Home Telugu అరుదైన మేధావి హరిహరశర్మ

అరుదైన మేధావి హరిహరశర్మ

0
SHARE

తుమ్మలపల్లి హరిహర శర్మ గారి హ‌ఠాన్మరణం (జూన్29) వల్ల దేశం ఒక జాతీయభావాలు గల అరుదైన మేధావిని కోల్పోయింది. గత 4, 5 దశాబ్దాలుగా జాతీయ భావవ్యాప్తికి విద్యారంగ అభివృద్ధికి ఎనలేని కృషిచేశారు. దేశ గౌరవానికి గానీ జాతి ఔన్నత్యానికి గానీ హాని కలిగించే ఎలాంటి విపత్తులెదురైనా వాటిని ఎదుర్కోవడంలో శర్మగారు ముందుండి మిగతావారికి స్ఫూర్తిదాయకంగా నిలిచేవారు. ఈ దిశలో వారు టీవీ సంభాషణలు, పత్రికల్లో వ్యాసాలు, సభల్లో గోష్టులలో ఉపన్యాసాల ద్వారా అనిర్వచనీయమైన కృషి చేశారు.

ఈదిశలో కేశవ మెమోరియల్ విద్యాసంస్థల ప్రాంగణంలో ప్రారంభమైన రచన జర్నలిజం కళాశాల అభివృద్ధికి కృషిచేయటమే గాక, ఆ కళాశాల ప్రిన్సిపాల్‌గా కొంతకాలం పనిచేసారు. ఆ తదుపరి దాంట్లో ఉపన్యాసకులుగా పనిచేస్తూ అనేకమంది పాత్రికేయులను తయారు చేయటంలో వారిది విశేష ప్రయత్నం ఉన్నది. పాత్రికేయులకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించిన సమాచారభారతికి 2004 నుంచి 2016 వరకు అధ్యక్షులుగా ఉన్నారు. జాగృతి వార పత్రికకు సంపాదకీయాలు రాసేవారు. జాగృతి ప్రకాశన్ ట్రస్ట్ అధ్యక్షులుగా కొంతకాలం, కార్యదర్శిగా వారి జీవితం అంతం వరకు పనిచేసారు. పాత్రికేయరంగంలో ప్రత్యక్షంగా పనిచేయకపోయినా, పాత్రికేయులతో సంబంధాలు వారిలో జాతీయ భావాలు నెలకొల్పటానికి వారు చేసిన కృషి మరవలేనిది. ఆధ్యాత్మిక రంగంలోనూ వారు ఎనలేని సేవలందించారు. శ్రీ శృంగేరి మఠంలో వీరికున్న గౌరవస్థానమే దానికి ప్రతీక. శృంగేరి పీఠానికి సంబంధించిన ‘‘శంకర కృప’’ పత్రికకు ప్రారంభంలో వారి అన్నగారు సంపాదకులుగా పనిచేసారు. ఆ తదుపరి 2016 వరకు హరిహర శర్మ సంపాదకులుగా సేవలందించారు.

ఒక ఆదర్శ అధ్యాపకుడిగా, ఏబీవీపీ పదాధికారిగా వారు అనేకమంది యువకులను సంస్కరించి తీర్చిదిద్దారు. అలా సంస్కరింపబడిన వందలాది మంది తమదైన విధంగా దేశానికి సేవలందిస్తున్నారు.

శర్మ గారి జీవితంలో కేశవ స్మారక విద్యా సమితికి ఒక ప్రత్యేక స్థానం ఉండేది. రెండు దశాబ్దాలకు పైగా పూర్తి సమయం కేటాయించి వివిధ విద్యాసంస్థల అభివృద్ధికి కృషిచేశారు. క్రమశిక్షణకు, సామర్థ్యానికి, పారదర్శకతకు శర్మ గారు పెట్టింది పేరు. ఒకవైపు ఆర్‌ఎస్‌ఎస్‌, మరోవైపు ప్రభుత్వ అధికారులతో ఎంతో సమన్వయంగా వ్యవహరించి అసాధ్యాలనుకున్న ఎన్నో పనులను సుసాధ్యాలు చేశారు. సమితి విద్యాసంస్థల ప్రస్తుతమున్న స్థాయి వెనక హరిహర శర్మ గారి కృషి సుస్పష్టంగా గోచరిస్తుంది.

సమాజ సేవలో నిమగ్నమై శర్మగారు తన కుటుంబాన్ని, తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారనేది కూడా నిర్వివాదాంశం. విలాసాలకు, స్వార్థానికి అతి చులకనగా ఆకర్షితులయ్యే ఈ రోజుల్లో శర్మగారు ఆదర్శప్రాయమైన జీవితం గడిపి తమతోటి వారందరికీ స్ఫూర్తినందించారు. సంస్థలలో ఎలాంటి క్లిష్ట సమస్యలు ఎదురైనా వాటిని సమయస్ఫూర్తితో మానవతా దృక్పథంతో అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం అందించేవారు. శర్మగారి మరణం కేశవ స్మారక విద్యాసమితికి తీరని లోటు. వారి జీవిత విధానం, కార్యశైలిని ఆదర్శంగా తీసుకొని నిస్వార్థమైన సేవలందించడమే వారికి నిజమైన శ్రద్ధాంజలి.

లింగాల నరసింహారెడ్డి

విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి, పాట్నా హైకోర్ట్‌ – అధ్యక్షులు, కేశవ స్మారక విద్యా సమితి

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)