Home News ఆత్మవిలోపి వ్యక్తిత్వం

ఆత్మవిలోపి వ్యక్తిత్వం

0
SHARE

రాష్ట్ర సేవికా సమితి తృతీయ ప్రముఖ్ సంచాలిక వందనీయ ఉషాతాయీజీ నాగపూర్ లోని దేవి అహల్యా మందిర్ (సమితి కార్యలయం)లో నిన్న (18.8.2017) అంతిమ శ్వాస విడిచారు. ఆమె వయస్సు 91 సంవత్సరాలు.

పూజ్య సర్ సంఘచాలక్ డా.మోహన్ జి భాగవత్ వందనీయ తాయీజీ కి శ్రద్ధాంజలి ఘటించారు. కర్ణాటక పర్యటనలో ఉన్న శ్రీ. మోహన్ జి హుబ్లీ లోని సేవికాసమితి కార్యాలయంలో జరిగిన శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్నారు. వందనీయ తాయీజీ స్వర్గస్తులు కావడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తంచేసిన పూజ్య సర్ సంఘచాలక్ ఇటీవల ఆమెతో కలిసి రక్షాబంధన్ జరుపుకోవడాన్ని గుర్తుచేసుకున్నారు. ఆమె జీవితం కేవలం సమితి కార్యకర్తలకే కాక అందరికీ ఎంతో స్పూర్తిదాయకమని అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తరఫున వందనీయ తాయీజీకి ఆయన శ్రద్ధాంజలి సమర్పించారు.

వందనీయ తాయీజీ కుటుంబానికి సంఘతో ఉన్న అనుబంధాన్ని మోహన్ జీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.  తాయీజీ భర్త సంఘ ఘోష్ టోలి (జట్టు)లో ఉండేవారని, తాయీజీ సమితిలో పనిచేశారని అన్నారు. ఇలా ఒకరు సంఘ్ లోనూ, మరొకరు సమితి కార్యంలోను ఎప్పుడు నిమగ్నమై ఉండడంవల్ల వాళ్ళిద్దరూ కలిసి ఉన్న సమయం చాలా తక్కువగా ఉండేది. ఘోష్ టోలి బైఠక్ వారి ఇంట్లో జరిగినప్పుడు మాత్రమే వారిద్దరిని ఒకచోట చూసే అవకాశం కలిగేదని మోహన్ జీ అన్నారు.

ఉషా తాయీజీ ఆదర్శ గృహిణి అని, వారి ఇంటికి వచ్చిన ఏ అతిధి ఆకలితో తిరిగి వెళ్ళేవాడు కాదని సర్ సంఘచాలక్ జి అన్నారు. ఎవరితోనైనా అతి త్వరగా స్నేహం చేసుకోగలిగిన తాయీజీ 10-15 నిముషాలలోనే వారికి ఎంతో సన్నిహితురాలు అయ్యేవారు. మృదుభాషి అయిన తాయీజీ తన నిష్ట, వ్యవహారశైలి ద్వారా సంఘ, సమితి కార్యకర్తలను ఎంతో ప్రభావితం చేసేవారని మోహన్ జీ అన్నారు.

గీత్ లు పాడటమంటే తాయీజీకి ఎంతో ఇష్టమని, అందుకనే ప్రముఖ్ సంచాలిక బాధ్యత తీసుకున్న తరువాత గీత్ ప్రస్తుతి కార్యక్రమం తరుచూ నిర్వహించాలని ఆమె సేవికలను ప్రోత్సహించేవారని మోహన్ జీ అన్నారు. అలా 70 శాఖల్లో ఈ కార్యక్రమం జరిగేది. ఏ పని చేపట్టిన దానిని చక్కగా పూర్తిచేయాలని ఆమె కార్యకర్తలకు చెప్పేవారు. ఎప్పుడు చిరు మందహాసంతో కనిపించే ఆమె కార్యకర్తలలో ఎంతో స్ఫూర్తిని నింపేవారు. ఆమెది ఆత్మవిలోపి వ్యక్తిత్వం అని మోహన్ జీ అన్నారు.

ఉషాతాయీజీ ఎక్కడున్న ఎంతో ఉత్సాహాన్ని, ప్రేరణను కలిగించేవారని, ఆమె అనుసరించిన విలువలను పాటించాడం ద్వారా  ఆమె లేని లోటును పూరించే ప్రయత్నం చేయడం సంఘ, సమితి కార్యకర్తలుగా  మన కర్తవ్యమని మోహన్ జీ అన్నారు. కార్యం ఎప్పుడు ఆగకూడదని ఆయన ఉద్బోధించారు.

రాష్ట్ర సేవికా సమితి కర్ణాటక ఉత్తర ప్రాంత సహ కార్యవాహిక శ్రీమతి రత్నమాలాజీ కూడా కార్యక్రమంలో మాట్లాడారు. వందనీయ తాయిజీ స్మృత్యర్ధం మాతృ మందిర్ ఆవరణలో పూజ్య సర్ సంఘచాలక్ జీ ఒక మొక్కను నాటారు.