Home Telugu Articles వెలుగులోకి వస్తున్న క్రైస్తవ మతాధికారుల దారుణాలు

వెలుగులోకి వస్తున్న క్రైస్తవ మతాధికారుల దారుణాలు

0
SHARE
Representative image

ఇద్దరు బిడ్డల తల్లి అయిన ఒక మహిళ తన కూతురు బాప్టిజం సందర్భంగా ఇచ్చిన అపరాధ అంగీకార వాంగ్మూలం ఆధారంగా కేరళలో ఐదుగురు కేథలిక్ క్రైస్తవ మత బోధకులు ఆమెను బెదిరించి, లొంగదీసుకొని, శారీరకంగా అనేకసార్లు అనుభవించిన విషయం సామాజిక మాధ్యమాల ద్వారా ఇటీవల వెలుగులోకి వచ్చింది. యాదృచ్ఛికంగా ఆమె భర్తకు ఆ విషయం తెలియటంతో అతను చర్చి అధికారులకు రెండునెలల క్రితం ఫిర్యాదుచేసినా పట్టించుకోకపోవటంతో తన స్నేహితుడితో తన ఆవేదనను పంచుకోవటంతో ఈ విషయం బయటకు పొక్కింది. అన్ని జాతీయ పత్రికల్లో ఈ వార్తాకథనం ప్రముఖంగా వచ్చింది. రెండు నెలల తర్వాత ఎట్టకేలకు పోలీసులు ఆ ఐదుగురు క్రైస్తవ మత బోధకులపై ఇప్పుడు కేసు నమోదుచేశారు.

మత బోధకుల నేరాలు కొత్తవి కాదు

ఇలాంటి మత నేరాలు కేరళ కేథలిక్ క్రైస్తవంలో కొత్తకాదు. 1992లో ‘అభయ’ అనే పేరుగల ఒక క్రైస్తవ సన్యాసినిని హత్యచేశారు. 2008వరకు సాక్ష్యాధారాలను తారుమారుచేస్తూనే ఉన్నారు. ఎంతో ప్రయత్నంమీద, అదీకూడా న్యాయస్థానాలు తీవ్రంగా జోక్యం చేసుకొన్నమీదట కేసు విచారణలో కొంత పురోగతి జరిగింది. నిందితులను రక్షించేందుకుగాను శవపరీక్ష నివేదికలో మార్పులు, చేర్పులు చేసేందుకు గట్టిగా ప్రయత్నం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం మీద కేరళ చర్చికి ఉన్న పట్టు అది. ఈ కేసులో ఇద్దరు మత బోధకులు, ఒక సన్యాసిని నిందితులు. 26 సంవత్సరాలు అయినా ఇంకా నిందితులకు పై నేరనిర్ధారణ జరగలేదు. రెండురోజుల క్రితం ముగ్గురు నిందితులలో ఒకరిని సాక్ష్యాధారాలు బలంగాలేవన్న అభియోగం మీద విడుదల చేశారు. ఇద్దరు నిందితులు తమనుకూడా విడుదల చేయవలసిందిగా చేసిన అభ్యర్థనను ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. 2006లో తమిళనాడు ఒమూల్లురు కేథలిక్ చర్చి నిర్వహిస్తున్న ఫాతిమా బాలికల పాఠశాలలో ఒక బాలిక- సుకన్య చనిపోయింది. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ పగిలిన గాజులు, కండోమ్‌లు, మద్యం, రక్తపు మరకలు అత్యాచారం జరిగినట్లు చెప్పకనే చెప్పాయి. ద్రవిడ మునే్నట్ర కజగంవారు నిందితులను కనీసం బదిలీ చెయ్యమని కోరారు. కాని అక్కడి బిషప్ అందుకు ఒప్పుకోలేదు. తమది అల్పసంఖ్యాక వర్గ పాఠశాల కనుక ప్రభుత్వ జోక్యం కూడదని చెప్పాడు. అయితే శవ పరీక్ష నివేదిక అత్యాచారం జరిగినట్లు ధృవీకరించింది. రాజస్థాన్‌లో ఒక మత బోధకుడు అసభ్య సందేశాన్ని ఒక బాలుడికి పంపించాడు. ఇది వెలుగులోకి రాగానే ఆ నేరాన్ని కప్పిపుచ్చుకొనేందుకు విగ్రహారాధకులు అయిన హిందువులు బైబిలును నమ్మిన నిమ్న జాతీయులపై చేస్తున్న దుష్ప్రచారంగా దాన్ని నమ్మబలుకుతున్నారు. బిషప్ మత బోధకుడినే బహిరంగంగా సమర్ధించాడు.

కేరళ కేథలిక్ చర్చిలో జరుగుతున్న అకృత్యాలపై అనేకమంది పుస్తకాలు వ్రాశారు. అందులో ప్రముఖమైంది- ‘‘ఆమెన్-ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ నన్’’ దీన్ని రాసిన డా.జెస్మి ఒక క్రైస్తవ సన్యాసిని. 33 సం.లపాటు సన్యాసి జీవితం గడిపిన ఆమె 2008లో చిరుచూర్‌లోని సెయింట్ మేరి కాలేజి ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ రాజీనామా చేశారు. ఆ పుస్తకంలో మత బోధకుల లైంగిక విశృంఖలత్వాన్ని, స్వలింగ సంపర్క కృత్యాలను వెలుగులోకి తెచ్చారు. ఈ పుస్తకాన్ని ప్రచురించకుండా ఆమెపై ఒత్తిడి తెచ్చారు. అయినా ఆమె ఆ పుస్తకాన్ని ముందు మళయాళంలో, ఆ తరువాత ఆంగ్లంలో ప్రచురించారు. విశేష ప్రజాదరణ పొందిన ఆ పుస్తకం క్రైస్తవ ప్రపంచంలో ఒక పెద్ద సంచలనానికి దారితీసింది. 2010లో మరో మత బోధకుడు మతం ముసుగులో జరుగుతున్న లైంగిక దోపిడీని చూసి తట్టుకోలేక అనేక వివరాలు బయటపెట్టాడు. 2012లో 68 సంవత్సరాల క్రైస్తవ సన్యాసిని ‘మేరీ చాందీ’ వ్రాసిన ‘స్వస్థ’అనే మళయాళ పుస్తకంలో మరింత వివరంగా లైంగిక దోపిడీ గురించిన వివరాలు బయటపెట్టారు. వాళ్ళందరూ మత బోధకులుగా, సన్యాసినులుగా జీవితం మొదలెట్టినవాళ్ళే. 70వ దశకంలో కేరళ నుంచి పెద్దపెట్టున ఆడ పిల్లలను మత, నర్సింగ్ శిక్షణల పేరుతో ఇతర దేశాలకు తరలించారు. క్రైస్తవ యువతులను ప్రలోభపెట్టి వారిని పాశ్చాత్య దేశాలకు ముఖ్యంగా వాటికన్‌కు అక్రమంగా తరలించి వారిని అక్కడ గదులు, మరుగుదొడ్లు శుభ్రంచేయటానికి వాడుకోవటమేకాక లైంగికంగా వాడుకోవటానికి ఉపయోగించారని అప్పట్లో పెద్ద దుమారం చెలరేగింది. ‘సోనియా డగల్’ వాటికన్ ఏజెంట్లద్వారా క్రైస్తవ యువతుల అక్రమ రవాణాను తన పుస్తకం ‘నన్ రన్నర్స్’లో వివరించారు. ఏ విధంగా వాటికన్ ఏజెంట్లు జర్మనీకి, ఇటలీకి అమ్మాయిలను అక్రమంగా తరలించారో, సహకరించిన మత బోధకులకు అమ్మాయికి యింత చొప్పున ప్రతిఫలం ఎట్లా చెల్లించారో, వారిలో కొందరిని లైంగిక బానిసలుగా మార్చారో సవివరంగా ఆమె వ్రాశారు. ఇదంతా వాటికన్ అధికారులకు తెలియకుండా జరగలేదు. 1978లోనే ‘నినో-లో-బెల్లో’అనే పరిశోధక పత్రికా విలేఖరి ‘వాటికన్ పేపర్స్’అనే సంచలనాత్మక ప్రచురణ ద్వారా ఎన్నో దారుణాలను వెలుగులోకి తెచ్చాడు.

అమెరికాలో, ఇతర పాశ్చాత్య దేశాల్లో చర్చి అనేక సంక్షోభాల్లో చిక్కుకుంది. విశృంఖలంగా జరిగిన బాలలపై అత్యాచారాల విషయంలో అనేక మంది మత బోధకులు పట్టుబడ్డారు. అనేక కమీషన్లువేసి విచారణ చేస్తున్నారు. అత్యాచార బాధితులకు ఇంతవరకూ 5.5 బిలియన్ డాలర్లు అంటే షుమారుగా 4లక్షల కోట్లు నష్టపరిహారంగా చెల్లించారంటే సమస్య తీవ్రత అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో నేరాలు జరుగుతున్నా, అత్యాచారాలు వెలుగులోకి వస్తున్నా మన ప్రభుత్వాలు వేగంగా స్పందించటం లేదు.

మన ప్రధాన జాతీయ మాధ్యమాల్లో ఈ అకృత్యాలపై పెద్దగా చర్చ జరగలేదు. పద్ధతి ప్రకారం మన యువతులను వారు క్రైస్తవులైనా, మరొకరైనా ప్రలోభపెట్టి, అక్రమంగా రవాణాచేసి వారిని లైంగిక దోపిడీకి గురిచేయటం మొత్తం జాతికే అవమానం. కేరళ కేథలిక్ చర్చి కనుసన్నలలోనే ఇది జరుగుతుందన్న విషయం తెలిసినా పత్రికలు, ప్రసార సాధనాలు మిన్నుకుండటం ఇంకా ఆశ్చర్యకరం. 2013లో ‘మేరీకుట్టి’ని ఒక మత బోధకుడు హత్యచేశాడు. ఇండియాటుడే 2013 మార్చి 5 సంచికలో ఈ విషయమై వ్రాస్తూ మత బోధకుల లైంగిక నేరాలకు అదుపు లేకపోవటానికి వారికి వనరులు పుష్కలంగా లభ్యమవటమే కారణమని పేర్కొంది. ఈ కేసులో నిందితుడైన మత బోధకుడికి మరణశిక్ష విధించిన విషయం చాలామందికి తెలియదు.

బలమైన శక్తిగా చర్చి

కేథలిక్ చర్చి కాలక్రమంలో ఒక బలమైన శక్తిగా ఎదిగింది. ‘ఇంక్విజిషన్’ కాలంలో పోపునకు ఎంత అధికారం, ప్రభావం ఉందో, అంత ప్రభావాన్ని లౌకిక భారతదేశంలో చర్చికి ఈనాడు ఉంది. పాశ్చాత్య దేశాలలో సైతం లేని వనరులు, మన దేశపు చర్చిలకు వున్నాయి. ‘కాన్‌స్టాంటిన్’ రోమ్ రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు ఇంకా అధికారికంగా బాప్టిజం పుచ్చుకోనప్పుడు, ఒక పాగన్ రాజుగానే చెలామణి అవుతున్నప్పుడు కూడా క్రైస్తవంపట్ల దురభిమానం చూపేవాడు. మన దేశంలోనూ పరిస్థితి అట్లాగే ఉంది. మన లౌకిక ప్రభుత్వాలు కేవలం హిందువులకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తుంటాయి. హిందూ ధార్మిక సంస్థల నిర్వహణలో జోక్యంచేసుకుంటూ ఉంటాయి. కాని ప్రభుత్వ యంత్రాంగం, పాలకులు, నేతలు క్రైస్తవ చర్చిపట్ల అభిమానాన్ని చూపుతుంటారు. ‘కాన్‌స్టాంటిన్’ క్రైస్తవం ద్వారా జనాన్ని నియంత్రించి, తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలన్న లక్ష్యంతో క్రైస్తవం పుచ్చుకొన్నాడు. ఆనాడు చర్చి అంత శక్తివంతమైనది కాదు. కాని భారతదేశపు చర్చి ఒక బహుళజాతి సంస్థకు ఎందులోనూ ఏమాత్రం తీసిపోదు. వలస కాలంలో పుట్టి, ఇటలీలోని ఫాసిస్టు పాలకుల సంపాదనతో పెరిగింది. ఎన్‌లైటెన్‌మెంట్ కాలంలో పాశ్చాత్య దేశాల్లో పోగొట్టుకున్నది భారతదేశంలో సంపాదించారు. విలువైన వేలాది ఎకరాల భూమి అన్ని ముఖ్య పట్టణాల్లో, నగరాల్లో వారి అధీనంలో ఉంది. చీకటి యుగంలో (450-1000) ఎంత శక్తివంతంగా చర్చి పాశ్చాత్య దేశాల్లో అధికారం చెలాయించిందో అంతకంటె ఎక్కువగా ఇక్కడ అధికారం చెలాయించగల స్థితిలో ఉంది. పత్రికా ప్రసార సాధనాలను, ప్రభుత్వ విధానాలను సామాన్య జనాన్నికూడా ప్రభావితం చెయ్యగలిగిన స్థితిలో ఎదిగింది. ఈశాన్య భారతంలో వేర్పాటు ఉద్యమాలను ప్రోత్సహించింది. అవసరమైనప్పుడు వేర్పాటుశక్తులకు ఊతం యిస్తూనే ఉన్నది.

గోవా ఇంక్విజిషన్

గోవాలో జరిగిన ‘కేథలిక్ ఇంక్విజిషన్’ గురించి చాలా తక్కువమందికి తెలుసు. దాన్ని చివరకు ఒక పాదపీఠిక క్రిందకు నెట్టివేశాం. 1501 నుండి 1961వరకు గోవా పోర్చుగీసువారి వలస పాలనలో ఉంది. 1541లో ఫ్రాన్సిస్ జేవియర్‌ను పోర్చుగీసు రాజు పంపగా క్రైస్తవ మత వ్యాప్తికోసం గోవా చేరాడు. వచ్చిన 4 సం.లకే అంటే 1545లోనే మత వ్యాప్తికి ఇంక్విజిషన్ అవసరమని, అనుమతించమని అభ్యర్థించాడు. ఆయన అభ్యర్థన మేరకు 1560లో ఇంక్విజిషన్ ప్రక్రియను ప్రారంభించి 260 సంవత్సరాలపాటు 1820వరకు కొనసాగించారు. ప్రపంచంలో ఇంత సుదీర్ఘకాలం కొనసాగిన మత విచారణ ఘట్టం మరొకటి లేదు.

అత్యాచారానికి మతానికి సంబంధం లేదు. అత్యాచారం ఎవరు చేసినా ఎక్కడ చేసినా శిక్షించే తీరాలి.

-డా.బి.సారంగపాణి

(ఆంధ్రభూమి సౌజన్యం తో)