–ప్రదక్షిణ
భారత్ స్వాతంత్ర్యానంతరం, గత కొన్ని దశాబ్దాలుగా అన్ని రంగాల్లో, అన్ని వ్యవస్థల్లో చొచ్చుకుపోయి పాతుకుపోయిన వామపక్షవాదులు, వారి హిందూవ్యతిరేక/భారతదేశవ్యతిరేక భావజాలంతో దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. విచిత్రంగా, ప్రపంచవ్యాప్తంగా మతం/దేవుడు లేడు అని తాము నాస్తికవాదులమని చెప్పుకునే కమ్యూనిస్ట్ లు, భారత్ లో మాత్రం ఇస్లాంమత ఛాందసవాదo – దాని వికృతరూపమైన జిహాద్ దాడులు, క్రిస్టియన్ మతఛాందసవాదo, దాని వికృత రూపమైన మతమార్పిడులను, `మతస్వేచ్ఛ’ పేరుతో కొన్ని దశాబ్దాలుగా ప్రోత్సహించి, మద్దతు ఇస్తున్నారు. అంతేకాక ఈ కమ్యూనిస్ట్ లు, విదేశాలనుంచి దిగుమతి చేయబడ్డ రెండు సెమెటిక్ మతాలకు చెందిన ఛాందసవాదులు కలిసి ఒకే కూటమిగా ఏర్పడి హిందూమతం పై విద్వేషాలు రెచ్చగొడుతూ, దేశవ్యతిరేక కార్యాలకు ఎప్పటినుంచో పాల్పడుతున్నారు. ఈ విషం ఎంతగా వ్యాపించిందంటే, భారతలో ఈ పరిణామాలు అర్ధం చేసుకున్నవారికి కూడా ఇంతవరకు దీనికి విరుగుడు దొరకలేదు.
అయితే దీర్ఘకాలంగా హిందూ వ్యతిరేక, దేశ వ్యతిరేక కుట్రలు కుతంత్రాలు సాగుతున్నా, భారతదేశం ముఖ్యంగా హిందూ సమాజం ఉదాసీనంగా నిర్లిప్తంగా ఉండడానికి కారణాలు వెతికితే ఎన్నో కనిపిస్తాయి. భారతలో దశాబ్దాలుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తున్న నిపుణులు దీనికి `వామపక్ష ఆవరణ వ్యవస్థ’ (లెఫ్ట్ ఇకోసిస్టమ్) అని పేరు పెట్టారు. వీరి విస్తృత వ్యవస్థకి నేపధ్యం ఏమిటని గమనిస్తే కొన్ని అంశాలు స్పష్టమౌతాయి. బులెట్ ద్వారా అధికారం అనే నక్సల్ వాదం, ప్రజాస్వామ్య విరుద్ధమైన నిరంకుశ నియంత రాజ్యాలు, హింసా రాజకీయాలు మొదలైన వామపక్ష తీవ్రవాద సిద్ధాంతాలకి భారత ప్రజలు ఎక్కువ ఆకర్షితం కాలేదు, కాబట్టి వీరు స్వాతంత్ర్యానికి పూర్వం కూడా, వారి అప్రజాస్వామిక హింసా రాజకీయ సిద్ధాంతాలకి ఎక్కడ చోటు దొరుకుతుందో వెతుక్కుని, ఆ పార్టీలను తమ స్థావరంగా మార్చుకున్నారు. నెహ్రూతో సహా ఎంతోమంది నాయకులు `సామ్యవాదం’ పేరుతో కమ్యూనిస్టులని భుజాలకెత్తుకుని మోసారు. సోవియట్ రష్యా బ్రిటన్ తో చేరి రెండవ ప్రపంచయుద్ధం జరిపినపుడు, కమ్యూనిస్టులు బ్రిటిష్ పాలకులను సమర్థించారు, అలాగే వారు భారత విభజనకి, పాకిస్తాన్ ఏర్పాటుకి తోడ్పడ్డారు, గాంధేయవాదులమని చెప్పుకునే వారికి, గాంధీగారు `రామరాజ్యం, గ్రామస్వరాజ్యం, గోవధ నిషేధం, స్వదేశి ఆర్ధికవ్యవస్థ’ తమ ఆశయాలని ప్రకటించినా, ఆయనను `జాతిపిత’ అన్నారే కానీ, ఆయన ఆశయాలను ఎప్పుడూ గౌరవించలేదు, ఆచరించలేదు. నెహ్రూ ఆచరించింది సోవియట్ రష్యా సిద్ధాంతాలు, పంచవర్ష ప్రణాళికలు మాత్రమే, దీనితో కమ్యునిస్టులకి పాలనా వ్యవస్థలో మార్గం సులభమైంది. ఆయన కూతురు ప్రధాని ఇందిరాగాంధీ ఏకంగా `జాతీయీకరణ’ పేరుతో అన్ని వ్యాపారాలు ప్రభుత్వపరం చేసి, భారత జాతి ఉత్సాహాన్ని, వ్యాపార ఔత్సాహికులను, సాంకేతిక ఆవిష్కరణలను, ప్రజల ఆర్ధిక అభివృద్ధిని పణంగా పెట్టి, కమ్యూనిస్టు సిద్ధాంతాలను ప్రభుత్వంలో నడిపింది.
కమ్యూనిస్టు పార్టీలు ముక్కచెక్కలైనా, ప్రజలు వోట్లు వేయకపోయినా, కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకి, వాటి ప్రచారానికి, ఎటువంటి లోటు లేకుండా వారు జాగ్రత్తపడ్డారు. అత్యంత ప్రధానంగా, ఎన్నికలలో గెలవకపోయినా, ఏవిధంగా అధికారంలో ఉన్నా/ లేక ప్రభుత్వపాలనలో లేకపోయినా, పాలనాపరంగా ఏవిధంగా తమ సిద్ధాంతాలు చెలామణీ చేసుకోవచ్చో కమ్యూనిస్టులకి అర్ధం అయినంతగా, ఈ దేశంలో మరే ఇతర పార్టీకి అవగతం కాలేదు.
ముఖ్యంగా ఈ విధంగా ప్రభుత్వ విధానాలలో కమ్యూనిస్టు సిద్ధాంతాలను చొప్పించడంలో వామపక్షాలు పూర్తిగా సఫలీకృతం అయ్యాయనే చెప్పాలి. అయితే వారు ఇంతటితో సంతృప్తి చెందలేదు. వారి విదేశీ కమ్యునిస్టు మతాన్ని మరింత బలోపేతం చేయడానికి, క్రమపద్ధతిలో దేశంలో విస్తృతంగా వ్యాప్తిచేసే పునాదులు దశాబ్దాలుగా వేసుకుంటూ వచ్చారు, దాని ఫలస్వరూపమే`వామపక్ష ఆవరణ వ్యవస్థ’. ఫలితంగా ఈరోజు కమ్యునిస్టులు ఎక్కువ కష్టపడకుండానే, వారి సిద్ధాంతకర్తలు, సిబ్బంది, అనుచరులు, అనుయాయులు, కార్యకర్తలు, ప్రజలు వారి భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, హిందూ వ్యతిరేక, దేశ వ్యతిరేక కార్యక్రమాలు ఎల్లప్పుడూ ఇష్టానుసారం చేస్తూ ఉంటారు.
అయితే ఇది ఎలా సాధ్యమైంది? ముఖ్యంగా ప్రజలను ప్రభావితం చేసే అన్ని రంగాలలో వారు పాతుకుపోవడం వల్ల ఇది సాధ్యమైంది. మన రాజకీయ ఆర్థిక సామాజిక వ్యవస్థలో కొన్ని ముఖ్య అంగాలు ఉన్నాయని మనకు తెలుసు, అవి రాజకీయ ప్రాబల్యం, విధానసభా వ్యవస్థ, న్యాయవ్యవస్థ, పాలనా యంత్రాంగం అధికారగణం- అంటే బ్యూరోక్రసి, మీడియా, ఆకడమియా అంటే విశ్వవిద్యాలయాలు- విద్యావేత్తలు, కళా సాంస్కృతిక సాహిత్య నాటక సినిమా రంగాలు, `ప్రజాసంఘాల’నబడే పౌరహక్కుల సంఘాలు/మానవహక్కుల సంఘాలు మొదలైనవి. అంతేకాక, వామపక్ష మహిళా సంఘాలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, విప్లవ రచయితల సంఘాలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో. దశాబ్దాలుగా ఇవి అన్ని రంగాలలో వామపక్ష భావజాలాన్ని ప్రచారం, ప్రసారం చేయడంలో కమ్యునిస్టులు కృతకృత్యులయ్యారు, దాని ఫలితమే ఇప్పుడు సర్వత్రా ఉన్న `వామపక్ష ఆవరణ వ్యవస్థ’.
విశ్వవిద్యాలయాల్లో వామపక్ష భావజాలం మితిమీరి, ఎంతోమంది బోధనా సిబ్బంది నక్సల్ ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడం మనం చూసాము. వీరు విద్యార్థులను వామపక్షవాదులుగా తీర్చిదిద్ది, హిందూ వ్యతిరేక, దేశ వ్యతిరేక పనులకు ఉసిగొలుపుతున్నారు. వీరి విషపూరిత వక్ర నినాదాలకు `భావప్రకటనా స్వేచ్ఛ’ అని ముసుగు వేస్తున్నారు. దేశంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు దేశవ్యతిరేక నిలయాలుగా మారాయి.
అలాగే, వామపక్ష కాంగ్రెస్ మీడియా సంస్థలు, దేశంలో ఏ గొడవ జరిగినా ఏకపక్షంగా కేవలం హిందువులను దోషులుగా నిలబెట్టి వారిని తీవ్రమైన పదజాలంతో ఎండగడతారు. హిందూ-వ్యతిరేక, దేశవ్యతిరేక పనులను పత్రికలలో, టీవీ చానెళ్ళలో అసలు వ్రాయరు, చూపించరు, మాట్లాడరు, చర్చించరు; ఒకవేళ చర్చించినా అవి వామపక్ష భావజాలంతో నిండి, ఏకపక్షంగా హిందూ వ్యతిరేక/దేశవ్యతిరేకoగా ఉంటాయి. ఇవే చదివి, చూసే ప్రజలు ఇవే నిజమనే మైకంలో దశాబ్దాలుగా పడిపోతున్నారు. అంతేకాక, దీనికి మరింత తీవ్ర పరిణామం, విదేశీ పత్రికలు ఈ పక్షపాత దృష్టితో ఉన్న వార్తలను ప్రచురించి, భారత దేశప్రతిష్టను కావాలని దిగజార్చడం. మన దేశమీడియా, కొంతమంది విలేకరులు పనిగట్టుకుని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి వామపక్ష సహచరుల సహాయంతో విదేశాలలో కూడా భారత-వ్యతిరేక వర్గాన్ని పోగుచేసి, దేశ-వ్యతిరేక, హిందూవ్యతిరేక కార్యక్రమాలు ఎన్నో చేసాయి, దీనికి కోకొల్లలుగా ఉదాహరణలు ఉన్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని కావాలని మరుగుపరిచిన ఎన్నో వాస్తవాలు ఇపుడు వెలుగు చూస్తున్నాయి.
డా. మన్మోహన్ సింగ్ ప్రధానిగా, సోనియాగాంధీ పది సంవత్సరాలు ప్రభుత్వం నడిపినపుడు, జాతీయ సలహా మండలి అనబడే నేషనల్ అడ్వైసరి కౌన్సిల్, సోనియాగాంధీ నేతృత్వంలో రాజ్యవ్యవస్థకి అతీతంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకునేది. ఈ మండలిలో కరుడుగట్టిన వామపక్షవాదులు, నక్షల్స్ తో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలున్న ప్రభుత్వేతర సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో నక్సల్ రాజకీయాల సమర్థకులు కొలువుతీరి ఉండేవారు, వారనుకున్న విధంగా ప్రభుత్వాన్ని వ్యవస్థలను వారు నియంత్రించేవారు. అంతేకాక ప్రభుత్వ నిధులు, వసతులు కూడా వారికి అనుకూలంగా ఉండే ప్రభుత్వేతర సంస్థలకు అందేలా వారు జాగ్రత్తలు తీసుకుని, వామపక్ష భావజాల వ్యవస్థకు మరింత బలం చేకూర్చారు.
`ప్రగతిశీల’మనే పేరుతో సాహిత్యం సినిమా పాటలలో సామ్యవాద సిద్ధాంత వ్యాప్తి; హిందూ సమాజాన్ని, హిందూ సంస్కృతిని, దేవతామూర్తులను, దేవాలయాలను తూలనాడడం, అపహాస్యం చేయడం మనం తెలుగు సాహిత్య వినోద రంగాలలో ఎప్పటినుంచో చూస్తున్నాము. చూడడమే కాక వాటి ప్రభావం కూడా మనమీద ఉండబట్టే, హిందూ సమాజం వాటిని ఎపుడూ ప్రశ్నించలేదు. దాని పర్యవసానo ఇప్పుడు చూస్తున్నాము, ఈ దేశంలో పుట్టిపెరిగిన వారే హిందూ సంస్కృతిని దూషించడం, అవమానించడం జరిగింది, జరుగుతోంది. దీని ఇంకొక తీవ్ర పరిణామo, విశృంఖలంగా, ఏ అడ్డు-ఆపు లేకుండా, క్రిస్టియన్ మతప్రచారం, మతమార్పిడులు తారాస్థాయికి చేరుకోవడం. ఇది ఎంతవరకు వెళ్లిందంటే, ఈ రోజు దేశంలో మతపరమైన ఓటు బ్యాంకులు ఏర్పడి, అవి ఎన్నుకున్న పార్టీలే అధికారం చేజిక్కించుకోవడం జరుగుతోంది.
ఇటీవల, దేశంలో సిఏఏ (పౌరసత్వ సవరణ చట్టం 2019) చట్టానికి వ్యతిరేకంగా, గతకొన్ని నెలలుగా జరుగుతున్న నిరసనలు, అల్లర్లు, మత ఘర్షణలు ప్రజలు గమనిస్తున్నారు. `పరస్పర విరుద్ధ భావజాలం’ ఉందని చెప్పబడే `వామపక్ష సంస్థలు- ఇస్లాం మత సంస్థలు- క్రిస్టియన్ మత సంస్థలు’ ఒక కూటమిగా ఏర్పడి దేశంలో అల్లకల్లోలం సృష్టించాయి, చాలాకాలం అల్లర్లు విధ్వంసం కొనసాగాయి. దీని ప్రత్యక్ష ఫలితమే మార్చ్ 2020లో, ఢిల్లీలో ఉగ్రవాద జిహాదీ ఛాయలున్న మతోన్మాదo, మతఘర్షణలు-నలభై మందికి పైగా మరణాలు.
కుహనా విద్యావేత్తలు, కుహనా మేధావులు, అసత్య వామపక్ష-కాంగ్రెస్ మరియు ప్రపంచ మీడియా, ఈ `వామపక్ష ఆవరణ వ్యవస్థ’లో భాగస్వామ్యులే. ప్రజాస్వామ్య భారతదేశంలో, అప్రజాస్వామికంగా అనైతికంగా రాజ్యంగవిరుద్ధంగా, ఎన్నికల్లో ఓడిపోయిన కొన్ని కూటములు/శక్తులు ఏవిధంగా `అధికారం’ చెలాయిస్తున్నాయో, వీరి భావజాలం మరియు చర్యల వల్ల దేశం ఎంత అధోగతి పాలైందో, ప్రజలు ఇప్పటికన్నా నిద్ర మేల్కొని అర్ధం చేసుకోకపోతే, మన దేశానికి భవిష్యత్తు ఉండదు.