Home Telugu Articles అవసరమైతే మనమూ యుద్ధం చేయాలి!

అవసరమైతే మనమూ యుద్ధం చేయాలి!

0
SHARE

భారత్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, లడఖ్, పాకిస్తాన్, బర్మా, నే పాల్ ఇవన్నీ కలసి ఒకే దేశంగా ఉన్నది కేవలం అశోకుడి కాలంలోనే. అంత విశాల భూభాగం మన దేశానికి ఆనాడు ఉండేది. అంతకు ముందెన్నడూ ఇండియాకు అంత పెద్ద మ్యాప్ లేదని చరిత్రకారులు అంటారు. ఇంత పెద్ద దేశంలో కళింగదేశం మాత్రం అశోకుడిని ధిక్కరించింది. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం, సైనిక బలగం అంతగా లేని దేశమది. వాళ్లకున్నది కేవలం సాహసం. వాళ్లకు స్వేచ్ఛ లేదా మరణం మాత్రమే లక్ష్యాలు. ఇవే అశోకునికి సవాల్ విసిరాయి. చిన్నదైన కళింగ సామ్రాజ్యం అశోకుడి ‘ఇగో’ను ఎంతగానో ‘హర్ట్’ చేసింది! అశోకుడి సైన్యం ముందు అలెగ్జాండర్ కూడా నిలబడలేదు. అశోకుడు అలెగ్జాండర్ కన్నా సులభంగా ‘ప్రపంచ విజేత’ అయ్యేవాడు. కానీ, ఇప్పటి ఒడిశా- నాటి కళింగ రాజ్యం అతనికి కంటిలో నలుసులా అనిపించింది. ఎలాంటి మందీమార్బలం లేని కళింగపై అపార సైనిక సంపద ఉన్న అశోకుడు యుద్ధం ప్రకటించాడు. లక్షలాది మంది ఆ యుద్ధంలో మరణించారు. కళింగ సైనికులు మరణించడానికి సిద్ధపడ్డారు కానీ లొంగిపోవాలని అనుకోలేదు. శవాల గుట్టల మధ్య నిలబడ్డ అశోకుడు క్షణకాలం ఆలోచించి- ‘ఈ యుద్ధానికి నేనా కారణం.? ఇంతటి సాహసవంతులైన ప్రజల మీదనా నా శౌర్య ప్రతాపం.. ఛీ.. ఛీ..! ఎంత తప్పు చేసాన’ని పశ్చాత్తాపపడ్డాడు.

‘నీవు గొప్ప రాజువు కావచ్చు. కానీ, మాకు మరణించే శక్తి ఉంది. దానిని మా నుండి లాక్కోవడం నీకు సాధ్యం కాదు’ అన్న మాటలు యుద్ధరంగంలో ప్రతిధ్వనించడంతో అశోకుడు తీవ్ర వైరాగ్యం పొందాడు. అప్పటికే బుద్ధుడు మరణించి 200 ఏళ్లు అయ్యింది. బుద్ధత్వం కోసం వెతుక్కుంటూ అశోకుడు వెళ్లాడు. కళింగ యుద్ధం తర్వాతనే అశోకుడికి జ్ఞానోదయమైంది.

యుద్ధంలో త్యాగం, వీరత్వం ఉండాలి. అది భారతీయుల సొత్తు. అశోకుడు భారతీయాత్మ. కాబట్టే కళింగ ప్రజల వీరత్వాన్ని గుర్తించగలిగాడు. కళింగులు కూడా భారతీయులే, గొప్ప చక్రవర్తిని ఎదిరించారు. అశోకునిలో మార్పు తెచ్చారు! అలాగే, నది అవతల విశ్రమిస్తున్న పురుషోత్తముడి దగ్గరికి అలెగ్జాండర్ తన భార్యను రాఖీ ఇచ్చి పంపాడు. ‘నేను నీ సోదరిని, నా భర్త ప్రాణాలు రక్షించు’ అని ఆమె అనడంతో ‘సరే’ అన్నాడు పురుషోత్తముడు. సమయం రానే వచ్చింది.. తన చేతికి చిక్కిన అలెగ్జాండర్ గుండెలో పురుషోత్తముడు బల్లెం దింపబోయాడు. ఆ క్షణంలో తన చేతి మణికట్టుపై రెపరెపలాడుతూ రాఖీ కనిపించింది. దాంతో పురుషోత్తముడు ఆగిపోయాడు. ‘ఎందుకు ఆగిపోయావు? అవకాశం దొరికిందిగా.. నన్ను చంపెయ్!’ అన్నాడు అలెగ్జాండర్. ‘నేను ఓ ప్రమాణం చేశాను. నా రాజ్యాన్ని వదలుకోవడానికి సిద్ధపడతాను కానీ నా మాటను వెనక్కి తీసుకోను’ అన్నాడు పురుషోత్తముడు. అలెగ్జాండర్ భార్యకు తాను ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి అతణ్ణి ప్రాణాలతో వదిలేశాడు పురుషోత్తముడు. ఇదీ భారతీయాదర్శమే! యుద్ధానికి భారతీయులు ఇచ్చిన విలువలకు తార్కాణాలు ఇవి.

మరి.. ఛత్రపతి శివాజీ జీవితాన్ని చూద్దాం. క్రీ.శ. 1659 ప్రాంతంలో అఫ్జల్‌ఖాన్ కుయుక్తులతో శివాజీని మట్టుబెట్టాలనుకొన్నాడు. ప్రేమతో ఆహ్వానించి కౌగిలించుకొని పక్కనుంచి పొడిచి చంపాలనుకొన్నాడు. శివాజీ తన ఇనుపగోళ్లతో అతని పొట్టలో పొడిచి పేగులు బయటకు తీసేసరికి చస్తాడని చచ్చిన వాడికే తెలియదు. ఔరంగజేబు కోపంగా ఈ వార్తను విని షయిస్తాఖాన్‌ను శివాజీపైకి పురమాయించాడు. పూణెలో విడిది చేసిన షయిస్తాఖాన్ అడుగడుగునా నిర్బంధం విధించినా, శివాజీ 400 మంది తన అనుచరులతో అక్కడికి చేరుకుని, గెరిల్లా ఆపరేషన్ మొదలుపెట్టాడు. ఖాన్ పడక గదిలోకే వెళ్లి అతనిపై కత్తి దూసాడు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అతని చేతి వేలు మాత్రమే తెగడంతో బతికి బయటపడ్డాడు.

పై మూడు చారిత్రక ఘట్టాల్లో ఈ రోజు సగటు భారతీయులంతా మొదటి రెండింటిని మన ఆదర్శాలుగా భావించినా, ప్రస్తుత పరిస్థితుల్లో శివాజీ వ్యూహమే సరైందని చాలామంది అంటారు. కాలానుగుణంగా వ్యూహాలు ఇప్పుడు మారకపోతే మతం, రాజకీయం రెండూ కలగలిసిన పాక్ కుటిల యత్నాలు ఒకవైపు, రాజకీయం, వ్యాపారం, అహంకారం నిండా నింపుకొన్న చైనా మరోవైపు మనవైపు కత్తులు దూస్తున్నాయి. రక్తం మరగిన మానవ మృగం పాకిస్తాన్ కాగా, రాజ్య దురహంకారానికి ప్రతీక చైనా. మరి ఇప్పుడు మనం ఎలాంటి యుద్ధం చేయాలి?!

గత నెలాఖరులో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన జరపడం, ఆ దేశ శ్వేతసౌధం మన ప్రధానికి మునుపెన్నడూ లేని గౌరవాన్ని ఇవ్వడాన్ని పాక్, చైనాలు భరించలేకపోతున్నాయి. పాకిస్తాన్‌కు చెందిన కరడుగట్టిన తీవ్రవాది హఫీజ్ సరుూద్‌ను చైనా వెనకేసుకొస్తుంటే, అమెరికా మాత్రం హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్‌ను ‘స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్’- ప్రత్యేకంగా గుర్తించిన ప్రపంచ స్థాయి ఉగ్రవాదిగా ప్రకటించింది. అలాగే, ఉగ్రవాదం వ్యాప్తి చేసే దేశాలకు సింహస్వప్నంగా ఉన్న ఇజ్రాయిల్‌లో మోదీ పర్యటన అరుదైనది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అగ్రస్థానంలో ఉంటూ తీవ్రవాద తండాలపై అరివీరభయంకరంగా దాడులు చేస్తూ దూసుకుపోతున్న ఇజ్రాయిల్ భారత్‌కు సహజ మిత్రదేశం. భవిష్యత్తులో భారత్ కూడా ఇలాగే మారితే అది ప్రపంచానికే ఆదర్శం అవుతుంది. ఏ రకంగానైనా భారత్‌ను ఆ స్థాయికి వెళ్లనివ్వరాదన్న దృఢ నిశ్చయంతో పాక్, చైనాలు ఉన్నాయి. ఇటీవలే డోక్లామ్‌లో అనవసర వివాదం రాజేసి అమర్‌నాథ్ యాత్రను అడ్డుకొంటామని చైనా ప్రకటించగా, తాజాగా లష్కరేతోయబా ఉగ్రవాది అబూ ఇస్మాయిల్ నేతృత్వంలో అమర్‌నాథ్ యాత్రికులపై దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ చైనా కనుసైగ చేస్తే పాకిస్తాన్ అమలుచేసే స్థితి ఏర్పడింది. ఇదంతా భారత్‌కు కొత్తేమీకాదు. క్రీ.శ. 638 నుండి తొమ్మిది మంది ఖలీఫాలు విశ్వ ప్రయత్నంతో క్రీ.శ. 712 వరకు 74 ఏళ్లలో 15సార్లు భారత్‌పై దాడి చేశారు. క్రీ.శ. 712 జూన్ 16 సాయంత్రం మహ్మద్ బిన్ ఖాసిం చేతిలో నాటి భారత వీరుడు దాహిర్‌సేన్ నేలకూలడంతో మొదలైన ఆక్రమణ మనస్తత్వం ఈ రోజుకూ కొనసాగుతూనే ఉంది.

ఓ పురుషోత్తముడు.. ఓ ఫృథ్వీరాజ్.. ఓ కుంభరాణా… ఒక హేమూ, మరో శివాజీ… వీర ప్రతాపరుద్రుడు… శ్రీకృష్ణ దేవరాయలు అందరూ ఈ ఆక్రమణ మనస్తత్వానికి వ్యతిరేకంగా ప్రాణాలే బలిపెట్టారు. చివరకు స్వాతంత్య్రం ఆంగ్లేయుల వశమైతే భారతీయులు ఎన్నో ప్రాణాలు బలిపెట్టి సాధించారు. ఎందరో ప్రసిద్ధ భారతీయ జ్యోతిషులు మొత్తుకొన్నా వినకుండా 15, ఆగస్టు 1947న స్వాతంత్య్రం ఇవ్వడానికే ఆంగ్లేయులు అంగీకరించారు. ఆగస్టు 15, 1945న జపాన్ ఆర్మీ ఆంగ్లేయుల ముందు శిరస్సు వంచింది. అదే నెల ఆగస్టు 6న హిరోషిమా, 9న నాగసాకి పట్టణాలపై అణుయుద్ధం జరిగింది. ‘ఆగస్టు 15 మా సెంటిమెంట్’ అని వౌంట్‌బాటన్ ప్రకటించి మనకు స్వాతంత్య్రం ఇచ్చాడు. ఆ రోజు స్వాతంత్య్రం స్వీకరిస్తే మన దేశం ముక్కలవుతుందని ఎందరో ప్రసిద్ధ జ్యోతిషులు చెప్పినా అధికారం కోసం కొందరు నాయకులు ఆత్రంగా స్వాతంత్య్రం తీసుకొన్నారు. అంతా భయపడ్డట్టుగానే దేశ విభజన జరిగింది. ఆనాటి నుండి పాకిస్తాన్ ఎన్నో కుయుక్తులను పన్నుతూ కాశ్మీర్ పేరుతో మనపై ప్రత్యక్ష, పరోక్ష యుద్ధం చేస్తుంది. దేశ విభజన వాదానికి ఒకప్పుడు అమెరికా బాగా సహాయం చేసింది. అమెరికా, యూరప్‌ల నుండి కోట్ల రూపాయల ఫారిన్ ఫండ్, ఎకె 47 రైఫిల్స్, ఇతర ఆయుధ సంపత్తిని పాకిస్తాన్, చైనాల ద్వారా టిబెట్ గుండా మన దేశంలోకి చేరవేస్తారని వార్తలొచ్చాయి. నాటి అమెరికా అధ్యక్షుడే ‘మేం రష్యాను ముక్కలు చేసినట్లే భారత్‌ను, చైనాను ముక్కలు చేస్తామ’ని స్వయంగా ప్రకటించాడు.

జనాభాలో ఇంచుమించు సమానమైన చైనా- భారత్‌ల మధ్య ఉద్రిక్తతలు పెంచుతున్నది ఎవరు? చైనా నాస్తిక దేశం, పాకిస్తాన్ మతతత్వ రాజ్యం. ఈ రెండూ కలవడం అంటే తూర్పు-పడమరల ఏకత్వమే. ఇటీవలి కాలంలో భారత్‌పై ఈ రెండూ దేశాలు విరుచుకు పడుతున్నాయి. దేశంలోకి ఇబ్బడి ముబ్బడిగా చైనా వస్తువులకు గత ప్రభుత్వానికి అనుమతించాయి. అమెరికాకు ఇవాళ ఎంత మార్కెట్ ఉందో భారత్‌లో చైనాకు అలాంటి మార్కెట్ ఉంది. చైనా బియ్యం కల్తీగా ఉన్నాయని ఎవరో తెలిసీ తెలియక సామాజిక మాధ్యమాల్లో పెడితే వాళ్లపై ఈగ కూడా వాలనివ్వని ‘చైనా భక్తులు’ హల్‌చల్ చేశారు. ఒకప్పుడు నెహ్రూ ఉదారత్వంతో ఐక్యరాజ్యసమితి శాశ్వత సభ్యత్వాన్ని పొందిన చైనా మనలను భద్రతామండలి మెట్లు ఎక్కకుండా అడ్డుకొంటున్నది. మయన్మార్‌లోని కోకోస్ ఐలాండ్, బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్, శ్రీలంకలోని హంబమ్ తోట, మాల్దీవుల్లోని మూవ్ అతోవ్, పాకిస్తాన్‌లోని గదర్ ప్రాంతాల్లో నౌకా స్థావరాలు నెలకొల్పి భారత్‌ను చుట్టుముట్టాలని చైనా ప్రయత్నిస్తోంది. ఆసియా ఖండంలో చైనాకు కంట్లో నలుసులా తయారైన భారత్ – భూటాన్‌లపై కక్షగట్టి ఇటీవల డోక్లాం భూభాగ వివాదం రేపింది. భూటాన్‌కు తూర్పు భాగంలో 495 చదరపు కిలోమీటర్లు సరిహద్దు కాగా, పశ్చిమ సెక్టార్‌లోని 286 చ.కిలోమీటర్ల భూభాగంపై చైనాతో వివాదం ఉంది. పశ్చిమ ప్రాంతం తమకు వదిలేస్తే తూర్పు ప్రాంతాలపై హక్కు కోరనని భూటాన్‌ను అడిగితే ఒప్పుకోలేదు. తద్వారా భారత్‌కు ఉచ్చు బిగించి తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలన్న చైనా పాచిక పారలేదు. అందువల్ల అమర్‌నాథ్ యాత్రను అడ్డుకోమని చైనా సైగ చేయగానే పాక్ మూకలు తెగబడ్డాయి.

మోదీ ప్రధాని అయ్యాక దౌత్యపరంగా సాధిస్తున్న విజయాలను చైనా – పాక్‌లు జీర్ణించుకోలేకపోతున్నాయి. అమెరికా- జపాన్‌లతో కలిసి భారత్ జరుపుతున్న నౌకాదళ విన్యాసాలు చైనాకు మింగుడు పడడం లేదు. ఊరీ, పఠాన్‌కోట్ ప్రాంతాల్లో పాక్ ఉగ్రవాదులు భారత్‌ను దెబ్బతీసినా మన సైనికుల సర్జికల్ స్ట్రెక్ వాళ్ళ దిమ్మదిరిగేలా చేసింది. కానీ, రక్తబీజుడి తమ్ములైన పాకిస్తాన్ తైనాతీలకు ఇవేవీ ఆనడం లేదు. హిజ్బుల్ తీవ్రవాది బుర్హాన్ వనీ మన సైనికుల చేతిలో హతమయ్యాక కాశ్మీర్ అల్లకల్లోలంగా మారింది. అక్కడి హురియత్ నేతలు వారి అనుచరులు రాళ్లదాడిలో ప్రత్యేక శిక్షణతో యువకులను పనిచేయిస్తున్నారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత అమర్‌నాథ్ యాత్రపై దాడి జరిగింది. కింకర్తవ్యం? రణమా? శరణమా? అని భారత ప్రజలు ఎదురు చూస్తున్నారు.

ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు తీవ్ర ఖండనలు, టీవీ చానళ్లలో వేడివేడి చర్చలు, పోలీసుల తనిఖీలు, నాయకుల ట్వీట్లు.. ఈ పరిణామాలను యావత్ దేశం చూస్తూనే ఉంది. సందట్లో సడేమియాల్లా మానవతా వాదుల పేరుతో చైనా భక్తులు, పాకిస్తాన్ భోక్తలు రంగంలోకి దిగేశారు. ఇప్పుడు దేశం కర్తవ్య విమూఢత్వంతో నివ్వెరపోయి చూస్తుంది. ఇలాంటి సమయంలో ఇజ్రాయిలే మనకు ఆదర్శం. వాళ్ళ అచంచలమైన దేశభక్తే వారి మార్కెట్‌గా, రక్షణగా మారిపోయింది. తమ వద్ద అణ్వస్త్రాలున్నాయని మురిసిపోవడం కాదు, ప్రయోగించకుండానే ఉత్తర కొరియాలా అందరినీ భయపెట్టవచ్చు. దేశ ప్రజల ఐక్యతే యుద్ధం కన్నా పెద్ద సంగ్రామం. రైలులో సీటుకోసం కొట్లాడి చనిపోయిన వ్యక్తి జునైద్‌కు మతం ముసుగు తగిలించి ‘ఈ దేశంలో అభద్రత ఉంది’ అంటూ దేశమంతా విన్పించేలా నిరసన తెలిపిన రాకాసి మూకకు అమర్‌నాథ్ యాత్రీకుల మరణరోదన విన్పించలేదా?

మన దేశానికి ప్రస్తుతం బయటి దేశాల శత్రువులను ఎదుర్కోవడం ఎంత ప్రధానమో, అంతర్గత బుద్ధి జీవులను, సంస్థలను, ఓట్ల కక్కుర్తిగల పార్టీలను ఎదుర్కోవడం అంతే ముఖ్యం. బయటి శత్రువుల కోసం రాడార్‌లు, నాడార్‌లు, ఆటంబాంబులు ఉన్నాయి కానీ అంతర్గత శత్రువులను ఎదుర్కోవడానికి ఎలాంటి ఆలోచనలు లేవు. ఇక్కడే మనం దెబ్బతింటున్నాం. ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు గాంధీజీ, నేతాజీ మళ్లీ బతికి వచ్చినా మార్చలేని దుస్థితిలో ఉన్నాయి. ‘వందమంది బయటి శత్రువులకన్నా ఇద్దరు ఇంటి శత్రువులు ప్రమాదకరం’ అని ప్రతి పౌరుడూ గుర్తించాలి. అంతర్గత శత్రువులు లేకుండా ఉన్నపుడు- బయటి వాళ్లతో అవసరం వస్తే యుద్ధం అనివార్యమైతే అదేం నేరం కాదు, ఘోరం అంతకన్నా కాదు!

1933లోనే ఆర్దుర్ రైడర్ అనే సంస్కృత ప్రొఫెసర్ నుంచి సంస్కృతం నేర్చుకొని మొదటి ఆటంబాంబు ప్రయోగం జరిగిన మాన్‌హట్టన్ ప్రాజెక్ట్ టీమ్ లీడర్ రాబర్ట్ జ్యూలియస్ ఓపెన్ హామర్‌ను మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. 16, జూలై 1945న అమెరికా అధ్యక్షుడు ట్రూమెన్ ఆజ్ఞతో ఈ ఆటంబాబు ప్రయోగం జరిపాక భగవద్గీతలోని రెండు శ్లోకాలను (116 అధ్యాయం 12, 32 శ్లోకాలు) హామర్ ఉటంకించాడు. అవసరమైతే యుద్ధం నేరం కాదు.. అది తప్పదు అనేది వాటి భావం. I am become death, the destroyer of worlds I suppose we thought that one way or another- … నేను ఫ్రపంచాన్ని నశింపజేయగల సమర్థత ఉన్న కాలుడను. ఈ యుద్ద భూమిలో చేరిన ప్రజలను సంహరించడానికి ప్రవృత్తుడినై ఉన్నాను.. యోధులనే వారు నీచే విడువబడ్డా జీవించలేరు. కాలమే వారిని నశింపజేస్తుంది.

-డా. పి.భాస్కరయోగి సెల్: 99120 70125

(ఆంధ్రభూమి సౌజన్యం తో)

For latest updates download Samachara Bharati app http://www.swalp.in/SBApp