చైనా, పాకిస్థాన్లతో యుద్ధాలు సంభవించినప్పుడు భారత్‌కు ఇజ్రాయెల్ సహాయం అందించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ ముస్లిం ఓటు బ్యాంకును సంతృప్తిపరచడానికై ఆ దేశం పట్ల దౌత్యపరమైన అస్పృశ్యతను పాటించాయి. ఇప్పుడు యూదు ప్రజ్ఞ, భారతీయ ప్రతిభల కలయిక నిశ్చితంగా మరింత భద్రమైన, మెరుగైన ప్రపంచావిర్భావానికి దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు.
ఒక ప్రభుత్వాధినేత మరో దేశంలో పర్యటించినప్పుడు సాధారణంగా జరిగేదేమిటి? ఆతిథేయి దేశంతో వాణిజ్య ఒప్పందాలు, ఇంకా సైనిక ఒప్పందాలు కుదుర్చుకోవడమే కదా. ప్రధాని మోదీ ఇటీవల ఇజ్రాయెల్‌లో పర్యటించినప్పుడు కూడా ఇదే జరిగింది. రక్షణ రంగంలో సంబంధాలను పటిష్ఠం చేసుకొనేందుకు, అధునాతన సాంకేతికతలను సమకూర్చుకోవడానికి సంబంధించి వివిధ ఒప్పందాలపై భారత్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, బెంజమిన్ నెతన్యాహు సంతకాలు చేశారు. అయితే ఇజ్రాయెల్‌లో మోదీ చరిత్రాత్మక పర్యటనతో భారత్‌కు కలిగిన ప్రధాన లబ్ధి ఈ ఒప్పందాలు కావు. ఒక వాస్తవానికి ఇవ్వవలసిన దానికంటే తక్కువ ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నానో వివరిస్తాను.
సుదీర్ఘ దుఃఖమయ చరిత్ర గల మహోన్నత ప్రజలు ఇజ్రాయెలీలు. యూదులు అయిన కారణంగా తొలుత క్రైస్తవ జాతుల నుంచి వారు వర్ణనాతీతమైన బాధలుపడ్డారు. జర్మన్ నియంత హిట్లర్ పాలనలో గ్యాస్ చాంబర్లు, నిర్బంధ శిబిరాలు యూదులు ఎదుర్కొన్న యాతనలకు పరాకాష్ట. ఇజ్రాయెల్ ఆవిర్భావానంతరం ముస్లిమ్–అరబ్ దేశాల సంయుక్త సైనిక దాడులు వారి మనుగడకు నిత్య ప్రమాదం కలిగిస్తున్నాయి. మోదీ పర్యటనపై టెల్ అవీవ్ నుంచి వెలువడిన రాజకీయ వార్తలు రక్షణ రంగంలో సహకారం, సాంకేతికతల బదిలీకి సంబంధించిన ఒప్పందాలకే అధిక ప్రాధాన్యమిచ్చాయి. ఆ ఒప్పందాలు మన దేశానికి ఎంతో ఉపయుక్తమైనవి అనడంలో సందేహం లేదు. అయితే భారత్‌కు ఆపత్సమయంలో ఇజ్రాయెల్ నిజమైన మిత్రదేశంగా ఆదుకున్నదనే వాస్తవం మనం విస్మరించరానిది. ఇజ్రాయెలీలకూ ఇది ఎంతో ముఖ్యమైన విషయం. ఇది అర్థం చేసుకోవాలంటే గత చరిత్రను ఒకసారి గుర్తుచేసుకోవల్సివున్నది.
జవహర్లాల్ నెహ్రూ హయాంలో ఇజ్రాయెల్ పట్ల భారత్ పూర్తిగా ‘దౌత్యపరమైన అస్పృశ్యత’ను పాటించింది. పశ్చిమాసియాలో కొత్తగా ఆవిర్భవించిన ఆ యూదు దేశం పట్ల ఆ వైఖరి మూడు దశాబ్దాలకు పైగా కొనసాగింది. 1950వ దశకంలో అమెరికాలో పర్యటిస్తున్న సందర్భంగా నెహ్రూ ఇలా ప్రకటించారు: ‘స్వేచ్ఛా స్వాతంత్య్రాలు దాడికిగురవుతూ, అన్యాయం జరుగుతూవుంటే భారత్ తటస్థంగా వుండదు, వుండబోదు’. అయితే నెహ్రూ ప్రభుత్వం పూర్తిగా అరబ్ దేశాల అనుకూల వైఖరినే అనుసరించింది. ఇజ్రాయెల్‌కు జరుగుతున్న అన్యాయాల్ని విస్మరించింది. నెహ్రూ అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు సైతం దాదాపుగా అదే వైఖరిని వహించాయి. 1960వ దశకంలో ఈజిప్ట్ అధినేత నాజర్ నాయకత్వంలో 13 అరబ్ దేశాలు సంయుక్తంగా ఇజ్రాయెల్‌పై దాడిచేశాయి. ఇంకా పలువిధాల ఉగ్రవాద దాడులను ప్రోత్సహించాయి. దౌత్యపరమైన ఆంక్షల గురించి మరి చెప్పనవసరం లేదు. ఇజ్రాయెల్ ఇన్ని విధాల కష్టనష్టాలకు గురవుతున్నప్పుడు భారత్‌కు ప్రధానమంత్రిగా వున్న గొప్ప ఉదారవాది పూర్తిగా మౌనం వహించారు! మనకు ఎప్పటికీ తలవంపులు కలిగించే ఒక సంఘటనను కూడా ఈ సందర్భంగా తప్పక ప్రస్తావించవలసివున్నది. 1976లో పాలస్తీనియన్ ఉగ్రవాద సంస్థ ఒకటి ఒక పౌర విమానాన్ని హైజాక్ చేసి, ఉగాండాకు తీసుకువెళ్ళింది. తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఆ విమానంలో వున్న యూదు ప్రయాణీకులందరినీ కాల్చివేస్తామని ఆ పాలస్తీనియన్ ఉగ్రవాదులు బెదిరించారు. అప్పట్లో ఉగాండాలో అధికారంలోవున్న సైనిక నియంత ఇడీ అమీన్ ఆ ఉగ్రవాదులకు మద్దతు నిచ్చాడు. ఇజ్రాయెలీ కమెండోలు సకా లంలో ఆ విమానంపై సాహసోపేతంగా దాడిచేసి ఆ యూదు ప్రయాణీకులందరినీ రక్షించారు. ప్రపంచాన్ని కలవరపరిచిన ఈ హైజాక్ సంఘటన సందర్భంలో ఆ దురాగతాన్ని నిర్ద్వంద్వంగా ఖడించడానికి న్యూఢిల్లీ వెనుకాడింది!
నెహ్రూ హయాంలోను, ఆ తరువాత దశబ్దాల పాటు భారత దేశ ప్రభుత్వాలు ఇజ్రాయెల్‌ను సందర్శించడానికి తమ పౌరులను అనుమతించలేదు. మన పాస్ పోర్టులపై ‘ఇజ్రాయెల్‌కు ప్రయాణించడానికి ఇది చెల్లదు’ అని స్పష్టంగా రాసివుండేది. అయినప్పటికీ చాలామంది భారతీయులు ఇతర మార్గాలలో ఇజ్రాయెల్‌ను సందర్శించడం జరిగింది. అరబ్–ముస్లిం దేశాల దాడులను మొక్కవోనిధైర్యంతో ఎదుర్కొంటున్న ఆ యూదు జాతి పట్ల భారతీయుల ప్రేమాభిమానాలకు ఇదొక తార్కా ణంగా చెప్పవచ్చు. 1990వ దశకంలో నెహ్రూ సోషలిస్టు విధానాలను కాంగ్రెస్ పార్టీ విడనాడిన తరువాతనే కాంగ్రెస్ ప్రధానమంత్రి ఒకరు (నెహ్రూ–గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తికాదు) ఇజ్రాయెల్‌కు పూర్తి స్థాయి దౌత్య ప్రతిపత్తిని ఇవ్వడానికి సాహసించారు. ఆ యూదు దేశం పట్ల భారత్ పాటిస్తున్న దౌత్యపర అస్పృశ్యత ఎట్టకేలకు అంతమొందినప్పటికీ ఇరుదేశాల మధ్య సంబంధాలు త్వరితగతిన మెరుగవ్వ లేదు. నెహ్రూ ప్రభుత్వం స్వదేశంలోని ముస్లిం మైనారిటీలను బుజ్జగించడానికే ప్రాధాన్యమిచ్చింది గానీ, మనుగడ ముప్పు నెదుర్కొంటున్న యూదు దేశానికి అండగా నిలిచేందుకు అంగీకరించలేదు. అయినా భారత్ విష యంలో ఇజ్రాయెల్ దెబ్బకు దెబ్బ అనే విధానాన్ని అనుసరించలేదు. ఇది విస్మరించకూడని వాస్తవం. 1962లో చైనా మన దేశంపై దాడిచేసిన సమయంలో చైనా సైనిక దళాల కదలికలు, రాజకీయ నిర్ణయాలకు సంబంధించిన కీలక గూఢచార సమాచారాన్ని ఇజ్రాయెల్ న్యూఢిల్లీకి సమకూర్చింది. ఇజ్రాయెల్ ఈ సహాయాన్ని చాలా రహస్యంగా చేసింది. అప్పుడు గానీ, ఆ తర్వాతగానీ ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించలేదు. అలాగే 1965లో పాకిస్థాన్ మన దేశంపై పెద్ద ఎత్తున దాడిచేసినప్పుడు కూడా ఇజ్రాయెల్ మనకు అవసరమైన సైనిక సామాగ్రిని తక్షణమే సరఫరా చేసింది. 1962లో గానీ, 1965లోగానీ నెహ్రూకు మిత్రులైన అలీన దేశాల ప్రభుత్వాధినేతలు భారత్‌కు కనీసం సానుభూతి కూడా తెలుపలేదు.
ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం విదేశాంగ విధానంలో తీసుకు వస్తున్న మార్పులను అర్థంచేసుకోవడానికి ఈ గతచరిత్రను తెలుసుకోవల్సిన అవసరమున్నది. జాతీయ ప్రయోజనాలే ప్రధానంగా మన విదేశాంగ విధానాన్ని మోదీ రూపొందించి అమలుపరుస్తున్నారు. ఆచరణ సాధ్యంకాని ఆదర్శాలకు కాకుండా దేశానికి ప్రయోజనం కలిగించే అంశా లకే ఆయన ప్రాధాన్యమిస్తున్నారు. విధానపరమైన అంశాల్లో ముఖ్యంగా పాలస్తీనాకు సంబంధించిన వ్యవహారాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ముస్లిం నాయకులకు వీటో అధికారాన్ని ఇచ్చాయన్నది స్పష్టం. సౌదీ అరేబియా, యుఏఇ, ఇరాన్ మొదలైన దేశాలు ఇజ్రాయెల్‌కు బద్ధశత్రువులు. అయినా మోదీ ఆ దేశంలో పర్యటించడంపై రియాద్, అబు దాబీ, టెహ్రాన్ల నుంచి ఎటువంటి ప్రతికూల వ్యాఖ్యలు వెలువడకపోవడం గమనార్హం. భారత్–ఇజ్రాయెల్ సంబంధాలు ఏ విధంగాను తమ ప్రయోజనాలకు ఏ విధంగాను హానికరం కావనే వాస్తవాన్ని ఆ ముస్లిం–అరబ్ దేశాలు అర్థం చేసుకోవడమే అందుకు కారణమనేది స్పష్టం.
ఇజ్రాయెల్ నుంచి అందుతున్న అధునాతన సాంకేతికతల వల్ల మన వ్యవసాయరంగంలో మౌలిక మార్పులు సంభవిస్తున్నాయి. హర్యానా రైతులు గతంలో ఎకరానికి 18,000 కిలోల టమోటాలు మాత్రమే పండించగలిగేవారు. ఇజ్రాయెల్ సాంకేతికతల సహాయంతో వారు ఇప్పుడు ఎకరానికి 96,000 కిలోల టమోటాలు పండిస్తున్నారు. అలాగే గతంలో ఆ రైతులు ఎకరానికి 3500 కిలోల దోసకాయలు మాత్రమే పండించేవారు. ఇప్పుడు ఎకరానికి 45,000 కిలోల దోసకాయలు పండించగలుగుతున్నారు. హర్యానా రైతులు ఇజ్రాయెల్ సాగు పద్ధతులను అనుసరించి సాగునీటి వినియోగంలో కూడా 65 శాతం తగ్గుదలను సాధించగలిగారు. తన భూభాగాల నుంచి భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడడానికి ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ అనుమతి ఇవ్వకూడదన్న న్యూఢిల్లీ డిమాండ్‌ను ఇజ్రాయెల్ పూర్తిగా సమర్థిస్తున్నది. టెల్అవీవ్ అందిస్తున్న సాంకేతికతలు, సైనిక సామాగ్రి రక్షణ పాటవాన్ని ఇతోధికంగా పటిష్ఠం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాదుల చొరబాటును అరికట్టడంలో ఇజ్రాయెల్ కీలక తోడ్పాటు నందిస్తున్నది. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనను ‘చరిత్రాత్మకమని’ సరిగానే అభివర్ణించినప్పటికీ సంబంధిత వార్తా కథనాలలో మరొక ముఖ్య వాస్తవం కూడా ఉపేక్షించబడింది. ఇజ్రాయెలీ పేటెంట్లు వున్న అత్యాధునిక సాంకేతికతలు అమెరికా పారిశ్రామిక ప్రగతికి ఉద్దీపనగా ఉన్నాయనేదే ఆ వాస్తవం. యూదులు అసాధారణ ప్రతిభావంతులు. తమకు పూర్తిగా ప్రతికూలంగా వుండే పశ్చిమాసియా కల్లోల పరిస్థితులలో కూడా వారు మనుగడ సాగించగలుతున్నారు. గత రెండు దశాబ్దాలలో అనేక మంది ఇజ్రాయెలీలు నోబెల్ పురస్కారాలను పొందారు. ఈ ఉత్కృష్ట యూదు ప్రజ్ఞకు, ఇప్పుడు అత్యంత పురాతన సృజనాత్మక నాగరికతా సంపన్న భారత్ తనకుతానుగా జత అయింది. యూదు ప్రజ్ఞ, భారతీయ సృజనాత్మక ప్రతిభా సంబంధాలు నిశ్చితంగా మరింత భద్రమైన, మెరుగైన ప్రపంచావిర్భావానికి దోహదం చేసేవిగా పరిణమిస్తాయనడంలో సందేహం లేదు.
-బల్బీర్ పుంజ్
(వ్యాసకర్త బీజేపీ సీనియర్ నాయకులు)
(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)
For latest updates download Samachara Bharati app http://www.swalp.in/SBApp