
ఈ ఏడాది 8 డిసెంబర్ నుండి 15 డిసెంబర్ వరకు భాగ్యనగరంలోని దాదాపు 40 బాలగోకులాలు ‘గీతాజయంతి’ని అత్యంత ఆసక్తికరంగా మరియు విన్నూత్నంగా నిర్వహించాయి. గత కొన్ని సంవత్సరాలుగా బాలగోకులంలో జరిగే పండుగలన్నింటిలో ‘గీతా జయంతి’ ఒక ముఖ్యమైన స్థానం ఏర్పాటు చేసుకుంది. బాలగోకులం చిన్నారులు ఈ సంవత్సరం భగవద్గీతలోని 10వ అధ్యాయం (విభూతి యోగ) నేర్చుకున్నారు.

చిన్నారులు గీతలోని 10వ అధ్యాయాన్ని వల్లించటమే కాకుండా నాటక, నృత్య ప్రదర్శనలతో పాటు కొన్ని దేశభక్తి గేయాలు కూడా పాడటం సంతోషకరం. మన నిత్యజీవితంలో భగవద్గీత ప్రాముఖ్యతను కార్యక్రమానికి విచ్చేసిన ఉపన్యాసకులు చక్కగా వివరించారు.
శిక్షక్ లు గీతాజయంతి కోసం పిల్లలను సంసిద్ధం చేయడానికి ఒక నెల రోజుల పాటు రోజూ సాయంత్రం శిక్షణా తరగతులు నిర్వహించారు.
కమ్యూనిటీ పెద్దలు కూడా ఈ వేడుకలకు వచ్చి పిల్లలని ఆశీర్వదించడమే కాకుండా వాళ్లతో పాటు భగవద్గీత పారాయణం చేశారు. శ్రీకృష్ణ భగవానునికి ప్రసాదం సమర్పించారు మరియు కొన్ని కమ్యూనిటీలలో అందరు కలిసి విందులో పాల్గొన్నారు.
మరికొన్ని బాలగోకులాలు ఈ వేడుకలను ప్రశాంతమైన దేవాలయాల ప్రాంగణాలలో జరుపుకున్నారు. గోపబాలురు మరియు గోపికల వేషాలలో పిల్లలు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. భగవద్గీత సిద్ధాంతాన్ని, భావాన్ని మరియు దాని ప్రాముఖ్యతను నాటక రూపంలో ప్రదర్శించారు.
5 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు భగవద్గీతను ఎంతో సరళంగా వల్లించడంతో అక్కడ ఉన్న పెద్దలందరూ పరమానందులయ్యారు. ఈ గీతాజయంతి వేడుకలు చిరస్మరణీయంగా మారటానికి బాలగోకులం బృందం చేసిన కృషి అభినందనీయం.
