గత నెలరోజులుగా వార్తలలో నలుగుతున్న అంశం..
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచాన్ని ఒక మలుపు తిప్పిన అంశం..
ప్రస్తుతం మన విపక్షాలకు కంటిమీద కనుకు లేకుండా చేస్తున్న అంశం..
ఫిబ్రవరి 14న మనదేశంలోని పుల్వామాలో మన సైనిక వాహనాలపై పాకిస్తాన్‌కు చెందిన జైషే మహమ్మద్ తీవ్రవాదులు బాంబుదాడులకు తెగబడి 40 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్నారు. దానికి తగిన జవాబుగా మన వైమానిక దళం ఫిబ్రవరి 26 తెల్లవారుఝామున పాకిస్తాన్ అధికార భూభాగంలోకి చొచ్చుకుపోయి బాలాకోట్‌లో ఉన్న తీవ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేశాయి. వెయ్యి కిలోల బాంబులు కురిపించాయి. ఆ దాడి అక్కడే జరపటానికి కారణం అక్కడ ఆ సమయంలో 500 నుండి 700 మందికి పైగా తీవ్రవాదులు ఉన్నట్లు నిఘా వ్యవస్థ నుండి మన సైన్యానికి పక్కా సమాచారం ఉండటమే. అటువంటి సమాచారంతోనే మన వైమానిక దళం బాలాకోట్‌పై దాడికి పక్కా ప్రణాళిక రచించి, విజయవంతంగా అమలుచేసింది. ఈ దాడిలో దాదాపు 350 మంది తీవ్రవాదులు మట్టికరిచినట్లు బిబిసి రాసింది. ఈ దాడితో ‘మా జోలికి వస్తే ఊరుకోం. ప్రతీకారం తీర్చుకోడానికి ఎంతదూరమైనా వస్తాం, ఏదైనా చేస్తాం’ అనే కఠిన సందేశాన్ని మన దేశం పాక్‌తోపాటు మిగతా ప్రపంచ దేశాలకు ఇచ్చినట్లయింది. ఆ దాడికి ప్రతిగా మళ్లీ పాక్ మనపై ఎఫ్-16 విమానాలతో దాడులకు పాల్పడింది. నియంత్రణ రేఖ దాటే ప్రయత్నం చేసింది. పాక్ విమానాలను నిలువరించే ప్రయత్నంలో మన పైలట్ అభినందన్ వర్ధమాన్ పాక్ చేతికి చిక్కటం, భారత కఠిన వైఖరికి పాక్ తలొగ్గి అతనిని భారత్‌కు అప్పగించడం వంటి సంఘటనలు ఒకదాని తరువాత ఒకటి చాలా వేగంగా జరిగాయి. ఇది భారత్‌కు ఒకవిధంగా చెప్పాలంటే యుద్ధవిజయం వంటిదే. పుల్వామాలో పాక్ తీవ్రవాదులు సృష్టించిన మారణకాండకు ప్రతిగా పాక్‌లోని తీవ్రవాద శిబిరాలపై మెరుపు దాడులను పక్కా ప్రణాళికతో నిర్వహించిన భారత సామర్థ్యాన్ని గుర్తించిన ప్రపంచదేశాలన్నీ భారత ప్రభుత్వానికి, నాయకత్వానికి తమ పూర్తి మద్దతు తెలిపాయి. బాలాకోట్‌పై దాడి తరువాత పాక్‌కు మిత్రదేశమైన చైనా సైతం ఒళ్లు దగ్గర పెట్టుకుని మసలుకోవాలని పాక్‌కు హితవు చెప్పింది.
ఇక విజయవంతంగా జరిగిన మెరుపుదాడుల పట్ల భారతీయుల ఉత్సాహానికి అంతే లేదు. ఎన్నాళ్ల నుంచో పాక్ చేస్తున్న ఆరాచకాలు, ఆగడాలను చూసి, చూసి విసిగిపోయిన సగటు భారతీయుడు బాలాకోట్ ఉగ్ర శిబిరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడులతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఉత్సాహంతో పొంగిపోయాడు. వేడుక చేసుకున్నాడు. అవసరమైతే తానూ యుద్ధరంగానికి వచ్చేస్తానన్నంత ఉద్వేగానికి లోనయ్యాడు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన విజయం ఒకేసారి సిద్ధించినట్లుగా సంబరపడ్డాడు. మెరుపు దాడులను సమర్థవంతంగా నిర్వహించిన ఎన్‌డిఎ ప్రభుత్వంపై, నాయకులపై తమ సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించాడు. సంతృప్తి చెందాడు.
అయితే భారత పౌరుల ఇంతటి సంబరాన్ని, వారిలో అధికారపక్షం పట్ల వ్యక్తం అవుతున్న విశ్వాసాన్ని మనదేశంలోని కొన్ని విపక్షాలు, కొంతమంది నాయకులు, వారికి వత్తాసు పలికే ఒక వర్గం మీడియా జీర్ణించుకోలేక పోతున్నారు. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మెరుపుదాడుల అంశాన్ని విమర్శించడం మొదలుపెట్టారు. నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశం ఎన్నికలలో భాజపాకు ఓట్లు తెచ్చిపెడుతుందా ? లేదా ? అంటూ ఒక వర్గం మీడియా అడ్డగోలుగా చర్చిస్తోంది. అసలు ఈ మెరుపు దాడులు దక్షిణ భారతంలో జరిగే ఎన్నికలలో ఏమాత్రం ప్రభావం చూపలేవు అంటూ తనను తాను జాతీయ మీడియాగా చెప్పుకుంటున్న ఒక ఆంగ్ల పత్రిక ఏకపక్షంగా తీర్మానిస్తోంది. తనను తాను బాధ్యత గల భారత పౌరుడిగా, ఒక శాస్త్రవేత్తగా, ఒక జాతీయ పార్టీ నాయకుడిగా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి భారత్ అసలు దాడులు చేసిందా? అని ప్రశ్నించాడు. ఎన్నికలకు ముందు భారత్, అమెరికాలు పక్కదేశాలను శత్రుదేశాలుగా చూపిస్తూ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శిం చాడు. పచ్చ మీడియాగా ముద్రపడ్డ మరో పత్రిక మరో అడుగు ముందుకేసి ‘పాక్ నాయకులు అప్రమత్తంగా వ్యవహరించి అభినందన్ వర్ధమాన్‌ను మనకు తిరిగి అప్పగించారు. దీనిని ప్రధాని ఘనతగా భాజపా వర్గాలు చెప్పుకుంటున్నాయి’ అని రాసింది. వీరంతా చేస్తున్న ఇటువంటి అర్థం పర్థం లేని విమర్శల వల్ల ఈ దేశ పౌరులమైన మనం, మన దేశం, మన సైన్యం, అధికార గణం, యంత్రాంగం ప్రపంచ దేశాల ముందు చులకన అవుతామనే కనీస ఆలోచన వీరికి తట్టకపోవటం మన దురదృష్టం. భాజపాను విమర్శించే ఉద్దేశంతో దేశ ప్రయోజ నాలను ప్రశ్నించటం మరింత విచారకరం.
అసలు ఇటువంటి విపత్కర చర్చకు నాంది పలికింది ఈ దేశాన్ని ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం ఆ పార్టీని ఉపయోగించుకుని తాము దొడ్డిదారిన అధికారంలోకి రావాలని కలలు గంటున్న కొంతమంది విపక్షాల నాయకులు కావటం దురదృష్టకరం. పుల్వామా దుస్సంఘటనతో దేశంలో ఒకపక్క యుద్ధ వాతావరణం రగులుతుంటే, మరోపక్క విపక్షాల ఐక్య సంఘటన నాయకులు ఢిల్లీలో సమావేశమై తమ భవిష్య రాజకీయ వ్యూహాల గురించి, అధికార పక్షాన్ని నిందించటం గురించి ఆలోచించటం మొదలుపెట్టారు. పుల్వామా సంఘటనను, మెరుపు దాడుల విజయాలను రాజకీయం కోసం వాడుకోరాదు అంటూ సుద్దులు పలికారు. యుద్ధ వాతావరణ సమయంలో బాధ్యతగా మెలగాల్సిన ప్రతిపక్షాల నుండి ఆ సమయంలో అటువంటి బాధ్యతారాహిత్య ప్రకటన రావడం చూసి ప్రజలు, ప్రపంచం విస్తుపోయింది. ఇదీ మనదేశం లోని విపక్షాల స్వార్థ నీతి.
ఇంతకీ విపక్షాల ఇంతటి బాధకు కారణం ఎన్నికలు. ఎన్నికలకు ముందు దేశంలో యుద్ధ పరిస్థితి నెలకొనడం, దానిని అధికారగణం సమర్థ వంతంగా ఎదుర్కొనటంతో, ఈ సంఘటన అధికారగణం పట్ల ప్రజలలో అభిమానం పెంచు తుందేమో, దానితో ఓట్లన్నీ వారికే పడిపోతాయేమో అనే భయం, ఆందోళన విపక్షాలకు పట్టుకుంది. దానితో విపక్షాలు తమ ప్రయోజనాలను కాపాడు కోవడం కోసం ఏకంగా సైనిక విజయాన్ని సైతం ప్రశ్నిస్తున్నాయి. బాలాకోట్ మెరుపుదాడులు ఓట్లు రాల్చలేవు అంటూ గావుకేకలు వేస్తున్నాయి. కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం దేశం పట్ల, దేశ ప్రయోజనాల పట్ల బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాయి.
వాస్తవానికి బాధ్యతగా మసలుకొనే విపక్షానికి అధికార పక్షాన్ని విమర్శించటానికి ఎన్నో ఇతర అంశాలు లభిస్తాయి. అయితే జాతి రక్షణ, జాతి సమగ్రత, జాతి సార్వభౌమత్వం కన్నా తమ స్వార్ధ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వజూపుతున్న ఇటువంటి కొన్ని విపక్షాలకు ఇంతకుమించి మరో అంశం కనబడకపోవటం విచారకరం. అధికార పక్షాన్ని విమర్శించడానికి చిన్నా, చితకా అంశాలు ఎన్నో ఉన్నప్పటికీ అవేవీ జాతీయస్థాయిలో తమకు ఓట్లు రాల్చలేవు అనేది వారి భావన (బాధ) అయి ఉండ వచ్చు. వీరి ఈ వింత ధోరణికి మనదేశ మీడియా సైతం వంతపాడటం విచిత్రం. ఎన్నికలలో ప్రస్తా వించవలసిన అంశాలు జాతీయస్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో ఎన్నో ఉన్నప్పటికీ మీడియా ఈ అంశానికే అధిక ప్రాధాన్య మిస్తూ దేశ సమగ్రతనే పణంగా పెట్టే ప్రయత్నం చేయడం దురదృష్టకరం. ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తిం చటం మీడియా లక్షణం కానే కాదు.
ఇంతకీ విపక్షాలు మొత్తుకుంటున్నట్లు అధికార పక్షం బాలాకోట్ మెరుపు దాడులను తమ రాజకీయ ప్రయోజనం కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నదా ? ఈ దాడులను తమ ఘనతగా ఎన్నికలలో చెప్పుకుంటున్నదా ? అంటే ఎక్కడా అందుకు రుజువులు కనబడటం లేదు. ‘మేం మెరుపుదాడులు చేశాం, అది మా ఘనత, అది చూసి మాకు ఓట్లు కుమ్మరించండి’ అని ప్రధాని గాని, మంత్రులు గాని, ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు కాని ఇప్పటివరకు ఎక్కడా చెప్పుకున్న దాఖలాలు కనబడలేదు. మెరుపుదాడులు చేసిన తరువాత ఆ విషయాన్ని మన విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే ప్రకటించారు. ఆ తరువాత సరిహద్దుల రక్షణ గురించిన తమ భవిష్య ప్రణాళికల గురించి త్రివిధ దళాధిపతులు మీడియాకు వివరించారు. ఇంతకు మించి ప్రభుత్వ అధికార గణం ఎక్కడా మెరుపు దాడుల గురించి డబ్బా కొట్టుకోలేదు. వాస్తవానికి ఇది డబ్బా కొట్టుకోవలసిన అంశం కాదు. మన ఇంటిని సమస్యల నుండి కాపాడుకోవడం మన కర్తవ్యం. బాధ్యతగా మసలుకొనే ఏ వ్యక్తీ తన కర్తవ్యాలను తన ఘనతగా చెప్పుకోడు. అది అతిశయోక్తి అనిపించుకుంటుంది. అలాగే ప్రస్తుత అధికారపక్షం దేశ రక్షణ, దేశంలో అంతర్గత భద్రత లను పటిష్టం చేయడం తన కర్తవ్యంగా భావించింది. ఏం చేయాలో అది సమర్థంగా నిర్వహించింది. కానీ దానిని తన ఘనతగా ఎప్పుడూ చెప్పుకోలేదు. అలా అధికారపక్షం చెప్పుకుంటుందేమో?!, ఓట్లు అడుగుతుందేమో? అని భయపడి, ఆందోళన చెంది, ఎక్కువగా ఊహించి విపక్షాలే దీనిపై రాద్ధాంతం చేస్తుండటం విచారకరం. తమ స్వార్థం కోసం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి ఏమాత్రం వెనుకాడకపోవడమే వీరికి తెలిసిన నీతి.
కానీ సమాచార విప్లవం వచ్చిన నేటి రోజుల్లో ఇప్పటి ఓటర్లు విపక్షాల ఇటువంటి బాధ్యతారాహిత్య ప్రవర్తనను నిశితంగా పరిశీలిస్తారని; ఎవరిది నీతి, న్యాయ ప్రవర్తన? ఎవరిది అవినీతి, అన్యాయ ప్రవర్తన ? అనేది గమనిస్తారని, చివరకు తమ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తారేమోనని కూడా విపక్షాలు ఊహించి మసలుకోవడం మంచిది.
Source: Jagriti Weekly