Home Views బతుకమ్మ… ప్రకృతి శోభకు కిరీటం

బతుకమ్మ… ప్రకృతి శోభకు కిరీటం

0
SHARE

-డా.  సరోజ వింజామర

ప్రాణాధారమైన ప్రకృతి  అందానికి ప్రతీక. ఆ ప్రకృతి  ప్రతీకయే స్త్రీ. వర్షపు జల్లులతో  సత్తువను  పెంచుకుని, భువినిండా  పరిచిన ఆకుపచ్చని తివాచీపై, హొయలొలుకుతున్న రంగురంగుల పూలతో, ఆశ్వయుజానికి  అందంగా ముస్తాబైన  ప్రకృతి  కాంతను  పడతులు అదే పూలతో  ఆరాధించుకునే పండుగ బతుకమ్మ.

పంచభూతాల ద్వారా ప్రకృతి ప్రాణుల అవసరాలను తీరుస్తుంది.  తనఉనికికోసం ఎవరిమీదా ఆధారపడకుండా  వివిధ ఋతువులలో తనరూపాన్ని తనే  పునర్నిర్మించుకుంటుంది. ఒక్కో ఋతువులో ఒక్కోరకమైన శోభలీనుతూ శరదృతువులో నిండైన నీటి చెలమలతో, ఒత్తైన  పూలగుత్తులతో వికసించి ఉంటుంది. శ్రామికులకు  ఆరుగాలం శ్రమించిన  పొలం పనులు ముగింపుకు వస్తున్న దశ ఇది. ఇటువంటి  సమయంలో శ్రామికులు తమ కృషిని ప్రకృతితో కలబోసుకుని ఉత్సవంగా జరుపుకునే పండుగ ఈ బతుకమ్మ. ఆశ్వయుజ మాస పాడ్యమి ఎంగిలిపూల బతుకమ్మగా  మొదలుకుని చివరి రోజు సద్దుల బతుకమ్మగా తొమ్మిదిరోజులపాటు ఈ  పండుగను ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటారు. తమకు అందుబాటులో ఉండి, విరివిగా  దొరికే గన్నేరు, బంతి, చామంతి, కాశీమల్లె, కట్లపూలు, పట్టుగొండ్లు, గుమ్మడి,  ఉద్రాక్ష,  గోరెంట, దాశన పూలు ఇలా ఎక్కువసేపు తాజాగా ఉండే పువ్వులను సేకరించుకుని బతుకమ్మను పేరుస్తారు. ఈ పండుగకు గునుగు, తంగేడులు పూలరాణులు. పువ్వులు విడిపోకుండా నిలబడి ఉండేలా బతుకమ్మలోపల ఆకులు మొదలగువాటితో కడుపు నింపుతూ, గౌరమ్మలా శిఖరంగా బతుకమ్మను పేర్చే విధానం ఎంతో పొందికగా, శాస్త్రీయంగా ఉంటుంది.  పొద్దుగుంకే సమయంలో పల్లెలు, వాడలు  బతుకమ్మ పాటలతో  మారుమోగుతాయి. గాజుల సవ్వళ్ళు, చప్పట్ల గలగలలు, వినసొంపైన పాటలతో  ప్రకృతి  పరవశిస్తుంది.

బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి ఆధార కథలు అనేకం.  అనేక  తరాలుగా  ఆడబిడ్డలు పదిలంగా కాపాడుకుంటూ పొదుముకున్న  పండుగ ఇది. పుట్టింటి ఆడబిడ్డలు తల్లిగారింటికి రావడంతో పండుగసందడి  మొదలౌతుంది. చుట్టాలు, చుట్టుపక్కలవారు, తన చిన్ననాటి దోస్తులు అందరితో కలిసి మహిళలు తమ సుఖదుఃఖాలను పంచుకునే పాటలను కడతారు. స్త్రీలే స్వయంగా  పాట, బాణీ కట్టడం అదనపు ఆకర్షణ. ఆ పాటల్లో సామాజికం, ధార్మికం, శ్రామికం,  కుటుంబ బాంధవ్యాలు ఇలా ఎన్నో రకాల  అంశాలు కథనాత్మకంగా  మేళవించి ఉంటాయి.  లయాత్మకంగా, తూగు ఉండేవిధమైన ఈ బతుకమ్మ పాటలు జానపదుల మౌఖికసాహిత్య వైభవాన్ని తెలియజేస్తాయి. ఆడవారికి  ప్రత్యేకమైన ఈ పండుగలో పువ్వుల సేకరణ, బతుకమ్మ పేర్చడం, బతుకమ్మలను ఎత్తుకోవడం, సద్దులను మోయడం  వంటి పనులలో మగవారుకూడా పాల్గొంటారు. తొమ్మిది రోజుల్లో చిన్నారులకుకూడా కొన్ని రోజులు ప్రత్యేకించి ఉండినా ఇపుడు అన్ని వయసులవారూ  కలిసి అన్ని రోజుల పండుగనూ జరుపుకుంటున్నారు.  అమ్మలతో పాటు  చిన్న పాపలుకూడా తమకోసం చేసిన చిన్న బొడ్డెమ్మను పట్టుకోవడం, వారితోపాటు బతుకమ్మ ఆటపాటల్లో ఉల్లాసంగా  పాల్గొనడం వారికి,   చూసే పెద్దలకూ కనుల విందుగా ఉంటుంది.  పువ్వుల్లాంటి అమ్మాయిలు చూడచక్కగా  అలంకరించుకుని గౌరమ్మగా  బతుకమ్మను భావించి గౌరమ్మ ఆకారంలో  అన్నలు, నానలు తెచ్చిన తీరొక్క పూలను అంతరాలుగా పేర్చుకుంటూ శిక్రంగా గుమ్మడిపువ్వుతోనో,  దాశన్న పువ్వుతోనో అలంకరిస్తారు. మహిళలు తమ సాంస్కృతిక వారసులను చూసి మురిసిపోతుంటారు.

పల్లెల్లో  రచ్చబండలు  మగవారికి వేదికలైతే  బతుకమ్మ వంటి పండుగలు స్త్రీలను ఒకదగ్గర చేర్చే ఉత్సవాలు. సంజె వేళ  ఇంటిముందర అలికి ముగ్గేసి పీట మీద పేర్చిన బతుకమ్మను పెట్టి ఇంటి ఆడవారందరు “ఏమేమి పువ్వొప్పునే  గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ” అంటూ కొంతసేపు పాటలు పాడుతూ  కొన్ని సుట్లు వేసిన తరువాత వీధిలో నలుగురు గుమిగూడే చోట, అటు తర్వాత  ఆలయాల ముందు, చివరగా ఊరి  చెరువు దగ్గరికి చేరుకుంటారు. ఎక్కడెక్కడి గ్రామీణ స్త్రీలంతా ఆ  పూలవాగు దగ్గరికి  చేరి పెద్ద పెద్ద వలయాలుగా తిరుగుతూ చేయి చేయి కలిపే చప్పట్లతో, బతుకమ్మ పాటలతో అంబరాన్నంటే  సంబురాలతో గౌరమ్మను కొలుస్తారు. చివరగా “పోయిరా  గౌరమ్మ పోయిరావమ్మా యాడాదికోసారి నువ్వ్వొచ్చిపోవమ్మా”  అని సాగనంపి ఆడపడుచులంతా  పసుపు బొట్టు ఇచ్చుకుని సద్దులు పంచుకుని తినడంలో ఉండే ప్రేమ, ఆప్యాయతలు  ఊరివారందరిని  కలిసికట్టుగా వుండేట్లుగా చేస్తాయి. ఎవరింటికి వారు అతుక్కుపోయి  ఉండే ఈనాటి  కాస్మోపాలిటన్ కల్చర్ మనుషులను కూడా కుదిపి వారుకూడా  బయటికొచ్చి ఆడిపాడేలా చేసే ఘనత బతుకమ్మ పండుగుకే   దక్కుతుంది. వానలతో సమృద్ధిగా నిండిన చెరువులను పొలాలకు, వాడకానికీ  ఉపయోగకరంగా  శుద్ధి చేసుకోవడానికి ఊరివారందరు కలిసికట్టుగా వేడుకగా జరుపుకునే శ్రామిక పండుగగా కూడా బతుకమ్మను చెప్పుకోవచ్చు. వర్షాలద్వారా ఎక్కడెక్కడినుండో వాగుల్లో  చేరిన మట్టిని తీసి వాటితో మట్టి బతుకమ్మలను చేసే ఆచారంకూడా ఉండేది.  వివిధ ఔషధ లక్షణాలు గల పుష్పాలు  ముఖ్యగా చెరువు కట్టల మీద విరివిగా పూసే తంగేడులతో స్త్రీలు  తమ తమ ఇండ్లలో చేసిన అన్ని బతుకమ్మలను సామూహికంగా చెరువు నీటిలో కలపడంద్వారా  ఆ నీటికి   ఔషధ లక్షణాలు ఆపాదించబడతాయి.  తద్వారా  ఊరివారందరు  వాడుకునే చెరువులు, వాగులు,కుంటలు, జలాశయాలు  ఊరివారందరి శ్రమ చేతా బాగుపడి అందరికి పనికివస్తాయి.  ఇలా సామాజిక సంబంధాలను గట్టిపడేలా చేసే పండుగ ఇది. మెట్టినింటి నుండి పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డలు అక్కడా ఇక్కడా తమ సంబంధాలను  పదిలంగా కాపాడుకుంటారు. బంధుత్వాలను కలుపుకుంటారు. సంఘటితం స్త్రీద్వారానే సాధ్యం కదా!  అలాగే వాడలు, కాలనీలలో స్త్రీలంతా ఒక చోట చేరి ఆడుతూ పాడుతూ ఒకరికొకరు సఖ్యంగా  మెలుగుతారు. వారి మధ్య ఏవైనా భేదాభిప్రాయాలున్నా తొలగించే పండుగ ఇది. మహిళలు తమలో నిబిడీకృతమై ఉన్న కళా నైపుణ్యాలను నలుగురితో పంచుకోవడానికి వేదిక ఈ బతుకమ్మ. ఊరివారందరిని ఏకం చేసే పండుగ బతుకమ్మ.

ఆడబడుచును లక్ష్మీదేవిగా, గౌరమ్మగా గౌరవించుకోవడం మన సంప్రదాయం. మహిళల మీద జరిగే ఎన్నో అకృత్యాలను అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన పండుగగా కూడా బతుకమ్మ ఏర్పడిందని మనకు చరిత్ర చెబుతోంది. స్త్రీని చులకన చేయడం తప్పని చెబుతూ ఆమెను  కొలుచుకోవాలనే సంప్రదాయం ఈ పండుగలో కనిపిస్తుంది. గ్రామీణుల ఆధ్యాత్మిక తత్వానికి ప్రతిరూపంగా బొడ్డెమ్మ పాటల్లో శివపార్వతులు, సీతారాములు, కృష్ణ గోపికలు ఇలా ఎందరో దేవుళ్ళు కదలాడుతూ ఉంటారు.

పంటపొలాలమధ్య  రోజంతా శ్రమించే రైతులకు, చేతి వృత్తులవారికి ఆటవిడుపు ఈ బతుకమ్మ సంబురం. పొలంపనుల్లో తమవంతు శ్రమను, ఇంట్లో కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహించే మహిళ ఈ పండుగద్వారా తన అలసటను సంబరంగా తీర్చుకుంటుంది అంతేకాకుండా చప్పట్ల దరువుతో గుండ్రంగా, వేగంగా తిరుగుతూ నలుగురితో మమేకమై పాడే పాటలు, ఆడే బతుకమ్మ ఆటల ద్వారా శారీరక, మానసిక దృఢత్వాన్ని పొందుతుంది. చినుకు తడితో స్నానం చేసి పూల సొగసునద్దుకున్న ప్రకృతిని గౌరమ్మగా భావించి ఆమెలా తాము కూడా పట్టుబట్టలు, ఉన్న నగలతో నిండుగా అలంకరించుకుని, తమ చిన్ని పాపలకు పరికిణీలు, పూలజడలతో అందంగా ముస్తాబు చేసి వాకిళ్ళలో, వాడలలో, కోవెలలో, వాగుల వద్ద బతుకమ్మలతో స్త్రీలు ఆడిపాడుతూ ఉంటే ఊరు కొత్త కళను సంతరించుకుంటుంది.  పల్లె పల్లె పూలవనం అయిపోతుంది.

భర్త సంపాదిస్తే భార్య కడుపు నింపుతుంది. అన్నపూర్ణయై తన సంతానాన్ని పెంచి పెద్ద చేస్తుంది.  ఆమె చేతిలోనే శిశువు  ఎదుగుదల. ఆమె పాకశాస్త్ర ప్రావీణ్యమే కుటుంబ సభ్యుల ఆకలి తీర్చే కల్పతరువు.  ప్రతి పండుగకు  రకరకాల నైవేద్యాలు ఉన్నా  ఆడవారు  తమకిష్టమైన  బతుకమ్మ పండుగకు చేసే తొమ్మిది రోజుల  నైవేద్యాలలో ఎంతో  వైవిధ్యాన్ని చూపిస్తారు. అటుకుల బతుకమ్మ, నాను బియ్యం బతుకమ్మ,  సద్దులబతుకమ్మ ఇలా తొమ్మిది రోజుల ఉత్సవాలనుకూడా ఆ నైవేద్యాల పేర్లతోనే పిలుచుకుంటారు.  సమృద్ధిగా కురిసిన వర్షాలతో ఏపుగా పెరిగిన పైరు,  చేతికందిన పంటలనుండి ఈ ప్రసాదాలు తయారు చేస్తారు. జొన్నలు, వడ్లు, సజ్జలు, పప్పులు ఇలాంటి  ప్రకృతి సహజమైన వాటితోనే ప్రసాదాలు చేయడం విశేషం. ప్రసాదాలను  పొడులుగా దంచి చేసుకోవడం, నానేసిన బియ్యం, నువ్వులు, బెల్లంతో ఉండలు, మలిద ముద్దలు, మక్కపేలాలు,  ఇలా ఎక్కువ వండకుండా ఉండే పోషకవిలువలు గల పూర్తీ శాకాహార సేవనం ఈ రోజుల్లో జరుగుతుందనే విషయాన్ని గమనించవచ్చును. ఎదుగుతున్న పిల్లలకు పౌష్టికాహారం ఎంతో  అవసరం. భవిష్యత్తులో పిందెగా , పండుగా ఎదగడానికి నాంది పువ్వు. ఆ పువ్వులలాంటి  పాపలను భవిష్యత్తులో అవసరముండే అనేక పనులకు వారిని సమాయత్తం చేసేవిధంగా ఆహారం  ఇలా పండుగలద్వారా అందించబడుతుంది. బతుకమ్మ సందర్బంగా చేసే రకరకాల నైవేద్యాలు కూడా అలాంటివే. మాములుగా ఇస్తే తిన్నాము అని మొరాయించే పిల్లలకు ఇలా పండుగ పేరు చెప్పి కొన్నిరోజులపాటూ ఈ విధమైన పుష్టినిచ్చే  తినిపించడంద్వారా  తల్లుల ఆకాంక్ష నెరవేరుతుంది.

వేర్వేరు ప్రాంతాలలో పూల పండుగలు జరుపుకోవచ్చు కానీ తెలంగాణాలో బతుకమ్మ వైశిష్ఠ్యమే వేరు. పువ్వులతో ప్రకృతిని  ఆరాధించడం కేవలం తెలంగాణకే ప్రత్యేకం. ఈ ప్రత్యేకతే  మిగతా రాష్ట్రాలలోకెల్లా తెలంగాణాను  శిఖరంగా నిలబెట్టింది. ఆనాడు నిజాంను ఎదిరించి నిలిచిన బతుకమ్మ కాలక్రమేణా  పల్లెల్లోనే  తప్ప  పట్టణాలలో కనిపించని దశకు చేరుకున్న సమయం. మహిళలు ప్రతి ఏటా వేడుకగా జరుపుకునే  ఈ  సంబురాలకు ఒక గుడి కానీ, చిహ్నం కానీ లేకపోవడం విచారించవలసిన విషయం. మన ప్రాంత  విశిష్టతను  కాపాడలేని వలస పాలకులు  తగిన ప్రాతినిధ్యం, నిధులు ఇవ్వక అణిచిన వాటిలో బతుకమ్మ పండుగ కూడా ఒకటి. అటువంటి దశలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ప్రకాశమై తెలంగాణ జాగృతి ద్వారా ఉవ్వెత్తున ఎగసి పునరుజ్జీవనం పొందింది బతుకమ్మ. తెలంగాణ ఆడపడుచులందరిని ఏకం చేసి స్వరాష్ట్ర సాధన సాకారం చేసిన ఘనత బతుకమ్మది. తెలంగాణ  రాష్ట్ర ఘనతను, ప్రత్యేకతను నేల నలుచెరగులా వ్యాపింపజేసింది నేడు మన బతుకమ్మ.  అటువంటి బతుకమ్మను రాష్ట్ర పండుగగా, బతుకమ్మ తయారీలో వాడే తంగేడు  పువ్వును రాష్ట్ర పుష్పంగా  ప్రకటించుకుని కొలుచుకోవడం కేవలం తెలంగాణ రాష్ట్రం అవతరించడం ద్వారానే సాధ్యమయింది. బతుకమ్మ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే బతుకమ్మ.

అందరూ కలవడంకోసం కిట్టీ పార్టీలు,  గెట్  టుగెదర్లు, నైట్ పార్టీలు అనే పేర్లతో విదేశీ సంస్కృతి వెంట పరుగులెత్తుతున్నది    నేటితరం. స్నేహం, ఐక్యత, ఆప్యాయత అనురాగాలు కలబోసుకుని  విలసిల్లే  సాంస్కృతిక ఉత్సవమైన ఇటువంటి బతుకమ్మ సంబురాలను జరుపుకునేటట్లుగా తల్లిదండ్రులు, పెద్దలు చూసుకుంటే విదేశీ వెర్రి వ్యామోహాల నుండి ముందు తరాలను మళ్లించిన వారవుతారు. పాఠశాల,  కళాశాల స్థాయిలో   విద్యార్థులకు బతుకమ్మతయారీలు, సంబంధిత  పోటీలు నిర్వహించడం ద్వారా  రాష్ట్రపండుగ పట్ల అవగాహన పెంచడం, పర్యావరణ స్పృహ కలిగించడం వంటివి చేయవచ్చును. స్త్రీలు  ఉత్సాహంగా పాల్గొనే విధంగా ప్రతి ఊరిలోని చెరువులు, వాగులను బాగు చేయడం, వారు బతుకమ్మ  ఆడుకోవడానికి  తగిన వసతులు, వనరులను కలిపించడం, పోటీలు నిర్వహించి ప్రోత్సహించడం వంటివి చేస్తే బతుకమ్మ  మరింత వన్నెలీనుతుంది.

పచ్చని పొలాలు,  అందమైన  పువ్వులు, బొజ్జనిండా  పసందైన చిరుతిళ్ళు  ఉంటే  ఆడవారికి ముఖ్యంగా  చిన్నపిల్లల సంతోషాలకు  కొదవేముంది!   అందుకే  బతుకమ్మ ఆడా మగ,  పిన్న పెద్దా తేడాలు లేకుండా అందరూ  సంబురంగా జరుపుకునే పల్లె  పండుగ, పూల పండుగ. ప్రకృతి పండుగ. అవధులు  లేని ఆనందోత్సాహాల కలబోత  బతుకమ్మ  పండుగ.

– ర‌చ‌యిత‌: కవయిత్రి, ఉపాధ్యాయురాలు