Home News భావ ప్రకటన స్వేచ్ఛ పై కాంగ్రెస్ ద్వంద నీతి

భావ ప్రకటన స్వేచ్ఛ పై కాంగ్రెస్ ద్వంద నీతి

0
SHARE

కాంగ్రెస్‌ పార్టీ అనవసర వివాదానికి ఆజ్యం పోస్తోంది. మధుర్‌ భండార్కర్‌ నిర్మించిన ‘ఇందు సర్కార్‌’ చిత్రంపై కాంగ్రెస్‌ కారాలూ మిరియాలూ నూరుతోంది. కాంగ్రెస్‌ తీరు విడ్డూరంగా ఉంది అనుకుంటుంటే- మరోవంక ఆ చిత్రంలోని కొన్ని భాగాలకు అడ్డంగా కోతపెట్టి సెన్సార్‌ బోర్డు మరింత ఆశ్చర్యపరచింది. ఆత్యయిక స్థితి ప్రధానాంశంగా ఆ చిత్రాన్ని నిర్మించలేదు. ఎమర్జెన్సీ నేపథ్యంలో కొందరు వ్యక్తుల మధ్య పెల్లుబికిన ఉద్వేగాల ఆధారంగా అల్లిన కథ అది. ఆ సినిమాపై పనిగట్టుకుని కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనలు ప్రేరేపించడం, మితిమీరి సెన్సార్‌ బోర్డు జోక్యం చేసుకోవడం వంటివి- ప్రజాస్వామ్య హితైషులను కలవర పరుస్తున్నాయి.

భావప్రకటన స్వాతంత్య్రానికి బంధనాలేల?

స్వాతంత్య్రానంతర భారతంలో 1975-’77 మధ్యకాలం ఓ చీకటి అధ్యాయం. ఇందిర సారథ్యంలో నిరంకుశస్వామ్యం సాగిన కాలమది. దేశం నెత్తిన ఆత్యయిక స్థితిని రుద్ది రాజకీయ ప్రత్యర్థులందరినీ ఇందిరాగాంధీ జైలుపాలు చేశారు. ప్రశ్నించిన ప్రజాస్వామ్య గళాలను కర్కశంగా నొక్కేశారు. స్వతంత్ర భారతావనికే మాయని మచ్చలా మిగిలిన ఆ చీకటి పాలనను విమర్శిస్తే కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు అంతగా ఉడుక్కోవాలి? యూపీఏ హయాము ముగిసి 2014లో మోదీ జమానా మొదలైనప్పటినుంచీ దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మిద్దెలూ మేడలూ ఎక్కి కాంగ్రెస్‌ పార్టీ గావు కేకలు పెడుతోంది. అంతవరకు బాగానే ఉంది. నిన్నటిదాకా స్వేచ్ఛకోసం మాట్లాడిన పార్టీ- ఉన్నఫళంగా ప్లేటు ఫిరాయించి ప్రజాస్వామ్య స్వరాలను తొక్కేసేందుకు ఎందుకు అంతగా ప్రయత్నిస్తున్నట్లు? ఒక పార్టీగా కాంగ్రెస్‌కు రాజకీయ ఇబ్బందులేవైనా ఉంటే ఉండవచ్చు! కానీ, సెన్సార్‌ బోర్డుకు ఏమైంది? ప్రజాస్వామ్య పురోగతికి పాటుపడటం దేశంలోని వ్యవస్థల బాధ్యత. సెన్సార్‌ బోర్డు బాధ్యతలూ అందుకు భిన్నం కాదు. చిత్రంలో ఎమర్జెన్సీకి సంబంధించి ఉటంకించిన పచ్చి వాస్తవాలపైనా సెన్సార్‌ బోర్డు కత్తెర వేటు పడటాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి?

ఆత్యయిక స్థితినాటి అమానుషకాండపై ఇప్పటికే ఎన్నో పుస్తకాలు వెలువడ్డాయి, పత్రికల్లో వేల సంఖ్యలో ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి. ఓ పుస్తక రచయితకు, వ్యాసకర్తకు ఉన్నపాటి స్వేచ్ఛ సినీ దర్శకుడికి ఎందుకుండకూడదు? ఎమర్జెన్సీ అధ్యాయంలో బలవంతపు కుటుంబ నియంత్రణ అత్యంత పాశవికమైనది. ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులతోపాటు లక్షలమంది ప్రజలను ఇళ్లలోంచి ఈడ్చుకుపోయి మరీ బలవంతంగా కు.ని. శస్త్ర చికిత్సలు చేయించారు. దేశంలో జనాభాను కట్టడి చేయాలంటే అధికారబలంతో ప్రజలను బెదిరించి, లొంగదీసుకుని కు.ని. ఆపరేషన్లు చేయించడం తప్ప మరోదారి లేదని నాటి ప్రధాని ఇందిర తనయుడు సంజయ్‌ గాంధీ గట్టిగా విశ్వసించారు. ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారందరినీ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స క్యాంపులకు బలవంతంగా తరలించారు. ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంకోసం ప్రతి రాష్ట్రానికీ లక్ష్యాలు నిర్దేశించారు. కు.ని. ఆపరేషన్లకు ఇష్టపడని ఎందరో ఉపాధ్యాయులను ‘మీసా’ చట్టం కింద బలవంతంగా జైళ్లలో బంధించినట్లు ఎమర్జెన్సీ అరాచకాలపై విచారణ జరిపిన షా కమిషన్‌ నివేదికలో వెల్లడైంది. కు.ని. చికిత్స చేయించుకున్నట్లు వైద్య ధ్రువీకరణ పత్రాలు చూపితే తప్ప టీచర్లను జైళ్లనుంచి విడుదల చేయలేదు. ఎమర్జెన్సీ అంధ యుగంలో చోటుచేసుకున్న ఈ అన్యాయంపై చిత్రంలో వినిపించిన సంభాషణలపైనా కత్తెర వేటు వేసేందుకు సెన్సారు బోర్డు సంసిద్ధమైందట! ఆ మాత్రం స్వేచ్ఛకూ ముకుతాడు వేస్తే ఇక ప్రజాస్వామ్య భారతావనికి అర్థమేముంది?

నిరంకుశత్వానికి చెల్లుచీటి!

సినిమాల సెన్సారింగ్‌పై శ్యామ్‌ బెనెగల్‌ కమిటీ సూచనలను తక్షణం అమలు పరచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. సినిమాలకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం తప్ప ‘బోర్డు’కు మరే అధికారాలూ ఉండరాదని బెనెగల్‌ కమిటీ సూచించింది. చలన చిత్రాల్లో ఏ భాగానికీ కత్తెర వేసే అధికారం ‘బోర్డు’కు ఉండదు. చిత్రం గనుక సినిమాటోగ్రఫీ చట్టంలోని 5బి(1) నిబంధనను ఉల్లంఘించినట్లయితే దానికి ధ్రువీకరణ పత్రం జారీ చేయకుండా నిలిపివేసే అధికారం ‘బోర్డు’కు ఉంటుంది. సెన్సార్‌ బోర్డుకు అపరిమిత అధికారాలు కట్టబెడితే అవి దుర్వినియోగమయ్యే ప్రమాదమే ఎక్కువ. అమర్త్యసేన్‌పై నిర్మించిన ఓ డాక్యుమెంటరీ చిత్రానికీ సెన్సార్‌ బోర్డు అడ్డదిడ్డంగా కత్తెర వేసినట్లు దర్శకుడు సుమన్‌ ఘోష్‌ ఇటీవల వాపోయారు. ఆ చిత్రంలోని ‘గుజరాత్‌’, ‘గోవు’, ‘హిందుత్వ దృక్పథంలో భారత్‌’ వంటి మాటలు వినిపించకుండా ‘బీప్‌’తో కప్పిపుచ్చారట! గోరక్షణ పేరిట ఈ దేశంలో కొన్ని అల్లరి మూకలు ఏ స్థాయిలో అరాచకం సృష్టిస్తున్నాయో అందరికీ తెలుసు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆవులను కాపాడే సాకుతో సాగుతున్న దాడులపై ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హింసాకాండ చెలరేగడానికి కారణమవుతున్న శక్తులను నిర్దాక్షిణ్యంగా కట్టడి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన స్వయంగా విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘గుజరాత్‌’, ‘గోవు’ వంటి మాటలు సెన్సార్‌ బోర్డుకు ఎందుకు అంటరానివిగా మారాయో అంతుపట్టదు! శ్యామ్‌ బెనెగల్‌ నివేదికను సాధ్యమైనంత సత్వరం అమలు చేయడమే చిత్ర పరిశ్రమను పట్టిపీడిస్తున్న అనేక సమస్యలకు పరిష్కారం. మధుర్‌భండార్కర్‌ సినిమాపై పుణె, నాగ్‌పూర్‌ వంటి చోట్ల కాంగ్రెస్‌ పార్టీ నిరసనలు కొనసాగిస్తూనే ఉంది. ఎమర్జెన్సీ నాటి నిరంకుశ భావజాలమే నేటికీ కాంగ్రెస్‌ నరనరాల్లోనూ ప్రవహిస్తున్నట్లుంది! ఆత్యయిక స్థితి కొనసాగుతున్న కాలంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం విఖ్యాత గాయకుడు కిశోర్‌ కుమార్‌పై కత్తిగట్టింది. ఆల్‌ ఇండియా రేడియో, దూరదర్శన్‌లలో ఆయన పేరు వినిపించకుండా, ఆయన బొమ్మ కనిపించకుండా నిషేధాజ్ఞలు విధించింది. చివరికి ఆయన పాటలను విక్రయించే గ్రామ్‌ఫోన్‌ కంపెనీలపైనా కిశోర్‌ రికార్డులను మార్కెట్లోకి విడుదల చేయవద్దని అప్పటి ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చింది. కిస్సా కుర్సీకా, ఆంధీ వంటి సినిమాలనూ ఇందిర సర్కారు నిషేధించింది. అదే ఒరవడిని కొనసాగిస్తూ ఇప్పుడు మధుర్‌భండార్కర్‌ చిత్రం గొంతుకోయాలని కాంగ్రెస్‌ పార్టీ పంతం పట్టడం పెడధోరణులకు దాఖలా. నిరంకుశ భావజాలం పాతుకుపోయిన పార్టీ, కాలం మారినంత మాత్రాన భిన్నంగా వ్యవహరిస్తుందా?

ఎ సూర్య ప్రకాష్, రచయిత ప్రసార భారతి చైర్మన్

(ఈనాడు సౌజన్యం తో)