Home Telugu Articles భగత్ సింగ్ – వీర సావర్కర్

భగత్ సింగ్ – వీర సావర్కర్

0
SHARE

– డాక్టర్ మధుసూదన్ చెరేకర్

భగత్ సింగ్ పేరు వినగానే బ్రిటిష్ వారిపై పోరాడిన విప్లవ యోధుడు గుర్తుకు వచ్చి యువతరం హృదయం ఉప్పొంగుతుంది. అలాగే వీర సావర్కర్ అనగానే బ్రిటిష్ వారిపై విదేశాల్లో పోరాటం చేసి ద్వీపాంతరవాస శిక్షకు గురైన గొప్ప దేశ భక్తుడు మదిలో మెదులుతాడు. వీరిద్దరూ వలసవాద శక్తుల దౌర్జాన్యాలపై పోరాటంలోఒకరికొకరు మద్దతునిచ్చుకుంటూ, ప్రశంసించుకోవడం వారి రచనల్లో చూడవచ్చు.

“ప్రపంచ ప్రేమికుడైన గొప్ప తిరుగుబాటుదారుడు, ధృడచిత్తుడైన నాయకుడు సావర్కర్ అని పిలవడానికి మేము కొంచెం కూడా వెనుకాడము. కాళ్ళ కింద పడి నలుగుతుందని గడ్డి తివాచీపై నడవని మృదుస్వభావి కూడా ఆయనే . ”
పై వాక్యాలు సావర్కర్ గురించి అమరవీరుడు సర్దార్ భగత్ సింగ్ రాసినవి. ఈ వ్యాసం 1926లో “విశ్వ ప్రేమ్” (నవంబర్ 15), “మాత్వాలా” (నవంబర్ 22) పత్రికల్లో రెండుసార్లు ప్రచురితమైంది.  ఈ వ్యాస సారాంశం ఇలా సాగింది.. “మా అంతిమ లక్ష్యం విశ్వ సోదరభావం. జాతీయవాదం అనేది అక్కడికి చేరుకోవడానికి ఒక అడుగు మాత్రమే” అని సావర్కర్ చాలాసార్లు చెప్పారు. భగత్ సింగ్ ఈ విషయాన్ని అంగీకరించడమేకాక, దానిని అనుసరించారని ఈ వ్యాసం చదివితే తెలుస్తుంది.  సావర్కర్ గురించి అంతటి సూటి, స్పష్టమైన, సూతిమెత్తని వర్ణన మరెక్కడా కనిపించదు.

ఇక్కడ విశేషం ఏమిటంటే, ఆ రోజుల్లో రాజకీయాల్లో పాల్గొనకూడదనే షరతుపై విడుదలైన సావర్కర్ రత్నగిరిలో గృహ నిర్బంధంలో ఉన్నారు.  సావర్కర్ ఈ షరతు అంగీకరించడం గురించి భగత్ సింగ్ ఒక్క విమర్శ కూడా చేయలేదు.  ఈ ఇద్దరు విప్లవకారులు ఒకరి హృదయాలను, మనస్సులను మరొకరు బాగా అర్థం చేసుకున్నారని చెప్పవచ్చు. కీర్తి పత్రిక (మార్చి 1926)లో మదన్ లాల్ ధింగ్రా, సావర్కర్ ల గురించి రాస్తూ భగత్ సింగ్ ఇలా అన్నారు.

“స్వదేశీ ఉద్యమ ప్రభావం ఇంగ్లాండ్‌కు కూడా చేరుకుంది. సావర్కర్ ‘ఇండియన్ హౌస్’ అనే సంస్థను ప్రారంభించారు.  మదన్‌లాల్ కూడా అందులోని సభ్యుడు… ఒక రోజు సావర్కర్, మదన్‌లాల్ ధింగ్రా చాలా సేపు మాట్లాడుతున్నారు. ప్రాణ త్యాగం చేసే పరీక్షలో భాగంగా మదన్ లాల్ చేతులను నేల మీద పెట్టించి సూదితో గుచ్చారు. కానీ ఆ పంజాబీ వీరుడు చలించలేదు. ఇద్దరి కళ్లు నీళ్లతో నిండిపోయాయి. ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఎంత సుందరమైన సమయమది. ఆ కన్నీటి బొట్టు ఎంత అమూల్యమైనది, చెరగనిది! వారి కలయిన ఎంత గొప్పది! ఆ భావోద్వేగం ద్వారా మనం గ్రహించాల్సింది ఏమిటంటే మరణం గురించి కూడా భయపడే పిరికి వ్యక్తులకేం తెలుసు.. దేశం కోసం  చనిపోయేవారు ఎంత పవిత్రంగా, ఎంత ఉన్నతంగా ఉంటారని!

మరుసటి రోజు నుంచి సావర్కర్ ఇండియన్ హౌస్ కు ధింగ్రా వెళ్లలేదు. ఆయన సర్ కల్నల్ వైలీ నిర్వహించిన భారత విద్యార్థుల సమావేశానికి హాజరయ్యారు. ఇది తెలిసిన ఇండియన్ హౌస్ కుర్రాళ్ళు చాలా ఆందోళనకు గురయ్యారు. ఆయన్ని దేశద్రోహి అని పిలవడం ప్రారంభించారు, కాని సావర్కర్ వారి కోపాన్ని తగ్గించారు. ధింగ్రా ఇండియా హౌస్ కోసం తలకోసుకోవానికి కూడా వెనుకాడడు అని వారికి నచ్చజెప్పారు. మనం ఆయన్ని శంకించాల్సిన అవసరం లేదని సర్ది చెప్పారు.. అలా కొన్ని రోజులు నిశ్శబ్దంగా గడిచాయి.

జూలై 1, 1909 న ఇంపీరియల్ ఇనిస్టిట్యూట్ జహంగీర్ హాల్ లో జరిగిన సమావేశానికి సర్ కర్జన్ వైలీ వచ్చాడు. ఆయన ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతున్నాడు, ధింగ్రా అకస్మాత్తుగా ఒక పిస్టల్ బయటకు తీశాడు. అంతే వైలీ శాశ్వతంగా కన్ను మూశాడు. కొంత పెనుగులాట తర్వాత తరువాత ధింగ్రా పట్టుబడ్డాడు. ఈ వార్త ప్రపంచమంతా పాకిపోయింది! అందరూ ధింగ్రాను నిందించారు. అతని తండ్రి పంజాబ్ నుండి ఒక టెలిగ్రామ్ పంపాడు. ధింగ్రా ఒక తిరుగుబాటుదారుడు, హంతకుడిని కొడుకుగా అంగీకరించడానికి నేను నిరాకరిస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత జరిగిన ఒక భారతీయుల సభలో ధింగ్రా చేసిన చర్యను తప్పుపడుతూ ప్రసంగాలు సాగాయి, ఆ సభలో సావర్కర్ కూడా ఉన్నారు. ఈ తర్వాత ధింగ్రా క్షమించరాని తప్ప చేశాడంటూ దోషిగా తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు సభకు అధ్యక్షత వహించిన బిపిన్ చంద్రపాల్ చెబుతుండగా సావర్కర్ లేని నిలబడి ఉపన్యాసం అందుకున్నారు. విచారణలో ఉన్న వ్యక్తిని దోషిగా ఎలా పేర్కొంటారని సావర్కర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పుడు ఓ ఆంగ్లేయుడు “ఇంగ్లీష్ పిడికిలి ఎంత సూటిగా తగులుతుందో చూడండి” అంటూ ఆయన మొహంపై దాడి చేశాడు. వెంటనే అక్కడే ఉన్న ఒక హిందుస్తానీ యువకుడు ఆ ఆంగ్లేయుడి తలపై కర్రతో కట్టి “చూడండి, ఇండియన్ దెబ్బ ఎంత  సూటిగా తగులుతుందో ” అని వ్యాఖ్యానించాడు. ఈ గందరగోళంలో సమావేశం మధ్యలోనే ఆగిపోయింది.

1926 లో భగత్ సింగ్ పంజాబీ హిందీ సాహిత్య సమ్మేళన్ కోసం ఒక వ్యాసం రాశారు. అందులో  “… ముస్లింలకు భారతీయత భావన లేదు, కాబట్టి వారు భారతీయత ప్రాముఖ్యతను అర్థం చేసుకోరు, అలాగే అరబిక్ లిపిని, పెర్షియన్ భాషను ఇష్టపడతారు. భారతదేశానికి ఒకే భాషగా ఉండటం, అది కూడా హిందీ కావడం ఎంత ముఖ్యమో వారు ఎప్పటికీ అర్థం చేసుకోరు, కాబట్టి వారు ఏకపక్షంగా తమ ఉర్దూనే గట్టిగా సమర్ధిస్తారు.” తరువాత అదే వ్యాసంలో, భగత్ సింగ్ ఇలా రాశారు.. “ముస్లింలు తమ మతవిశ్వాసాన్ని కొనసాగిస్తూనే కమల్ టర్క్ ల మాదిరిగా  భారతీయులుగా మారాలి. భాషను మతంతో ముడి పెట్టకుండా విశాల దృక్ఫథంతో చూడాలి.  ఈ విశ్వాసమే  భారతదేశాన్ని కాపాడుతుంది.” భగత్ సింగ్ వ్యక్త పరిచిన ఈ అభిప్రాయాలు సావర్కర్ దృష్టికొణంలోనివని మనం ఇక్కడ గమనించాం. శ్రీ గురూజీ పాంచజన్యం (బంచ్ ఆఫ్ థాట్స్) ప్రకారం. సావర్కర్ రాసిన “1857- స్వాతంత్ర్య పోరాటం” పుస్తకపు ఆంగ్ల అనువాదాన్ని భగత్ సింగ్ ప్రచురించి విప్లవకారుల ద్వారా ప్రాచుర్యం కల్పించారు.  కొంతమంది రచయితలు సావర్కర్, భగత్ సింగ్ రత్నగిరిలో కలుసుకున్నారని పేర్కొన్నారు, కాని ఇది నిర్దారణ కాలేదు. గాంధీజీ అనుచరుడైన వై.డి.ఫడ్కే పేర్కొన్నట్లుగా సావర్కర్ రాసిన “1857” నుండి భగత్ సింగ్ ప్రేరణ పొందాడు, కాని సావర్కర్ “హిందూపదపద షాహి” పుస్తకాన్ని ప్రస్థావించలేదు. అయితే భగత్ సింగ్ హిందూపాదషాహి నుండి కూడా ప్రేరణ పొందారని ఇప్పుడు తెలుస్తోంది. ఆయన జైలు డైరీలో అనేక రచయితల ప్రస్థావన ఉంది. ఇందులో ఏడుగురు భారతీయ రచయితలు మాత్రమే ఉంటే, వారిలో సావర్కర్ పేరు ఉంది. భగత్ సింగ్ తన డైరీలో ఆరు కొటేషన్లను గమనించవచ్చు. అవి  హిందూపదపాదషాహి నుండి గ్రహించినవే.. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:

1) ప్రత్యక్షమైనది, పరోక్షమైనదైనా త్యాగం పూజ్యమైనది.. అది విజయానికి తప్పనిసరి.  కానీ అంతిమంగా విజయానికి దారితీయని త్యాగం ఆత్మహత్య అవుతుంది. అలాంటి త్యాగానికి మరాఠా యుద్ధ వ్యూహాలలో చోటు లేదు (హిందూపదపాదషాహి, పేజీ 256).
2) మరాఠాలతో పోరాటమంటే గాలితో యుద్ధం చేయడమే, నీటికి ఢీకొనడమే. [హిందూపదపాద షాహి, 254]
3) చరిత్రను సృష్టించకుండా దాని గురించి వ్రాయడం, ధైర్యసాహసాలను చూపకుండా  వీరగేయాలను ఆలపించడం వల్ల నిరాశ తప్ప మరేమీ మిగలదు. (హిందూపదపాదషాహి245-4)
4) రాజకీయ బానిసత్వాన్ని ఎప్పుడైనా సులభంగా వదిలించుకోవచ్చు. కానీ సాంస్కృతిక ఆధిపత్యపు సంకెళ్ళను విచ్ఛిన్నం చేయడం కష్టం. [హిందూపద్‌పాద్‌షాహి, 242-43]
5) స్వేచ్చా మందహాసాలను మేము ఎప్పుడు వదులుకోము. మాపై దురాక్రమణకు పాల్పడిన డానస్ కు చెప్పండి `బానిస సంకెళ్ళను క్షణకాలమైనా భరించడం కంటే రక్తాన్ని త్యాగం చేయడమే ఉత్తమమని’ అనే థామస్ మూర్ వాక్యాలను సావర్కర్ ఉటంకించారు. (హిందూపదపాదషాహి, 219)
6) “మతమారడం కంటే మరణించండి”. ఇది ఆ సమయంలో హిందువులలో ప్రబలంగా ఉన్న నినాదం. కానీ రామ్‌దాస్ మాత్రం “లేదు, అలా కాదు. మతం మారడం కంటే మరణించడం మంచిదేకానీ మరణం లేదా బలవంతపు మతమార్పిడి కంటే మేలైనది ఉంది. హింసాత్మక శక్తులను చంపి, ధర్మ విజయం కోసం పోరాడుతూ ప్రాణాలు వదలడం” అని అన్నారు. (హిందూపదపాద షాహి పే .141-62)

భగత్ సింగ్ పేర్కొన్న సైన్స్ ఆధారిత ‘సోషలిస్ట్ హిందుస్తాన్’  వర్ణన సావర్కర్ ‘సైన్స్ ఆధారిత హిందుస్తాన్’ కు చాలా దగ్గరగా ఉంది. ఖురాన్, వేదం రెండింటినీ వేరుగా ఉంచడం ద్వారా తాను శాస్త్రాన్ని అంగీకరిస్తున్నానని నెహ్రూ చెప్పడాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. భగత్ సింగ్ తన 750 పేజీల మొత్తం రచనల్లో సావర్కర్, ఆయన హిందుత్వం లేదా ఆయన బ్రిటిష్ షరతులను అంగీకరించడాన్ని ఎక్కడా విమర్శించలేదు. అయితే, హిందువులకు అనుకూలంగా ముస్లింలను చంపడానికి సమర్ధించే అల్లర్లను ఆయన విమర్శించారు. (కీర్తి, జూన్ 1928), కానీ అవి సావర్కర్ ను ఉద్దేశించినవి కావు, సావర్కర్‌కు కూడా వర్తించవు. భగత్ సింగ్ సహాయకుడు యశ్పాల్ విప్లవత్మక ఉద్యమంలో సావర్కర్ సోదరులు మా నాయకులు అని చెప్పారు.

సావర్కర్, భగత్ సింగ్ ఇద్దరూ కాకోరి కుంభకోణంపై వ్యాసాలు రాశారు, ఇద్దరి మొదటి వ్యాసాలలో అష్ఫాక్ ప్రస్తావన లేదు. సావర్కర్ తరువాత అష్ఫాక్ గురించి మరొక వ్యాసం రాశారు. భగత్ సింగ్ తన రెండవ వ్యాసంలో అష్ఫాక్ గురించి ప్రస్తావించారు. మదన్ లాల్, అంబప్రసాద్, బాలముకుండ్, సచింద్రనాథ్, కుకా వంటి విప్లవకారుల గురుంచి సావర్కర్, భగత్ సింగ్ తమ వ్యాసాల్లో ప్రస్థావించారు. 20 డిసెంబర్ 1928 న లాలా లాజ్‌పత్ రాయ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ సావర్కర్ ఒక వ్యాసం రాశారు. ఈ దాడిలో గాయాలతో లాలాజీ మరణించారు. దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు సాండర్స్ ను భగత్ సింగ్, అతని సహచరులు చంపారు. మహాత్మా గాంధీ దీనిని పిరికి చర్యగా అభివర్ణించారు. గాంధీ జీ ప్రకటనను విమర్శిస్తూ సావర్కర్ 1929 జనవరి 19 న ఒక వ్యాసం రాశారు. అదే సమయంలో, లాలాజీ సాహిత్యంపై ప్రసిద్ధ వ్యాసం కూడా రాశారు.

సావర్కర్ తన సాహిత్యంలో భగత్ సింగ్ అతని సహచరులను తన రచనల్లో చాలాసార్లు ప్రస్తావించారు. సావర్కర్ తన శ్రద్ధానంద్ పత్రికలో రాసిన “ది రియల్ మీనింగ్ ఆఫ్ టెర్రర్” అనే వ్యాసాన్ని  భగత్ సింగ్, అతని సహచరుల కీర్తి పత్రిక (మే 1928)లో తిరిగి ప్రచురించారు. వీర్ సావర్కర్ రాసిన  ‘Armed but tyrannical’ అనే వ్యాసాన్ని bomb’s philosophy పేరిట భగత్ సింగ్, వోరా జనవరి 26, 1930 న ప్రచురించారు. అటువంటి వ్యాసాలతో సావర్కర్ యువత హృదయాలను జ్వలింపజేశారని  ఫడ్కే చెప్పారు. అక్టోబర్ 8, 1930 న, సావర్కర్ సహాయకుడు పృథ్వీ సింగ్ ఆజాద్, భగత్ సింగ్ సహాయకురాలు దుర్గాబాభి ముంబైలోని ఒక సార్జెంట్ పై కాల్పులు జరిపారు. దీని ఫలితంగా సావర్కర్ నిర్బంధ కాలం పెరిగింది. 23 మార్చి 1931 న భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను ఉరి తీశారు.

ఆ సమయంలో సావర్కర్ ఈ క్రింది కవితను స్వరపరిచారు. ఇది ఆంగ్లంలో ఇలా ఉంది..

ఓహో భగత్ సింగ్,

మాకోసం నువ్వు ఉరికంబం ఎక్కుతున్నావు

ఓహో, రాజ్ గురు

ఓ ధైర్యశాలీ! జాతి కోసం పోరాడుతూ నీవూ వెళిపోతున్నావు      

ఓహో! మీకు ఇవే మా విజయాభినందనలు!

నేటి త్యాగంలోనే రేపటి విజయం ఉంది  

అదే అద్భుత కిరీటం !

మరణాన్ని ఆహ్వానించడం!

ఆయుధాలను ఎదుర్కోవడం

శత్రువుపై ప్రయోగించిన వాటినే!

ఇలాంటి శత్రువు ఎక్కడైనా ఉంటాడా?

నీ లక్ష్యాన్ని స్వచ్చపరచేవాడు  

ఓ! అమరులారా ! వీడ్కోలు! వీడ్కోలు!

ఇక్కడ మిగిలిపోయిన మేము ప్రతిన పూనుతున్నాం !

ఈ భీకర రణంలో

మేము ఎన్నడూ భయపడకుండా పోరాడతాం! విజయం సాధిస్తాం!

ఓహో భగత్ సింగ్!

( हा भगतसिंग, हाय हा        

जाशि आजि, फांशी आम्हांस्तवचि वीरा, हाय हा!    
 राजगुरू तूं, हाय हा!  

राष्ट्र समरी, वीर कुमरा पडसि झुंजत, हाय हा!

हाय हा, जयजय अहा!                                

हाय हायचि आजची, उदयीकच्या जिंकी जया          

राजमुकुटा तो धरी                                      

मृत्युच्या मुकुटासि आधी बांधी जो जन निजशिरीं !    

शस्त्र धरुचि अम्हि स्वतः                                

धरुनि जें तूं समरिं शत्रुशि मरसि मारीत मारतां !      

अधम तरि तो कोणता ?                                

हेतुच्या तव वीरतेची जो न वंदिल शुद्धता            

जा हुतात्म्यांनो, अहा !                                  

साक्ष ठेवुनि शपथ घेतों आम्हि उरलों तें पहा !          

शस्त्रसंगर चंड हा

झुंजावुनि कीं, जिंकुची स्वातंत्र्यविजयासी पहा !          

हा भगतसिंग, हाय हा , )                                        

రత్నగిరిలోని సావర్కర్ ఇంటిపై నిరంతరం కాషాయ ధ్వజం ఎగిరేది.. ఆయన ఇంటిని ఈ జెండా ఆధారంగా గుర్తించవచ్చు.. అయితే మార్చి 24 న సావర్కర్ ఇంటిపై నల్ల జెండా ఎగిరింది.  దీన్ని అర్థం చేసుకోవడం ప్రభుత్వానికి కష్టమేమీ కాదు. మార్చి 24 న సావర్కర్ వర్వాడే అనే గ్రామానికి వెళ్ళినప్పుడు రత్నగిరి పిల్లలు ఈ గీతాన్ని పాడుతూ ఊరేగింపు నిర్వహించారు.. సావర్కర్ మార్చి 25 న తిరిగి వచ్చి నల్ల జెండాను మళ్లీ ఎగురవేసాడు. సావర్కర్ ఆ తర్వాత నాలుగు నెలలకు భగత్ సింగ్‌ను గుర్తుచేస్తూ ఒక కథనాన్ని ప్రచురించారు. నేపాలీ ఉద్యమం సందర్భంగా భగత్ సింగ్ గురించి వ్రాసారు. విప్లవకారులపై సావర్కర్ ప్రభావం గురించి శివవర్మ, వోరా తమ రచనల్లో కూడా ప్రస్థావించారు.
 
అనువాదం: క్రాంతి దేవ్ మిత్ర

మరిన్ని వార్తలు, విశేషాల కోసం Samachara Bharati యాప్ ను క్లిక్ చెయ్యండి.

This Article was first published in 2020