అయోధ్యలోని శ్రీరామజన్మభూమిని విముక్తం చేసి, శ్రీరామ మందిరాన్ని తిరిగి నిర్మించడానికి హిందువులు అనేక పోరాటాలు చేశారు.
అంతిమ విముక్తికి దారితీసిన 77వ యుద్ధంలో హిందువులు ఎలా పోరాడారు? ఈ పోరాటం మునుపటివాటికన్నా ఏ విధంగా భిన్నమైనది? ఇది దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలా ఎలా మారింది? ఉద్యమంలో సామాన్య పౌరుల్ని సహితం ఏ విధంగా కలుపుకుపోగలింది? రామశిల, రామజ్యోతి, రామ పాదుకా ఉద్యమాలు ఎలా నిర్వహించబడ్డాయి? 1990 మరియు 1992 సంవత్సరాలలో అయోధ్యలో చేపట్టిన కరసేవలో భారతదేశంలోని మారుమూల ప్రాంతాలలోని లక్షలాది హిందువులను ఎవరు ఏకత్రితం చేశారు?
1925లో ప్రారంభమయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) అనే ఉద్యమం వీటన్నటికీ సమాధానం చెబుతుంది. 1925 నుంచి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులు తరతరాలుగా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో హిందువులను సంఘటితం చేసే సమాజ నిర్మాణ కార్యక్రమాన్ని విస్తరిస్తూ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. స్వయంసేవకులు సమాజాన్ని ఉత్తేజపరిచేందుకు జాతీయ జీవితంలోని వివిధ స్రవంతులతో మమేకమయ్యారు. ఆ విధంగా దేశం పట్ల ధర్మం పట్ల నిబద్ధత కలిగిన హిందువుల సంఘటన విశేషంగా జరిగినది. సమస్యలు, సమస్యల పరిష్కారానికి సమాజంలో ఉత్ప్రేరకంగా, నేపధ్యంలో పనిచేయడంలో సంఘం ప్రధానంగా శిక్షణ ఇస్తుంది. సంఘం పట్ల అవగాహన లేని చాలామంది, తెరవెనుక కార్యకర్తలు నిర్వహించే పనితీరు గురించి తెలియక కేవలం అంతిమ ఫలితాన్ని మాత్రమే ఆకళింపు చేసుకునే ప్రయత్తం చేస్తుంటారు. దురదృష్టవశాత్తూ, కొంతమంది సున్నితంగా ఆలోచించే మేధావులు కూడా సంఘకార్యాన్ని లోతుగా ఆకళింపు చేసుకోరు.
జాతీయ సమస్యలపై సున్నితంగా ఆలోచిస్తూ, నిస్వార్థంగా గ్రామాలలో, బస్తీలలో నివసించే ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూ పనిచేసే యువకుల బృందం ఇంతటి బృహత్తర ఉద్యమానికి మూలం. వీరినే సంఘ స్వయంసేవకులుగా వ్యవరిస్తాము. ఈ స్వయంసేవకులు తమ దైనందిన ప్రార్ధనలో “వయం హిందూ రాష్ట్రాంగభూత” అనగా “మనం హిందూ రాష్ట్రము యొక్క శరీర భాగాలము” అని పాడతారు. అందుకే వారు దేశంలోని అన్ని ప్రాంతాల సమస్యల పట్లా సున్నితంగా స్పందిస్తారు.
కాలక్రమేణా సంఘ కార్యకర్తలు విశ్వహిందూ పరిషత్, ఏబీవీపీ, బీకేఎస్, బీఎంఎస్, విద్యాభారతి, వనవాసి కల్యాణ్ పరిషత్, జనసంఘ్ (తర్వాత బీజేపీ), సేవాభారతి తదితర సంస్థలను ప్రారంభించారు. ఈ సంస్థలు తమ పరిధిని స్వంతంగా నిర్మించుకోవడమే కాకుండా భారత్ సంక్షేమం కోసం పనిచేస్తున్న అనేక సంస్థలతో కూడా అనుసంధానమయినాయి. ఇంతటి బృహత్తరమైన అనుసంధానం కలిగివుండే ఈ రాష్ట్ర నిర్మాణ యజ్ఞం, మీడియా వారు “సంఘ్ పరివార్” గా వ్యవహరించే దానికన్నా చాలా విస్తృతమైనది.
ఇంతటి విస్తృత పరిధిని ఏర్పరచుకోవడంతో, సమాజంలోని ఆలోచనాపరులైన హిందువులు, సంస్థలు, సాధుసంతులు, జాతీయ జీవితంలోని వివిధ రంగాలతో మమేకమై రామాజన్మభూమి 77వ యుద్ధం చివరి దశకు తీసుకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. క్షేత్రస్థాయిలో, విద్యారంగంలో, మీడియాలో, పరిపాలనలో, కోర్టులలో పోరాడారు. చాలా మంది హిందువులు తమ వృత్తిని కోల్పోయారు, వారి కుటుంబాలు ప్రమాదాల్లోకి నెట్టబడ్డాయి. పాపం, వారిలో అనేకమంది తమ జీవితాలను కూడా త్యాగం చేశారు.
అయోధ్యలో శ్రీరాముని “ప్రాణ ప్రతిష్ఠ”ను జరుపుకున్నఈ శుభయఘడియల్లో, కష్టపడి నెరవేర్చుకున్న మన ఆశయాలనూ, సంఘటితంగా పనిచేసే తత్వాన్ని, మన ధర్మాన్ని, హిందూ దేశాన్ని, మనమేర్పరచుకొన్న ఇంతటి విస్తృత సామాజిక వ్యవస్థనూ మన స్వప్రయోజనాలకు అతీతంగా ఉంచి నిరంతరం జాతీయ శ్రేయస్సు కోసం పాటుపడదామని ప్రతిజ్ఞ చేద్దాం.
ఇంటింటికీ సంఘ కిరణాలను విస్తరించేందుకు ఆగణితమైన దీపాలను వెలిగిస్తూ, మౌన సాధక తపస్వీ వలే హిమగీరులవైపు నిశబ్దంగా సాగుదాం!
“జై శ్రీరామ్”
– నడింపల్లి ఆయుష్
(ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచార ప్రముఖ్)