400 భాషలకు ముప్పు! రానున్న 50 ఏళ్లలో అంతర్థానమయ్యే ఆస్కారం
భారత్‌లో వందల కొద్దీ భాషల ఉనికి ప్రశ్నార్థకమవుతోంది. దేశంలో మాట్లాడే భాషల్లో రానున్న 50 ఏళ్లలో సగానికి పైగా భాషలు అంతర్థానమయ్యే ఆస్కారముంది. 780 భాషలకుగాను కనీసం 400 భాషలు ఈ ముప్పును ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆరు వేల భాషలు మాట్లాడుతుండగా, దాదాపు నాలుగు వేల భాషలకు ఈ పరిస్థితి ఎదురయ్యే ఆస్కారముంది. ముప్పున్న భాషల్లో పది శాతం భారత్‌లోనే ఉన్నాయని భాషా శాస్త్రవేత్త, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా(పీఎస్‌ఎల్‌ఐ) ఛైర్మన్ గణేష్ ఎన్.దేవి వెల్లడించారు.
దేశంలో మాట్లాడుతున్న 780 భాషల్లో కనీసం 400 భాషలు రానున్న యాభైఏళ్లలో అంతర్ధానమయ్యే ప్రమాదముంది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద భాషా అధ్యయనాల్లో ఒకటైన పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా(పీఎస్‌ఎల్‌ఐ) ఛైర్మన్ గణేష్ ఎన్.దేవి తాజాగా ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ అధ్యయనానికి సంబంధించి తీసుకురాదలచిన 50 సంపుటాల్లో 11 సంపుటాలను గురువారమిక్కడ ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
‘‘హిందీ, తెలుగు, కన్నడ, మరాఠీ, బంగ్లా, మలయాళం, గుజరాతీ, పంజాబీ లాంటి ప్రధాన భారతీయ భాషలను ఆంగ్లం దెబ్బతీస్తోందనే వాదన ఉంది. దీనికి సరైన ప్రాతిపదిక లేదు. వీటికి ఆంగ్లం నుంచి ముప్పు లేదు. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే తొలి 30 భాషల్లో ఇవి ఉన్నాయి. వీటిలో ఒక్కో భాషకు కనీసం వెయ్యేళ్ల చరిత్ర ఉంది. వీటిలో ప్రతి భాషను కనీసం రెండు కోట్ల మందికి పైగా ప్రజలు మాట్లాడతారు. చిత్ర పరిశ్రమ, చక్కటి సంప్రదాయ సంగీతం, విద్యా సదుపాయాలు, మీడియా వ్యాప్తి రూపంలో వీటికి బలమైన అండ ఉంది’’ అని గణేష్ వివరించారు. భారత్‌లో తీర ప్రాంత భాషలకు ముప్పు అత్యంత ఎక్కువగా ఉందన్నారు. కనుమరుగయ్యే ఆస్కారమున్న భాషల్లో అత్యధికం ఇవేనన్నారు. ‘‘కార్పొరేట్ సంస్థలు మత్స్య సంపద కోసం సముద్ర జలాల్లో విస్తృతస్థాయిలో వేట సాగిస్తున్నాయి. తీరంలో జీవనోపాధిపై మత్స్యకారులకు నమ్మకం సన్నగిల్లుతోంది. వారు తీరాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. ఇది తీర ప్రాంత భాషలపై పెను ప్రభావం చూపుతోంది’’ అని వివరించారు.
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాష భోజ్‌పురి అయ్యుండొచ్చని గణేష్ తెలిపారు. కొన్ని గిరిజన భాషలు ఇటీవల సంవత్సరాల్లో అభివృద్ధి చెందినట్లు చెప్పారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో మాట్లాడే గోండి, సంతాలి, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రల్లో మాట్లాడే భేలి, వేరే ప్రాంతాల్లో మాట్లాడే పలు ఇతర భాషలు అభివృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. ఈ భాషలు మాట్లాడేవారిలో విద్యావంతులైనవారు ఇదే భాషల్లో రచనలు సాగించడం దీనికి ముఖ్య కారణమన్నారు. సినిమాలు తీయడం మరో కారణమని చెప్పారు.
ఐదు దశాబ్దాల్లో 250 భాషలు అదృశ్యం
గత ఐదు దశాబ్దాల్లో భారత్ 250 భాషలను కోల్పోయిందని గణేష్ తెలిపారు. ఏదైనా భాష పుట్టుక వెనుక వేల సంవత్సరాల కృషి ఉంటుందని, భాషను కోల్పోవడమంటే పూర్వీకులకు తీవ్ర అన్యాయం చేయడమేనని వ్యాఖ్యానించారు. ‘‘ఒక భాష అంతర్థానమైందంటే దానితో ముడిపడిన సంస్కృతి కూడా కనుమరుగైనట్లే’’ అన్నారు. పీఎస్‌ఎల్‌ఐ ఇప్పటివరకు దేశంలోని 780 భాషలపై 27 రాష్ట్రాల్లో మూడు వేల మందితో అధ్యయనం జరిపింది.
(ఈనాడు సౌజన్యం తో)