భారతదేశాన్ని విచ్చిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న సమూహాలు/దళాలు హిందీని జాతీయ భాషగా చేయాలని ఆర్.ఎస్.ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోందని, ప్రభుత్వం కూడా హిందీ మాట్లాడని వారి మీద బలవంతంగా రుద్దాలని చూస్తున్నదనే అసత్య ప్రచారాలు మొదలు పెట్టాయి. కానీ భారతీయ భాషలన్నీ జాతీయ భాషలు అనే విషయంలో ఆర్.ఎస్.ఎస్ స్పష్టంగా ఉంది. ఆర్.ఎస్.ఎస్ ద్వితీయ సర్ సంఘ్ చాలక్ శ్రీ గురూజీ గోళ్వాల్కర్ భాషా సమస్యపై తమ అభిప్రాయాలను గతంలో అనేకసార్లు స్పష్టంచేశారు. డిసెంబర్ 1957, అక్టోబర్ 1967 లో ఆర్గనైజర్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో వారి అభిప్రాయాలను పంచుకున్నారు.
భాషా సమస్య
ప్రశ్న: మన జాతీయ భాష ఏది?
జవాబు: మన భారతీయ భాషలన్నింటినీ జాతీయ భాషలుగానే పరిగణిస్తాను. అవన్నీ మన జాతీయ వారసత్వాన్ని సమానంగా కలిగి ఉన్నాయి. హిందీ వాటిలో ఒకటి. జనాభా పరంగా అది దేశవ్యాప్తంగా వాడుకలో ఉంది కనుక జాతీయ భాష స్థానాన్ని సంపాదించుకున్నది. అందువల్ల హిందీ జాతీయ భాష, మిగతావన్నీ ప్రాంతీయ భాషలు అనడము ఎంత మాత్రం సరియైనదికాదు. అలా అనడం సరైన దృక్పథం కాదు.
ప్ర: హిందీ ఎదుగుదల వల్ల వాళ్ళ మాతృభాషలు కనుమరుగవుతాయని / గ్రహణం పదుతుందని కొంతమంది అంటున్నారు.
జ: నేనలా అనుకోవటం లేదు. ఉదాహరణకు తెలుగు,తమిళం బెంగాలీ, మరాఠీ భాషలు ఇంగ్లీష్ వారి పెత్తనంలో కూడా నిలబడ్డాయి. హిందీ పెరగడంతో పాటు ఈ భాషలు మరింత వృద్ధి చెందుతాయి. బెంగాలీ హిందీమయం అవుతుందని బెంగాలీలు భయపడడం ఎందుకు?
గత ఇరవై సంవత్సరాలుగా బెంగాలీ ఉర్దూమయం అయింది. ఉదాహరణకు ఉదయం అనేమాటకు ప్రభాతే అని వాడడానికి బదులు ఫాజారే అని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయినా ఏ బెంగాలీ ఎలాంటి అభ్యంతరం వ్యక్తంచేయడంలేదు. అటువంటప్పుడు వారికి హిందీ పట్ల ఎందుకు కోపం ఉండాలి?
కొంతకాలం కిందట మదురైలో ఒక న్యాయవాది హిందీభాష వల్ల తమిళానికి నష్టం కలుగుతుందని నాతో అన్నారు. అదేలాగా అని ఆయన్ని ప్రశ్నించాను. కాని అతను వివరించలేకపోయాడు. జిల్లా కోర్టులో ఇంగ్లిష్ ను ఎందుకు వాడుతున్నారు, తమిళం వాడవచ్చు కదా అని అడిగాను. మళ్ళీ అతని నుంచి సమాధానం లేదు. అపుడు ఆయనతో తమిళం శత్రువు హిందీ కాదు. ఇంగ్లీష్ భాషే ఆ రెండింటి శత్రువు అని చెప్పాను.
ప్ర: మాతృభాషతోపాటు హిందీ, సంస్కృతం, ఆంగ్లం- ఇలా నాలుగుభాషలు నేర్చుకోవాలంటే విద్యార్ధులకు కష్టం కదా?
జ: అది నిజమే. కానీ ఆ నాలుగింటిలో పక్కన పెట్టదగినది ఆంగ్లమే. ఇది తప్పనిసరి భాష కాదు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని, దానికి కట్టుబడి ఉంటే ప్రస్తుతపు గందరగోళ పరిస్తితి వెంటనే సర్దుకుంటుంది. ప్రస్తుతపు అస్థిరత్వంవల్ల ఆంగ్ల భాష మరింత బలపడుతుంది. ఇంతకు మునుపు కంటే ఎక్కువ మంది పిల్లలు కాన్వెంట్లకు వెళ్తున్నారు. కొంతమంది బహిరంగంగా ఇంగ్లీష్ భాష భారత్ కు అధికార భాషగా ఉండాలి అని కోరుకుంటున్నారు. రాజ్యభాష గురించి ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయం తీసుకోకపోతే ప్రజలు గందరగోళానికి గురవుతారు.
పాత మధ్యప్రదేశ్ లో విద్యా శాఖ తన కార్యకలాపాలను హిందీ మరియు మరాఠీలో నిర్వహించేది. కానీ బృహత్ బాంబే ఏర్పడిన తర్వాత, ఇంతకు ముందు మధ్యప్రదేశ్ లో ఉన్న ప్రాంతాలు విచిత్రంగా తిరిగి ఆంగ్లాన్ని ఉపయోగించడం మొదలుపెట్టాయి. కాబట్టి ఇది పద్దతి కాదు. ఒక కచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి, దానిని తూచ తప్పకుండా అమలు చేయాలి. అప్పుడే రాజ్యభాష సమస్య పరిష్కారమవుతుంది.
ప్ర: దక్షిణాదిలో కొంతమంది ప్రజలు తమకు ఇంగ్లిష్ బాగా వచ్చని, ఇంగ్లిష్ ను మారిస్తే ఉద్యోగ నియమాకాలలో నష్టం కలుగుతుందని, హిందీని కూడా నేర్చుకోవాలంటే చాలా సమయం పడుతుందని సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.
జ. మొట్టమొదటగా, దక్షిణాది వాళ్ళకు మాత్రమే ఇంగ్లీష్ బాగావచ్చు అని చెప్పడం సరైనది కాదు. ఈ దేశంలో ఇంగ్లిష్ బాగా వచ్చు అనేవాళ్ళలో 1% మంది మాట్లాడేది అసలు ఇంగ్లీష్ అవునో కాదో చెప్పడం కష్టం. దక్షిణాదిలో కూడా అందుకు మినహాయింపు కాదు.
ఈ విషయంలో ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత దక్షిణాది వారికీ హిందీ నేర్చుకోవడానికి పది సంవత్సరాలకంటే తక్కువ సమయమే పడుతుంది. అందులో అనుమానం లేదు . ఇప్పటికే కూలీవాళ్ళు, హమాలీలు రెండు పైసలను ‘ దో పైసా’ అనడం మొదలుపెట్టారు. కానీ రాజకీయ నాయకులు ఇలాంటి కూలీలను పట్టించుకుంటారా?
ప్ర: కానీ వాళ్ళకు హిందీ రాయడం,మాట్లాడం హిందీవాళ్లలాగా బాగా వస్తుందా?
జ: ఎందుకు రాదు? హింది మాతృభాషగా కలిగిన 15-20 కోట్లమంది వాడుతున్న భాషనే రాజ్య భాష చేస్తారని అనుకోవద్దు. ఎందుకంటే వీరు ఉపయోగించే హిందీలో కూడా అనేక మాండలికాలు ఉన్నాయి. ప్రామాణిక సంస్కృత హిందీ మాత్రమే కేంద్రభాష అవుతుంది. ఆ మేరకు అందరూ సమానంగా, సులభంగా నేర్చుకోవచ్చు. దక్షిణాది హిందీ మాట్లాడే విద్యార్థులకు ఉత్తరాది వారికంటే మంచిగా రాయడం,మాట్లాడటం వచ్చంటే మీకు ఆశ్చర్యం కలగవచ్చు.
ప్ర: సంస్కృతం అనుసంధాన (లింక్) భాషగా ఉండాలని కొందరు అంటున్నారు.
జ: హిందీని వ్యతిరేకిస్తున్న అందరు సంస్కృతాన్ని అంగీకరిస్తే బాగానే ఉంటుంది. నేను చాలా సంతోషిస్తాను. కానీ సమస్య ఏమిటంటే హఠాత్తుగా సంస్కృతభాషలో సుగుణాలను ఏకరవు పెడుతున్నవారికి నిజంగా ఆ భాషపట్ల ఎలాంటి గౌరవం లేదు. కేవలం తమ వాదన నెగ్గించుకోవడం కోసమే ఈ మాట మాట్లాడుతున్నారనుకుంటాను.
ప్ర: వివిధ భాషలలోని ఉమ్మడి పాఠ్య పుస్తకాలు కూడా సమైక్యతకు దోహదం చేస్తాయి కదా?
జ: అన్నిటికంటే ముఖ్యమైనది ఆ పుస్తకాలలోని పాఠ్యాంశం. ప్రత్యేకంగా మన చరిత్ర పుస్తకాలలో లోపం ఉంది. మిగతాది అసలు దేశమే కాదన్నట్లు విషయమంతా పాటలీపుత్రం ,ధిల్లీ నగరాల మధ్యే తిరుగుతుంది. మిగతా దేశం గురించి సమాచారం ఉండదు. ఎంత మంది డిగ్రీ విద్యార్ధులకు చోళులు, పాండ్యులు,పులకేసిల గురించి తెలుసు?విజయనగర సామ్రాజ్యం గురించి తప్పిస్తే దక్షిణాదిన పాఠ్యాంశాల్లో ఇతర చరిత్ర ఏమి లేదు. తూర్పు భారత్ ను తీసుకుందాం, ఖారవేలుడు ఉత్కళ రాజ్యానికి చెందిన గొప్ప రాజు. ఆయన తన రాజ్యాన్ని సముద్రమార్గం ద్వారా ఇండోనేషియా వరకు విస్తరించాడు. ఈ విషయం ఎంత మంది భారతీయ పండితులకు తెలుసు? మనం దక్షినాదిలో దేవాలయాలను సందర్శిస్తే వాటి వెనక దాగిన మన సంస్కృతి అర్థమవుతుంది. ఎంతమందికి దాని గురించి తెలుసు.
ప్ర: హిందీని మన జాతీయ భాషగా చేయాల్సిన అవసరం ఉందంటారా?
జ: ఎందుకు? హిందే ఒక్కటే మన జాతీయ భాష కాదు. దేశంలోని అన్ని భాషలు మన సంస్కృతి కి సంబందించిన ఆలోచనలను వ్యక్తపరుస్తాయి. అవి కూడా నూటికి నూరు శాతం జాతీయ భాషలే. సువిశాలమైన మన దేశంలో పరాయి భాష అయిన ఆంగ్లం స్థానంలో ఒక అనుసంధాన భాష కావాలన్నది మాత్రం నిజం.