Home News మునివాహన సేవ ప్రభావం.. ఆ గ్రామంలో వెల్లివిరిసిన సామరస్యం

మునివాహన సేవ ప్రభావం.. ఆ గ్రామంలో వెల్లివిరిసిన సామరస్యం

0
SHARE

కొంతకాలం క్రితం నాటి ఘటన..  హిందూ సమాజంలోని వివిధ కులాలు, వర్గాల మధ్య సామరస్యాన్ని, సద్భావాన్ని నెలకొల్పే మహత్తర బాధ్యత తన భుజస్కందాలపై వేసుకున్నారు చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్. ఇందులో భాగంగా హిందూ ధర్మంలో పేర్కొన్న రీతిలో సాంప్రదాయబద్ధమైన ‘మునివాహన సేవ’ నిర్వహించారు. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని తన భుజాలపై ఎక్కించుకుని దేవాలయంలోకి తీసుకువెళ్లారు.

ఈ చర్య అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. వివిధ వర్గాలకు చెందిన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అమెరికాకు చెందిన వరల్డ్ రిలీజియస్ ఫోరమ్ తమ నివేదికలో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది.

ఇది అక్కడితో ఆగిపోలేదు. రంగరాజన్ చేపట్టిన ఈ మునివహన సేవ సమాజంలో ఎంతో ప్రభావాన్ని చూపింది, చూపుతోంది. దీని ఫలితంగా ఇటీవల ఒక గ్రామంలో సామరస్యం వెల్లివిరిసింది.

వివరాల్లోకి వెళ్తే..  నాగార్జునసాగర్ దగ్గరలోని ఒక గ్రామంలో బొడ్డు రాయి (గ్రామం మధ్యలో ఒక దేవతను ప్రతిష్టిస్తారు. ప్రతి సంవత్సరం ఉత్సవాలు చేస్తారు. గ్రామంలోనివారంతా అందులో పాల్గొంటారు) వేశారు. గ్రామంలోని అందరూ అభిషేకాలు, పూజలు ప్రారంభించారు. ఆ గ్రామంలోనే ఉన్న ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందినవారు కూడా తాము పూజలు, అభిషేకం చేస్తామని అనడంతో కొందరు ఒప్పుకోలేదు. దీనితో మాటామాటా పెరిగి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తమను అడ్డుకుంటున్నవారిపై ఎస్సీ వేదింపుల (నిరోధక ) చట్టం కింద కేసు పెడతామని ఎస్సీ వర్గానికి చెందినవారు హెచ్చరిస్తే, ఏది ఏమైనా వారిని పూజలు చేసేందుకు అనుమతించమని ఇతర కులస్థులు పట్టుబట్టారు.

అప్పుడు అక్కడే ఉన్న ఒక కోలాటం కళాకారుడు కల్పించుకుని రెండు వర్గాల వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. కొంతకాలం క్రితం చిలుకూరు బాలాజి దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ నిర్వహించిన మునివాహనసేవ గురించి చెప్పి, అప్పటి ఫోటోలు చూపించి వారు ఇలా సద్భావన కోసం ప్రయత్నిస్తుంటే ఎస్సీ కులస్తులను అడ్డుకోవాలనుకోవడం ఏమిటని ఇతర కులస్తులను ప్రశ్నించారు. అలాగే కేసులు పెట్టడం వల్ల కొద్దిమంది జైలుపాలు కావడం, దానివల్ల గ్రామంలో ఉద్రిక్తతలు పెరగడం తప్ప సమస్య పరిష్కారం కాదని ఎస్సీ వర్గం వారికి నచ్చచెప్పారు ఆ కోలాటం కళాకారుడు.

ఆయన చెప్పినదానిలో నిజాన్ని గ్రహించిన రెండు వర్గాలవారు తమ ధోరణి మార్చుకుని రాజీకి సిద్ధమయ్యారు. ఎస్సీ వర్గం వారు పూజలు చేయడానికి ఇతరులు అంగీకరిస్తే, వేధింపుల కేసులు పెట్టె యోచనను ఎస్సీ కులస్థులు విరమించుకున్నారు. ఆ విధంగా ఆ గ్రామంలో సామరస్యం వెల్లివిరిసింది.

సమాజంలో సంస్కరణ, మార్పు తీసుకురావాలనుకునేవారు ఏదో ఒక వర్గాన్ని, కులాన్ని దోషిగా నిలబెట్టి దూషించడం కాకుండా రెండు వర్గాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నించాలి. అందుకు మన పెద్దలు ఏర్పాటుచేసిన ఆచారాలు, పద్దతులను అనుసరించాలి. ఇదే విషయం నాగార్జునసాగర్ గ్రామంలో నిరూపితమైంది.