Home Telugu Articles భారతీయతకు ప్రతినిధి రామ్ నాథ్ కోవింద్

భారతీయతకు ప్రతినిధి రామ్ నాథ్ కోవింద్

0
SHARE

రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం వెనుక కుల ప్రయోజనాలు ఉన్నాయన్న ప్రచారం తప్పు. అది ఆయనకు అన్యాయం చేయడమే అవుతుంది.

“నేను ఎలాగైతే విజయం సాధించానో, అలాగే మీరు కూడా కష్టపడండి’ అని రామ్ నాథ్ కోవింద్ ఒకసారి తన బంధువుతో అన్నారు. ఈ వాక్యం చాలు ఆయన స్వయం కృషితో పైకి వచ్చారని చెప్పడానికి. రాష్ట్రపతి అభ్యర్థిగా కోవింద్ పేరును ప్రకటించినప్పటి నుండి ఆయన గురించి, ఆయన ఎంపిక గురించి అనేక ఊహాగానాలు సాగుతున్నాయి.

కాన్పూర్ దగ్గర లోని పారఖ్ గ్రామం నుండి పార్లమెంట్ కు, సుప్రీం కోర్ట్ , పాట్నా రాజ్ భవన్ వరకు సాగిన కోవింద్ ప్రస్థానం నిబద్ధత కలిగిన పార్టీ కార్యకర్త, సంవేదన కలిగిన సామాజిక కార్యకర్త ప్రయాణం. RSSలో స్వయంసేవక్ గా ప్రారంభమయిన సామాజిక జీవనం జనసంఘ్, బి‌జే‌పి లలో క్రియాశీల కార్యకర్తగా ముందుకు సాగింది.

వృత్తిరీత్యా కోవింద్ న్యాయవాది. సుప్రీం కోర్ట్ లో న్యాయవాదిగా పదేళ్ళకు పైన పనిచేశారు. సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన IAS కాడర్ కు ఎంపిక కాకపోవడంతో ఆయన ఆ ఉద్యోగంలో చేరలేదు. 1994లో రాజ్యసభకు ఎన్నికైన ఆయన రెండు పర్యాయాలు సభ్యుడిగా కొనసాగారు. రాజ్య సభ సభ్యుడిగా ఉన్నప్పుడే 2002లో భారత ప్రతినిధిగా ఐక్యరాజ్యసమితిని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం దక్కించుకున్నారు. సౌమ్యుడు, మృదుభాషిగా పేరు పొందిన కోవింద్ లక్ష్య సాధకుడని కూడా గుర్తింపు పొందారు. బి‌జే‌పిలో వివిధ స్థాయిల్లో పనిచేసిన ఆయన SC మోర్చా అధ్యక్షుడిగా, పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు.

కుల వ్యామోహం ఎక్కువగా ఉన్న మన సమాజంలో కోవింద్ కుల గుర్తింపు ఒక పెద్ద చర్చనీయాంశమైపోయింది . రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన ఎంపిక `అన్నివర్గాలలో రాజకీయ ప్రాబల్యం’ పెంచుకునే చర్యగా కొందరు అభివర్ణిస్తే, మరికొందరు ఇది `బ్రహ్మాండమైన రాజకీయ ఎత్తుగడ’ అని అంటున్నారు. కోవింద్ దళిత వర్గానికి చెందినవారన్నది నిజం. ఆయన దిగువ మధ్యతరగతి రైతు కుటుంబం నుండి వచ్చారు. ఆయన రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడం మన ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పదనమే.

దళితుల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలంటే ఆ వర్గంలో నూతన నాయకత్వం రావాలి. అధి కోవింద్ రూపంలో వచ్చింది. ఆర్ధికాభివృద్ధి ద్వారా సామాజిక స్థాయి పెంచుకోవాలన్న నూతన ఆలోచనా ధోరణికి ఆయన ఒక గుర్తు. తమ వర్గపు గుర్తింపు బృహత్తరమైన జాతీయ గుర్తింపులో భాగమనే అవగాహన ఈ నూతన నాయకత్వంలో కనబడుతుంది. కోవింద్ వంటి నాయకులు బి‌జే‌పి, దాని పరివార సంస్థల `ఒక జాతి ఒకే ప్రజానీకం’ అనే సిద్ధాంతాన్ని తమ వర్గం వారిలో బలంగా నాటడం వల్లనే ఇటువంటి మార్పు కనిపిస్తోంది.

కాబట్టి కోవింద్ కులాన్ని గురించి మాత్రమే మాట్లాడటం ఆయనకు, అలాగే మన జాతి చూపిన రాజకీయ పరిపక్వతకు అన్యాయం చేసినట్లే అవుతుంది. రాష్ట్రపతి భవనంలో ప్రవేశించిన మొదటి, చివరి వ్యక్తి కోవింద్ కాదు. ఆయనకు ముందు కె.ఆర్. నారాయణన్ 1997 నుండి 2002 వరకు ఆ పదవిలో ఉన్నారు. నారాయణన్ మాదిరిగానే కోవింద్ కూడా బాగా చదువుకున్నవారు, విషయపరిజ్ఞానం కలిగినవారు.

అయితే ఇతరులతో కోవింద్ ను పోల్చాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని సందర్భాల్లో తప్పిస్తే రాష్ట్రపతి పదవిలో ఉన్నవారు వివాదాలకు దూరంగానే ఉన్నారు. ప్రవృత్తి దృష్ట్యా కోవింద్ ఈ పదవికి చక్కగా సరిపోతారని అంతా భావిస్తున్నారు. పార్లమెంట్ ప్రతినిధుల బృందం లో సభ్యుడిగా 12 పైన దేశాల్లో పర్యటించిన ఆయనకు విస్తృత అంతర్జాతీయ అవగాహన ఉంది. రాష్ట్రపతిగా విదేశీ నేతలతో ఎలా వ్యవహరించాలో ఆయనకు బాగా తెలుస్తుంది.

కె.ఆర్. నారాయణన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు చేసిన ఫ్రాన్స్ పర్యటన ఇక్కడ గుర్తుచేసుకోవాలి. 2000 లో జరిగిన ఆ పర్యటన గురించి రాస్తూ ఫ్రెంచ్ పత్రికలు `ఎలిసిస్ లో ఒక అంటరానివాడు’ అంటూ శీర్షికలు పెట్టాయి. లే మోండ్ పత్రిక ఒక్కటే నారాయణన్ తో ఇంటర్వ్యూ ప్రచురించింది. కానీ ఆ పత్రిక కూడా తన శీర్షికలో నారాయణన్ కులాన్ని ప్రస్తావించకుండా ఉండలేకపోయింది.

ఫ్రెంచ్ మీడియా నారాయణన్ కులాన్ని గురించి చేసిన వ్యాఖ్యలు ఆయనతోపాటు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి. ఫ్రెంచ్ ప్రభుత్వం ఈ విషయమై విచారం వ్యక్తం చేయడమేకాక క్షమాపణలు చెప్పుకోవలసివచ్చింది.

నారాయణన్, కోవింద్ లు అత్యున్నత స్థానాన్ని అందుకోవడం వారికేకాక మొత్తం దేశానికి గర్వకారణం. జాకీర్ హుస్సేన్ ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత కొందరు ఆయన దగ్గరకు వచ్చి `హుస్సేన్ వంటి ముస్లిం ఉప రాష్ట్రపతి అయ్యారంటే అధి మన దేశపు సెక్యులరిజం గొప్పదనం’ అని అన్నారు. ఆ మాటలు విన్న జాకీర్ హుస్సేన్ వారిని మందలించారు. `ఒక ముస్లిము ఉప రాష్ట్రపతి కావడంలో సెక్యులరిజం గొప్పదనం లేదు, అలా అయిన తరువాత అంతా ఆయనను ముస్లిముగా కాకుండా భారతీయుడిగా గుర్తించగలగాలి’ అని అన్నారు.

`మన రాజకీయాలు స్వార్థపూరితమైనవి కాదు, సమూహపూరితమైనవి’ అని జొనాథన్ హైడ్ తన రైటియస్ మైండ్ లో అన్నాడు. సమూహ గుర్తింపు ఎక్కువ ప్రాధాన్యత వహిస్తుంది. అదే క్రమంగా వర్గాలుగా విడిపోవడానికి దారితీస్తుంది. దానివల్ల మొత్తం దేశం నష్టపోతుంది. నారాయణన్ ఉదంతంలో మనం అదే చూసాము.

కోవింద్ గ్రామీణ, వ్యవసాయ, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ప్రతినిధి. అదే వర్గానికి చెందినవారు ప్రధాని నరేంద్ర మోడి. ఆయనను కూడా కొద్దిమంది మేధావులు `చాయ్ వాలా’ అని వెక్కిరించారు. కానీ మోడి, కోవింద్ లు భారత్ కు నిజమైన ప్రతినిధులు.

– రామ్ మాధవ్ , బి‌జే‌పి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్.

ఇండియన్ ఎక్స్ ప్రెస్ సౌజన్యంతో…