Home News భవ్యభారత నిర్మాణం మన కర్తవ్యం

భవ్యభారత నిర్మాణం మన కర్తవ్యం

0
SHARE

వర్తమాన పరిస్థితులు – మన పాత్ర” అంశంపై బౌద్ధిక్ వర్గలో పరమ పూజనీయ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ గారి ప్రసంగ సారాంశం :

ఒక కఠినమైన పరిస్థితిలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం  సతమతమవుతోంది. ఈ వైరస్ వ్యాపిని అరికట్టడానికి ఇళ్లలోనే ఉండవలసివస్తోంది. ఇళ్లలోనే ఉంది ఎంత పని చేయగలిగితే అంతే చేయాలి.  మన శాఖలు, ఇతర కార్యక్రమాలు, సంఘ శిక్షవర్గ రద్దయ్యాయి. మనమంతా ఇళ్ళలో ఉంది లాక్ డౌన్ పాటిస్తున్నా మన జీవితం మాత్రం సాగుతోంది. అలాగే సంఘకార్యం కూడా నడుస్తూనే ఉంది. నిత్య కార్యక్రమాలు లేవుకాని వాటి స్థానంలో ఇతర కార్యక్రమాలు వచ్చాయి. జీవిత లక్ష్యం ఏమిటి? మనం మంచిగా ఉంటూ ప్రపంచాన్ని ఆ విధంగా తయారుచేయడమని స్వయంసేవకులకు కూడా తెలుసు.  వ్యక్తిగతంగా మంచిగా ఉంటున్నాము, కానీ చుట్టూ సమాజం గురించి ఏమి ఆలోచించము అనకూడదు. అలాగే సమాజానికి పొరపాటున ఏదో మంచి చేసినా వ్యక్తిగతంగా సద్గుణాలు లేకపోతే అలాంటివారిని కూడా సమాజం మన్నించదు. ” ఏకాంతంలో ఆత్మ సాధన, లోకాంతంలో పరోపకారం”. ఇదే సంఘకార్య స్వరూపం, జీవన స్వరూపం.  సంఘ కార్యకర్తలు తమ ఇళ్లలో ఉండి ప్రార్థన చేస్తున్నారు. నిత్యం, సమయానుసారం చేస్తున్నారు. అందులో వారి కుటుంబసభ్యులు కూడా పాల్గొంటున్నారు.  ఇలా మైదానాల్లో, బహిరంగంగా జరగకపోయిన శాఖ కార్యక్రమం జరుగుతూనే ఉంది. అయితే ఇప్పటికీ ఇదే సాధ్యపడుతోంది. మిగిలిన కార్యక్రమం మారిపోయింది. అదే సేవాకార్యక్రమం. జోరుగా సాగుతున్న సేవాకార్యక్రమాలను సమాజం కూడా ఆహ్వానిస్తోంది, ప్రోత్సహిస్తోంది. అయితే ఇదే సంఘకార్యమని పొరబడకూడదు. కార్యక్రమం కార్యం అయిపోదు. మనం సద్గుణాలను పెంపొందించుకోవడం, మన ప్రయత్నం ద్వారా ప్రపంచాన్ని బాగుగా ఉంచడం మన కార్యం.

మనమందరం ఒక కథను స్మరించుకుందాం. చాలా ఏళ్ళ క్రితం ఒక బౌద్ధ భిక్షువు చైనా దేశం వెళ్లి తథాగతుని చరిత్ర చైనా భాషలో వ్రాసి, ముద్రించి, అందించాలి అనుకొని అక్కడి వాళ్లను ధన సహాయం కోసం అర్థిస్తాడు. కానీ అకస్మాత్తుగా పెద్ద భూకంపం వచ్చింది. కూడబెట్టిన ధనం అంతా సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టేస్తాడు. రెండోసారి ధనాన్ని పోగుచేసి ఇక ముద్రణకు ఇస్తాను అనుకున్న సమయంలో వరదలు వచ్చాయి.  అప్పుడు కూడా ధనాన్ని నిరాశ్రయులకు సహాయం చేయడానికి ఇస్తాడు. చివరగా మూడోసారి ఎలాగోలా మళ్లీ దాతలను ఆశ్రయించి ఆ పుస్తకాన్ని ముద్రిస్తారు. పుస్తకం మొదటి పేజీలో మూడవ ముద్రణ అని రాసి ఉంటుంది. మరి మొదటి రెండు ముద్రణలు ఏమిటంటే సమాజ హితం కోసం చేసిన పనులు అని అర్థం. మనం కూడా ఇంట్లో ఉన్నా సంఘ కార్యంలో ఉన్నట్లే. సమాజ హితం దేశహితం కోసం చేసే కార్యక్రమాల పద్ధతి మాత్రమే మారింది. సంఘ కార్యం ఆగలేదు. మనం చేసే పని నిస్వార్థ భావనతో కూడినదై ఉండాలి. ఎటువంటి కీర్తిని ఆశించినదై ఉండకూడదు. మనం మన సమాజం కోసం, దేశం కోసం చేస్తున్నాము అనే భావనతో పని చేయాలి. మనను మనం కాపాడుకుంటూ సమాజంలో సేవను కొనసాగించాలి. లాక్ డౌన్ అమలులో ఉన్నందున అనుమతి తీసుకొని ఒక అనుశాసనంతో సేవ చేయాలి. మనం ఈ మహమ్మారికి భయపడాల్సిన అవసరం లేదు భయంతో మన కార్యంలో అవరోధం ఏర్పడుతుంది. కావున లేశమాత్రమైనా జంకకుండా, విచలితం కాకుండా, ఆత్మవిశ్వాసంతో అప్రమత్తంగా ముందుకు సాగాలి ఇప్పటివరకు ఈ వ్యాధికి సంబంధించిన కచ్చితమైన అంచనా, వివరాలు ఇంకా తెలియరాలేదు. అందుకే దీన్ని పూర్తిగా నివారించే వరకు మనం కార్యం నుండి తప్పుకో రాదు. ఇది నిరంతర ప్రక్రియ. కార్యంలో ఎప్పుడూ నిరాశకు గురి కాకూడదు. ఉదాహరణకు ఒక కథ గుర్తుకు వస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో అన్ని రకాలుగా ఓడిపోయి మిగిలిన కొద్దిపాటి డబ్బుతో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటాడు. అదే సమయంలో ఆ ప్రాంతంలో లో మాంగనీస్ ఖనిజం కోసం గనుల శాఖ వారు పెద్ద గుంతలు తవ్వి ఖనిజం దొరకలేదని వదిలేసి వెళ్లే సమయంలో ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఆ స్థలాన్ని కనుగోలు చేసి అప్పటికే కూలీడబ్బు తీసుకొని ఉన్న కూలీలను మరింత తవ్వమని చెబుతాడు. మరో మూడు అడుగుల లోతు తవ్వకం జరగగానే ఖనిజం బయటపడుతుంది. అనూహ్యంగా ఆ వ్యక్తి గనులకు అధిపతి అయి కోటీశ్వరుడుగా మారిపోతాడు. తరువాత తన జీవిత అనుభవంతో రాసిన వ్యాసానికి `డిఫరెన్స్ బిట్వీన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ 3 ఫీట్’ అని పేరు పెడతాడు. అందుకే మనం చివరి వరకు నిరాశను దరిచేరనీయకూడదు.

వాల్మీకి రామాయణంలో హనుమంతుని ముఖ్యమైన నాలుగు లక్షణాలను మనం ఆదర్శంగా తీసుకోవాలి.ధృతి, దృష్టి, బుద్ధి, దక్షతతో కార్యాన్ని సాధించాలి. విదురనీతి లో చెప్పినట్లు నిద్ర, తంత్ర,భయం,క్రోధం, ఆలస్యం, దీర్ఘసూత్రత అనే ఆరు దుర్గుణాలను దూరం చేసుకోవాలి ఈ సంకట సమయంలో మన దేశంలో ఉన్న 130 కోట్ల మంది భరతమాత పుత్రులే అనే విషయం గుర్తుంచుకొని సేవా బధ్ధులు కావాలి. ఇదే సమయంలో కొందరు విద్వేషపూరిత అతివాదులు వారి చేష్టలను గమనిస్తూ వాటిని ఖండిస్తూ ముందుకు సాగాలి. ఈ నేపథ్యంలో సమాజ హితాన్ని ధర్మాచరణ ధ్యేయంగా కలిగి ఉన్న సాధువుల హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే భవిష్యత్తులో కూడా సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో విద్యార్థులకు ప్రత్యామ్నాయ మార్గాలలో శిక్షణను, విద్యను అందించడానికి మార్గాన్ని అన్వేషించాలి. సంఘం కూడా జూన్ వరకు కార్యక్రమాలకు విరామం ప్రకటించింది, కానీ సేవలకు కాదు. ఈ సంకట సమయంలో మనం నెగ్గుకు రావాలంటే సామాజిక స్వావలంబన సాధించాలి. అంటే స్వదేశీ ఉత్పత్తులే వాడాలి అనవసరమైన వస్తు వినియోగాన్ని తగ్గించుకోవాలి. విదేశీ ఉత్పత్తులను దూరం పెట్టాలి. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా పర్యావరణం కుదుటపడుతుంది. అయితే రాబోయే కాలంలో దీనిని పరిరక్షించుకోవాలి. యోగ, ధ్యానం, ఆయుర్వేద పద్ధతులను అవలంబించాలి. కుటుంబంలో సాన్నిహిత్యం పెరిగి ప్రేమ, స్నేహం, సమరసతలు నెలకొంటున్నాయి. వీటిని స్థిర పరుచుకోవాలి. రాబోయే కాలంలో నీటి సంరక్షణ, సమృద్ధి, వృక్ష సంరక్షణ, ప్లాస్టిక్ నిషేధం, సేంద్రియ ఎరువుల వాడకం, గో ఆధారిత ఉత్పత్తులు వంటి ఈ విషయాలపై దృష్టి పెట్టాలి. సేవా కార్యక్రమంలో స్వార్ధాన్ని విడనాడి దేశ హితం కోసం పనిచేయాలి. నాగరికమైన క్రమశిక్షణ అవసరం. ఎక్కడ ఈ రకమైన క్రమశిక్షణ కనిపిస్తోందో అక్కడ వైరస్ వ్యాప్తి నిరాధించగలిగాము. ఈ నాగరకమైన క్రమశిక్షణనే సోదరి నివేదిత దేశభక్తి అని అన్నారు. చట్టం, నియమనిబంధనలను కచ్చితంగా పాటించాలని రాజ్యాంగ సభలో చేసిన ప్రసంగంలో డా. అంబేడ్కర్ అన్నారు. కాబట్టి మనం ఈ పద్దతిని మరింత బాగా అలవరచుకోవాలి.  అలాగే దీనితోపాటు సమాజంలో శాంతి, సద్భావన, సహకార భావన ఏర్పడాలి. ప్రభుత్వ విధానాలు, అధికార యంత్రాంగపు అమలు, సమాజపు ఆచరణాత్మకమైన సహకారం అనే మూడు ఉన్నప్పుడే ఇది సాధ్యపడుతుంది. ప్రస్తుత కష్టకాలం భవిష్యత్తు గురించి మనకు పాఠాలు నేర్పుతోంది. అవేమిటని జాగ్రత్తగా తెలుసుకుని వాటిని మన జీవితాలలో ఆచరణలోకి తెచ్చుకోవాలి. మనమంతా కలిసి, ఆత్మవిశ్వాసంతో మనదైన ఈ దేశం, సమాజాన్ని ఈ సంకట స్థితి నుంచి బయటకు తెచ్చి ప్రపంచానికి దారిచూపే దేశంగా తీర్చిదిద్దుకునేందుకు కృషి చేయాలని గుర్తుంచుకోవాలి. అదే మన కర్తవ్యం. ఈ కష్టాన్ని ఒక అవకాశంగా తీసుకుని మనం ఒక నూతన, భావ్యభారత నిర్మాణానికి నడుంబిగించాలని కోరుతున్నాను.

https://www.facebook.com/VSKTelangana/videos/840300669828570/