Home Telugu Articles స్ఫూర్తి ప్రదాత శ్రీ రామానుజులు

స్ఫూర్తి ప్రదాత శ్రీ రామానుజులు

0
SHARE

కాంతిమతి, కేశవాచార్యుల దంపతులకు క్రీ।।శ।। 1017లో తమిళనాడులోని శ్రీ పెరుంబదూరులో శ్రీరామానుజాచార్యులు జన్మించారు. మేనమామ శ్రీశైలపూర్ణులు ‘శ్రీ లక్ష్మీణాచార్యులు’ అని పేరు పెట్టారు. పదహరేళ్ళ వయస్సులోనే కుటుంబానికి పెద్ద దిక్కు అయ్యారు. కుటుంబ పోషణకు వైదిక కర్శలు నిర్వహస్తూ వేదాంత విద్యను అభ్యసించడానికి యాదవ ప్రకాశుల వద్ద శిష్యునిగా చేరారు. 8 ఏళ్ళ పాటు వివిధ శాస్త్రాలలో అపార పాండిత్యాన్ని సంపాదించారు. గురువు గారితో పాటు కాశీకి వెళుతూ కంచికి చేరుకున్నాడు. తిరుక్కంచి నంబి వరదరాజు పెరుమాళ్ళకు సేవ చేసేవాడు. అతనికి కావలసిన సహాయం జలాన్ని తెచ్చి ఇవ్వడం వంటే కైంకర్యాలకు చేపట్టారు.

రామానుజులకు 32 సంవత్సరాలప్పుడు చెరువు గట్టున పంచ సంస్కారాలనందించాడు మహపూర్ణుడు. గురువును, గురుపత్నిని తీసుకొని రామానుజులు కంచికి వెళ్ళారు, ఆరు నెలల పాటు భగవద్వైభవ గోష్టి, ఆళ్వార్లు బోధనల ద్వారా మహపూర్ణులు వివరిస్తుంటే రామానుజుల దేహం పులకించేది. తంజమాంబ వ్యవహరం భరించలేక మహపూర్ణులు వారి భార్య రామానుజులకు చెప్పకుండా తిరిగి శ్రీరంగం వెళ్ళిపోయారు.

తంజమాంబను దూషించక ఆమె పుట్టింట జరుగనున్న శుభకార్యానికి పంపి గృహస్థాశ్రమానికి స్వస్తి పలికి కాషాయ వస్త్రాలను ధరించి త్రిదండాన్ని చేపట్టారు.

వైష్ణవ ధర్మానికి మూల స్థానము శ్రీరంగమే, దాన్నే కేంద్రంగా చేసుకొని పరమవైదికమైన విశిష్టాద్వైత సిద్ధాంతానికి వన్నె తెచ్చారు. శ్రీరంగనాథుని ఆలయంలో సేవలు సన్నగిల్లాయి, కూరంగ్రామం జమీందారు  శ్రీకూరత్తాళ్వ్‌న్‌ ‌రామానుజులను గురువుగా ఆరాధించేవారు. కూరేశుల ద్వారా ఆలయ అధికారాన్ని చేజిక్కుంచుకొని ఆలయ వ్యవస్థను, ఉత్సవాలను, చుట్టూ ఉంటే సమాజాన్ని దక్షగా తీర్చిదిద్దడం ఆరంభించారు.

తిరుమాలై అండాన్‌ ‌సన్నిధిలో తిరువామ్‌మొజి అధ్యయనం చేశారు. తిరువరంగప్పెరుమాళ అఱైయర్‌ ‌వారి దగ్గర నాలాయిర దివ్యప్రబంధం అధ్యయనం చేశారు. ధనుర్దాసుపై రామానుజులు కటాక్షించి రంగన్ని ఆరాధించేలా చేశారు. శాస్త్రవాదంలో పండితుడైన మజ్ఞమూర్తిపై విజయం సాధించారు.

‘‘శరణాగతి గద్య, శ్రీరంగ గద్య, వైకుంఠ గద్య’ అనే గద్యత్రయాన్ని రచించారు. తిరుమలకు బయలుదేరి మోకాళ్ళకు వస్త్రాలను కట్టుకొని పైకి నడిచారు. అక్కడ నందనవనం, పుష్కరిణి లాంటివి తయారు చేసి పెరమాళ్ళకు ప్రీతి వర్ధకమైన కైంకర్యం చేయాలని పంపించారు. రెండవసారి తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వరున్ని విష్ణు స్వరూపంగా నిర్ణయించేలా చేశారు.

ఉత్తర దేశ యాత్ర సాగిస్తు (అయోద్య, నైమిశారణ్యం) శ్రీ కూర్మనాథుణికి శ్రీపాంచరాత్రాగమన పద్ధతిలో ఆరాధనలను జరిపించాలని చెప్పి ముందుకు సాగారు, సింహాచలంలో శ్రీ వరాహాలక్ష్మీ నరసింహా స్వామికి మంగళశాసనం చేసి తిరుపతికి బయలుదేరారు.

తిరుపతిలో గోవింద రాజుల విగ్రహం శయనించిన మూర్తిగా తయారు చేయించి ప్రతిష్టించారు. అలిపిరి దగ్గర సితారాములను ప్రతిష్టించారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి మరునాడు అక్కడ కళ్యాణం జరిగేలా ఏర్పాటు చేశారు. కొండపైన, కిందకూడ నిత్యం ఒకేలా ఆరాధనలు జరిగేలా ఏర్పాటు కావించారు. తిరుమలలోని ఆలయంలోనే ఈశాన్య భాగంలో ఎత్తుగ శ్రీ నరసింహా స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. తిరుమల క్షేత్రాన్ని, ఆలయ వ్యవస్థను, అధికారుల ఆచరణలను సరిదిద్దారు అక్కడే శ్రీబాష్యం రచనను సాగించారు.

కర్ణాటక బయలుదేరి వెళ్తూ గిరిజనులపై అనుగ్రహాన్ని కురిపించారు. కొంగు పిరాట్టి అనే మహిళకు మొదటిగా మంత్రోపదేశం కావించి. మహిళలలు కూడా మంత్రోపదేశానికి అర్హులే అని చాటించారు. రాజు విట్టి దేవుని కుమారైకు పట్టిన దయ్యాన్ని వదిలించారు. వెయ్యి మంది జైనులతో తనకు, వారికి మధ్యలో తెర అడ్డంపెట్టుకొని ఒకేసారి అందరి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి ఆదిశేషుని అవతారం అని నిరూపించారు.

మేలుకోటలో విగ్రహ ప్రతిష్ట గావించి ‘తిరునారాయణ పెరుమాళ’గా నామకరణం చేశారు. దళితులకు పంచ సంస్కారాలు కావించారు. బాగుపడాలని భావించే జనులంతా భగవంతుని సేవకు అర్హులే అని దళితులకు నియమ నిష్టలను నేర్పి ‘తిరుకులత్తార్‌’ అని పేరు పెట్టి వాళ్ళకు మర్యాదను ఏర్పరచారు.

4వ సారి తిరుమలకు వెళ్ళి స్వామి సేవలు యధాతరంగా జరగాలి అని జీయర్‌ ‌సంప్రదాయాన్ని ఏర్పరిచారు. ‘నాచ్చియార్‌ ‌తిరుమొజ్ఞి’ అండాళ్‌ ‌ప్రసాదించిన గ్రంథాన్ని కాలక్షేపం చేస్తుంటే గోదమ్మ తన వ్రతం నెరవేరితే సుందరబాహుల్‌ ‌పెరమాళ్ళకు నూరు గంగాళముల పరమాన్నమును తన బదులు రామానుజులు చేయించి కైంకర్యము సమర్పించి గోదాగ్రజులైనారు. తిరుమలేశుడికి ‘శ్రీవేదార్థసంగ్రహం’ వినిపించి శంఖచక్రాలను సమర్పించి ఆచార్యులయ్యారు.

సవినయంగా శిష్యరూపాన్ని ధరించి వచ్చిన తిరుక్కురుం గుడి పెరమాళ్ళకు శంఖచక్రాంకనం చేసిద్వయ మంత్రానికి ఉన్న ప్రాధాన్యాన్ని లోకానికి చాటి చెప్పారు.

ఆచరణ ద్వారా ఉపదేశం ద్వారా కూడా లోకానికి ఉజ్జీవనమార్గాన్ని చూపించి సమతామూర్తులయ్యారు శ్రీ భగవద్రామానుజులు, క్రీ.శ.1017లో ఆవిర్భవించి క్రీ.శ.1137 పింగళనామ సంవత్సరంలో భగవత్‌ ‌సన్నిధానాన్ని పొందారు. వీరి చరమ శ్రీ విగ్రహం, శ్రీరంగనాథు నికత్యంత ప్రియం కనుక ఆ రంగనాథుని ఆజ్ఞప్రకారం శ్రీరంగంలోని వసంత మండపంలో వేంచేపు చేసారు. పెద్దలు, నేటికిని ‘తానానతిరుమేని’గా శ్రీ భగవద్రామానుజులను శ్రీరంగంలో మనమంతా సేవించుకొగలుగుతున్నాం.

రామానుజులు తీర్చిదిద్దిన స్థానాలలో నాలుగు కేంద్రాలను విశేషించి ఒక ముక్తక శ్లోకం ద్వారా పెద్దల ప్రతి దినం స్శరించి వందనం చేస్తూంటారు. అవి శ్రీరంగం, కాంచీపురం, తిరుమల, తిరునారాయణపురం.

శ్రీరంగ మంగళమణిం కరుణానివాసం
శ్రీవేంకటాద్రి శిఖరాలయ కాల మేఘమ్‌।।
శ్రీ‌హస్తి శైల శిఖరోజ్వల పారిజాతం
శ్రీశం నమామి శిరసా యదుశైల దీపమ్‌।।

– గీతాంజలి
రిసెర్చ్ ఆఫీసర్‌, ‌తెలుగు అకాడమీ, తెలంగాణ