కోటి లింగాల వద్ద పురావస్తుశాఖ వారు నిర్వహించిన త్రవ్వకాలలో నాగవంశానికి చెందిన గోబద, సమగోప, సిరివాయ, నారన, సిరికమ అనే పేర్లతో ఉన్న నాణాలు లభించాయి. దానిని బట్టి శాతవాహనులకు ముందు ఈ ప్రాంతాన్ని నాగవంశపు రాజులు పరిపాలించినట్లుగా తెలుస్తున్నది. రాష్ట్ర పురావస్తు శాఖవారు బోధన్‌లో నిర్వహించిన త్రవ్వకాలలో నొక్కుడు (పంచ్‌మార్క్‌డ్) నాణాలు, శాతవాహనుల నాణాలు, కాల్చినమట్టితో చేసిన పూసలు, మృణ్యయపాత్రలు, రోము దేశపు వెండినాణాలు, ఆ దేశపు మృణ్యయ పాత్రలు, మత్తుపానీయాలకు వాడే పాత్రలు, రాతితో చేసిన ధర్మచక్రం మొదలైనవి లభించాయి.
రోమను దేశపు వెండినాణాలు, రోమ‘న్ మృణ్యయ పాత్రలు లభించినందున శాతవాహనులకు రోము దేశానికి వర్తక వాణిజ్యాలు నిర్వహింపబడినట్లుగాను, బోధన్ ఒక గొప్ప వాణిజ్య కేంద్రంగా ఉన్నట్లు అవగతమవుతున్నది. బోధన్‌కు సమీపంలో ఉన్న మంజీరా, గోదావరి నదులు, తూర్పు తీరాన ఉన్న బంగాళాఖాతం ద్వారా అనేక విదేశాలతో వర్తక వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నట్లుగా తెలుస్తున్నది. పడవల ద్వారా సముద్రం వరకు సరుకులను రవాణాచేసి, అక్కడ నుంచి నౌకల ద్వారా అనేక దేశాలతో వాణిజ్యం నిర్వహించినట్లుగా విదితమవుతున్నది.
ప్రాచీన అవశేషాలు
నిజామాబాద్ జిల్లాలో అనేక ప్రాచీన అవశేషాలు వేరు వేరు కాలాలలో నిర్మింపబడినట్లుగా తెలుస్తున్నది.
నాణాలు:
వివిధ వంశాల రాజులు వేయించిన రాగి, సీసం, వెండి, బంగారు నాణాల ద్వారా ఆ కాలం నాటి రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక స్థితి గతుల్ని గ్రహింపవచ్చును. క్రీ.పూ 6వ శతాబ్దం నాటికే మహాజన పధ్నాలుగు నాణాలను ముద్రించి వాడుకలోకి తెచ్చాయి. విద్వంక లేక నొక్కుడు (పంచ్‌మార్క్‌డ్) నాణాలు బోధన్‌లో లభించాయి. శాతవాహన కాలం నాటి సీసపు నాణాలు విజయ నగర రాజుల కాలానికి చెందిన బంగారు నాణాలు కూడా బోధన్‌లో లభించాయి. ఎల్లారెడ్డి పరిసర ప్రాంతాలలో మొగలుల కాలం నాటి వెండి నాణాలు లభించాయి.
బోధన్‌లో కాకతీయుల నాణాలు, బహమనీ సుల్తానుల రాగి, వెండినాణాలు కూడా లభ్యమైనాయి. ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల, నిజాం, నిజాంసాగర్ మండలం నర్వ అనే గ్రామంలో మొగలుల వెండినాణాలు, లింగంపేట మండలం మోతె గ్రామంలోను, బోధన్ దగ్గర ఉన్న తగ్గెల్లి గ్రామంలో మొగలుల వెండినాణాలు లభించినట్లుగా తెలుస్తున్నది. ఈ జిల్లాలో అనేక ప్రదేశాలలో వివిధ రాజవంశాలకు చెందిన నాణాలు గుప్తనిధుల రూపంలో లభించినట్లుగా విదిత్యమవుతున్నది. ఈ నాణాలపై బ్రాహ్మి, సంస్కృతం, తెలుగు, కన్నడ, అరబిక్, ఉర్దూ భాషలను చూడవచ్చును.
తాళ పత్రగ్రంథాలు:
ఈ జిల్లాలో అనేక గ్రామాలలో తాళపత్ర గ్రంథాలు లభించినట్లుగా ప్రఖ్యాత శాసన పరిశోధకులు జయధీర్ తిరుమలరావు, రాష్ట్ర పురావస్తు శాఖలో శాసన పరిశోధకులు బ్రహ్మచారి గార్ల ద్వారా తెలుస్తున్నది. ఈ జిల్లాలో లభించిన తాళపత్ర గ్రంథాల ద్వారా ఈ ప్రాంతం మరాఠా రాజుల, పీష్వాల ఆధీనంలో కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. ఆ కాలం నాటి సాంఘీక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను తెలియచేస్తున్న రాజశేఖరుని “బల్లాల చరిత్ర” గల తాళపత్ర గ్రంథాలు వర్ని గ్రామంలో లభించాయి. ఆయుర్వేదం, జ్యోతిష్య శాస్త్రం, మంత్రశాస్త్రం, శతకాలు కలిగి ఉన్న తాళపత్ర గ్రంథాలను శాసన పరిశోధకుడు డా. కావూరి శ్రీనివాస్ కౌలాస్లోని గోవిందమహరాజ్ వద్ద సేకరించి, పరిష్కరిస్తున్నారు.
శాసనాలు:
జిల్లాలో వివిధ రాజవంశాలకు చెందిన సుమారు 76 శాసనాలు కనుగొనబడినట్లుగా సాయిరెడ్డి తన పుస్తకం నిజామాబాద్ జిల్లా చారిత్రక వైభవంలో పేర్కొన్నారు. ఇందులో కొన్ని శాసనాలు మాత్రమే పరిష్కరింపబడినాయి. ఈ శాసనాలు సంస్కృత, కన్నడ, తెలుగు, అరబిక్, ఉర్దూ భాషలలో, కొన్ని దేవనాగరి లిపిలో ఉన్నాయి.
ఈ ప్రాంతాన్ని పరిపాలించిన శాతవాహనుల విష్ణుకుండినుల కాలానికి చెందిన శాసనాలు ఈ జిల్లాలో లభ్యం కాలేదు. అదే విధంగా ఈ ప్రాంతాన్ని ఏలిన బాదామి చాళిక్యుల శాసనాలు కూడా ఈ జిల్లాలో లభించలేదు. ఆ తరువాత ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాష్ట్రకూటుల శాసనాలు అనేక దేవాలయాలలో లభించాయి. బోధన్ చాళుక్యులు రాష్ట్రకూటుల సామంతులుగా ఉంటూ వారితో వైవాహిక సంబంధాలు ఏర్పరచుకున్నారు. రాష్ట్రకూట రాజు రెండవ అరికేసరి ఆస్థానములో ఉన్న పంపకవి “విక్రమార్కుని విజయము” ఆది పురాణము అనే గ్రంథాలను క్రీ.శ. 941లో రచించారు. పంపకవి తన శేష జీవితాన్ని పౌదనపురంలో గడిపినట్లు బోధన్‌లోని పంప సమాధిపై ఉన్న శాసనం ద్వారా తెలుస్తున్నది. ఈ జిల్లాలో ఉన్న రాష్ట్రకూటులు వేయించిన శాసనాలు ఇంకా ప్రకటించబడినట్లుగా లేదు. అదే విధంగా వారి సామంతులైన బోధన్/వేములవాడ చాళుక్యుల శాసనాలది కూడా అదే పరిస్థితి.
కళ్యాణి చాళుక్యుల శాసనాలు:
ఈ జిల్లాలో కళ్యాణి చాళుక్యుల శాసనాలు 20 వరకు ప్రకటించబడినవి. ఆ శాసనాలు సంస్కృతం, కన్నడ భాషలలో ఉన్నాయి. మొదటి సోమేశ్వరుని శాసనాలు బోధన్, పెంటకుర్టు, జుక్కల్లోను, రెండవ సోమేశ్వరుని శాసనాలు బోధన్, దేశాయిపేటలోను, ఆరవ విక్రమాదిత్యుని శాసనాలు బోధన్, దేశాయిపేట, వాజిద్నగర్ ఖుదావంద్‌పూర్, బీర్కూరు, గుండెనమ్లి, బిచ్కుంద భీంగల్, దుర్కి, యాదారంలలోనూ, మూడవ సోమేశ్వరుని శాసనాలు చిన్న మల్లారెడ్డి, బోధన్, దేశాయిపేట, నవీపేటలలో, రెండవజగదేవ్మల్లుని శాసనాలు వర్ని, నీలం, బిచ్కుంద, సంగెంతాడ్ బిలోలి, యాదలలోనే లభించాయి.
కాకతీయుల శాసనాలు:
కాకతీయుల శాసనాలు ఈ జిల్లాలో అనేకం లభించాయి. వీరిలో మొదటి ప్రోలరాజు శాసనం కాజీపేటలో గణపతి దేవుని శాసనం బాల్కొండలో, రుద్రమదేవి శాసనాలు, బీర్కూరు, కుప్రియల్, బండరామేశ్వరపల్లి, కామారెడ్డి, వినాయకపురిలలోను, ప్రతాపరుద్రుని శాసనాలు బిచ్కుంద, కౌలాస్లలో లభించినవి మాత్రమే ప్రకటితమైనాయి.
యాదవరాజుల తామ్రపత్ర శాసనం కోటగిరిలో లభించినట్లుగా తెలుస్తున్నది. శివాజీ వేయించిన దానశాసనం కందకుర్తిలో లభించింది.
ఢిల్లీ సుల్తాను మొహమ్మద్ బిన్తుగ్లక్ బోధన్‌లో ఉన్న ఇంద్రనారాయణ దేవాలయాన్ని దేవళ్మజ్దీస్గా మార్చినట్లు ఆ భవనంలో ఉన్న పార్సీ భాషలో ఉన్న శాసనం ద్వారా తెలుస్తున్నది. రెడ్డి రాజుల వంశానికి చెందిన అనవేమారెడ్డి వేయించిన శాసనాలు బిచ్కుంద, మద్నూరు, పెద్దకొడప్గల్ గ్రామాలలో లభించాయి. మొగల్ నవాబ్ ఔరంగజేబు వేయించిన అరబిక్ శాసనం బోధన్‌లోని ఆలంగీర్ మసీదులో ఉన్నది.
నిజాం ప్రభువుల కాలంలో జాగీర్దార్లుగా ఉన్నరెడ్డి రాజుల మోడి భాషలో ఉన్న శాసనాలు వేమారెడ్డి, బిచ్కుంద, మద్నూర్, పెద్దకోడప్గల్ గ్రామాలలో లభించాయి. ఆధునిక యుగంలో స్థానిక ముస్లీం నవాబుల ఉర్దూ భాషలో ఉన్న శాసనాలు బోధన్ , జిల్లాలోని ఇతర ప్రాంతాలలో కనుగొన్నారు. బోధన్, నవీపేట మండలాలలో పరిష్కరింపబడని శాసనాలు అనేకం ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఈ పైన పేర్కొన్న పరిష్కరింపబడిన వేరువేరు భాషలలో ఉన్న శాసనాల ఆధారంగా ఆనాటి రాజకీయ, ఆర్థిక, సాంఘీక పరిస్థితులను గ్రహింపవచ్చును.
-కె.వెంకటేశ్వర రావు
9490636659
(విజయక్రాంతి సౌజన్యం తో)