Home News కేంద్ర బడ్జెట్ 2023-24 ఆర్థిక స్థిరత్వానికి సమ్మిళిత వృద్ధికి దోహదపడుతుంది

కేంద్ర బడ్జెట్ 2023-24 ఆర్థిక స్థిరత్వానికి సమ్మిళిత వృద్ధికి దోహదపడుతుంది

0
SHARE

– డాక్టర్. సత్తు లింగమూర్తి,
దక్షిణ మధ్య క్షేత్ర సహా-సంయోజక్, స్వదేశీ జాగరణ్ మంచ్

ఫిబ్రవరి 1, 2023న 45.03 లక్షల కోట్ల వ్యయంతో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన 2023-24  యూనియన్ బడ్జెట్ ను స్వదేశీ జాగరణ్ మంచ్ స్వాగతిస్తుంది.ఇది భారతదేశ ఆర్థిక స్థిరత్వాన్ని, సమ్మిళిత అభివృద్ధిని సూచించే విధంగా ఉంది.

 కరోనా మహమ్మారి మరియు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.8%  ఆర్థిక వృద్ధి సాధిస్తుందని  2023 ఆర్థిక సర్వేలో పేర్కొనడం భారత దేశ దృఢమైన ఆర్థిక నిర్మాణానికి  చిహ్నం. 2023-24 కేంద్ర బడ్జెట్ భారతదేశం వచ్చే 25 సంవత్సరాలలో పయనించే అమృత కాల మార్గానికి  పునాదిగా భావించవచ్చు.

సమ్మిళిత వృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధితో భారతీయుల జీవన విధాన నాణ్యతను మెరుగుపరచడం “అమృత్ కాల్” లక్ష్యం.  ఈ బడ్జెట్ తో అభివృద్ధి యొక్క సంపన్నమైన ఫలాలు ప్రజలందరికి అందుతాయి. ముఖ్యంగా సమాజంలోని విస్మరించబడిన వర్గాలపై ఈ బడ్జెట్ ప్రత్యేక దృష్టి సారించింది.

ఈ బడ్జెట్‌ సమతుల్యంగా , నిర్మాణాత్మకంగా ,  మరియు భారత దేశ భవిష్యత్ కు ఆశాజనకంగా ఉందని స్వదేశీ జాగరణ మంచ్ అభిప్రాయ పడుతుంది . ప్రతిపాదిత బడ్జెట్ అమృత్ కాల వ్యవధిలో యువత సామర్థ్యాన్ని వెలికితీయడం, బలమైన మరియు స్థిరమైన స్థూల-ఆర్థిక మూలాలను కలిగి ఉండడం ద్వారా ఉద్యోగాల సృష్టికి మరియు ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది.

అంత్యోదయలో భాగంగా బలహీన గిరిజన సమూహాలను(PMTG) ఆర్థిక భాగస్వాములుగా చేయడానికి, ఆర్థిక వ్యవస్థలో  చివరి వ్యక్తిని చేరుకోవడానికి ‘సప్తఋషి’గా వర్ణించబడిన, ఏడు ప్రాధాన్యతలతో కూడిన బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానమంత్రి విశ్వకర్మను ఉటంకిస్తూ జ్ఞాన సమాజాన్ని తయారు చేసేందుకు కుల వృత్తులను ప్రోత్సహించడానికి  ‘యువశక్తి’ని లక్ష్యంగా చేసుకుని నూతన పథకాలను ప్రవేశ పెట్టడం ప్రశంసనీయం.

కర్బన ఉద్గారాలను సున్నాకు తీసుకురావడానికి మరియు భారతీయుల రోజువారీ ఆర్థిక కార్యకలాపాలలో భాగంగా మరియు పర్యావరణ అనుకూల ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర బడ్జెట్ ప్రత్యేకంగా గ్రీన్ గ్రోత్‌పై దృష్టి సారించింది.

ఈ బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా విస్తరించిన సంచార జాతులను ఆర్థిక ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి తొలిసారిగా ‘ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్’ PMTGs కోసం రూ. 15,000 కోట్లు కేటాయించడం జరిగింది.

UNO 2023 సంవత్సరాన్ని మిల్లెట్స్ (చిరుధాన్యాలు) సంవత్సరంగా ప్రకటించింది. భారతదేశం చిరుధాన్యాల అతిపెద్ద ఉత్పత్తి దారుగా, రెండవ అతిపెద్ద ఎగుమతిదారునిగా  ఉండటం ద్వారా ప్రపంచంలో భారత్ చిరుధాన్యాల కేంద్రంగా ఉండబోతుంది. కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశ పెట్టిన  ‘శ్రీ అన్న’పథకంద్వారా  మినుములను మరియు చిరు ధాన్యాలను ప్రోత్సహించడం జరుగుతుంది. దీంతో దేశవ్యాప్తంగా ముఖ్యంగా మినుములను పండిస్తున్న రైతులందరూ లబ్ధి పొందనున్నారు. అలాగే అత్యంత పోషక విలువలున్న మిల్లెట్లను తీసుకోవడం ద్వారా ప్రజల ఆహార వినియోగ విధానం క్రమంగా మారుతుంది.

జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ ద్వారా ఇంధన పరివర్తనలతో, రాష్ట్ర ప్రభుత్వాలను హరిత వృద్ధి దిశగా ప్రోత్సహించేందుకు ప్రత్యేక చొరవ చూపడం జరిగింది . కాలుష్యపూరితమైన, ఎరువులతో కూడిన ఆహార సంబంధిత వ్యాధులను తగ్గించడానికి మరియు సహజమైన  ఆహార ఉత్పాదకతను మెరుగుపరచడానికి ఒక కోటి మంది రైతులు సహజ వ్యవసాయాన్ని అనుసరించేలా ఈ బడ్జెట్ గ్రీన్ గ్రోత్‌పై దృష్టి సారించడం అద్భుతమైన పరిణామం.

దేశంలోని ఒప్పంద వివాదాలను పరిష్కరించేందుకు MSMEలకు ఉపశమనం కలిగించే వివాద్ సే విశ్వాస్-1 మరియు వివాద్ సే విశ్వాస్-2ని ప్రవేశపెట్టడం ద్వారా బడ్జెట్ MSME ల వృద్ధిని లక్ష్యంగా చేసుకుంది. స్టార్టప్‌లపై దృష్టి సారించింది మరియు ప్రపంచంలోని స్టార్ట్-అప్‌ల కోసం భారతదేశాన్ని మూడవ అతిపెద్ద వ్యవస్థగా పేర్కొంది. MSMEల కోసం బడ్జెట్ వ్యయం మెరుగుపరచబడింది మరియు ఉత్పత్తి అనుబంధిత ప్రోత్సాహక పథకం కారణంగా (PLI ), MSME ల పనితీరు ఆశాజనకంగా ఉంది. PLI కి సంబంధించి బడ్జెట్ వ్యయం కూడా ప్రధానంగా పెరిగింది.

వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపును సంవత్సరానికి రూ. 5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచడాన్ని స్వదేశీ జాగరణ మంచ్ స్వాగతిస్తుంది, ఇది దేశంలోని నిమ్న-మధ్య ఆదాయ వర్గం మరియు వేతన వర్గాలకు ఉపశమనం కలిగిస్తుంది. ఇది వారి  జీవన నాణ్యత మరియు జీవన శైలి మెరుగుదలకు దోహదపడుతుంది.

మూలధన వ్యయం ను 13.7 లక్షల కోట్ల వరకు పెంచడాన్ని స్వదేశీ జాగరణ్ మంచ్ అభినందిస్తుంది. ఇది సమీప భవిష్యత్తులో రెట్టింపు ప్రభావాన్ని చూపుతుంది. మౌలిక సదుపాయాల కల్పన, ఓడరేవులు, విమానాశ్రయాలు, రోడ్లు మొదలైన వాటి విస్తరణ వల్ల దేశం , యువతరం ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.

మొత్తంగా  2023-24 కేంద్ర బడ్జెట్ సమ్మిళిత వృద్ది దిశలో, నిర్మాణాత్మకంగా మరియు దేశ భవిష్యత్ కు ఆశా జనకంగా ఉందని స్వదేశీ జాగరణ మంచ్ అభిప్రాయ పడుతూ స్వాగతిస్తుంది.