భారత వీసా నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ.. పాకిస్థాన్‌లో జన్మించిన ఇస్లామిక్ బోధకుడు సాకిబ్ ఇక్బాల్ షమీపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ అనే ఎన్ జీఓ.. కేంద్ర హోంమంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేసింది. యునైటెడ్ కింగ్‌డమ్ పౌరుడు, ఇస్లామిక్ బోధకుడు ముహమ్మద్ సాకిబ్ బిన్ ఇక్బాల్ షామీ అలియాస్ సాకిబ్ ఇక్బాల్ షమీ జనవరి 26 నుంచి భారతదేశంలో పర్యటిస్తున్నారు. వివిధ నగరాల్లో ఇస్లామిక్ మతపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఫిబ్రవరి 4వ తేదీన వరంగల్‌లో జరిగే మతపరమైన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా, ప్రధానవక్తగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా తూర్పు వరంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.. ఇస్లామిక్ బోధకుడు సాకిబ్ ఇక్బాల్ షమీకి స్వాగతం పలుకుతూ పోస్టర్‌ను విడుదల చేశారు. మత ప్రచారకులకు భారత ప్రభుత్వం వీసాలు జారీ చేయదని RTI కింద ఇచ్చిన సమాధానంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.