మధ్యప్రదేశ్‌లోని ఖర్‌గోన్ నగరంలో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా జరిగిన హింసకు సంబంధించి దాదాపు 84 మందిని పోలీసులు అరెస్టు చేశారు. హింసకు పాల్పడిన నిందితులకు చెందిన 50 నిర్మాణాలను నేలమట్టం చేశారు.
ఆదివారం సాయంత్రం ఒక ప్రార్థనామందిరం పక్కగా శ్రీరామనవమి శోభాయాత్ర కొనసాగుతుండగా అల్లర్లు జరిగాయి. దాదాపు మూడు గంటల సేపు రాళ్ళు రువ్వుకోవడం, ఘర్షణలు తలెత్తాయి. కనీసం ఒక డజనుపైగా ఇండ్లు, వాహనాలు, దుకాణాలు అగ్నికి ఆహుతైపోయాయి. హింసాత్మక ఘటనల్లో 27 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి 84 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 12 మంది మైనర్లను నిర్బంధంలోకి తీసుకున్నారు. వారిలో అత్యధికులు ముస్లిములని పోలీసులు తెలిపారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాలకు లోబడి అక్రమంగా నిర్మితమైన ఇండ్లు, దుకాణాలతో కలుపుకొని 45 నిర్మాణాలను ఖర్‌గోన్ నగర అధికార యంత్రాంగం నేలమట్టం చేసింది.
“రాళ్ళు రువ్వి అల్లర్లకు దిగిన వారిని ఉపేక్షించేది లేదు. వారి నివాసాలు శిథిలాలుగా మారిపోతాయి. రాష్ట్రంలో శాంతి, భద్రతలకు భంగం కలిగించే విధంగా ఏ ఒక్కరిని అనుమతించేది లేదు” అని మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. విధ్వంసానికి పాల్పడిన నిందితుల నుంచి పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాబడుతుందని ఆయన స్పష్టం చేశారు. నిందితుల నుంచి నష్ట పరిహారాన్ని రాబట్టడం కోసం ఒక రాష్ట్ర స్థాయి ట్రిబ్యూనల్‌ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చౌహాన్ తెలిపారు.
“ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం నివారణ మరియు ధ్వంసం నుంచి రికవరీ చట్టాన్ని మధ్యప్రదేశ్‌లో తీసుకువచ్చాము. ఖర్‌గోన్ నగరంలో విధ్వంసకారులను శిక్షించడంతో సరిపుచ్చక విధ్వంసానికి సరిపడ వారి నుంచి పరిహారాన్ని రాబడతాము. ఈ మేరకు ఒక క్లెయిముల ట్రిబ్యూనల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది” అని సీఎం చౌహాన్ తెలిపారు.
శాంతి, భద్రతల పరిరక్షణలో సీఎం చౌహన్ కఠిన వైఖరిని బలోపేతం చేస్తున్నట్టుగా నివాసాలు, దుకాణాలను బుల్ డోజర్లు నేలమట్టం చేస్తున్న దృశ్యాలు టీవీ చానెళ్ళల్లో రోజంతా ప్రసారమయ్యాయి. పోలీసులు, జిల్లా అధికార యంత్రాంగం, మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన అధికారులతో కూడిన ఒక సంయుక్త బృందం సోమవారం మధ్యాహ్నానికి నగరంలోని మోహన్ టాకీస్ ప్రాంతంలో నాలుగు ఇండ్లను నేలమట్టం చేసినట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అక్రమంగా నిర్మితమైన మరో 50 ఇండ్లను గుర్తించినట్టు చెప్పారు. ఈ నివాసాలన్నీ నగరంలోని ఖస్‌ఖస్‌వాడీ, ఆనంద్ నగర్, మోతీపురా, సంజయ్ నగర్, తాలబ్ చౌక్ లాంటి అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయని పోలీసులు తెలిపారు.