Home News భారత్‌లో సీఏఏ.. వాస్తవాలు, వాగుళ్లు – 3

భారత్‌లో సీఏఏ.. వాస్తవాలు, వాగుళ్లు – 3

0
SHARE

ఈశాన్య రాష్ట్రాల ప్రయోజనాలకు రక్షణ

సీఏఏతో ఈశాన్య రాష్ట్రాలకు నష్టం జరుగుతుందునే ప్రచారంతో అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌ (ఐఎల్‌పీ) నిబంధనల పరిధిలోకి వచ్చే అరుణాచల్‌ప్రదేశ్‌, మిజోరాం, నాగాలాండ్‌లకు పౌరసత్వ సవరణ బిల్లులోని నిబంధనలు వర్తించవు. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో పేర్కొన్న అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలోని గిరిజన ప్రాంతాలకు కూడా ఈ నిబంధనలు వర్తించవని బిల్లు స్పష్టం చేస్తోంది.

అస్సాంలోని గిరిజనేతర ప్రాంతాలు పౌరసత్వ సవరణ బిల్లు పరిధిలో ఉన్నాయి. అస్సాంలోకి అక్రమంగా ప్రవేశించిన చాలా మంది ప్రధానంగా బంగ్లాదేశ్‌ నుంచి వచ్చినవారు ఈ బిల్లుతో ప్రయోజనం పొందుతారని, ఇక వీళ్లు తమ రాష్ట్రంలో అధికారికంగా స్థిరపడిపోతారని అస్సాంలోని గిరిజనేతర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతు న్నారు. ఈ అపోహలను తొలగించాల్సి ఉంది.

బంగ్లాదేశ్‌ అక్రమ వలసదారులతో ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రం అస్సామే. 1971లో తూర్పు పాకిస్తాన్‌ బంగ్లాదేశ్‌గా మారక ముందు నుంచే పెద్ద సంఖ్యలో హిందువులు భారత్‌కు వలస రావడం మొదలైంది. వీరు బంగ్లాదేశ్‌లోని పాకిస్తాన్‌ సైనికుల దురాగతాల బాధితులు. హిందువు లను శరణాగతులుగా, అక్రమ వలసదారులను బయటివారిగా వర్గీకరించే ప్రయత్నం జరిగింది. ఈ అక్రమ వలసదారుల్లో అత్యధికులు ముస్లింలు.

ఇలా పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లలో వివక్షకు గురవుతున్న ముస్లిమేతరులకు ఆశ్రయం కల్పించి పౌరసత్వం ఇవ్వాలని కోరిన ఈ కాంగ్రెస్‌, కమ్యూనిస్ట్‌ పార్టీలే ప్రస్తుతం అందుకు వీలుకల్పించే విధంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని తెస్తే గగ్గోలు పెట్టడం విచిత్రం. అది రాజ్యాంగ వ్యతిరేకమని, ముస్లిం వ్యతిరేకమని, మానవహక్కులకు వ్యతిరేకమంటూ నానా రాద్ధాంతం చేస్తున్నాయి. వీటి వైఖరి మూలంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో అల్లర్లు, హింస చెలరేగాయి.

పైన మనం అధ్యయనం చేసిన వాస్తవాలను అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పౌరసత్వ సవరణ చట్టంపై అపోహలను తొలగించి, మన దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను తిప్పి కొడదాం.


లక్ష మంది శరణార్థుల పడిగాపులు

‘చరిత్ర శపించినవారు’`హిందూ శరణార్థు లకు హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌ పెట్టిన పేరు ఇది. మార్చి 31,2013న ఆ సంస్థ సంచాలకుడు సమీర్‌ కాల్రా విడుదల చేసిన విషయాలు దిగ్భ్రమ గొలుపుతాయి.ఇది అమెరికాలోని హిందువులు ఏర్పాటు చేసిన హక్కుల రక్షణ సంస్థ (హెచ్‌ఏఎఫ్‌). ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పోరాడుతున్నది. మిగిలిన దేశాలలో హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలకీ, పాకిస్తాన్‌లో హిందువులు ఎదుర్కొంటున్న పీడనకూ ఎంతో తేడా ఉంది.అక్కడ హిందువుల మీద పథకం ప్రకారం హింసాకాండ సాగుతున్నది. మత వివక్ష సుస్పష్టం. పాకిస్తాన్‌ మైనారిటీల మీద, వారి మతాచారాల మీద తీవ్ర అణచివేత కొనసాగు తున్నది. ఇటీవలి కాలంలో దాదాపు 1,00,000 మంది భారతదేశానికి శరణార్థులుగా వచ్చారని ఆ సంస్థ వెల్లడిరచింది.

పాకిస్తాన్‌కు సమీపంగా ఉన్న రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో శరణార్థులు ఎక్కువగా ఉన్నారు. అందుకే 2023 (జనవరి 14-16) ఆరంభంలోనే హెచ్‌ఏఎఫ్‌ ఈ నగరాన్ని సందర్శించింది. సంస్థ సంచాలకుడు సమీర్‌, అమెరికాలో ఉంటున్న కొందరు భారతీయ వైద్యులు అక్కడకు వెళ్లారు. స్థానికంగా ఉన్న కొన్ని హిందూ సంస్థలు వీరికి సహకరించాయి.

1947, దేశ విభజన సమయంలో తమ దేశంలో మైనారిటీలను (హిందువులు, సిక్కులు, క్రైస్తవులు తదితరులు) భద్రంగా చూసుకుంటామని పాకిస్తాన్‌ స్థాపకుడు మహమ్మదలీ జిన్నా హామీ ఇచ్చాడు. కానీ ఆది నుంచి అక్కడ హిందువులు, మైనారిటీలు వివక్షకు గురి అవుతూనే ఉన్నారు. నాటి నుంచి సరిహద్దులు దాటి భారతదేశంలోకి వస్తున్నారు. ఇది దశల వారీగా జరిగింది. 1965, 1971 (యుద్ధాల వేళ), 1992 తరువాత భారత్‌కు పాక్‌ శరణార్థులు వెల్లువెత్తారు. అయితే 1971 తరువాత వచ్చిన వారినే శరణార్థులు అని పిలుస్తారు. 1965లో ఒక్క రాజస్తాన్‌కే 8000 మంది వచ్చారు. 1971లో 90,000 మంది భారత్‌కు వచ్చారు. 1992 తరువాత 20,000 మంది వచ్చారు. భారత్‌`పాక్‌ యుద్ధాల సమయంలో అక్కడి హిందువులను ‘దేశ వ్యతిరేకులు’గా ప్రకటించారని హెచ్‌ఏఎఫ్‌ నివేదిక చెబుతున్నది. అప్పటి నుంచి వారి మీద ఆంక్షలు మరింత తీవ్రమయినాయి. ఒక పక్క పాక్‌ ప్రభుత్వం, మరొకవైపు జిహాదీలు లేదా ఉగ్రవాదులు, ముస్లిం మత గురువులు కూడా వారిని వేధించే పనిని యథేచ్ఛగా సాగిస్తున్నారు. కాలీబెరీ (రాజస్తాన్‌) శరణార్థి శిబిరంలో ఉంటున్న ఒక మహిళ చెప్పినదాని ప్రకారం రహీంయార్‌ఖాన్‌ జిల్లాలో ముస్లిం మత గురువులు హిందువులు మతం మార్చకోకపోతే ఇక్కడ ఉండక్కరలేదు అని బాహాటంగానే ప్రకటిస్తున్నారు.హిందువులుగా ఉండదలుచుకున్న వాళ్లకి పాకిస్తాన్‌లో చోటు లేదని చెబుతున్నారు. అసలు హిందూ వివాహాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఎలాంటి చట్టాలు లేకపోవడం వల్ల వివాహితలను కూడా అపహరించి మతం మార్చి వేరే పెళ్లిళ్లు చేస్తున్నారు. పైగా అపహరించుకుపోయిన వాళ్లే ఆమె చేత ఇష్టపూర్వకంగా మతం మార్చుకున్నట్టు, పెళ్లి చేసుకున్నట్టు సంతకాలు చేయిస్తారు. ఇందులో పోలీసుల జోక్యం ఉండదు. ఈ వ్యవహారానికి ఎదురు చెబితే ఆమె కుటుంబంలోని వారందరినీ చంపే స్తామని బెదిరిస్తారు. ఈ తరహా బాధితులు కూడా రాజస్తాన్‌కు వచ్చారు.

ఇక్కడ 1992 ప్రస్తావన అయోధ్యకు సంబంధించినది. ఆ సంవత్సరం ఇక్కడ వివాదాస్పద కట్టడాన్ని కూలిస్తే అక్కడి హిందువులను లక్ష్యం చేసుకుని హింసాకాండ సాగించారు.ఆ సమయంలో ఉపఖండమంతటా కూడా హిందువులను హింసించారు. ముస్లిం మూకలు హిందువుల మీద, వారి ఆలయాల మీద దాడులు చేశాయి. ఆ తరువాత భారీగా హిందువులు తరలి వచ్చారు. 2009లో 6000 మంది భారత్‌లో తలదాచుకోవడానికి వచ్చారు.అప్పటి నుంచి ఏటా వేయి మంది రాజ స్తాన్‌కు వస్తున్నారని రాజస్తాన్‌కు చెందిన హిందూ సింగ్‌ శోధ్‌ తెలిపింది. పాకిస్తాన్‌కు పక్కనే ఉండడం వల్ల కావచ్చు, రాజస్తాన్‌లోనే 400 హిందూ శరణార్థి శిబిరాలు ఉన్నాయి. రాజస్తాన్‌లోని ప్రతి జిల్లాలోను హిందూ శరణార్థులు కనిపిస్తారని హిందూ సంఘాలు చెబుతున్నాయి. ఈ శరణార్థులు ఎక్కువగా పాక్‌లోని సింధు ప్రాంతం, రహీమ్‌యార్‌ ఖాన్‌, బహావల్పూర్‌ జిల్లాల వారే. పంజాబ్‌, హరియాణా, గుజరాత్‌, ఢిల్లీలో కూడా పాక్‌ నుంచి వచ్చిన హిందువులు దీనస్థితిలో కనిపిస్తారు.

శరణార్థి శిబిరాలలో ఉంటున్నవారి నోట సాధారణంగా ఒకే రకం మాటలు వినిపిస్తాయి. సామాజిక వివక్ష, హిందూ దేవాలయాల ధ్వంసం, మత స్వేచ్ఛ లేకపోవడం, ఆర్థిక దోపిడీ, భూకా మందుల పీడనÑ రైతుల వేధింపు, దీనితో పాటు పాఠశాలల్లో హిందువుల పట్ల చూపే ధోరణి వారిని ఇక్కడికి చేర్చాయి. పాఠశాల ఉపాధ్యాయులు హిందువుల పిల్లలతో బలవంతంగా ఖురాన్‌ చదివిస్తారు. సాధారణంగా ఆడపిల్లకు 16 ఏళ్లు వస్తే ఇక భయం మొదలు. అది అక్కడ వివాహ అర్హత వయసు. బాలికలను అపహరించి, మతం మార్చి వృద్ధులకు ఇచ్చి పెళ్లి చేస్తారు.

నిజమే, భారత్‌ ఆశ్రయమిస్తుందని వారు ఆశించి వచ్చారు. కానీ ఇంతకాలం వారి ఆశ నెరవేరలేదు. రాజస్తాన్‌లో అశోక్‌ గెహ్లోత్‌ ప్రభుత్వం వారిని అష్టకష్టాలు పెట్టింది కూడా. మండు టెండలలో వారి శిబిరాలను కూల్చివేయించినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు సీఏఏ ఇలాంటి వారికి పౌరసత్వం ఇవ్వాలని అనుకుంటున్నది. వారికి సగౌరవమైన జీవితం ఇవ్వాలని చూస్తున్నది. ఇది తప్పా?

మొద‌టి భాగం – భారత్‌లో సీఏఏ.. వాస్తవాలు, వాగుళ్లు – 1

రెండో భాగం – మొద‌టి భాగం భారత్‌లో సీఏఏ.. వాస్తవాలు, వాగుళ్లు – 2

జాగృతి సౌజ‌న్యంతో…