Home News భారత్‌లో సీఏఏ.. వాస్తవాలు, వాగుళ్లు – 2

భారత్‌లో సీఏఏ.. వాస్తవాలు, వాగుళ్లు – 2

0
SHARE

తమ రాష్ట్రాల్లో అమలు చేయరట!

అధికారం పరిధులు తెలియపోతే అంధత్వం వస్తుంది. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఏఏని అమలు చేయబోమని ప్రగల్భిస్తున్నారు. ఇదో పెద్ధ అబద్ధం. అసలు వారి చేతిలోనే పౌరసత్వం వ్యవహారం ఉండదు. అది కేంద్రానిది. పౌరసత్వ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయబోం అంటున్నవారు ` మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్‌), ఎంకే స్టాలిన్‌ (తమిళనాడు) పినరయి విజయన్‌ (కేరళ). అరవింద్‌ కేజ్రీవాల్‌ (ఢల్లీి) కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రజల మధ్య విభజన సృష్టించడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల ముందు సీఏఏ అమలు చేస్తోందని మండిపడ్డారు మమత. ఈ చట్టం బహుళవాదం, లౌకికవాదం, మైనారిటీ వర్గాలకు, శ్రీలంక తమిళ శరణార్థులకు కూడా వ్యతిరేకమేనని తేల్చారు స్టాలిన్‌. సీఏఏ దేశ ప్రజల మధ్య మతపరమైన వివక్షకు దారి తీస్తుందని పినరయ్‌ విజయన్‌ ఆరోపణ. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల నుంచి పేద మైనారిటీలు మన దేశంలోకి వెల్లువెత్తేందుకు బీజేపీ ప్రభుత్వం గేట్లు తెరిచిందని కేజ్రీవాల్‌ నింది. సీఏఏ నిబంధనలు భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయనని కూడా వీరు చెబుతున్నారు. దేశ పౌరులు జీవనోపాధి కోసం బయటి దేశాలకు వెళుతున్నారని, పౌరసత్వ చట్టంతో జరిగేదేమీ ఉండదని సమాజ్‌వాదీ నేత అఖిలేష్‌ యాదవ్‌ అంటున్నారు. ఈ చట్టాన్ని రద్దు చేయాల్సిందేని ఈ నాయకులంతా డిమాండ్‌ చేస్తున్నారు

సీఏఏపై స్టే ఇవ్వండి: కేరళ

పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలు అమలు కాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ నిబంధనలు వివక్షా పూరితం, ఏకపక్షం, లౌకికవాద సిద్ధాంతాలకు వ్యతిరేకమని కేరళ ప్రభుత్వ వాదన. 2019లో పౌరసత్వ సవరణ చట్టాన్ని ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం 2024లో నిబంధనలు రూపొందిం చిందని, అందువల్ల వీటి అమలు అత్యవసరమేమీ కాదని భావిస్తోందని కేరళ సర్కారు తెలిపింది.

కోర్టుకెక్కిన అసదుద్దీన్‌

సీఏఏను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ చట్టంపై స్టే విధించాలని పిటిషన్‌ వేశారు. తన పిటిషన్‌పై విచారణ పెండిరగ్‌లో ఉండగా సీఏఏ ప్రకారం కొత్తగా ఎవరికీ భారత పౌరసత్వం ఇవ్వవద్దని ఒవైసీ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. సీఏఏ, ఎన్‌పీఆర్‌తో కలిపి చూడాలని ఓవైసీ కోరారు. దేశంలోని ముస్లింలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారాయన. ఈ వాదనలనే సుప్రీం కొట్టేసింది.

కాంగ్రెస్‌లో తలో మాట..

లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పౌరసత్వ సవరణ చట్టంతో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఈ చట్టం వివక్షతో కూడుకున్నదని, రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలకు, అసలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తేల్చారు.. ఆ పార్టీ సీనియర్‌ నేతలు జైరామ్‌ రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌ తదితరులు సీఏఏను వ్యతిరేకించినా.. కాంగ్రెస్‌ ముఖ్యనాయకుడు రాహుల్‌ గాంధీ మాత్రం ఈసారి ఆచితూచి మాట్లాడుతున్నారు. భారత్‌ గౌరవ్‌ యాత్రలో పెద్దగా మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదే రాహుల్‌ నాలుగేళ్ల క్రితం ప్రగల్భాలు పలికారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాగానే సీఏఏను రద్దు చేస్తాం అనేంతవరకు వెళ్లారు. అలా అని విపక్షాల మధ్య ఈ విషయంలో గొప్ప సయోధ్య ఏమీ లేదు. కాంగ్రెస్‌ వైఖరి పినరయ్‌కి నచ్చలేదు. ఆ పార్టీ సీఏఏ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని తప్పు పట్టారు. రాహుల్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ అంశం మీద బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటానికి కాంగ్రెస్‌ ఎందుకు చొరవ తీసుకోవడం లేదు?అని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

రొహింగ్యాల సమస్యేమిటి?

 మయన్మార్‌ (బర్మా) రోహింగ్యాలకు పౌరసత్వం ఎందుకు ఇవ్వరని సీఏఏ వ్యతిరేకులు అడుగు తున్నారు. ఇది పూర్తిగా వితండ వాదమే. మయన్మార్‌ రోహింగ్యాలు అక్కడి ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. వారితో మొదటి నుంచి శాంతి భద్రతల సమస్య ఉంది. ఈ కారణంగానే అనేక ఇస్లాం దేశాలు వారిని అనుమతించడం లేదు. బెంగాలీ ముస్లింలుగా చెప్పుకునే రొహింగ్యాలు చివరకు బంగ్లాదేశ్‌కు కూడా సమస్యగా మారారు. ఇప్పటికే మన దేశంలోకి లక్షలాది మంది రోహింగ్యాలు అక్రమంగా ప్రవేశించారు. మయన్మార్‌ ప్రభుత్వ రోహింగ్యాలను అణచివేస్తోందని ప్రచారం జరుగుతున్నా, వారి ఆగడాలను మాత్రం ప్రస్తావిం చడం లేదు. రోహింగ్యాల బాధితుల్లోమయన్మార్‌ హిందువులు ఉన్నారు.

తమిళుల ప్రస్థావన ఎందుకు?

శ్రీలంక సమస్య సునితమైనది. తమిళుల కోసం ప్రత్యేక దేశం (ఈలం) పేరుతో లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈలం (ఎల్టీటీఈ) అక్కడ దశాబ్దాల పాటు సాయుధ పోరాటం చేసింది. ఆ సంస్థ ఓడిపోయింది. తమిళులపై అక్కడ చిత్రహింసలు, అణచివేత వాస్తవమే అయినా దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి. తమిళనాడులోని కొన్ని సోకాల్డ్‌ ద్రావిడవాద పార్టీలు, శక్తులు ఈలం అంశాన్ని అడ్డం పెట్టుకొని వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాయి..

మయన్మార్‌, శ్రీలంక బౌద్దుల ఆధిక్యత ఉన్న దేశాలే అయినా మత రాజ్యాలు కావు. చైనాతో మన దేశానికి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ రెండు దేశాలతో మనకు వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాలున్నాయి.. మత రాజ్యాలైన పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్తాన్‌లలోని మైనారిటీలకు, మయన్మార్‌, శ్రీలంకలతో పోలిక పెట్టడం ఏమాత్రం సమంజసం కాదు.

ఎవరికీ వ్యతిరేకం కాదు: అమిత్‌షా

భారత పౌరసత్వాన్ని పొందడమనేది ప్రభుత్వ సార్వభౌమ నిర్ణయమని, దాని విషయంలో తాము ఎప్పటికీ రాజీ పడబోమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిష్కర్షగా చెప్పారు. సీఏఏ వెనక్కి తీసుకోబోమని, కచ్చితంగా అమలు చేసి తీరుతామని కేంద్ర హోంమంత్రి స్పష్టం చేశారు. మైనారిటీలు లేదా ఇతర వర్గాలు భయపడనక్కరలేదనీ, ఎవరి పౌరసత్వాన్ని రద్దు చేయడానికి చట్టంలో నిబంధన లేదనీ అన్నారు. కాంగ్రెస్‌, వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. మైనార్టీల ఓట్ల కోసం అనేక మంది బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 2019లో బీజేపీ మేనిఫెస్టోలో సీఏఏ తీసుకొచ్చి అఫ్ఘానిస్తాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ శరణార్థులకు పౌరసత్వం ఇస్తామని చెప్పింది. 2019లో దీనిని ఉభయ సభలు ఆమోదించాయి. కానీ కొవిడ్‌ కారణంగా ఆలస్యమైందన్నారు అమిత్‌షా.

రాజ్యాంగం ప్రకారం పౌరసత్వానికి సంబంధిం చిన చట్టాలను రూపొందించే హక్కు పార్లమెంటుదే. చట్టం, దానిని అమలు చేసే అధికారం కేంద్రానిది. ఇందులో రాష్ట్రాలకు సంబంధం లేదు. ఆర్టికల్‌ 11 ప్రకారం పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలను రూపొందించడానికి పార్లమెంటుకు అన్ని అధికారాలు ఉన్నాయి.

రాహుల్‌ గాంధీ, మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌, స్టాలిన్‌, పినరయి విజయన్‌, ఉద్దవ్‌ ఠాక్రే, అసదుద్దీన్‌ ఓవైసీ తదితరలు అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఓ బహిరంగ వేదికపైకి వచ్చి పౌరసత్వ సవరణ చట్టం గురించి తమ వాదన వినిపించాలని కేంద్రహోంమంత్రి అమిత్‌షా సవాలు విసిరారు. ఈ సమస్య గురించి ఎవరైనా రాహుల్‌ గాంధీని వివరంగా ఇంటర్వ్యూ చేయాలని, సీఏఏను వ్యతిరేకించడానికి గల కారణాన్ని ఆయన ద్వారా చెప్పించాలని మీడియా ముఖంగా కోరారు అమిత్‌షా.

ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకమా?

ఎంతమాత్రం కాదు. ఈ సవరణతో ప్రస్తుతం భారత్‌లో ఉన్న ముస్లింలు, ఇతర పౌరులకు కూడా ఎలాంటి సంబంధం లేదు. ఆ మూడు దేశాలలో ఇస్లాం అధికారిక మతం కాబట్టి అక్కడి ముస్లింలను ఈ జాబితాలో చేర్చలేదు. ఇస్లామిక్‌ దేశాలలో ముస్లింలపై మతపరంగా అణచివేత, అత్యాచారాలు జరిగే అవకాశం లేదు. ఈ చట్టం రాజకీయ, ఆర్ధిక శరణార్ధులకు సంబంధించినది కూడా కాదు. అందువల్ల కూడా ముస్లింలకు ఇందులో స్థానం కల్పించలేదు.

చట్టంలో ఏముందో తెలియనివారు కూడా దేశానికి ఏదో అనర్ధం జరుగుతోందని వాదిస్తున్నారు. ఇది కొత్తగా పౌరసత్వాన్ని ఇస్తుంది. ప్రస్తుతం ఉన్న వాటిని రద్దు చేయదు.

రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తోందా?

 సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే ఇలా చెప్పారు -‘‘ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదు. అలాగే కొందరు చెపుతున్నట్లుగా అధికరణం 14,15 లను అతిక్రమించడం లేదు. దేశీయకరణ లేదా పౌరసత్వ గుర్తింపు ఇవ్వడంలో మూడు దేశాలలో అణచివేతకు గురైన మైనారిటీ వర్గానికి చెందినవారికి కలిగిస్తున్న ప్రత్యేక సదుపాయం, హోదా మాత్రమే. దీనికి ఇతర వర్గానికి చెందినవారి దేశీయకరణ లేదా పౌరసత్వ మంజూరు ప్రక్రియతో ఎలాంటి సంబంధం లేదు. ఈ సవరణలు అధికరణం 14ను ఏమాత్రం ఉల్లంఘించడం లేదు.’’

తస్లీమా, అద్నాన్‌ సమీలకు పౌరసత్వం

పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లో జీవించడానికి ఇష్టపడ కుండా, భారతదేశంపై ప్రేమతో ఇక్కడకు వచ్చేయాలని భావించే ముస్లింలు ఎవరైనా ఉంటే తప్పకుండా రావచ్చు. ‘లజ్జ’ నవల రాసి తన దేశంలో బెదిరింపులకు గురైన రచయిత్రి తస్లీమా నస్రీన్‌ అలా వచ్చిన వారే. ప్రముఖ గాయకుడు అద్నాన్‌ సమీ కూడా పాకిస్తాన్‌ పౌరసత్వం వదులుకొని భారత దేశానికి వచ్చేశారు.

మొద‌టి భాగం – భారత్‌లో సీఏఏ.. వాస్తవాలు, వాగుళ్లు – 1

మూడో భాగం – భారత్‌లో సీఏఏ.. వాస్తవాలు, వాగుళ్లు – 3

జాగృతి సౌజ‌న్యంతో…