దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల జప్తునకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌కు కేంద్రం ఓకేచెప్పింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల బిల్లును మార్చి 12నే లోక్‌సభలో ప్రవేశపెట్టినా ప్రతిష్టంభన వల్ల గట్టెక్కలేదు. వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వ్యాపారుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి తాజా ఆర్డినెన్స్ వీలు కల్పిస్తుంది. ప్రధాని నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్ర పడింది. రాష్ట్రపతి సంతకం చేశాక అమల్లోకి వస్తుంది. విచారణ కోసం భారత్‌కు తిరిగి రావడానికి నిరాకరించే, అరెస్ట్ వారెంట్ జారీ అయిన, రూ.100 కోట్లకు పైగా రుణాలు చెల్లించని ఆర్థిక నేరగాళ్లకు ఈ ఆర్డినెన్స్ నిబంధనలు వర్తిస్తాయి.
దోషిగా తేలకున్నా జప్తే..
ఆర్డినెన్స్ ప్రకారం నిందితుడు దోషి అని తేలక ముందే అతని ఆస్తులు అమ్మి రుణదాతలకు చెల్లించొచ్చు. ఆ నేరగాళ్లను మనీ ల్యాండరింగ్ వ్యతిరేక చట్టం కింద విచారిస్తారు. సదరు నిందితుడిని పరారీలో ఉన్న నేరగాడిగా ప్రకటించాలని కోరుతూ విచారణ సంస్థ డైరెక్టర్ లేదా డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యేక కోర్టులో దరఖాస్తు చేయాలి. నిందితుడు ఎక్కడున్నదీ, నేరానికి పాల్పడి అతను కూడబెట్టిన ఆస్తులు, స్వాధీనం చేసుకోవాల్సిన ఆస్తులు, బినామీ ఆస్తులు, విదేశాల్లోని ఆస్తులు తదితర వివరాలను ఆ దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది. ఆరు వారాల్లోగా తమ ముందు హాజరు కావాలని కోర్టు నిందితుడికి నోటీసులు పంపుతుంది.
స్పెషల్ కోర్టు ఉత్తర్వులను హైకోర్టులో సవాలు చేయొచ్చు. స్థానిక సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్ధి, ఈ–పరిపాలనకు తీసుకోవాల్సిన చర్యల కోసం సరికొత్తగా తీర్చిదిద్దిన రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్(ఆర్‌జీఎస్‌ఏ)కే కేబినెట్ పచ్చజెండా ఊపింది. పంచాయతీ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 24న మోదీ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. దీని అమల్లో కేంద్రం, రాష్ట్రాల వాటా 60:40 కాగా ఈశాన్య రాష్ట్రాలకైతే అది 90:10గా నిర్ధారించారు. కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రమే 100 శాతం భరిస్తుంది. పథకానికి అయ్యే వ్యయం 7255.50 కోట్లు.
(సాక్షి సౌజన్యం తో)