మేడ్చల్ జిల్లా రావులకోల్ గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారి బోనాలను అగ్రకులాలు అడ్డుకున్నారంటు పేపర్ లో వచ్చిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్త రాసినవారు, రాయించిన వాళ్ళు, సూడో అంబేద్కర్ వాదులు సంబరాలు జరుపుకుంటున్నారు. అదిగో పులి – ఇదిగో తోక అంటూ అబద్దాలు ప్రసారం చేయటంలో వీళ్లకు సాటి లేనే లేరు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, పచ్చని గ్రామాల్లో మంట పెట్టి చలి కాచుకునే కుల రాజకీయ రాబంధులు జోరు ఎక్కువైంది. ప్రజల మధ్య గొడవలు సృష్టించి, అట్రాసిటీ కేసులు పెట్టి, ఇరు వర్గాల ప్రజలు మానసిక క్షోభకు గురవుతున్నారు.
మేడ్చల్ కి దగ్గరలో వున్న రావులకోల్ గ్రామంలో సుమారుగా 8 వేల జనాభా ఉంటుంది. ముదిరాజ్, గొల్ల, బెస్త, గౌడ్, మాదిగలు మొదలైన కులాల ప్రజలు నివసిస్తుంటారు. ఊర్లో శివాలయం, హనుమాన్ దేవాలయం అలాగే ఊరికి దూరంగా అడివిలో మైసమ్మ గుడి వున్నాయి. ఎస్సీలు హనుమాన్ మాలలు, శివమాలలు వేసి, భక్తి ప్రపత్తులతో దేవాలయాల్లో పూజలు, అభిషేకాలు చేస్తూ, యాగాల్లో ఎస్సీ దంపతులు కూర్చుని హోమం చేస్తారు. వంటలు వండి ఒకరినొకరు సామూహిక భోజనాలు చేస్తారు. బిసిలతో పాటు ఎస్సీలు ఆర్థికంగా ఎదుగుతూ సమానంగా అన్యోన్యంగా వుంటారు.
సర్పంచ్ ముదిరాజు, ఉప సర్పంచ్ మాదిగ అయినప్పటికీ భేదాలు లేకుండా సామాజిక కార్యక్రమాల్లో అన్ని వర్గాలతో కలిసి పాల్గొంటారు. అన్ని విధాలుగా సామరస్యంగా ఉంటున్న ఈ గ్రామం ఒకేసారి కుల వివక్షత పేరుతో వార్తల కెక్కింది. ఎందుకు?
వివరాల్లోకి వెళ్తే, జులై 16న బోనాలు పండుగను గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మరుసటి రోజు సోమవారం వంటలకోసం ఊరి ప్రజలు కొన్ని కుటుంబాలు మాత్రమే అడివిలోని మైసమ్మ గుడి దగ్గర చేరుకొని డప్పులు వాయిస్తూ గుడి ప్రదక్షిణ చేస్తున్నారు. ఎస్సీలు కూడా సుమారుగా 7,8 కుటుంబాలు వంటలకు వచ్చారు.
ప్రదక్షిణలో ఎస్సీ లు వచ్చి చేరారు. చిన్న గుడి కాబట్టి, చుట్టూ ఒకేసారి ప్రదక్షిణ చేయటం ఇబ్బంది కాబట్టి, ఇప్పటికే రెండు ప్రదక్షిణలు పూర్తయ్యాయి కాబట్టి, ఇంకో ప్రదక్షిణ పూర్తి కాగానే మీరు మొదలు పెట్టండంటూ బిసి కులానికి చెందిన పెద్దలు సలహా ఇచ్చారు.
ఎస్సీలలో ఒకరిద్దరు యువకులు ఈ సలహా పెడ చెవిన పెట్టి , కుల వివక్షత చూపిస్తున్నారంటు రెచ్చి పోయేసరికి ఇరు వర్గాలు పరస్పరం గొడవకు దిగారు.అట్రాసిటీ కేసులు పెట్టారు. పోలీసులు వచ్చారు. ఇరు వర్గాలను శాంతింపచేశారు. ఇరువర్గాలు కూర్చొని పరస్పరం మాట్లాడుకుని రాజకీయాల ప్రమేయం లేకుండా, గతంలో అందరూ కలిసి వున్నట్లే సామరస్యంగా జీవించాలని అనుకున్నారు. అంటరానితనం, కుల వివక్షత లేని ఈ గ్రామాన్ని కుల చిచ్చు పెట్టి రచ్చకీడ్చటం బాధగా ఉందని ఇరువర్గాల పెద్దలు వాపోయారు.