Home Views సాంస్కృతిక స్వరాజ్య సాధకుడు తిలక్

సాంస్కృతిక స్వరాజ్య సాధకుడు తిలక్

0
SHARE

– డా. వారె దస్తగిరి

“స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించే వరకు పోరాడతాను” అని నినదించి సంపూర్ణ స్వాతంత్రాన్ని కాంక్షించిన తొలితరం స్వాతంత్ర సమర యోధుడు బాలగంగాధర్ తిలక్. ఆనాటి జాతీయ కాంగ్రెస్ అవలంబిస్తున్న వినతులు, విన్నపాలు, నిరసనలతో సంపూర్ణ స్వాతంత్ర్యం రాదని చెప్పిన ద్రష్ట.  జాతీయోద్యమాన్ని విప్లవమార్గంలో  కొత్తపుంతలు తొక్కించిన మేధావి. సామాన్య ప్రజల్ని స్వాతంత్ర్యసమరవీరులుగా మలచిన ఆయన వాక్పటిమ అనన్య సామాన్యం. జాతీయతా పునాదులపైనే స్వాతంత్ర సౌధం నిలుస్తుందని చాటిన ఆయన మార్గం నేటి తరానికి  ఆదర్శప్రాయం. ఆయన మాటలు తూటాలై ఆంగ్లేయుల గుండెల్లో గుబులు రేపాయి. ఆయన రాతలు యువకుల్లో నూతనోత్తేజాన్ని రగిలించి స్వాతంత్ర్య యజ్ఞంలో సమిధలుగా మార్చాయి. బ్రిటీషు వారి దాష్టికానికి ముచ్చెమటలు పట్టించాయి. అందుకే అతన్ని బ్రిటీషువారు భారతదేశ  అశాంతి పితామహుడు అన్నారు. కానీ భారతీయులు మాత్రం అతన్ని  `లోకమాన్యుని’గా గౌరవించుకున్నారు. సైద్ధాంతికంగా జీవితాంతం వ్యతిరేకించిన మహాత్మా గాంధీ సైతం తిలక్ ను “ది మేకర్ ఆఫ్ మోడరన్ ఇండియా” అని పిలిచారంటే ఆయన జీవితం స్వాతంత్రోద్యమాన్ని ఎంతలా ప్రభావితం చేసిందో అర్థమవుతుంది.

 బాలగంగాధర్ తిలక్ అసలు పేరు కేశవ గంగాధర్ తిలక్.  ఆయన 1856 జూలై 23న మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా చిఖలీ గ్రామంలో ఒక సాధారణ ఉపాధ్యాయుని ఇంట్లో జన్మించాడు. తండ్రి గంగాధర్రా మచంద్ర తిలక్ ఒక సంస్కృత పండితుడు, ఉపాధ్యాయుడు. తల్లి పార్వతీబాయి.

విద్యారంగంలో కృషి:
తిలక్ ఆంగ్ల విద్యను అభ్యసించిన అనేక మందిలా ఆంగ్లేయులకు ఊడిగం చేయడానికి తన తెలివిని వినియోగించలేదు. పాశ్చాత్య విద్యావిధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆంగ్లవిద్య భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని అగౌరవపరిచే విధంగా ఉందని భావించారు. ప్రజలకు నాణ్యమైన స్వదేశీ విద్యను అందించడం ద్వారానే స్వాభిమాన పౌరులుగా మార్చవచ్చు అని భావించారు. అందుకే గోపాల్ గణేష్ అగార్కర్, మహాదేవ్ బల్లాల్ నాం జోషి, విష్ణుశాస్త్రి చిప్లుంకర్ మొదలైన తన కళాశాల మిత్రులతో కలిసి న్యూ ఇంగ్లీష్ పాఠశాలను 1880 లో స్థాపించారు. ఒక సంవత్సరంపాటు సభ్యులందరూ ఉచితంగా బోధించాలని తీర్మానించుకున్నారు. ఈ  పాఠశాలయే 1884 లో డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీగా రూపాంతరం చెందింది.

బహిరంగసభలకు, ర్యాలీలకు అనుమతిలేని రోజులలో వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహించి ధార్మిక వేదికలను రాజకీయ చైతన్యానికి ఉపయోగించారు.1893లో మొట్టమొదటిసారి గణపతి ఉత్సవాలను పుణేలోని శనివార్ వాడలో పది రోజులపాటు పెద్ద ఎత్తున నిర్వహించారు. దీని ద్వారా ప్రజలను సమీకరించడం, వారిని జాతీయోద్యమం వైపు నడిపించడం మొదలుపెట్టారు. మతపరమైన కార్యక్రమాలకు ఆంగ్లేయుల ఆటంకాలు ఉండకపోవడం ఒక చిన్న కారణమైతే, మతం మానవులను ఒకటి చేసే సాధనం అని భావించడం ప్రధాన కారణం. పది రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాలలో అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలను, ప్రాచీన  జానపద కళలను పరిచయం చేయడంతో పాటు వాటి ద్వారా భారతీయులలో స్వాభిమానాన్ని మేల్కొల్పడం ఆయన ప్రణాళిక. ధార్మిక ఉపన్యాసాలలో దేశభక్తిని రంగరించి, స్వాతంత్రోద్యమం వైపు యువకులను ఆకర్షించే వారు.  దీనితోపాటు మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, హిందూ పద పాదుషాహిగా పేరుపొందినవాడు శివాజీ. మామూలు మావలీలను మహోన్నత వీరులుగా తీర్చిదిద్ది సంఘటిత శక్తి ద్వారా మోఘలాయిలను వణికించిన ధీరుడు శివాజీ. ఆయన జీవితం నుండి ప్రతీ యువకుడు ప్రేరణ పొందాలని “శివాజీ జయంతి” వేడుకలను 1895లో తిలక్ ప్రారంభించారు. ఈ రెండు ఉత్సవాలు అనతికాలంలోనే మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సామాజిక ఉత్సవాలలో కుల మత ప్రాంతాలకు అతీతంగా భారతీయులందరూ పాల్గొన్నారు, ఇప్పటికి పాల్గొంటున్నారు. ఇది తిలక్ దూరదృష్టికి పరాకాష్ఠ.

1896 చివరలో బొంబాయిలో ప్లేగువ్యాధి వ్యాపించింది జనవరి 1897 నాటికి ఇది అంటువ్యాధిగా మారింది. అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం కమీషనర్ రాండ్ ను ప్రత్యేక అధికారిగా నియమించింది. రాండ్ నేతృత్వంలోని ఆంగ్లేయ పోలీసులు ప్లేగువ్యాధిని అరికట్టే సాకుతో అనేక దురాగతాలను సాగించారు. తిలక్ తన మరాఠీ వార్తా పత్రిక కేసరిలో హిందూ గ్రంథమైన భగవద్గీత శ్లోకాలను ఉటంకిస్తూ ఈ సమస్యను ఎదుర్కోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దుర్మార్గమైన అణచివేతను వ్యతిరేకించారు.   దీనికంతటికీ కారణమైన కమిషనర్ రాండ్ ను మరొక బ్రిటిష్ అధికారిని  జూన్22, 1897 న చాపేకర్ సోదరులు కాల్చిచంపారు. ఈ హత్యతో పోలీసుల దౌర్జన్యం మరింత పెరిగింది. “ప్రభుత్వానికి పెచ్చెక్కిందా?” అనే శీర్షికతో తిలక్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఎండగట్టారు. తిలక్ బయట ఉంటే ప్రభుత్వ ఉనికికి ప్రమాదమని ఆంగ్ల ప్రభుత్వం భావించింది. 18 నెలల జైలు శిక్ష విధించింది. దుర్భర జైలు జీవితం అనుభవిస్తూనే మిగిలిన సమయంలో “ఆర్కిటిక్ హోం ఇన్ ద వేదాస్” అనే గ్రంథాన్ని వ్రాసారు. ప్రపంచవ్యాప్తంగా తిలక్ ను విడుదల చేయాలని, విద్వాంసులు, రాజకీయ నాయకులు ఆంగ్ల ప్రభుత్వానికి విన్నవించారు.1989 దీపావళి రోజున తిలక్ విడుదలయ్యారు.

బ్రిటీష్ పాలకులమీద మితవాదులు పెట్టుకున్న నమ్మకం భ్రమ అని తిలక్ పదేపదే చేసిన హెచ్చరిక  బెంగాల్ విభజనతో నిజమైంది. భారత స్వాతంత్రోద్యమంలో కలిసి పనిచేస్తున్న హిందూ ముస్లింలమధ్య విభేదాలు తీసుకురావడానికి 1905లో బెంగాలును మత ప్రాతిపదికన లార్డ్ కర్జన్ విభజించాడు. అరవిందఘోష్, రవీంద్రనాథ్ ఠాగూర్, చిత్తరంజన్ దాస్ మొదలైన నాయకులు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా తిలక్ ప్రారంభించిన ఉద్యమంలో పాల్గొన్నారు. లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ బెంగాల్ విభజన ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేయడానికి నాలుగు సూత్రాల ప్రణాళిక తాయారు చేశారు. అవి స్వరాజ్, స్వదేశీ, విదేశీ వస్తు బహిష్కరణ, జాతీయ విద్య వ్యాప్తి. స్వదేశీ ఉద్యమం ప్రజల్లో చైతన్యాన్ని కలిగించింది. స్వదేశీ వస్తువుల వినియోగం, తయారీ ఊపందుకున్నాయి. స్వాతంత్ర సంగ్రామంలో స్వదేశీ ఉద్యమం ఎంతో ప్రేరణను నింపింది.

  1908ఏప్రిల్ 30 న ముజఫర్పూర్ జడ్జీ డగ్లస్ కింగ్ ఫోర్డ్ పై బెంగాలకు చెందిన ప్రపుల్ల చాఖి, ఖుదిరంబోస్ అనే ఇద్దరు యువకులు బాంబుతో దాడి చేశారు. డగ్లస్ తప్పించున్నాడు కాని ఇద్దరు మహిళలు చనిపోయారు. వారిని పట్టుకొని సోదా చేస్తే పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. వారికి ఉరిశిక్ష విధించారు. తిలక్ తన పత్రిక ద్వారా ఆ యువకులను సమర్థించారు. స్వాతంత్ర పోరాటంలో అమరులైన యువకులు విప్లవవీరులు అని కీర్తించాడు. దేశంలో బాంబులు తయారు కావడం దురదృష్టకరమే అయినా ఆ పరిస్థితిని సృష్టించింది ఎవరు అని “దేశ దౌర్భాగ్యం” పేరుతో వ్రాసిన సంపాదకీయంలో నిలదీశారు. దీనిని దేశ ద్రోహంగా చిత్రించి తిలక్ ను అరెస్టు చేశారు. తిలక్ తరపున మహ్మద్ అలీ జిన్నా బొంబాయి కోర్టులో వాదించాడు. కాని ఓడిపోయాడు. ఫలితంగా తిలక్ కు ఆరు సంవత్సరాల విదేశీ కారాగార శిక్ష విధించారు. ఇదంతా ఆంగ్లేయుల పథకం ప్రకారమే జరిగిందని తరువాత తెలిసింది. త్వరగా తీర్పు ఇచ్చిన జడ్జీ దావార్ కు ఆంగ్ల ప్రభుత్వం సర్ బిరుదును ఇచ్చింది. బర్మాలోని మండలే జైలుకు తిలక్ ను తరలించారు. యావత్భారతదేశం దుఃఖ సాగరంలో మునిగింది. అక్కడ కర్ర చెక్కలతో చేసిన చిన్న గదిలో, ఏకాంత కారాగార వాసంలో తిలక్ ను నిర్బంధించారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు దేశ సేవయే దైవ కార్యంగా భావించి నిర్వహించని ఆధ్యాత్మిక పూజలు, గాయత్రీ మంత్ర జపాలు, పారాయణలు జైలులో చేయడం ప్రారంభించాడు. అనేక పుస్తకాలను చదువుతూ ఒక సంవత్సరం పాటు గడిపాడు. తరువాత ఆంగ్లేయుల షరతులకు అంగీకరిస్తే విడుదల చేస్తామని సమచారం వచ్చింది. దానికి “నాకిప్పుడు 53 యేళ్ళు, ఇంకో పదేళ్ళు బతికినా విడుదలైనాక ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవ చేయవచ్చు. ఆంగ్లేయుల షరతులకు అంగీకరిస్తే ఇప్పుడే నేను చనిపోయినట్లు” అని బదులిచ్చాడు. ఇది తిలక్ నిష్కళంక దేశభక్తికి నిదర్శనంగా నిలిచే సాక్ష్యం. ఆ మండలే జైలులో ఉన్నప్పుడే `గీతారహస్యం’ అనే గ్రంథాన్ని వ్రాశారు. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పిన కర్మయోగాన్ని సమకాలీన పరిస్థితులకు అన్వయించారు. ఆధునిక భారత దేశానికి కుడా భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలు మార్గదర్శనం చేస్తాయని నిరూపించారు. 1914లో జైలు నుండి విడుదలయ్యారు. తిలక్ తన తోటి జాతీయవాదులతో కలవడానికి  1916 లో భారత జాతీయ కాంగ్రెస్‌లో తిరిగి చేరారు. మొత్తం అహింస ఆలోచనను విడిచిపెట్టి, అన్ని విధాలుగా స్వపరిపాలనను సాధించడానికి కృషి చేయాలని తిలక్ గాంధీని కోరారు. కానీ గాంధీ పూర్తిగా ఏకీభవించలేదు. స్వపరిపాలనను సాధించే మార్గాలను మాత్రం అంగీకరించారు.

హిందూ అమ్మాయిల వివాహ వయసును పెంచడానికి బ్రిటీష్ ప్రభుత్వం తెచ్చిన లైంగిక సమ్మతి బిల్లును తిలక్ బహిరంగంగా వ్యతిరేకించారు. సామాజిక సంస్కరణలకు మద్దతునిచ్చే తిలక్ ఇలా వ్యతిరేకించడాన్ని చాలా మంది తప్పు పట్టారు. ప్రాణ స్నేహితుడైన అగార్కర్ కూడా తిలక్ తో విభేదించి `సుధారక్’ అనే మరో పత్రికను ప్రారంభించారు. అయినా తిలక్ అతన్ని నిందించలేదు. హిందూ జీవన పద్ధతిలో ఆంగ్లేయుల జోక్యం ఎందుకన్నది తిలక్ లేవనెత్తిన  ప్రశ్న. ఏ సామాజిక సంస్కరణనైనా స్వీయపాలనలో సాధించాలని ఆయన కోరుకున్నారు. లైంగిక సమ్మతి బిల్లును వ్యతిరేకించిన తిలక్ తన కుమార్తెకు పదిహేనేళ్ళ వయసులో వివాహం చేశారు. అంటే వివాహ వయసును పదేళ్ళ నుండి పన్నెండేళ్ళకు పెంచడం తిలక్ సమర్థించే విషయమే అయినా ఆ చట్టం ద్వారా హిందూ జీవన విధానంలో ఆంగ్లేయుల జోక్యాన్ని మాత్రం ఆయన సహించలేక పోయారు. ఆయన వితంతు వివాహాలను కూడా సమర్థించారు. ధోండో కేశవ్ కార్వే అనే తన సహచరుడు మొదటి భార్య మరణం తరువాత ఒక వితంతువును వివాహం చేసుకున్నప్పుడు అతన్ని అభినందించారు. బ్రిటిష్ ప్రభుత్వజోక్యం లేకుండా సామాజిక సంస్కరణలు జరగాలన్నదే తిలక్ వాదన.

తిలక్, స్వామి వివేకానందలకు ఒకరంటే మరొకరికి గౌరవం ఉండేది. 1892లో ఒక రైలు ప్రయాణంలో వారు  అనుకోకుండా కలుసుకున్నారు. వివేకానందకు తన ఇంట్లో ఆతిధ్యం ఇచ్చారు. వివేకానంద చిన్న వయస్సులోనే మరణించినప్పుడు తిలక్  కేసరి పత్రికలో నివాళులు అర్పిస్తూ `19 వ శతాబ్దపు ఆది శంకరాచార్యులు వివేకానంద’ అని కీర్తించాడు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రారంభకులు డాక్టర్ కేశవరావ్ హెడ్గేవార్ తిలక్ ను అమితంగా గౌరవించేవారు.1920లో జాతీయ కాంగ్రెస్ మహాసభలు నాగపూర్ లో జరపాలని నిర్ణయించారు. ఆ సభల నిర్వహణా కార్యదర్శిగా హెడ్గేవార్ వ్యవహరించారు. ఆ సభలకు తిలక్ అధ్యక్షత వహిస్తారని తెలిసి ఆయన చాల ఆనంద పడ్డారు. కానీ అనారోగ్యంతో ఆగస్ట్ 1, 1920 న తిలక్ తుది శ్వాస వదిలారు.

 భారత స్వాతంత్ర సంగ్రామంలో ఎందరికో మార్గదర్శిగా నిలవడంతో పాటు స్వదేశీ స్పృహను, సంస్కృతీ పరిరక్షణా మార్గాలను సూచించిన తిలక్ ఈనాటి కాలపు సామాజిక సేవకులకు నిత్య స్మరణీయులు. జాతీయవాదులకు ప్రేరణా స్రోతస్సు. సామాజిక సంస్కర్తలకు దిశానిర్దేశకుడు. అటువంటి మహానుభావుని జీవితాన్ని అధ్యయనం చేయడం నేటి తరానికి అత్యంతావశ్యకం.

This article was first published in 2020