పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా దంపతులు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని, జ్యోతిర్లింగ శక్తి పీఠం దర్శించుకున్నారు. ఈ మేరకు రాజ్యసభ ఎంపీ టీ.జీ వేంకటేశ్, ఆర్.ఎస్.ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ శ్రీ దేవేంద్ర గారు, ఆంధ్ర ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ గారు తదితరులు అమిత్ షా కు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత శ్రీశైలం ఆలయం వద్ద వేద పండితులు పూర్ణ కుంభంతో అమిత్ షాకు స్వాగతం పలికారు. అనంతరం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ ప్రాంగణంలో ఒక మొక్కను నాటారు. అనంతరం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ కమిటీ బాధ్యులు స్వామివారి శేష వస్త్రాలను, ప్రసాదాలను, స్వామి అమ్మవార్ల ఙ్ఞాపికను అందించి కేంద్ర హోంశాఖ మంత్రి దంపతులను సన్మానించారు. అనంతరం శ్రీ శివాజి స్ఫూర్తి కేంద్రాన్ని అమిత్ షా దంపతులు సందర్శించారు.