Home News సీఏఏ కింద మొదటి 14 మందికి భారత పౌరసత్వం

సీఏఏ కింద మొదటి 14 మందికి భారత పౌరసత్వం

0
SHARE

పౌరసత్వ సవరణ చట్టం 2019 అమలులోకి వచ్చిన నేపథ్యంలో భారత పౌరసత్వాన్ని మంజూరు చేసే ప్రక్రియను భారత ప్రభుత్వం వేగిరం చేసింది. ఇందులో భాగంగా తొలిసారిగా 14 మందికి భారత పౌరసత్వాన్ని అందజేసింది. పౌరసత్వానికి సంబంధించిన సర్టిఫికేట్లను ఆ 14 మందికి అందజేశారు. డిల్లీ వేదికగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా వీరికి పౌరసత్వ సర్టిఫికేట్లను అందజేశారు. ఈ సందర్భంగా వీరికి అజయ్‌ భల్లా శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సమయంలో డిల్లీలో 300 మందికి భారత పౌరసత్వ సర్టిఫికేట్లను అందజేశామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు.

దేశంలో సీఏఏ అమలుపై ఈ యేడాది మార్చి మాసంలో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2019 డిసెంబర్‌లో ప్రతిపక్షాల నిరసనల మధ్య సీఏఏ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందింది. దీని తర్వాత రాష్ట్రపతి సమ్మతి కూడా దీనికి లభించింది. సీఏఏ చట్టం ప్రకారం.. పాక్‌, బంగ్లా, ఆఫ్గనిస్తాన్‌ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకి భారత పౌరసత్వం ఇవ్వాలని వుంది. ఈ మేరకు కేంద్రం పలు నిబంధనలను రూపొందించింది. 2014 డిసెంబర్‌ 31 కంటే ముందు పై మూడు దేశాల నుంచి భారత్‌కి వలస వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌ వేదికగానే జరుగుతుంది.