భారత్ – చైనాల మధ్య గత రెండు నెలలుగా కొనసాగుతున్న డోక్లాం వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. భారత్ – భూటాన్ – చైనా ట్రైజంక్షన్ అయిన డోక్లాం నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ సోమవారం మీడియా ప్రకటన ద్వారా వెల్లడించింది. దౌత్యపరమైన చర్చలతో ఇది సాధ్యమైనట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.
‘డోక్లాం ఘటనపై భారత్, చైనా మధ్య గత కొన్ని వారాలుగా దౌత్యపరమైన చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో డోక్లాం సరిహద్దు నుంచి సైన్యాలను వెనక్కి తీసుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ప్రస్తుతం సైన్యాలు వెనక్కి వెళ్తున్నాయి’ అని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. మరికొద్ది రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనాలో పర్యటించనున్న నేపథ్యంలో డోక్లాం వివాదానికి తెరపడటం గమనార్హం.
జూన్లో డోక్లాం ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. డోక్లాం ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మాణం చేపట్టింది. దీని వల్ల సరిహద్దు భద్రతకు ముప్పు వాటిల్లుతుందని భావించిన భారత సైన్యం.. సిక్కిం సరిహద్దును దాటి రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకుంది. దీంతో చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత సైన్యం వెనక్కి వెళ్లిపోవాలని లేదంటే పరిస్థితులు యుద్ధానికి దారితీస్తాయని పలుమార్లు హెచ్చరికలు చేసింది. అంతేగాక సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించి బెదిరింపు చర్యలకు పాల్పడింది. అయితే భారత్ మాత్రం దౌత్యపరమైన చర్యలతోనే సమస్య పరిష్కారమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గత కొన్ని వారాలు దీనిపై చర్చలు జరగగా.. ఎట్టకేలకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది.
(ఈనాడు సౌజన్యం తో)