- అడ్డు వచ్చిన మహిళలపై దాడికి యత్నం
- ‘జీవించే హక్కు’ కల్పించమంటూ బాధితుల వేడుకోలు
యాచకమే జీవనోపాధిగా చేసుకుని జీవిస్తున్న ఎస్సి వర్గానికి చెందిన బుడగ జంగాల కుటుంబాలపై స్థానిక చర్చి దౌర్జన్యానికి పాల్పడ్డ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లె గ్రామంలో జరిగింది . .
బాధితులు అందజేసిన వివరాల ప్రకారం.. దొరసానిపల్లె గ్రామంలో వెనుకబడ్డ బుడగజంగాల సామాజిక వర్గానికి చెందిన కొన్ని కుటుంబాలు గత 15 ఏళ్లుగా ఉపయోగంలో లేని భూమిలో చిన్నచిన్న టెంట్లు వేసుకుని జీవనం సాగిస్తున్నాయి. యాచనే ప్రధాన జీవనోపాధిగా వీరు రోజూ తమ పిల్లలతో కలిసి గ్రామాల్లో, పట్టణాల్లో యాచన చేస్తూ ఉంటారు.
కొన్ని రోజుల క్రితం ఇద్దరు పాస్టర్లు వారి నివాస స్థలానికి సమీపంలో ఒక చర్చిని నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. ఏదో చర్చి కట్టుకుంటున్నారులే అనుకుంటుండగా, ఆ చర్చి ప్రతినిధులు కృపాకర్, అశోక్ హఠాత్తుగా టెంట్లు పీకి వేసి, తాము నివసిస్తున్న భూమి ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బుడగజంగాల కుటుంబాలకు చెందిన బాధితులు విలపించారు. పైగా ఆ భూమి తమదేనంటున్నారని వాపోతున్నారు. స్థానిక పోలీసుల సమక్షంలో ఈ వ్యవహారం అంతా జరుగుతుండటం గమనార్హం.
ఈ ఘటనపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కడప జిల్లా కలెక్టర్, ఏపీ షెడ్యూల్డ్ కులాల కమిషన్ తో పాటు జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. చర్చి చర్యల వల్ల ఎస్సి కులాల పేద కుటుంబాలు తమ నివాసం కోల్పోతున్నారని, ఇది రాజ్యాంగం ప్రసాదించిన ‘జీవించే హక్కు’ని హరించడమేనని తమ ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులను శిక్షించడంతో పాటు, బాధితులకు సరైన నివాస సదుపాయం కలుగజేయాల్సిందిగా కోరింది.
https://www.facebook.com/lawinforce.org/videos/597521047847253/