కోయంబత్తూర్ లో అక్టోబర్ 23న జరిగిన కారు పేలుడు ఘటనపై తమిళనాడు ప్రభుత్వం ఎన్ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) దర్యాప్తు కోరిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి స్థానిక పోలీసులు చేసిన దర్యప్తులో అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సంబంధాలు వెలుగుచూడడంతో స్టాలిన్ ఈ కేసులో ఎన్ఐఏ దర్యాప్తు కోరారు. ఇక ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తును వేగిరం చేసింది. ఈ ఘటనకు సంబంధించి, తమిళనాడు వ్యాప్తంగా 43 ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజాము నుంచి ఎన్‌ఐఏ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి అనుమానితులు, మద్దతుదారుల ప్రాంగణాల్లో ఎన్ఐఏ సోదాలు జరుపుతోంది. ఒక్క కోయంబత్తూరులోని కొత్తమేడు, ఉక్కడం, పొన్విజా నగర్‌తో పాటు పలుచోట్ల ఎన్‌ఐఏ అధికారులు సోదాలు జరుపుతున్నారు. చెన్నైలోని పుదుపేట్, మన్నాడి, జమాలియా, పెరంబూర్‌లో దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
గత నెల అక్టోబర్ 23న తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో తమిళనాడులోని కోయంబత్తూరులో మారుతీ 800 కారులో ఎల్‌పీజీ సిలిండర్ పేలింది. ఉక్కడంలో ముస్లింలు మెజారిటీ సంఖ్యలో ఉంటారు. ఈ ప్రాంతంలో ప్రసిద్ద కొట్టై ఈశ్వరన్ ఆలయం ఉంది. ఈ ఆలయానికి సమీపంలోనే కారులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో అక్కడ అనుమానస్పద స్థితిలో ముబిన్ అనే 25 ఏళ్ల వ్యక్తి మృతదేహం లభించింది. కోయంబత్తూరు కారు పేలుళ్ల కేసుకు సంబంధించి తమిళనాడు పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం ప్రయోగించారు. అయితే వారంతా అనుమానాస్పద స్థితిలో మరణించిన జమీషా ముబిన్ సహచరులని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.
ఇక మరోవైపు ఉక్కడంలోని ముబిన్ ఇంట్లో పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన ముడి పదార్థాలను అప్పుడు పోలీసులు గుర్తించారు. వారు ముబిన్ ఇంట్లో 75 కిలోల పొటాషియం నైట్రేట్, బొగ్గు, అల్యూమినియం పౌడర్, సల్ఫర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్లాస్టులో చనిపోయిన ముబిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. అతన్ని ఇంతకుముందే ఓసారి ఎన్ఏఐ ఉగ్రసంబంధాలపై ప్రశ్నించింది.
కోయంబత్తూరు సిలిండర్ పేలిన సమయంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అది ISIS లింక్‌లతో కూడిన స్పష్టమైన ఉగ్రవాద చర్య అనీ. తమిళనాడు ప్రభుత్వం ఈ సమాచారాన్ని ఇప్పుడు 12 గంటలు దాచిపెడుతోందనీ. ఇది రాష్ట్ర నిఘా యంత్రాంగం వైఫల్యం కాదా? అంటూ ప్రశ్నించారు. ఇక అన్నామలై ప్రకటన తర్వాత అసలు విషయం బయటపడింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురు ముస్లిం యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన ఐదుగురిని మహ్మద్ తల్హా, ముహమ్మద్ అజారుద్దీన్, మహ్మద్ రియాజ్, ఫిరోజ్ ఇస్మాయిల్,ముహమ్మద్ నవాజ్ ఇస్మాయిల్‌గా గుర్తించారు. అంతేకాదు దాన్ని నిజంచేస్తూ ఉన్న వీడియో ఒకటి సీసీటీవీ ఫుటేజ్ లో బయటపడింది. కారులో పేలుడు పదార్థాలను ఎలా లోడ్ చేసేందుకు తీసుకెళ్లారో CCTV ఫుటేజీ చూపించింది. ఈ ఫుటేజ్ లో మహమ్మద్ రియాజ్, ఫిరోజ్ ఇస్మాయిల్, ముహమ్మద్ నవాజ్ ఇస్మాయిల్ సహాయంతో పేలుడు పదార్థాలను జేమీసా ముబిన్ తీసుకువెళుతున్నట్లు కనిపించింది. ఇక నిందితుల్లో ఒకరైన ఫిరోజ్ ఇస్మాయిల్ అల్-ఉమ్మా ఉగ్రవాది S.A. బాషాకు దగ్గరి బంధువు అని పోలీసులు నిర్ధారించారు. దాంతో ఇది ఖచ్చితంగా ఉగ్రవాదులపనేనని తేలింది. దాంతో ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించారు.
శ్రీలంకంలో 2019 ఈస్టర్ ఆదివారంనాడు జరిగిన దాడుల తరహాలోనే కోయంబత్తూర్ దాడులకు ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. బాంబు పేలుడులో మరణించిన జమేజా ముబిన్ కి కేరళలోని త్రిసూర్ జైలులో మహ్మద్ అజారుద్దీన్ అనే ఐఎస్ఐఎస్ ఉగ్రవాద వ్యక్తితో సంబంధాలున్నాయి. ప్రస్తుతం కొచ్చి సెంట్రల్ జైలులో ఉన్న మహ్మద్ అజారుద్దీన్, ఈస్టర్ ఆదివారం ఆత్మాహుతి దాడి సూత్రధారి జహ్రాన్ హషీమ్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు.
ఈ అంశంపై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆ సమయంలో రెండోసారి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అరెస్టు చేసిన నిందితులపై పోలీసులు ఇంకా యూఏపీఏ ఎందుకు ప్రయోగించలేదని అప్పుడు ప్రశ్నించారు. మరణించిన నిందితుడు జేమేసా ముబిన్ అక్టోబర్ 21న తన చివరి వాట్సాప్ స్టేటస్‌గా “మరణం గురించిన వార్త మీకు చేరినట్లయితే, దయచేసి నా తప్పును క్షమించండి, నా లోటును దాచిపెట్టండి, నా జనాజాలో పాల్గొనండి. నా కోసం ప్రార్థించండి” అని రాసుకున్నాడని అన్నామలై అన్నారు.
బీజేపీ మినహా మరే ఇతర రాజకీయ పార్టీ ఈ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తమిళనాడు ముస్లిం మున్నేట్ర కజగం, ఇండియన్ నేషనల్ తౌహిద్ జమాత్ మినహా మరే ఇతర ముస్లిం సంస్థలు ఈ ఘటనపై స్పందించలేదు. తమిళనాడు ముస్లిం మున్నేట్ర కజగంకు చెందిన జవహిరుల్లా ఈ ఘటనకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇండియన్ నేషనల్ తౌహిద్ జమాత్ రాష్ట్ర అధ్యక్షుడు అబూ బాకర్ కూడా అదే విధంగా ప్రతి స్పందించారు, అయితే విచారణ మరియు అరెస్టుల పేరుతో అమాయక ముస్లింలను లక్ష్యంగా చేసుకోవద్దని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో పురోగతి కనిపిస్తోంది. తాజాగా ఎన్ఐఏ అధికారులు జరిపిన దాడుల్లో కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరి వాటిల్లో ఏముందనేది తేలాల్సి ఉంది.