భారత్, చైనా సరిహద్దులోని గాల్వన్ లోయలో చోటుచేసుకున్న ఘర్షణలో తెలంగాణకు చెందిన ఆర్మీ అధికారి సహా ముగ్గురు భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ అధికారి కల్నల్ సంతోష్ బాబు స్వస్థలం సూర్యాపేట. బీహార్ 16వ బెటాలియన్‌కు చెందిన సంతోష్ బాబు ఏడాది కాలంగా భారత్ – చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నారు.
చిన్నతనం నుండే దేశభక్తి భావాలు కలిగిన కల్నల్ సంతోష్ బాబు ప్రాథమిక విద్యాభ్యాసం మంచిర్యాల జిల్లా (నాటి ఆదిలాబాద్ జిల్లా) లక్సెట్టిపేట గ్రామంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో పూర్తయింది. కల్నల్ సంతోష్ బాబు తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసారు. సైన్యంలో చేరాలన్న అతని కోరిక నెరవేరనందున కొడుకు సంతోష్ బాబును సైన్యంలోకి పంపి భరతమాత ఋణం తీర్చుకోవాలనుకున్నారు.
సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో ప్రాథమిక స్థాయి విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నసంతోష్ బాబు, అనంతరం విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక పాఠశాలలో సీటు సంపాదించారు.
2004లో లెఫ్టినెంట్ హోదాలో సైన్యంలో ప్రవేశించిన నాటి నుండి 15 ఏళ్ల సర్వీసులో నాలుగు సార్లు పదోన్నతులు పొందారు. కాంగోలో సైతం విధులు నిర్వర్తించిన సంతోష్ బాబు, 37 ఏళ్ల వయసులోనే కల్నల్ హోదా పొందారు. జమ్మూ, కుప్వారా, పూంఛ్, శ్రీనగర్ వంటి ప్రాంతాల్లో పనిచేశారు. 2007లో జమ్మూకాశ్మీర్ సరిహద్దు వద్ద ముగ్గురు చొరబాటుదారుల్ని కాల్చిచంపారు.
ఉన్న ఒక్కగానొక్క కొడుకుని సైన్యంలోకి పంపాలన్న తండ్రి ఆశయం నెరవేర్చడమే లక్ష్యంగా సంతోష్ బాబు కృషి చేశారు. ఉగ్రవాదులను, శత్రుమూకలను ఎదుర్కోవడంలో ఎంతో సత్తా చాటిన సంతోష్ బాబు చివరకి సరిహద్దులో పోరాడుతూ నేలకొరిగారు.