కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణ వివాహం సీపీఐ (ఎం) యువజన విభాగం ప్రెసిడెంట్ పీఏ మొహమూద్ రియాస్‌తో సోమవారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ వివాహానికి ఓ ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త హత్య కేసులో దోషిగా ఉన్న వ్యక్తి హాజరుకావడంతో దుమారం రేగుతోంది. విజయన్ కుమార్తె వివాహానికి ఓ హత్య కేసులో దోషిగా తేలి, ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తోన్న మొహమూద్ హసీమ్ అనే హంతకుడు అతిథిగా హాజరయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హత్యకేసులో దోషిగా నిర్ధారణ అయిన వ్యక్తి వివాహానికి హాజరుకావడంపై ముఖ్యమంత్రి విజయన్ వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేస్తోంది.
“ఆర్ఎస్ఎస్ కార్యకర్త సురేంద్రబాబు హత్యకేసులో మొహమూద్ హసీమ్‌కి సుప్రీంకోర్టు 2017లో ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కోవిడ్-19 కారణంగా అతడు పెరోల్‌పై బయటకు వచ్చాడు. ఇదే సమయంలో తన కుమార్తె వివాహ వేడుకలకు హాజరుకావలసిందిగా స్వయంగా ముఖ్యమంత్రి నుంచి ఆహ్వానం అందడంతో హసీం సీఎం అధికారిక నివాసానికి వచ్చి, ఆయనతో భుజం భుజం పూసుకుని తిరిగారు” అని బీజేపీ కేరళ విభాగం అధికార ప్రతినిధి సందీప్ వారియర్ విమర్శించారు.
హత్య కేసులో హసీమ్‌ను కేరళ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించగా.. సుప్రీంకోర్టు మాత్రం 2017లో అతడిని దోషిగా తేల్చి, ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. హసీమ్ పెరోల్‌ను రద్దుచేయాలని కోరుతూ న్యాయస్థానానికి వెళ్తామని వారియర్ అన్నారు. వరుడు రియాస్ తనకు దగ్గర బంధువని, తాను పెరోల్ నిబంధనలను ఉల్లంఘించలేదని హసీమ్ అంటున్నప్పటికీ అధికార పార్టీ నేతలు హసీం రాకపై అసహనం వ్యక్తంచేస్తున్నారు.
వీణ-రియాస్ వివాహానికి హాజరైన కేవలం 30 మంది అతిథుల్లో హత్యకేసు నిందితుడు కూడా ఉండటం గమనార్హం.