- రెచ్చగొట్టే పనులు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు
- అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూళ్లు
- ఎస్సీలను తప్పు దారి పట్టిస్తున్న గ్రామానికి చెందిన SFI, KVPS నాయకులు
- సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం, తిమ్మాపురం గ్రామంలో ఘటన
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం, మర్కుక్ మండలం దగ్గరలోని తిమ్మాపురం గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారి పట్ల కుల వివక్షత, అంటరానితనం పాటిస్తున్నారంటూ సీపీఎం పార్టీకి చెందిన కుల వివక్ష పోరాట సమితి, SFI కి చెందిన నాయకులు దుష్ప్రచారం చేస్తూ గ్రామంలో ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని ఎస్సీ, రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
గ్రామంలో కులవివక్షతను సృష్టించి, మళ్లీ వారే పరిష్కారం చూపుతున్నట్టు వారం రోజులుగా దళిత సంఘాల నాయకులమని చెప్పుకుంటూ ప్రతి రోజూ ఒకరు చొప్పున తిమ్మాపురం రావటం సభలు పెట్టి, ఇతర కులాలను తిట్టటం, పోలీస్ స్టేషన్ లో హడావిడి చేసి, వాళ్ళు ఫిర్యాదు చేసిన ఇతర కులాల వ్యక్తులను ఎస్సీ అట్రాసిటీ కేసు క్రింద కేసులు పెట్టి అరెస్ట్ చేసి, పరిహారం ఇవ్వాలని, మరోవైపు ఫిర్యాదులో పేర్లున్న వారి నుండి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం జరుగుతుందని సామాజిక సమరసత వేదిక పేర్కొంది.
అసలు వాస్తవ విషయానికి వస్తే… తిమ్మాపురం గ్రామంలో రజక, యాదవ, ముదిరాజ్, పద్మశాలి మొదలైన బిసి కులాలతో పాటు, ఎస్సీ మాదిగలు అందరూ కలిసి సామరస్యంగా జీవిస్తున్నారు. ఎస్సీలు, బిసి కులాల పొలాల్లో పని చేస్తూ, వారి ఇళ్లల్లో భోజనాలు కూడా చేస్తారు. బిసి, ఎస్సీ కులాలు వారు కలిసి భజన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ గ్రామంలోని దేవాలయాల్లోకి అందరికి ప్రవేశం వుంది. అయితే కొద్ది మంది SFI, KVPS కు చెందిన ఒకరిద్దరు నాయకులు గ్రామంలో వున్న ఈ సామరస్యాన్ని చెడగొట్టి, సొమ్ము చేసుకునేందుకు ప్రజల మధ్య కలహాలు సృష్టించే పనులు చేస్తున్నారు.
అందులో భాగంగా గ్రామంలోని SFI నాయకుని ఆధ్వర్యంలో 30 మంది ఎస్సీలు హనుమాన్ గుడి లోపలికి వెళ్లి, ఎవరైనా అభ్యంతరం చెప్తే, కేసులు పెడతామని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఎప్పుడూ లేని విధంగా ఇంతమంది ఒకేసారి గుడికి రావటం ఏమిటని బిసిలకు ఆశ్చర్యం కలిగించింది. ప్రక్క గ్రామమైన తిగుల్ నుండి నాయి బ్రాహ్మణులు వచ్చి ఒక బిసి కి క్షవరం చేస్తుంటే, SFI నాయకుడు 25 మందితో వచ్చి తొందరగా కటింగ్ చేయమని ఒత్తిడి తేవటంతో, ఆ మంగలి “ఒకేసారి మీద పడితే ఎట్లా, ఒకరి తర్వాత ఒకరికి చేస్తా” అనటంతో, ఎస్సీలతో వివక్షత పాటిస్తున్నాడని, బిసి లకు కుర్చీలో, ఎస్సీలను క్రింద కూర్చోపెట్టి క్షవరం చేస్తున్నాడని గొడవ చేశారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా, ఏర్పాటు చేసిన భోజనాలలో 30 మంది ఎస్సీలు ఒక్కసారే వచ్చి, మేమే వడ్డన చేస్తామని, బిసిలు తినాలని ఒత్తిడి తేవడమే కాకుండా, అందేటని ప్రశ్నించిన వారిపై వివక్షత చూపించారంటు గొడవ చేసి ఒక్కొక్క కులం నుంచి మొత్తం 10మందిపై అట్రాసిటీ కేసులు పెట్టారు. ఇలా చేయడం తప్పని చెప్పిన సొంత ఎస్సీలలోని పెద్ద మనుషులు, నిజాయితీ వ్యక్తులు నోరు నొక్కేసారు. అంతేకాకుండా ఎస్సీలు ఎవరైనా బిసి ల ఇంటికి వెళ్లినా, పనులు చేసినా, భోజనాలు చేసినా 15000 రూపాయలు జరిమానా కట్టాలని ప్రకటించారు.
గ్రామంలో ఉన్న SFI, KVPS నాయకులిద్దరూ కలిసి చేస్తున్న కుట్రలకు అమాయకపు ఎస్సీలు బలవువున్నారు. ఎస్సీ అట్రాసిటీ కేసును దుర్వినియోగం చేసి, బిసి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. మూర్ఖుల చేతిలో పడి వంచనకు గురి కావొద్దని, ఊర్లో వున్న మంచి వాతావరణం చెడగొట్టవద్దని, భారత రాజ్యాంగం పీఠికలో డా బి ఆర్ అంబేద్కర్ పేర్కొన్నట్లుగా సమాజంలో ప్రజలు సోదర భావంతో వుంటూ స్వేచ్చ, సమానత్వ దిశలో పయనించాలన్న సంకల్పానికి, గండి కొడ్తున్న కమ్యూనిస్ట్ ల నుండి గ్రామాలను రక్షించుకోవాలని ఎస్సీ, రిజర్వేషన్ పరిరక్షణ సమితి విజ్ఞప్తి చేస్తున్నది.