Home News భారత రాజ్యాంగ దినోత్సవం: సంక్షేమ మానవీయ ఛత్రం

భారత రాజ్యాంగ దినోత్సవం: సంక్షేమ మానవీయ ఛత్రం

0
SHARE

రాజ్యాంగ నిర్ణాయక సభ భారత రాజ్యాంగానికి ఆమోదముద్ర వేసిన రోజు ఇది. దేశంలో 2015 నుంచి ‘రాజ్యాంగ దినోత్సవం’ జరుపుతున్నాం. అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా, రాజ్యాంగ దినోత్సవం నిర్వహించే సంప్రదాయం మొదలైంది. ప్రపంచంలో సవివరమైన, విపులమైన, సమగ్ర రాజ్యాంగం మనదే కావడం విశేషం. సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవనంలో న్యాయం జరగాలన్నది మన రాజ్యాంగ నిర్దేశం. ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యతను గుర్తు చేసుకోవడానికి రాజ్యాంగ దినోత్సవం పాటిస్తున్నాం. రాజ్యాంగంలోని మూడో భాగం మానవ హక్కులకు పట్టం కట్టింది. నాలుగో భాగం ‘సంక్షేమ రాజ్యం అనే భావనను అమలు చేయడమే రాజ్యవ్యవస్థ ధర్మం’ అని నిర్దేశించింది. ఈ ద్వంద్వ లక్ష్యాల్ని సాధించడానికి కావాల్సిన యంత్రాంగాన్ని ఏర్పాటుచేయడం కోసమే రాజ్యాంగంలోని మిగిలిన అంశాలన్నీ ఉన్నాయి. ప్రజాస్వామ్యం, న్యాయమార్గ పాలన, లౌకికవాదం, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిరపేక్షంగా ఎన్నికల నిర్వహణ అనే పునాదుల మీద ఈ యంత్రాంగాన్ని నిర్మించడానికి రాజ్యాంగం తోడ్పడుతుంది. ఫెడరల్‌ వ్యవస్థ అధికారాల విభజన, చట్టసభలు రూపొందించే శాసనాల్ని పరిశీలించే అధికారం న్యాయవ్యవస్థకు ఉండటం- అన్నవీ పునాదులే! ఇవే అంశాల్ని న్యాయ వ్యవస్థ ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ అని విశదీకరించింది. రాజ్యాంగం మౌలిక చట్టమే కాని, ప్రధానంగా అది రాజకీయ పత్రం! రాజ్యాంగంలోని మూడు, నాలుగు భాగాల వల్ల భారత రాజ్యాంగం శక్తిమంతమైన సామాజిక, ఆర్థిక ఉపకరణంగా తయారైంది.

విజయ సోపానాలు

రాజకీయ జీవనంలో ప్రజాస్వామ్య విధానాలు అవలంబించేలా చేయడానికి మన రాజ్యాంగం దోహదపడుతోంది. స్వతంత్ర న్యాయవ్యవస్థ, పత్రికా స్వేచ్ఛ అంశాల్లోనూ సత్సంప్రదాయాలకు రాజ్యాంగ స్ఫూర్తే కారణం. 1992లో 73, 74 రాజ్యాంగ సవరణలు స్థానిక స్వపరిపాలనా సంస్థలైన పంచాయతీలకు, మునిసిపాలిటీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడానికి తోడ్పడ్డాయి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్ఠంగా ఉందనడానికి రుజువు- అత్యవసర పరిస్థితి తరవాత ప్రభుత్వ మార్పిడి సునాయాసంగా జరగడం. ప్రపంచ చరిత్రలో స్వయంగా అధికారం వదులుకున్న నియంతలు ఎవరూ లేరు. ఇందిరాగాంధీ ఎంత నియంత అయినా, ఎమర్జెన్సీని రద్దుచేసి ఎన్నికలకు అవకాశం కల్పించింది ఆమే! ఇది మన రాజ్యాంగ పటిష్ఠతకు నిదర్శనం. రాజ్యాంగ లక్ష్యాల్ని సాధించడంలో వైఫల్యాలూ లేకపోలేదు. ఎంత తక్కువగా లెక్కించినా, 36 శాతం ప్రజలు దేశంలో ఇప్పటికీ నిరుపేదలుగానే ఉన్నారు. ఆర్థిక న్యాయంలో సంపూర్ణ విజయం సాధించలేదనడానికి ఇదే ప్రబల ఉదాహరణ.

ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన పార్లమెంటరీ వ్యవస్థ మొత్తంమీద బాగానే పనిచేసింది. అత్యవసర పరిస్థితి కాలంలో మినహా, సమయానికి ఎన్నికలు నిర్వహించగలుగుతున్నాం. శాసనాలు రూపొందించడమే ఆ సభల ప్రథమ కర్తవ్యం. అందుకు ప్రజాసమస్యల్ని కూలంకషంగా చర్చించి పరిష్కారాలు చూపడం వంటి మౌలిక బాధ్యతను సభలు అంతగా నిర్వర్తించడం లేదు. బడ్జెట్లను కేంద్రంలో, రాష్ట్రాల్లోనూ హడావుడిగా ఆమోదిస్తున్న సందర్భాలు ఏటా కనిపిస్తూనే ఉన్నాయి. అర్థవంతమైన చర్చల స్థానాన్ని అరుపులు, కేకలు, నినాదాలు, మైకులు విరిచేయడం వంటివి ఆక్రమిస్తున్నాయి. వరసగా వాయిదాలు వేసి సమావేశాలు ముగిశాయనిపించిన సందర్భాలూ ఉన్నాయి. ఆర్డినెన్సులు జారీచేసే సదుపాయాన్ని దుర్వినియోగం చేయడంలో అన్ని రాజకీయపక్షాలూ పోటీ పడుతున్నాయి. రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధమైన పాలన అసాధ్యమైనప్పుడు రాష్ట్రపతి పాలన విధించడానికి అవకాశమిచ్చే 356వ అధికరణను అధికారంలోని అన్ని పక్షాలూ దుర్వినియోగమే చేశాయి. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దుచేయడంలో రాజకీయ ప్రయోజనాలున్నాయని సరిపెట్టుకోవచ్చు. కానీ, ఇందిరాగాంధీ హయాములో సొంత పార్టీ ప్రభుత్వాల్ని రద్దుచేయడానికీ 356వ అధికరణను ప్రయోగించిన ఉదంతాలు ఉన్నాయి.

1971-1972 మధ్య సంవత్సరకాలంలో ప్రధానిగా ఇందిర వరసగా 24, 25, 26 రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చారు. బ్యాంకుల జాతీయీకరణకు మార్గం సుగమం చేయడం, రాజభరణాల రద్దుకు న్యాయవ్యవస్థ నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఓడించడంతో పాటు ప్రాథమిక హక్కుల్ని నీరుగార్చడం ఈ రాజ్యాంగ సవరణల ప్రధాన ఉద్దేశం. 1973లో ఈ సవరణల్ని న్యాయస్థానంలో సవాలు చేశారు. ఇది కేశవానంద భారతి కేసుగా ప్రసిద్ధమైంది. ఈ కేసు విచారించడానికి అపూర్వమైన రీతిలో 13 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఏర్పాటయింది. ప్రాథమిక హక్కుగా గల ఆస్తి హక్కును కేవలం రాజ్యాంగపరంగా పరిమితం చేయడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ‘రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఇష్టానుసారం మార్చే హక్కు పార్లమెంటుకు లేదు’ అన్నది ఈ కేసు తీర్పులో ప్రధానాంశం. ఈ వ్యవహారంలో ఏడుగురు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు అమలులోకి వచ్చింది. దాన్ని వ్యతిరేకించిన న్యాయమూర్తులు ఆరుగురు ఉన్నారన్న విషయాన్ని గమనించాలి. తీర్పు తనకు పరాజయం అని ఇందిరాగాంధీ భావించారు. తీర్పు వెలువడిన మరుసటి రోజున అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఎం సిక్రీ పదవీ విరమణ చేశారు. తదుపరి న్యాయమూర్తిని నియమించాల్సి వచ్చినప్పుడు ముగ్గురు సీనియర్లనుకాదని జస్టిస్‌ ఏఎన్‌రే కు ప్రధాన న్యాయమూర్తి పదవి కట్టబెట్టారు. దేశంలో న్యాయవ్యవస్థను ప్రభుత్వాధినేత తనకు అనుకూలంగా మలచుకోవడం అదే మొదటిసారి. 1971 ఎన్నికల్లో ఇందిర అఖండ విజయం న్యాయవ్యవస్థలో ప్రభుత్వ జోక్యానికి నాంది పలికింది. న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసి రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించింది.

అసలుకే ఎసరు

అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న కాలంలో ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని వక్రీకరించడానికి 39, 41, 42 రాజ్యాంగ సవరణలు తెచ్చారు. అప్పటికే 1975 జూన్‌ 12న- ఆమె ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జగ్‌ మోహన్‌లాల్‌ సిన్హా నిర్ధారించారు. అదేరోజు గుజరాత్‌ శాసనసభ ఎన్నికల్లో జనతా ఫ్రంట్‌ కాంగ్రెస్‌ను ఓడించింది. ఆ తీర్పు ఫలితంగా ఇందిరాగాంధీ రాజీనామా చేయాల్సి ఉన్నప్పటికీ, ఆమె అందుకు సిద్ధం కాలేదు. తీర్పు తనకు వ్యతిరేకం కాదని, దేశప్రజలకు వ్యతిరేకమైందని నమ్మించే ప్రయత్నం చేశారు. 1975 ఆగస్టు 10వ తేదీన 39వ రాజ్యాంగ సవరణ ప్రతిపాదించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికల విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీలులేదన్నది ఆ రాజ్యాంగ సవరణ సారాంశం. తరవాత రెండు నెలలకు 41వ రాజ్యాంగ సవరణ ప్రతిపాదించారు. దీని ప్రకారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్ల పదవీకాలంలో వారి మీద ఎలాంటి సివిల్‌, క్రిమినల్‌ కేసులు దాఖలు చేయడానికి వీలు లేకుండా చేశారు. ఇది వారి పదవీ కాలానికే కాకుండా, జీవితకాలం వర్తిస్తుందనడం ఈ సవరణలో ఉన్న వైపరీత్యం!

అన్నింటికన్నా ప్రమాదకరమైంది 42వ రాజ్యాంగ సవరణ! దీని ప్రకారం, ఆరు నెలలపాటు మాత్రమే అత్యవసర పరిస్థితి విధించడానికి ఉన్న అవకాశాన్ని ఏడాదికి పొడిగించారు. రాజ్యాంగ పీఠికలో ‘భారత్‌ సోషలిస్ట్‌, సెక్యులర్‌’ అన్న మాటలు చేర్చారు. ఏ రాజ్యాంగ సవరణనూ న్యాయస్థానాల్లో సవాలు చేయడానికి వీలు లేదన్నారు. ‘ఇండియా రాజ్యాంగం కాస్తా ఇందిర రాజ్యాంగంగా మారిపోయింది’ అని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అంశాన్ని అనంతరం మినర్వా కేసులో సుప్రీంకోర్టు కొట్టివేసింది. కేశవానంద భారతి కేసులో చెప్పిన రాజ్యాంగ మౌలిక లక్షణాల్ని ఆ తీర్పులో మరింత పరిపుష్టం చేశారు. 1977 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జనతాపార్టీ ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 42వ రాజ్యాంగ సవరణను రద్దు చేసింది. రాజ్యాంగ పీఠికలో ఇందిర హయాములో చేర్చిన ‘సోషలిస్టు, సెక్యులర్‌’ అనే మాటలను తొలగించలేదు. ఆస్తిహక్కు ప్రాథమిక హక్కు కాకుండా, రాజ్యాంగ హక్కుకు పరిమితం చేశారు. దీన్ని బట్టి జనతాపార్టీ సోషలిజం ఇందిర ‘కుహనా సోషలిజం’ కంటే భిన్నమైనదని భావించాలి! 44వ రాజ్యాంగ సవరణలో విశేషం ఒకటుంది. ఎవరైనా అవకాశవాద రాజకీయాల కోసం ప్రజాస్వామ్యాన్ని వమ్ము చేయడానికి వీలులేకుండా పోయింది! రాజ్యాంగాన్ని తమకు అనువుగా మలచుకోవడం, అనుకూలమైన న్యాయమూర్తుల్ని నియమించడం తాత్కాలికమే అవుతుంది. అలా వినియోగించుకోగలరేమో కాని- పార్లమెంటు, న్యాయస్థానాలు ఆ పొరపాటును సవరించే అవకాశం ఎప్పుడూ ఉంటుందని అనంతర పరిణామాలు రుజువు చేశాయి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగానికి జరిగిన అపచారాన్ని రెండేళ్లలోనే సరిదిద్దుకోగలిగాం. పాలకుల ఇష్టానుసారంగా రాజ్యాంగాల్ని మార్చిన పాకిస్థాన్‌, నేపాల్‌ దేశాల అనుభవాలు మనకు గుణపాఠం కావాలి. రాజ్యాంగాన్ని తిరగ రాయడానికి 2002లో చేసిన ప్రయత్నం సాగలేదని అర్థం చేసుకోవాలి. రాజ్యాంగ విశిష్టతను కీర్తిస్తేనే సరిపోదు. రాజ్యవ్యవస్థలోని న్యాయ, పార్లమెంటరీ, కార్యనిర్వాహకవర్గ వ్యవస్థలు దేనికదే స్వతంత్రంగా పనిచేయాలన్నది రాజ్యాంగ నిర్దేశం. దీనికి కట్టుబడటంలోనే మన ప్రజాస్వామ్య భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది!

నిబంధనలు బేఖాతరు

ఇందిరాగాంధీ ప్రధాని అయినప్పుడు కాంగ్రెస్‌ పాత తరం నుంచి అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే 1967లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి తొమ్మిది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారం కోల్పోయింది. అప్పుడే సంయుక్త విధాయక్‌ దళ్‌ మంత్రివర్గాలు ఏర్పడ్డాయి. ఇందిరాగాంధీ అధికారం తన హక్కు అనుకున్నారు. దాన్ని నిలబెట్టుకోవడం తన ప్రథమ కర్తవ్యంగా భావించారు. తాను లేని దేశమే లేదనుకున్నారు. నెహ్రూ ప్రోది చేసిన పార్లమెంటరీ సంప్రదాయాలకు, గాంధీజీ నైతిక సూత్రాలకు ఆమె తిలోదకాలిచ్చారు. అధికారం నిలబెట్టుకోవడానికి పేదల అనుకూల విధానాలు అనుసరించడం అనివార్యమైంది. బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి చర్యలు తీసుకున్నారు. రాజభరణాల రద్దు కోసం పార్లమెంటులో 1970 సెప్టెంబరులో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపాదించారు. అది రాజ్యసభలో వీగిపోయింది. రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఆ పని చేయాలనుకున్నారు. మునుపటి సంస్థానాధీశులు సుప్రీంకోర్టుకు వెళితే, ఆ ఉత్తర్వును కొట్టివేశారు. ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకోవాలంటే పార్లమెంటులో తిరుగులేని మెజారిటీ ఉండాలనుకున్న ఇందిరాగాంధీ, 1971లో మొట్టమొదటిసారి మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. ‘గరీబీ హటావో’ ప్రధాన నినాదమైంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 352 స్థానాలు దక్కాయి. ఆ విజయం తరవాత ‘పార్లమెంటు రాజ్యాంగ సవరణ తీసుకొస్తే, కాదనడానికి న్యాయవ్యవస్థకు అర్హత ఎక్కడిది’ అనేదాకా ఇందిరాగాంధీ వెళ్లారు. 1971 ఆఖరున బంగ్లాయుద్ధం అనంతరం ఇందిరాగాంధీ ఏకపక్షంగా, నియంతగా వ్యవహరించారు.

– ఆర్వీ రామారావ్‌

(ఈనాడు సౌజన్యం తో)