Home News వకుళమాత గుడి అక్కడే కట్టాలి – హైకోర్టు తీర్పు

వకుళమాత గుడి అక్కడే కట్టాలి – హైకోర్టు తీర్పు

0
SHARE
  • వెంకటేశ్వరుడి తల్లికి అంకితమైన గుడి అది 
  • ఆ ప్రత్యేకతను టీటీడీ కాపాడుకోవాల్సి ఉంది 
  • హైకోర్టు జడ్జి జస్టిస్‌ చల్లా కోదండరాం తీర్పు 
  • పునర్నిర్మాణంపై టీటీడీ తీర్మానానికి సమర్థన 
  • ఆగమ శాస్త్ర ప్రకారం నిర్మించాలని ఆదేశం 
  • తీర్పుతో వందల ఏళ్ల ఆలయానికి పునర్వైభవం 

ఏడుకొండలవాడి మాతృమూర్తి వకుళమాత ఆలయాన్ని ప్రస్తుతం ఉన్నచోటే పునర్నిర్మించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. చిత్తూరు జిల్లా, తిరుపతి బైపాస్‌ రోడ్డు పేరూరులో శిథిలావస్థలో ఉన్న వందల ఏళ్లనాటి వకుళమాత గుడిని పునర్నిర్మించాలంటూ 2009లో టీటీడీ చేసిన తీర్మానాన్ని సమర్థించింది. ఆ తీర్మానాన్ని అనుసరించి.. ఆగమశాస్త్ర ప్రకారం ఆ దేవదేవుడి తల్లి ఆలయాన్ని నిర్మించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరాం బుధవారం ఆదేశాలు జారీచేశారు. ఈ గుడిని పునర్నిర్మించాలంటూ టీటీడీ తీసుకున్న నిర్ణయం వల్ల తాము ఉపాధి కోల్పోతామని.. అక్కడ రాళ్లు కొట్టడానికి వీలుకాదని, కాబట్టి ఆలయాన్ని మరోచోటుకు తరలించాలని కోరుతూ వరాల రెడ్డి అనే ఆయన హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టివేశారు.

ఇదీ నేపథ్యం..

సప్తగిరీశుడి తల్లి అయిన వకుళమాతకు కూడా తిరుపతి సమీపంలోని పేరూరులో ఒక ఆలయం ఉన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. నిజానికి ఒకప్పుడు తిరుపతికి వచ్చిన భక్తులు వకుళ మాత గుడిని కూడా సందర్శించేవారు. ఈ గుడిలో వకుళమాతకు నైవేద్యం సమర్పించి గంట కొట్టిన తర్వాతే.. తిరుమలలో శ్రీవారికి నైవేద్యం పెట్టేవారని ప్రతీతి. అంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ గుడి.. టీటీడీ నిరాసక్తత, ప్రభుత్వంలోని వివిధ శాఖల మధ్య సమన్వయం లేకపోవటం వల్ల క్రమేపీ పూర్వవైభవాన్ని కోల్పోయింది. కాలక్రమంలో అక్కడ క్వారీయింగ్‌ మొదలైంది. పేరూరుకు చెందిన వరాలరెడ్డి, రాజశేఖరరెడ్డి అక్కడ క్వారీయింగ్‌కు మైనింగ్‌ శాఖ వద్ద అనుమతి పొందారు. వకుళమాత గుడి ఉన్న పేరూరు కొండ.. సర్వే నెంబరు 324, 591లో పది ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో ఉండేది. కానీ, కొన్నేళ్లుగా జరిగిన క్వారీ తవ్వకాలతో దాదాపు మూడు వంతుల కొండ హరించుకుపోయింది. కొండపైన ఆలయ భాగం మినహా మిగిలిన కొండను దాదాపుగా తవ్వేశారు. ఆలయం వద్దకు దారి కూడా లేకుండా పోయింది. ఆధ్యాత్మిక ప్రాధాన్యం మాట అటుంచితే.. వందల ఏళ్లనాటి ఈ గుడిని చారిత్రక కట్టడంగానైనా పరిగణించి పరిరక్షించాలని స్థానికులు పెట్టుకుంటున్న మొరను వినే నాథుడే లేకపోయాడు. దీంతో స్థానికులే కొన్ని ధార్మిక సంస్థలతో కలిసి ఆలయ పరిరక్షణకు నడుం బిగించారు. సమస్యను టీటీడీ దృష్టికి తీసుకెళ్లారు. వారి ఉద్యమం తీవ్రతరం కావడంతో, ఈ గుడిని ఆ ప్రాంతం నుంచి తొలగించి వేరే ప్రాంతంలో నిర్మించడానికి ఉన్న వెసులుబాటును తెలియజేయాలని పురావస్తుశాఖను టీటీడీ కోరింది. ఈ మేరకు 2005, డిసెంబర్‌ 25నఒక తీర్మానం కూడా చేసింది. ఈ నేపథ్యంలో వకుళమాత ఆలయాన్ని రక్షించాలంటూ రాష్ట్ర స్థాయిలో ఉద్యమం ప్రారంభమైంది. ప్రజల డిమాండ్‌ మేరకు, టీటీడీ చొరవతో రెవెన్యూ అధికారులు 15.11.2009లో పేరూరు గ్రామ లెక్క దాకల లోని సర్వే నెంబర్‌ 590, 324 కింద దాదాపు 4 ఎకరాలు టీటీడీకి అప్పగించారు. దేవస్థానం అప్పటి ఈవో కృష్ణారావు 2010, జనవరి 17న ఈ ఆలయాన్ని సందర్శించారు. టీటీడీకి కేటాయించిన స్థలం చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. రూ.2 కోట్లను ఆలయ పునర్నిర్మాణానికి, మెట్ల నిర్మాణానికి టీటీడీ పాలకమండలి ద్వారా కేటాయింప జేశారు. అయితే ఇది తమ భూమి అని కొన్ని క్వారీ కంపెనీలు హైకోర్టులో రిట్‌ వేశాయి. తాము ఇక్కడ క్వారీల్లో రాళ్లను కొట్టి జీవనోపాది పొందుతున్నామని, ఇక్కడ ఆలయం నిర్మించడంవల్ల తాము ఉపాధి కోల్పోతామని స్థానికులు కోర్టుకు తెలిపారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు సింగిల్‌ జడ్జి 2010 టీటీడీ బోర్డు తీర్మానాన్ని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీచేశారు. దీంతో.. ఆలయ పునరుద్ధరణ కోరుతూ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకా్‌షరెడ్డి, కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానందస్వామితోపాటు.. పలు హిందూ స్వచ్ఛంద సంస్థలు పోరాటాలు నిర్వహించాయి. స్వామి పరిపూర్ణానంద విశాఖ నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేశారు. మరోవైపు.. ఆలయాన్ని అక్కడి నుంచి వేరేచోటుకు తరలించి పూర్తి స్థాయి క్వారీ వినియోగానికి అనుమతివ్వాలని క్వారీ యజమానులు అభ్యర్థించారు. ఈ కేసు నడుస్తుండగా.. వకుళమాత ఆలయాన్ని పేరూరు కొండపైనే పునర్నిర్మించాలంటూ టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్‌ రెడ్డి, కదిరి మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, దూరదర్శన మాజీ డైరెక్టర్‌- శ్రీపీఠం ట్రస్ట్‌ అధ్యక్షుడు ఆర్‌.వి.వి.కృష్ణారావు వేర్వేరుగా హైకోర్టులో కేసులు వేశారు. వీటిని విచారించిన హైకోర్టు సింగిల్‌ జడ్జి.. అక్రమ క్వారీయింగ్‌ ఆపాలని, ఆలయాన్ని సంరక్షించాలని 2012 సెప్టెంబరులో మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. రెండు వర్గాల పిటిషన్లను జతచేసి విచారించాలని స్పష్టం చేశారు. ఆ వ్యాజ్యాలను విచారించిన జస్టిస్‌ కోదండరాం.. అక్రమ క్వారీయింగ్‌కు సంబంధించిన తాజా చిత్రాలను పరిశీలించారు. అక్కడ క్వారీయింగ్‌కు ఎలాంటి లీజులూ పొందలేదని గుర్తించారు. ఆలయ పునర్‌ నిర్మాణానికి నిధలు మంజూరు చేసే అధికారాలు టీటీడీ ఉన్నాయని, ఈ ఆలయం వేంకటేశ్వరస్వామి తల్లికి అంకిత మిచ్చినదని, దీనిని ప్రత్యేకను చాటుకోవాల్సిన అవసరం టీటీడీ ఉందని, 2009లో టీటీడీ బోర్డు చేసిన తీర్మానం మేరకు ఆలయాన్ని పునర్‌ నిర్మించాలని ఆదేశించారు. ఆలయ నిర్మాణం వల్ల తాము ఉపాధికోల్పోతామని స్థానిక గ్రామస్థులు చేసిన వాదనలను తోసిపుచ్చారు. శతాబ్దాల క్రితం తొండమాన చక్రవర్తి ఆ ఆలయాన్ని నిర్మించినట్లు, అనంతరం శ్రీకృష్ణదేవరాయలు ఆలయాన్ని పునరుద్ధరించి అభివృద్ధి చేసినట్లు తెలిపే ఆధారాలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారని ఈ కేసులో భానుప్రకాశ్‌ రెడ్డి తరపున వాదించిన న్యాయవాది గోపాకలకృష్ణ కళానిధి వివరించారు. అలాగే, ఈ ఆలయ నిర్మాణం వల్ల పేరూరు పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందని న్యాయమూర్తి భావించారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇది భక్తుల విజయం

పేరూరు కొండపైగల ప్రాచీన వకుళమాత ఆలయాన్ని అక్కడే పునర్నిర్మించాలంటూ బుధవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు భక్తుల విజయమని టీటీడీ సభ్యుడు భానుప్రకాశ్‌ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ప్రస్తుతం న్యూజెర్సీ (యూఎ్‌సఏ)లో ఉన్న ఆయన.. అక్కడి నుంచి ఫోనులో ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. తాము 15 సంవత్సరాలుగా పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని పోరాడుతున్నామని గుర్తుచేశారు. తమ పోరాటం నేటికి ఫలించడం ఆనందాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు.


ఇది ధర్మ విజయం.. వెంకన్న విజయం: పరిపూర్ణానంద

‘‘వకుళమాత ఆలయాన్ని పేరూరు కొండపైనే పునర్నిర్మించాలన్న కోర్టు తీర్పు.. ధర్మ విజయం, వెంకన్న విజయం. హిందూ సంస్కృతి ‘మాతృదేవోభవ’ అని ప్రభోదించింది. ఈ కేసులో విజయం ద్వారా ఆ తిరుమలేశుడు కూడా దీన్ని నిరూపించాడు’’ అని కాకినాడ శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద అన్నారు. కోర్టు తీర్పు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. వకుళమాత ఆలయ పునరుద్ధరణకు స్వామి పరిపూర్ణానంద తొలి నుంచీ ఉద్యమస్థాయిలో కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. 2005 నుంచీ ఆయన ఆలయ పునరుద్ధరణపై స్థానికులను చైతన్యం చేస్తున్నారు. కనుమూరి బాపిరాజు టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఆయనను తీసుకుని.. వేలాది మందితో పాదయాత్రగా వెళ్లి కూలిన ఆలయాన్ని చూపించారు. పేరూరు కొండపైన వకుళమాత ఆలయ జీర్ణోద్ధరణ జరిగాకే శ్రీవారి దర్శనం చేసుకుంటానని ఆయన ప్రతిజ్ఞ కూడా చేశారు. అక్రమ మైనింగ్‌ మాఫియా అక్కడ గుడి కట్టకుండా స్టే పిటిషన్‌ తెచ్చుకుంటే.. దాన్ని వెకేట్‌ చేయించేలా రిట్‌ పిటిషన్‌ ఎందుకు దాఖలు చేయలేదని ఆయన టీటీడీని అప్పట్లో ప్రశ్నించారు. టీటీడీ నుంచి స్పందన లేకపోవడంతో.. శ్రీపీఠం ట్రస్ట్‌ అధ్యక్షుడు ఆర్వీవీ కృష్ణారావుతో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయించారు. ఆ పిటిషన్‌ నేపథ్యంలోనే ఈ తీర్పు వెలువడింది. హైకోర్టు తీర్పుతో అన్ని అడ్డంకులూ తొలగినందున.. త్వరలోనే టీటీడీ అధికారులను కలిసి, 2017లోగా వకుళ మాత ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసేలాగా కృషి చేస్తానని స్వామి పేర్కొన్నారు. 

(ఆంధ్ర జ్యోతి సౌజన్యం తో)