అరబిందో అఖండ భారత్ దృక్కోణం (విజన్), దాని సరైన వివరణను అర్థం చేసుకోవడానికి, ప్రతి పౌరుడు శ్రీ అరబిందో జీవితాన్ని తెలుసుకోవాలి. శ్రీ అరబిందులవారి హిందూ-కేంద్రీకృత ఆలోచనలు, తత్వశాస్త్రం, రచనలు సమాజ శ్రేయస్సు కొరకు ఉద్దేశించినవి. భారత స్వాతంత్ర్య పోరాటం గురించి ఆయన అన్వేషణ ఆ పోరాటంలో వ్యక్తిగతంగా పాల్గొనడం ఒక స్ఫూర్తిదాయకమైన, మేల్కొలుపు అధ్యాయము. ఇది ప్రస్తుత, భవిష్యత్తు తరాలకు చెప్పాల్సిన అవసరం ఉందని, హైదరాబాద్ లో జరిగిన ‘ఆరో అవలోకన్ శిబిరం’(‘శిక్షకులకు శిక్షణ’) లో పాల్గొన్న డాక్టర్ భాస్కర్ యోగి అన్నారు.
శ్రీ అరబిందో 150 వ వార్షికోత్సవ సన్నాహకాల్లో భాగంగా, ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ’ అనే సంస్థ, అక్టోబర్ 2, 2021న, ‘ఆరో అవలోకన్ శిబిరం’ (Train the Trainers Camp) నిర్వహించింది. ఒక రోజంతా జరిగిన ఈ కార్యక్రమం శ్రీ సౌమిత్రి లక్ష్మణాచార్య స్వాగత సందేశంతో ప్రారంభమైంది.
హైదరాబాద్ లోని శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఛల్మయి రెడ్డి గారి కీలక ప్రసంగం లో, మానవత్వానికి దారి చూపే ‘సనాతన ధర్మం’, మన జీవితాలపై దాని ప్రభావం, ఆవశ్యకత గురించి వివరించారు.
మన దేశం సంస్కృతి గురించి నేటి యువతరం తెలుసుకోక పోవటం ప్రమాదకరమైనదని, దీన్ని ఒక సవాలుగా స్వీకరిస్తూ ప్రప్రథమంగా పరిష్కరించాల్సిన అంశం అని, తెలంగాణ శ్రీ అరబిందో సొసైటీ వైస్ ఛైర్మన్ శ్రీ శ్రీనివాస్ ములుగు అన్నారు. సమాజంలో ఒక తరం ఇంకో తరం మధ్య ఉన్న జ్ఞాన అంతరాన్ని తగ్గించాలని ఇందులో పాల్గొన్న వారికి విజ్ఞప్తి చేశారు.
‘జాతీయవాద ప్రవక్త’ అనే అంశంపై ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీ అరబిందుల జాతీయవాద రచనలు, లోతైన విశ్లేషణ, వేదాలు, గీత, హిందూ తత్వశాస్త్రం సహా వివిధ గ్రంథాలు, విషయాలపై చేసిన వ్యాఖ్యానం సాధారణ ప్రజల మనస్సులకు ప్రెరణనిస్తూ స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొనేలా వారిని ప్రోత్సహించాయన్నారు. మారుతున్న పరిణామాలు మరియు భారతదేశానికి పూర్తి స్వేచ్ఛ కోసం అతని డిమాండ్ బ్రిటిష్ వలసవాదులను భయపెట్టిందని , భారతదేశంలో తమ ఉనికిని సవాలు చేస్తున్న అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులలో ఒకరిగా శ్రీ అరబిందోను ప్రకటించారని గుర్తు చేశారు.
నేటి కాలానికి శ్రీ అరబిందో ఆలోచనల ఔచిత్యం గురించి శ్రీ రాకా సుధాకర్ రావు మాట్లాడుతూ. అరబిందో అభ్యుదయ మరియు నిశ్రేయస్ వైపు భారతీయులను నడిపించే సనాతన ధర్మ ప్రతిపాదకుడు. మాతృభూమి కీర్తి కొరకు శ్రేయస్సు, నిశ్రేయసులు (దైవానికి అనుసంధానం చేయడం) గురుంచి వివరించారు.
కార్యక్రమంలో భాగంగా, వక్తలు, నిర్వాహకులు, సోషల్ మీడియా కార్యకర్తలు మరియు రచయితల కోసం విడివిడిగా సమావేశాలు జరిగాయి. ఈ సెషన్లకు శ్రీ ఎక్కా చంద్రశేఖర్, శ్రీ ఆయుష్ నడింపల్లి, శ్రీ మురళీ మనోహర్ మరియు శ్రీ బిఎస్ శర్మ మార్గనిర్దేశం చేశారు.