భౌగోళికంగా అత్యంత సువిశాలమైన ఆసియా ఖండం నుంచి చైనాకు మాత్రమే భద్రతా మండలిలో ప్రాతినిధ్యాన్ని పరిమితం చేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఆసియా నుంచి మరి ఒకటి రెండు దేశాలకు ప్రాతినిధ్యం అవసరమన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యవహారాల్లో ఆసియా పాత్ర పెరుగుతోంది. భారత్, జపాన్ ఈ ప్రాంతం నుంచి సభ్యత్వం కోసం పోటీ పడుతున్నాయి. వీటికి సభ్యత్వం దక్కకుండా చైనా అడ్డు పడుతోంది. అమెరికా అండ ఉన్నంత మాత్రాన సభ్యత్వం దక్కడం సులువు కాదని చైనా అధికార మీడియా ‘గ్లోబల్ టైమ్స్’ తాజా సంపాదకీయంలో భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. త్వరలో అమెరికా రక్షణమంత్రి టిల్లర్‌సన్ భారత్ పర్యటన, అధ్యక్షుడు ట్రంప్ ఆసియా తొలి పర్యటన నేపథ్యంలో బీజింగ్ వ్యాఖ్యలు ఆలోచన రేకెత్తిస్తున్నాయి!
భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వంపై అమెరికా ఇటీవల ఓ ప్రకటన చేసింది. ‘వీటో’ అధికారం వదులుకుంటే సభ్యత్వం పొందడానికి మార్గం సులువు అవుతుందన్నది దాని సారాంశం. ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ నోటి వెంట వచ్చిన వాక్కు అది. వాషింగ్టన్‌లో అమెరికా-భారత్ మిత్రత్వ మండలి నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలను భారత్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. చిత్తశుద్ధి లేనప్పుడే ఈ తరహా అర్థరహిత, హాస్యాస్పద, వంకరటింకర వ్యాఖ్యలు వెలువడుతుంటాయి.
భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ సాధనపై భారత్‌కు మద్దతు ఇస్తామని ఒకపక్క చెబుతూనే మరోవైపు చైనా వ్యతిరేకిస్తోందంటూ వాషింగ్టన్ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. మండలిలో సభ్యత్వం అనేది ఇతరుల ఇష్టాయిష్టాలు, దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన అంశం కాదు. సభ్యత్వానికి భారత్ అన్ని విధాలా అర్హురాలు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య, శాంతికాముక దేశం- భారత్! అనేక భాషలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు గల భారతావని- భిన్నత్వంలో ఏకత్వానికి పట్టంగడుతోంది. ప్రపంచంలో అత్యంత వేగంగా, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనది. సమాఖ్య స్ఫూర్తికి, మానవ హక్కులకు, అల్పసంఖ్యాకుల హక్కులకు, ప్రాథమిక హక్కులకు కట్టుబడిన దేశంగా అసలు సిసలైన ప్రజాస్వామ్యానికి భారత్ నిదర్శనంగా నిలుస్తోంది. స్వతంత్ర న్యాయవ్యవస్థతో అలరారుతోంది. అన్నింటికీ మించి అంతర్జాతీయ సంస్థలకు వెన్నుదన్నుగా నిలుస్తూ అవి నిర్వహించే సేవా, శాంతిపరిరక్షక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. శాంతిపరిరక్షక కార్యక్రమాల్లో భాగంగా వివిధ దేశాల్లో సేవలు అందిస్తున్న అనేకమంది భారతీయ సైనికులు విధి నిర్వహణలో అమరులయ్యారు. 2016 ఆఖరు నాటికి వివిధ దేశాలకు చెందిన 3,517 మంది ప్రాణాలు కోల్పోగా, భారత్‌కు చెందిన 162 మంది హతులయ్యారు. అంతర్జాతీయంగా 16 శాంతిస్థాపక కార్యక్రమాలు కొనసాగుతుండగా అందులో 13 కార్యక్రమాల్లో భారతీయ సైనికులు సేవలు అందిస్తున్నారు. దాదాపు ఏడున్నర వేల మంది భారత సైనికులు ప్రస్తుతం వివిధ దేశాల్లో శాంతిస్థాపక కార్యక్రమాల్లో భాగస్వాములుగా ఉన్నారు.
సమతుల్యత లోపం
రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఆవిర్భవించిన భద్రతామండలిలో అమెరికా, అప్పటి సోవియట్ యూనియన్ (ప్రస్తుత రష్యా), బ్రిటన్, ఫ్రాన్స్, చైనా శాశ్వత సభ్య దేశాలు. వీటిలో బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఐరోపా ఖండానికి చెందినవి. చైనా ఆసియాకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆఫ్రికా ఖండానికి అసలు ప్రాతినిధ్యమే లేదు. భౌగోళికంగా అతి చిన్నదైన ఐరోపా నుంచి మూడు దేశాలకు, అతి పెద్దదైన ఆసియా నుంచి ఒక్క చైనాకు మాత్రమే సభ్యత్వం ఇవ్వడం ఆనాటి పరిస్థితులకు సరైనది కావచ్చు. కానీ, ఇప్పటి పరిస్థితులకు ఎంతమాత్రం సమర్థనీయం కాదు. అప్పట్లో అవి బలీయమైన దేశాలు కావచ్చు. అంతర్జాతీయ వ్యవహారాల్లో కీలకపాత్ర పోషించి ఉండవచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. అనంతర కాలంలో ప్రపంచవ్యాప్తంగా గణనీయ మార్పులు వచ్చాయి. అంతర్జాతీయ ముఖచిత్రం అనూహ్యంగా మారిపోయింది. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరున్న బ్రిటన్- అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికాకు తోకదేశంగా మిగిలిపోయింది! దానికి ప్రత్యేక విధానమన్నదే లేకుండా పోయింది. ఐరోపా సమాఖ్య (ఈయూ) నుంచి ఇటీవలే వైదొలగడంతో అంతర్జాతీయ స్థాయిలో మరింత కుంచించుకుపోయింది. ఇప్పుడు బ్రిటన్ ఒక సాధారణ దేశం. అనేక అంతర్గత సమస్యలతో అది సతమతమవుతోంది. స్వదేశంలోనే వేర్పాటువాద పోరాటాలను ఎదుర్కొంటోంది. ఆర్థిక వ్యవస్థ కూడా అంత గొప్పగా ఏమీ లేదు. ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థలకు సైన్యాన్ని, నిధులను సమకూర్చడంలో పెద్దగా చొరవ సైతం చూపలేకపోతోంది. ‘మండలి’లోని మరో శాశ్వత సభ్యదేశం ఫ్రాన్స్‌దీ ఇదే పరిస్థితి. ప్రపంచ వ్యవహారాల్లో ఇప్పుడు దాని పాత్ర అత్యంత పరిమితం. ఆర్థికంగానూ ఆ దేశం గొప్ప శక్తిమంతంగా లేదు. మారిన పరిస్థితుల్లో ఈ దేశాల సభ్యత్వాలను కొనసాగించడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న తలెత్తక మానదు. ఇప్పుడు బ్రిటన్, ఫ్రాన్స్ కన్నా ఐరోపాలో జర్మనీ పటిష్ఠంగా ఉంది. దాని ఆర్థిక వ్యవస్థా బలోపేతమైంది. తూర్పు, పశ్చిమ జర్మనీ కలయికతో పెద్దదేశంగానూ అవతరించింది. నాలుగు దఫాలుగా ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ వరసగా విజయం సాధిస్తున్నారు. జర్మనీలో నేడు రాజకీయంగా సుస్థిర పరిస్థితులు ఉన్నాయి. బ్రిటన్ వైదొలగిన తరవాత ఐరోపా సమాఖ్యలో శక్తిమంతమైన దేశం జర్మనీ తన ఉనికిని చాటుతోంది. ఈయూ నుంచి వైదొలగిన బ్రిటన్‌పై కూటమి దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఫ్రాన్స్ కూడా ఈయూ దేశమైనప్పటికి జర్మనీ తరవాతే దాని స్థానం. ఈ నేపథ్యంలో భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వానికి జర్మనీకి అన్ని విధాలా అర్హత ఉంది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ప్రపంచశక్తిగా చలామణీ అయిన నాటి సోవియట్ యూనియన్ తొమ్మిదో దశకంలో తిరుగుబాట్లతో ప్రాభవం కోల్పోయింది. సోవియట్ నుంచి విడిపోయిన పలు రిపబ్లిక్‌లు స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. ఇప్పుడు రష్యా అంతర్జాతీయంగా గణనీయ శక్తి అయినప్పటికీ, గతంలో మాదిరిగా ప్రభావవంతంగా లేదన్నది వాస్తవం!
శాశ్వత సభ్యత్వం కోసం జి-4గా పిలిచే భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్ గట్టిగా పోటీపడుతున్నాయి. దక్షిణాఫ్రికా కూడా బరిలో ఉంది. ఈ దేశాల వాదనల్లో హేతుబద్ధత ఉంది. వీటి ఆశలపై నీళ్లు చల్లేందుకు శాశ్వత సభ్యదేశాలు పరోక్షంగా పావులు కదుపుతున్నాయన్న విమర్శ ఉంది. తమ ఇరుగుపొరుగు దేశాలను ప్రేరేపించి జి-4 దేశాలకు వ్యతిరేకంగా అవి మాట్లాడిస్తున్నాయన్నది అందులో ఒకటి. దాంతో భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం తాము కూడా బరిలో ఉన్నామంటూ ఆయా దేశాలూ ముందుకొస్తున్నాయి. తద్వారా భారత్, జర్మనీ, జపాన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా అవకాశాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. జి-4 దేశాలను వ్యతిరేకించే 13 దేశాలు విస్తృత అంగీకారం కోసం ఐక్యత (యునైటింగ్ ఫర్ కాన్సెస్) పేరిట కూటమిగా ఏర్పడ్డాయి. భారత్‌కు వ్యతిరేకంగా చైనా మాట్లాడటమే కాకుండా, తన అనుయాయి పాకిస్థాన్‌కు గట్టి ప్రోత్సాహం అందిస్తోంది. భారత్, పాకిస్థాన్‌లను ఒకే గాటన కట్టడం బీజింగ్ మానసిక దౌర్బల్యానికి నిదర్శనం. పాక్ ఏ రకంగా భారత్‌కు సరిసమాన దేశమో డ్రాగన్ వివరించాల్సి ఉంది. తన బద్ధశత్రువైన జపాన్ సభ్యత్వంపై చైనా బహిరంగంగానే స్వీయ వ్యతిరేకత వ్యక్తీకరిస్తోంది. ఐరోపాలో జర్మనీకి వ్యతిరేకంగా ఇటలీ, స్పెయిన్ మరికొన్ని గళం విప్పుతున్నాయి. లాటిన్ అమెరికాకు చెందిన బ్రెజిల్‌కు అదే ప్రాంతానికి చెందిన అర్జెంటీనా మద్దతు పలకడం లేదు. ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికాకు వ్యతిరేకంగా నైజీరియా మాట్లాడుతోంది.
మారుతున్న ప్రపంచ ముఖచిత్రం
అంతర్జాతీయ సంస్థలు, ప్రాంతీయ కూటములు కాలానుగుణంగా మారుతూ తమ పరిధిని విస్తరించుకుంటున్నాయి. ఒక్క భద్రతా మండలి మాత్రమే ఇందుకు మినహాయింపుగా ఉంది. నాలుగో దశకంలో 51 దేశాలతో ప్రస్థానం ప్రారంభించిన ఐరాసలో నేడు 190కి పైగా దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. భద్రతామండలి 20వ శతాబ్దంలో అప్పటి పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా ఆవిర్భవించిన సంస్థ. 21వ శతాబ్దానికి అనుగుణంగా దాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. అప్పటికీ, ఇప్పటికీ ప్రపంచ పరిస్థితుల్లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. కొత్తశక్తులు ఆవిర్భవించాయి. ఏడు దశాబ్దాలు దాటినా మండలి స్వరూప స్వభావాల్లో ఎలాంటి మార్పూ లేదు. తాత్కాలిక సభ్యత్వ దేశాల సంఖ్యను పెంచడం తప్ప మండలి నిజానికి చేసిందేమీ లేదు. అయిదు శాశ్వత, పది తాత్కాలిక సభ్యదేశాలతో మండలి సుదీర్ఘకాలంగా కాలక్షేపం చేస్తోంది. ఆకలి, అస్థిరత, అశాంతికి కేంద్రంగా ఉన్న ఆఫ్రికాకు భద్రతామండలిలో ప్రాతినిధ్యమే లేకపోవడం పెద్ద లోటు. ప్రజాస్వామ్య మూలసూత్రాలకే ఇది విరుద్ధం. ఏకంగా ఒక ఖండాన్నే విస్మరించిన సంస్థను ప్రపంచ సంస్థగా గుర్తించి, గౌరవించడం కష్టం. ప్రపంచవ్యాప్తంగా ఐరాస కార్యకలాపాలు ఎక్కువగా ఆఫ్రికాలోనే చోటుచేసుకుంటున్నాయి. లాటిన్ అమెరికా, అరబ్ దేశాలకూ ఇందులో చోటులేదు. జనాభాపరంగా ముస్లిం సమాజం ప్రపంచంలో ద్వితీయ స్థానంలో ఉంది. ఆ విషయాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ఏయే దేశాలకు సభ్యత్వం ఇవ్వాలి, కొత్తగా వచ్చేవాటికి వీటో అధికారం ఉండాలా, వద్దా అనే అంశాలపై శాశ్వత సభ్యత్వ దేశాలు చురుగ్గా వ్యవహరిస్తున్న దాఖలాలే లేవు! ఖండాలు, జనాభా, ఆయా దేశాల శక్తి సామర్థ్యాలు, అంతర్జాతీయ సంస్థలకు అవి అందిస్తున్న సేవలు, నిధులు- వీటిలో దేన్ని ప్రాతిపదికగా తీసుకోవాలన్న విషయంలోనూ వాటి మధ్య ఏకాభిప్రాయం లేదు. ‘మండలి’ విస్తరణ, సంస్కరణలపై విముఖతతోనే అవి ఇలా వ్యవరిస్తున్నాయన్న విమర్శ సైతం ఉంది. సవాలక్ష లోపాలతో సతమతమవుతున్న సంస్థ యావత్ ప్రపంచానికి సరైన ప్రాతినిధ్యం వహించగలదా? అలాంటి సంస్థ మానవాళికి ఏమి మేలు చేయగలదు, ప్రపంచశాంతికి ఎలా పాటుపడగలదు? ఈ ప్రశ్నలకు లభించే జవాబులే మున్ముందు ఐరాస మనుగడను నిర్దేశిస్తాయి!
– గోపరాజు మల్లపరాజు
(ఈనాడు సౌజన్యం తో)