రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకుల ద్వారా దేశవ్యాప్తంగా లక్షన్నర సేవాకార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే 20 పెద్ద ఆసుపత్రులు, 15 బ్లడ్ బ్యాంక్ లు కూడా నడుస్తున్నాయి.
భువనేశ్వర్ లో మూడురోజులపాటు జరిగిన అఖిల భారతీయ కార్యకారిణి సమావేశాల ముగింపు తరువాత సర్ కార్యవహ శ్రీ భయ్యాజీ జోషి పత్రిక విలేకరులతో మాట్లాడారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు స్వయంసేవకులు సహాయకార్యక్రమాలు చేపట్టేవారని, కానీ 1989 నుంచి సంఘ ద్వారా ప్రణాళికాబద్ధంగా సేవాకార్యక్రమాలు ప్రారంభమయ్యాయని ఆయన తెలియజేశారు.
అలాగే స్వయంసేవకులు అవసరమైనవారికి ప్రత్యేకమైన సేవలు కూడా అందజేస్తున్నారని భయ్యాజీ తెలిపారు. స్వయంసేవకుల కృషి మూలంగా ఇప్పుడు ప్రతి సంవత్సరం 3 నుంచి 4 వేల నేత్ర దానాలు జరుగుతున్నాయని అన్నారు. గ్రామీణాభివృద్ది రంగంలో కూడా స్వయంసేవకులు పనిచేస్తున్నారు. స్థానికుల సహాయ సహకారాలతో 250 గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దరని ఆయన తెలియజేశారు. గ్రామాలకు సంబంధించిన సమస్యలను గ్రామీనులే పరిష్కరించుకోవాలని, అందుకు అవసరమైన సహాయాన్ని మాత్రం అందించాలన్నది స్వయంసేవకులు అనుసరిస్తున్న సూత్రమని ఆయన అన్నారు. విద్యా, ఆరోగ్యం, వ్యవసాయం మొదలైన రంగాల్లో స్వయంసేవకులు పనిచేస్తున్నారు.
సంఘ ఆలోచన, దృక్పధాన్ని అంగీకరించి లక్షకు పైగా గ్రామాలకు చెందిన వారు తమతో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నారని భయ్యాజీ అన్నారు.
నిత్య శాఖలకు హాజరయ్యే 16-17 సంవత్సరాల వయస్సు కలిగినవారు 5లక్షల మంది ఉంటారని, అలాగే మరో 4లక్షల మంది 17 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగినవారని వివరించారు. మొత్తం 59వేల గ్రామీణ మండలాలకుగాను 30వేల మండలాలలో సంఘ కార్యం జరుగుతోందని చెప్పారు. జాతీయ పౌర రిజిస్టర్ (NRC) గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ చొరబాటుదారులను గుర్తించి తగిన చర్యలు తీసుకునేందుకు ఒక విధానాన్ని రూపొందించుకోవడం ప్రభుత్వపు కర్తవ్యమని అన్నారు. NRC ప్రస్తుతం అస్సాంలోనే అమలుపరుస్తున్నారని, నిజానికి దేశంలోని అన్నీ ప్రాంతాల్లో అమలుచేయాలని అభిప్రాయపడ్డారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణం గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెపుతూ మందిర నిర్మాణానికి ఎదురవుతున్న అవరోధలన్నిటిని తొలగించాలన్నది తమ అభిప్రాయమని అన్నారు. ఈ విషయమై ఉచ్చ న్యాయస్థానంలో వాదనలు పూర్తయ్యాయని, తుది తీర్పు హిందువులకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ఈ వివాదానికి కోర్ట్ బయట పరిష్కారం కనుగొనే ప్రయత్నాల గురించి మాట్లాడుతూ ఇలాంటి ప్రయత్నాలు మంచివేనని, వీటివల్ల సమస్య శాంతియుతంగా, సజావుగా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. దీనివల్ల ప్రపంచంలో కూడా భారత్ పట్ల గౌరవం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అయితే కేసు దీర్ఘకాలం కోర్టుల్లో నానడంవల్ల ఇలాంటి సయోధ్య సాధ్యం కాలేదు. ఇప్పుడు వాదనలు పూర్తయి తుది తీర్పు వెలువడనుందని, దాని కోసమే అంతా వేచి చూస్తున్నారని అన్నారు.
ఉమ్మడి పౌర స్మృతి అమలును చాలాకాలంగా అనేకమంది కోరుకుంటున్నారని, రాజ్యాంగం అమలు చేసినప్పుడే ఇది కూడా జరిగి ఉండాల్సిందని, ఇలాంటి పౌర స్మృతి అందరికీ మేలు చేస్తుందని భయ్యాజీ అన్నారు.
భద్రత కరువవడం వల్ల కాశ్మీరీ పండిట్ లు తమ ఇల్లూవాకిళ్ళు వదిలిపెట్టవలసివచ్చిందని, అందువల్ల వాళ్ళు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకునేందుకు దోహదం చేసే పరిస్థితులను నెలకొల్పల్సి ఉందని ఆయన అన్నారు.