అహల్యాబాయి త్రిశత జయంతి ఉత్సవాల ప్రారంభం
ఆదర్శవంతమైన పరిపాలనకు మనం శ్రీరామచంద్రుని పాలనను ఉదాహరిస్తూ ఉంటాం. అయితే ఆయన ఈ కాలంవాడు కాదు. ఎప్పుడో త్రేతాయుగంవాడు. మరి ఇప్పటికాలంలోనూ అంతటి ఆదర్శంగా నిలిచే పరిపాలకులు ఉన్నారా? అనే ప్రశ్నకు మనకు వినిపించే జవాబు ఒక స్త్రీమూర్తిది కావటం చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. ఇది నిజమేనా? అన్న సందేహమూ కొందరికి కలుగవచ్చు. కాని ఇది అక్షరసత్యం. అటువంటి ఆదర్శ పరిపాలనను అందించిన మహిళ ఇండోర్ రాజ్యాన్ని 18వ శతాబ్దoలోని చివరి ముుడు దశాబ్దాలపాటు పాలించిన దేవీ ఆహల్య బాయి హోల్కర్. 1725 మే 31న ఆమె జన్మించింది. రాబోయే సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఆమె త్రిశత జయంతి ఉత్సవాలు జరుగనున్నవి. ఈ సంవత్సరం మే 31 నుండి ఆ ఉత్సవాలు ప్రారంభమవుతున్నవి.
అహల్యా బాయి అతి సాధారణమైన పల్లెటూరి కుటుంబంలో జన్మించి, తమ గ్రామం మీదుగా ప్రయాణిస్తూ దారిలో శివాలయంలో దర్శనార్థమై ఆగిన పీష్వా గారి దృష్టిలో పడటం అప్పుడు 12 సంల వయస్సు గల బాలిక అహల్య జీవితాన్ని మలుపు త్రిప్పింది. ఇండోర్ కేంద్రంగా సమీప గ్రామాలకు అధికారిగా ఉన్న మల్హారరావు హోల్కర్‌కి ఆ బాలికను చూపించి, ఇటువంటి చురుకైన పిల్ల మీకు కోడలు అయినట్లయితే మీ సంస్థానం బాగా అభివృద్ధిలోకి వస్తుందని పీష్వా సలహాయిచ్చారు. ఆ సలహా మల్హారరావుకి నచ్చింది. ఆ మాటే పీష్వాకి చెప్పాడు. వెంటనే పీష్వా ఆ బాలిక తండ్రిని పిలిపించాడు. ఆయన పేరు మాణకోజొ సిందే. పెద్దకుటుంబంతో వియ్యమందడానికి, అట్టహాసంగా వివాహం చేయడానికి అతడు తటపటాయించటం గమనించి, అన్ని బాధ్యతలూ తానే తీసుకుంటానని చెప్పి 1737 మే 20వ తేదీన ఆ వివాహం జరిపించారు. ఖండేరావు హోల్కర్ – ఆహల్య బాయిల వివాహం జరిపించి, విలువైన కానుకలిచ్చి, దీవించి, పీష్వా పుణే వైపు సాగిపోయారు.
అలా పన్నెండేళ్ల ప్రాయంలో హోల్కర్ వంశ౦లో అడుగు పెట్టిన అహల్యాబాయి తన జీవితంలో ఎన్నెన్నో పరీక్షలను ఎదుర్కోవలసి వచ్చింది. ఖండేరావు విలాస పురుషుడు. రాజ్యవ్యవహారాలుగాని, కుటుంబ వ్యవహారాలుగాని పట్టించుకునే వాడు కాదు. తాను ఓపికగా వ్యవహరించి అతనిలో మార్పు తీసుకొని రాగలనని అహల్యాబాయి ఆశపడింది. అయితే ఆమెకు ఆయనగారి దర్శనమే సరిగా లభించేది కాదు. మాటా మంతీ కూడా తక్కువే. అలా సాగిన దాoపత్యంలో 1745లో ఒక కొడుకును (మాలేరావ్) 1748లో ఒక కూతురిని (ముక్తా బాయి) కన్నది. తనభర్త రాజ్యవ్యవహారాలను పట్టించుకోకపోవటం గమనించి ఆ లోటును భర్తీ చేయడానికి మామగారి శిక్షణలో అనేక విషయాలను అహల్య అభ్యసించింది.
ముంచుకొచ్చిన కష్టాలు…
1754 మార్చి 24న యువరాజు ఖండేరావు ఆకస్మిక మరణం సంభవించింది. ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా అహల్య సహగమనానికి సిద్ధపడుతున్నదని తెలిసి మల్హారరావు ఆమెకు నచ్చజెప్పాడు. రాజ్యాన్ని అనాథగా వదిలి వేయటం తగదని, వ్యక్తిగతమైన ధర్మాని కంటే, ఆక్రమణదారుల నుండి రాజాన్ని రక్షించుకుంటూ ప్రజలకు సుపరిపాలన అందించటం ప్రాధాన్యం గల విషయమని, వయోభారంతో ఉన్న తమను తమ ఖర్మకు వదిలివేయటం తగదని ప్రాధేయపడ్డాడు. దేశహితాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవటమే సముచితమని గ్రహించిన ఆహల్య సహగమనం ఆలోచనను విరమించుకొంది. ఆపైన రాజ్య నిర్వహణ వ్యవహారాలలో మరింత శ్రద్ధ వహించింది, పుణే నుండి పీష్వా, ఢిల్లీనుండి మొగలు పాదుషా, తదితరులు శోక సందేశాలను పంపించారు. మొగలు పాదుషా, ఈ రాజ్యానికి నూతనంగా వారసుడైన మాలేరావుకి అంబడ్ పరగణాను, అహల్యకి వేరుల్ పరగణాను కానుకలుగా ఇస్తూ పత్రాలు పంపించాడు.
1761లో మూడవ పానిపట్ యుద్ధం జరిగింది. మహారాష్ట్రులు, మొగలులు కలిసి అహమద్ షా అబ్దాలిని ఎదిరించారు. ఆ యుద్ధంలో మైదానంలో ముఖాముఖి తలపడటం కంటే, వృక యుద్ధ (గెరిల్లా పద్ధతి)ని అనుసరించటం మేలని మల్హారరావు చెప్పిన మాటను మిగిలిన సర్దారులు, సేనాపతులూ వినిపించుకోలేదు. ప్రతిఫలం అతి భయంకరమైన పరాజయం. అయితే తాము పట్టును పూర్తిగా కోల్పోలేదని నిరూపించుకోవటంలో భాగంగా తక్కువ సమయంలోనే సేనలను, ఆయుధాలను, మందు గుండు సామగ్రిని సమకూర్చుకొని కురుక్షేత్ర సమీపంలోని ‘గోహాడ్’ దుర్గాన్ని గెలుచుకొని వచ్చారు. ఒక్కొక్క అడుగులో, ఒక్కొక్క మెట్టు వద్ద అహల్యా బాయి యుద్ధనీతిని అభ్యసిస్తూ అడుగులు ముందుకు వేసింది.
1761లో తనను తల్లివలె చూసుకొంటున్న అత్తగారు గౌతమా బాయి మరణించింది. 1764లో మామగారు మల్హరరావు మరణించారు. ఆ పైన రాజ్యపాలన భారమంతా అహల్యబాయి మీద పడింది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే కుమారుడు మాలేరావ్ అదుపు తప్పి వ్యవహరిస్తుండడంతో మహేశ్వరంలోని రాజభవనం దాటి బయటకు పోవద్దని కట్టడి చేసింది. దానితో అతడు మరణించాడు. అహల్యా బాయి కుమార్తె ముక్తాబాయికి ఒక కుమారుడు కలిగాడు. నాతుబా అని పిలిచేవారు. తమకు వారసుడు లభించాడని సంతోషించారు. కానీ ఆ బాలుడు క్షయ వ్యాధిగ్రస్తుడై మరణించాడు. అహల్య బాయికి చక్కగా సహకారిస్తూ వచ్చిన అల్లుడు (ముక్తా బాయి భర్త యశ్వంతరావ్) పుత్ర వియోగం భరించలేక మంచం పట్టి మరణించాడు. ముక్తాబాయి సహగమనం చేసింది. ఒంటరిగా మిగిలిన మహిళ- రాజ్యంలోని ప్రజలందరికీ పెద్ద దిక్కుగా మసులుతూ 1795 వరకు పరిపాలన కొనసాగించటమేగాక ఆదర్శ పరిపాలనా కర్తగా యశస్సు నార్జించింది. అతి తక్కువగా పన్నులు విధించటము, ప్రజలకు అధికారికంగా సదుపాయాలు సమకూర్చటము, శాంతి భద్రతల రక్షణ, నేరవిచారణ, పర్యావరణ పరిరక్షణ, పరిశ్రమల అభివృద్ధి మొదలైన ఎన్నోవిషయాలలో ఆమె నూతన ప్రమాణాలను నెలకొల్పింది.
శ్రద్ధతో అధ్యయనం…
రాజ్యనిర్వహణలోను, సేనలను నడిపించటంలోనూ, మల్హారరావుకు మంచి పేరు ఉండేది. ఎడ్లబండిపై ఆయుధాలు, మందుగుండు వగైరా పంపించే సమయంలో ఎడ్లకు మేత ఎలా లభిస్తుంది, ఎక్కడెక్కడ ఎలాంటి వ్యవస్థ చేయాలని ముందుగా ఆలోచించి, తగిన విధంగా వ్యవస్థ చేసిన తర్వాతనే కదలడానికి ఆదేశాలిచ్చేవాడు. ఇటువంటి చిన్నవిషయాల పట్ల కూడా శ్రద్ద వహించటం అహల్యబాయి నేర్చుకుంది. తక్కువ సైన్యాన్ని వినియోగించి, ఎక్కువ విజయాలను సాధించటం మల్హారరావు విధానం. ప్రజాధనాన్ని సద్వినియోగమయ్యేలా చూడటం తమ బాధ్యత అని, దానిని వ్యక్తిగత అవసరాలకు వాడరాదని కఠోర నియమంతో వారు వ్యవహారించారు. రాజ్య కోశాగారానికి సంబంధించిన లెక్కలను అహల్యాబాయి ప్రతిరోజూ చూస్తూ ఉండేది. వాటి దుర్వినియోగానికి ఎవరూ పాల్పడకుండా జాగ్రత్త వహించేది. ఫలితంగా కోశాగారంలో ఎప్పుడూ తగినంతగా ధనం అందుబాటులో ఉండేది.
నూతన రాజధాని మహేశ్వరం…
అహల్యా బాయి నర్మదా నదీ తీరంలో ఉన్న మహేశ్వరానికి రాజధానిగా చేసికొని నివసించింది. అది చిన్న గ్రామం అయినందున అన్ని రకాల వసతులు అక్కడ, నెలకొనే విధంగా వివిధ వృత్తుల వారు వచ్చి తమ పరిశ్రమలను, వ్యాపారాలను తెరవడానికి ప్రోత్సహించింది. వివిధ విషయాలలో నిపుణులైన వారికి ఆహ్వానించి వారికి నివాసాలు ఏర్పరిచింది. తెలంగాణ నుండి వేద విదుడైన గోళే శాస్త్రిని, గుజరాత్ నుండి జ్యోతిష్యశాస్త్ర విద్వాంసుడైన ప్రవీణ్ గణేశ్ భట్, రఘనాథ వైద్యుని, రత్నగరి (మహారాష్ట్ర) నుండి పూజారి రామచంద్ర రానడే గార్లను రప్పించి, నివాసము లేర్పరచి, గౌరవించింది. నర్మదా నది తీరంలో స్నానఘట్టాలను ఏర్పరిచింది. దేవాలయాలను నిర్మించింది (ఇప్పటికీ అక్కడ 60 దేవాలయాలను మనం చూడగలము).
తిరుగులేని రాజనీతి.. రాజనీతి..
అంతకు ముందు హోల్కర్ రాజ్యాంలో అధికారిగా ఉండిన గంగాధర్ చంద్రచుడ్‌కి నిరాధార అయిన ఈ మహిళ నుండి తాను రాజ్యాన్ని వశపరుచుకోగలనన్న ఆశ పుట్టింది. తన ఈ షడ్యంత్రంలో భాగస్వాములు కావాలని మరికొందరు ప్రముఖులను కూడా కలుపుకొని, పెద్ద సైన్యంతో ఇండోర్ పైకి వచ్చి పడ్డాడు. అహల్యాబాయి వడోదరలోని గైక్వాడ్‌కి నాగపూర్‌ని భోంస్లేకి, పుణేలోని శ్రమంత్ మాధవ రావ్ పీష్వాకి లేఖలు రాసి పంపింది. ఎటువంటి యుద్ధానికైనా మా సేనలు సిద్ధంగా ఉన్నాయి. మహిళా సైన్యంపై విజయం సాధించటంవల్ల మీ గౌరవమేమీ పెరగదు – ఓడిపోతే పరువు పోతుంది. ఆలోచించుకొని అడుగు ముందుకు వేయండని హెచ్చరించింది. పూణే నుండి వచ్చిన రగోబాకు తప్పటడుగు వేసినట్లుగా అర్థమైంది. మీ ఏకైక పుత్రుని కోల్పోయిన సందర్భంగా పరామర్శించ వస్తున్నానని మాట మార్చాడు. పరామర్శించ వచ్చేవారు పల్లకీలో రావచ్చు. ఈ రాజ్యం మీది, ఎన్నాళ్లయినా ఉండవచ్చు. ఇంత సైన్యంతో రావటమెందుకు? అని అహల్యాబాయి నిలదీసింది. సైన్యాన్ని వదిలిపెట్టి పల్లకీలో ఇండోర్‌కి వెళ్లి మర్యాద దక్కించుకున్నాడాయన.
అహల్య బాయి రణనీతి అందరికీ తెలియవచ్చింది. తుకోజీ సేనపతిగా ఉండేవాడు. అవసరమైన ఖర్చులకు మల్హారరావు గారి అనుమతితో కోశాగారం నుండి ధనం తీసుకొంటూ ఉండేవాడు. అహల్యబాయి పరిపాలనకు వచ్చిన తర్వాత ముందు తీసుకొన్న ధనానికి సంబంధించి పూర్తిగా లెక్కలు సమర్పించిన తర్వాతనే మరొకసారి ధనాన్ని విడుదల చేయటమనే పద్ధతిని ప్రవేశపెట్టింది. మొదట్లో కష్టమని తోచినా, క్రమంగా అందరూ ఆ పద్థతికి అలవాటుపడక తప్పలేదు. ఒకసారి నారో గణేశ్ అనే అధికారి పనితీరుపై అనుమానం వచ్చి అహల్యబాయి అతడిని బాధ్యతల నుండి తప్పించి, నిర్బంధంలో ఉంచింది, తుకోజీ అతడిని విడిచిపెట్టాడు. మళ్లీ విధుల్లోకి చేర్చుకున్నాడు. అహల్యబాయి నిర్ణయంలో తాను జ్యోక్యం చేసుకొన్నందుకు ఆమె కోపగిస్తు౦దనే భయంతో, తుకోజీ గ్వాలియార్ సంస్థానాధీశుడైన మహద్ జీ సిందే సహాయం కోరాడు. అహల్యాబాయికి నచ్చజెప్పి వ్యవహారం సర్దుబాటు చేయాలని ప్రార్థించాడు. ఆయన – నేను పేష్వా గారికి, మొగలులకు, భోంస్లేకి ఎవరికైనా ఒక మాట చెప్పి నెగ్గించుకోగలను, కానీ నేను అహల్య బాయికి చెప్పలేను. ఎందుకంటే ఆమె ఏదైనా ఒక పని చేసినదంటే, ఆ పని వెనకాల ఎంతో పరిశీలన, అధ్యయనమూ, అవగాహన ఉంటుంది. అటువంటి పనిని తిరగదోడమని నేనెలా చెప్పను?’ అన్నాడు. మహాద్ జీ సిందే చెప్పిన ఈ మాటలు అహల్య బాయి పరిపాలన విధానానికి తిరుగులేని ప్రశంసాపత్రం వంటిది. అప్పటి నుండి తుకోజీ కూడా అహల్య బాయి ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించటం జరిగింది.
ప్రజల సొమ్ము ప్రజలకే…
పనులను ప్రత్యక్షంగా పరిశీలించటం, ముందుగా రూపొందించిన ప్రతిపాదనలలో అవసరమైన మార్పులు చేయటం ద్వారా, ప్రజల సొమ్ము ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా శ్రద్ధ వహించేది. పీష్వా మరణానంతరం ఆయన ఆత్మ శాంతికి దానధర్మాలు చేయాలని ఆమె తలపెట్టింది. వాటిని రాజ్యకోశాగార ఖర్చులలో వ్రాసిన వారిని మందలించింది, ఆ ఖర్చులను తన కుటుంబ ఖర్చులలోకి మార్పించింది. ఇలా చాలా ఉదాహరణలు కనబడతాయి. అతి సామాన్య ప్రజలు కూడా తన వద్దకు వచ్చి తమ సమస్యలు చెప్పుకొనడానికి, పరిష్కారాలు పొందడానికి అవకాశమిస్తూ సాయం కాలాలు సుదీర్ఘ సమయం ఆమె దర్బారులో ఉండేది. వాద వివాదాలు, న్యాయ సమస్యలు అతి తక్కువ ఖర్చుతో పరిష్కరమయ్యే విధంగా వివిధ స్థాయిలలో న్యాయస్థానాలను అహల్యా బాయి ఏర్పరిచింది.
ప్రజాసంక్షేమం…
పర్యావరణ పరిరక్షణ గురించి, ఫల వృక్షాలను పెంచటం గురించి రైతులకు, సాధారణ ప్రజలకు అహల్య బాయి ఇచ్చిన ప్రోత్సాహం అనుసరణీయమైనది . రైతులు చేల గట్లమీద నిమ్మ, వేప, మేడి, మర్రి, మామిడి వంటి చెట్లు పెంచాలని ప్రోత్సహించింది. తద్వారా నీడను, ఫలాలను ఇచ్చే చెట్ల ద్వారా మనుషులకు, పక్షులకూ లభించే ప్రయోజనంతో భూసారం కొట్టుకు పోకుండా, రైతులకు వ్యవసాయంలోనూ లాభం కలిగేది. అహల్యాబాయి మట్టితో చేసిన శివలింగాలను పూజించి, వాటిని నదిలో నిమజ్జనం చేస్తుండేది. ఆ శివలింగాలలో కొన్ని రకాల ధాన్యం గింజలు, కొన్ని విత్తనాలూ ఉండేవి. అవి జలప్రవాహంలోని జలచరాలకు ఆహారంగా ఉపయోగపడటం గాని, విత్తనాలు ఎక్కడైనా గట్లను తాకితే అక్కడ అవి మొలకెత్తి వృక్షాలుగా ఎదగడం జరుగుతుందని ఆమె ఆలోచన.
అహల్యా బాయి పరిపాలనకు రాకముందు స్త్రీలకు ఆస్తి హక్కు ఉండేదికాదు. పుత్ర సంతానం లేకుండా ఎవరైనా మరణించినట్లయితే, వారి సంపద, ఆస్తులూ. రాజ్యానికి బదిలీ చేయబడేవి. అహల్యా బాయి దీనిని మార్చింది. భర్తను కోల్పోయిన విధవ అయిన స్త్రీ తన ఇచ్ఛానుసారంగా ఆ సంపత్తిని వినియోగించే అవకాశమిచ్చింది.
ఆలయ పునరుద్ధరణ…
దేశవ్యాప్తంగా అహల్యా బాయి పేరు నేటికీ స్మరింపబడడానికి గల ప్రధాన కారణం విదేశీ ముస్లింలు లేదా డిల్లీ సుల్తానులు, ఔరంగజేబు వంటి మొగలు పాదుషాలు విధ్వంసo చేసిన అనేక దేవాలయాలను పునరుద్ధరింపజేయటం. ఇలా పునరుద్ధరింపబడిన ఆలయాలు పశ్చిమాన ద్వారక, సోమనాథ్ క్షేత్రాల నుండి తూర్పున పూరీ వరకు, ఉత్తరాన కాశీ నుండి దక్షిణాన రామేశ్వరం వరకూ కనబడతాయి. ఆలయ పునరుద్ధరణతో పాటు యాత్రికుల సౌకర్యార్థం నదుల వద్ద స్నానఘట్టాలను, తీర్థక్షేత్రాలలో అన్న సత్రాలనూ ఏర్పరిచింది. స్థానఘట్టాల వద్ద మహిళలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయించింది. ఈ పనులన్నీ కూడా ఆమె రాజ్య కోశాగారం నుండి ఒక రూపాయి కూడా తీయకుండా స్వంత సంపద నుండే వెచ్చించింది. ఒకసారి ఆమె భగవద్గీత వినదలిచి పండితులను పిలిపించినదట. ఆ పండితుడు ధర్మ క్షేత్రే, కురు క్షేత్రే…! అంటూ ఆరంభించగానే, ఈ రోజుకు ఇక్కడ ఆపుదాం, క్షేత్రే, క్షేత్రే… ధర్మం కురు’ అని చెప్పారుగా, అది అమలు చేయనీయండి- అన్నదట. ఆమె ఉపయోగించిన రాజముద్ర మీద ‘శ్రీ శంకర ఆజ్ఞే వరూణ్’ అని ఉండేది. అంటే శంకర భగవానుని అజ్ఞ్యానువర్తిగా పాలన సాగించిన పుణ్యశ్లోకురాలు దేవి అహల్యాబాయి హోల్కర్.
విజయభారతి
NHRC సభ్యురాలు, భారత్