Home News కాకతీయ వారసులకు మేడారం సారె… ఆ జాతర వెనుక కథ నిజం కాదా?

కాకతీయ వారసులకు మేడారం సారె… ఆ జాతర వెనుక కథ నిజం కాదా?

0
SHARE

వనవాసీల దేవతలైన సమ్మక్క సారక్కలు నిరంకుశ కాకతీయులతో పోరాడి తమ ప్రాణాలను బలిచ్చారన్న పురాణ గాథ ఒకటి విస్తృతంగా ప్రచారంలో ఉంది. అయితే, దీనికి సంబంధించిన నిజానిజాలు తెలుసుకోడానికి, సమగ్ర పరిశోధన అవసరమని మేడారంలోని సమ్మక్క సారక్క ఆలయ అర్చకుల బృందం, సంస్కృతి – వారసత్వ పరిశోధన బృందం ‘టార్చ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ భావిస్తున్నాయి. మేడారంలోని సమ్మక్క సారక్క జాతరను తెలంగాణ కుంభమేళాగా భావిస్తారు.

సమ్మక్క అర్చకుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన అరుణ్‌ కుమార్‌ ఈ విషయమై తన అభిప్రాయాన్ని ఇలా వెల్లడించారు. “కాకతీయ పాలకులు, వన దేవతలైన సమ్మక్క సారక్క మధ్య సంబంధాల గురించి అనేక చారిత్రక, పౌరాణిక, కాల్పనిక కథలు, ఊహాగానాలు ప్రచారంలో వున్నాయి. సమ్మక్క, సారక్కలకు, కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి సైన్యానికి మధ్య జరిగిన యుద్ధం గురించి మా పూర్వీకులెవరూ చెప్పలేదు కనుక, అవి వాస్తవ దూరమైన విషయాలు. కాబట్టి అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలియడం లేదు. ఈ గాథలను ధ్రువీకరించడానికి ఎలాంటి చారిత్రక ఆధారాలు, సాక్ష్యాలు లేవు. చరిత్రను కూడా కొందరు వక్రీకరించారు. ఈ నేపథ్యంలో వనదేవతలైన సమ్మక్క, సారక్కల మూలాన్ని తెలుసుకోవడానికి చరిత్రపై సమగ్ర పరిశోధన జరగాల్సిన అవసరం వుంది” అన్నారు.

ఈ పరిణామాల నడుమ, కాకతీయ సామ్రాజ్యం పతనమైనప్పటి నుంచీ ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని జగదల్‌పూర్‌లో వుంటున్న ఓరుగల్లుకు చెందిన కాకతీయ పాలకుల వారసులను టార్చ్‌ సంస్థ కార్యదర్శి, జనగాం వాసి అయిన చరిత్ర పరిశోధకులు అరవింద్‌ ఆర్య పాకిడే ఫిబ్రవరి 25వ తేదీ రాత్రి వేళ కలిశారు. కాకతీయ వారసులకు అరవింద్ ‘‘సారె’’ను (తల్లిదండ్రులు తమ బిడ్డలకు కానుకగా ఇచ్చే చీర, రవికె, ఇతర వస్తువులు) బహుమతిగా ఇచ్చారు.

ఈ సారెను సమ్మక్క పూజారులే కాకతీయ వారసులకు పంపించారని, ఫలితంగా, వనవాసీల దేవతలైన సమ్మక్క-సారక్కలకు, కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి సైన్యానికి మధ్య జరిగిందనే ఏ విధమైన సాక్ష్యాలూ లేని యుద్ధ సంబంధమైన కథలకు ముగింపు పలికినట్లయ్యిందని అరవింద్ అన్నారు. కాకతీయుల వారసుడైన మహారాజా కమల్‌ చంద్రభంజ్‌ దేవ్, ఆయన కుటుంబీకులు సారెను అందుకున్నట్లు అరవింద్‌ తెలిపారు.

కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత ప్రతాపరుద్రుని కుటుంబ సభ్యులు కొందరు గోదావరి తీరం గుండా సాహస ప్రయాణం చేసి దండకారణ్యానికి చేరుకున్నారు. కాకతీయ వారసుడైన అన్నమదేవ్‌ జగదల్‌పూర్‌ కేంద్రంగా కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈయనను కాకతీయ వారసుడిగా బ్రిటిష్‌ చారిత్రక పరిశోధకులు నిర్ధారించారు. మహారాజా కమల్‌ చంద్ర భంజ్‌ దేవ్ ప్రస్తుతం అన్నమదేవ్‌ వంశస్థునిగా కొనసాగుతున్నారు.

మరోవైపు శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందిన దంతేశ్వరి మాత అక్కడి కాకతీయ వంశస్థులకు ఆరాధ్య దైవం. ఇదిలా వుంటే.. అసలు సమ్మక్క జస్మస్థలం బస్తర్‌ ప్రాంతమే అన్న వాదనలు కూడా వున్నాయి. దండకారణ్యంలో సమ్మక్కను ‘‘సదువాలి’’ గా పూజిస్తారని అరవింద్ చెప్పారు.