— ప్రదక్షిణ
అసలు మానవహక్కులు అంటే ఏమిటి? ప్రతి మానవుడికి సహజసిద్ధంగా ఉండే హక్కులను మానవహక్కులని పిలుస్తాము. ఇవి జాతి, మత, దేశ, లింగ, భాషలకు అతీతంగా సర్వత్రా, మానవులందరికీ వర్తించే హక్కులు; వ్యక్తుల జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, హింస, బానిసత్వం నుంచి స్వేచ్ఛ, విద్య, ఉపాధి హక్కు, భావప్రకటనా స్వేచ్చ తదితర హక్కులు మానవహక్కులుగా పరిగణిస్తున్నారు.
ప్రతి సంవత్సరం డిసెంబర్ 10 న యావత్ ప్రపంచం మానవహక్కుల రోజుగా పాటిస్తోంది. హక్కుల పరిరక్షణకై పునరంకితం అవుతోంది. ఐక్యరాజ్యసమితి (UNO) సర్వసభ్య సాధారణ సమావేశం 1945, 1948లో మనవ హక్కుల ప్రకటన పత్రం విడుదల చేసింది, ఇందులో ఆదర్శవంతమైన, ఆచరణీయమైన పౌర, సాంస్కృతిక, ఆర్ధిక, రాజకీయ, సామాజిక హక్కులను పరిరక్షించే సూత్రాలను పొందుపరిచింది. ప్రపంచ దేశాలు తమ దేశాలలో వీటిని అమలుపరచేందుకు వీటిని రూపొందించారు. వివిధ దేశాలు ఈ ప్రకటనాపత్రంపై సంతకాలు చేసి, తమ దేశ ప్రజల సమగ్ర హక్కులను కాపాడే విధంగా చట్టాలలో మార్పులు చేసి, హక్కుల పరిరక్షణకు, ప్రజల ఆకాంక్షల సిద్ధికి, ప్రజాస్వామ్య విస్తరణకు దోహద పడ్డాయి. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం 1965నుంచి వరుసగా ఎన్నెన్నో ఒడంబడికలపై సంతకం చేసింది. పౌర రాజకీయ హక్కుల ఒప్పందంపై (ICCPR) 1966లో, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల ఒప్పందంపై (ICESCR) 1966లో, జాతివివక్షతకి వ్యతిరేకంగా (ICERD)1965లో, స్త్రీలపై అన్నిరకాల వివక్షతలకి వ్యతిరేకంగా జరిగిన ఒప్పందంపై (CEDAW)1979లో, బాలల హక్కుల ఒప్పందంపై (CRC)1989లో, క్రూరమైన హింసాత్మక శిక్షలను వ్యతిరేకించే ఒప్పందంపై (CAT)1984లో మన దేశం సంతకాలు చేసింది. క్రమేణా ఈ సంస్థ మానవ హక్కుల పరిధిని, వికలాంగులు 2006 (CRPD), ఇతర అల్పసంఖ్యాక వర్గాలకు విస్తరింపచేస్తూ, వివక్షను ఎదిరించే హక్కుల పరిరక్షణను విశ్వవ్యాప్తం చేసింది. అంతకుముందున్న `యుఎన్ మానవహక్కుల కమిషన్’ బదులు, 2006లో `మానవ హక్కుల కౌన్సిల్’ ఏర్పాటైంది. ప్రపంచంలోని అన్ని దేశాలు, ప్రాంతాలలో మానవహక్కులను మానవాళి అందరికీ విస్తరింపచేయడం కౌన్సిల్ ప్రధాన లక్ష్యం.
వీటితోపాటు ఎన్నో ప్రపంచదేశాలు తమ దేశాలలో `మానవహక్కుల కమిషన్’లు ఏర్పరిచి, ప్రజల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్నాయి. మనదేశంలో కూడా, జాతీయ మానవహక్కుల కమిషన్ (NHRC) 1993లో ఏర్పాటైంది. దీనికి ప్రభుత్వం రాజ్యాంగ హోదా కల్పించింది. మానవహక్కుల పరిరక్షణ, వృద్ధి, రాజ్యాంగంలోని `పౌరుల జీవించే హక్కు, స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం’ కాపాడడం, మానవహక్కులకు భంగం వాటిల్లినపుడు, న్యాయస్థానాల ద్వారా వాటిని పునరుద్ధరించడం ఈ మానవహక్కుల కమిషన్ బాధ్యత. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి కమిషన్ అధ్యక్షుడుగా ఉంటారు, ఇతర జాతీయ కమిషన్ల (మహిళా, ఎస్సి, ఎస్టి, మైనారిటీ, బిసి, బాలలు, వికలాంగులు)అధ్యక్షులు ఎక్స్అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు. అంతేకాక, అనేక రాష్ట్రాలలో కూడా రాష్ట్రస్థాయి మానవహక్కుల కమిషన్లు ఏర్పాటు చేయబడ్డాయి, మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ కమిషన్లు ఏర్పాటై ఉన్నాయి.
ప్రస్తుత పరిస్థితులు – భారత్ ఎదుర్కోవాల్సిన సవాళ్ళు
ప్రపంచంలో ఆధిపత్యంలో ఉన్న దేశాలు, అధిక సంఖ్యలో ఉన్న మెజారిటి క్రిస్టియన్ ముస్లిమ్ దేశాలు, లేక ఆయా దేశాలలో క్రిస్టియన్లు ముస్లిములు అధిక జనాభాకల దేశాలు, సహజంగానే `ప్రపంచ మానవహక్కుల కౌన్సిల్’ లో ఎక్కువ శాతం సభ్యులుగా కొనసాగుతున్నారు. ఆ దేశాలు అంతర్జాతీయ మానవహక్కుల సదస్సుల్లో, జమ్మూకాశ్మీర్ లో ముస్లిముల మానవహక్కులకి భారత ప్రభుత్వం, సైన్యం ఎంతో విఘాతం కలిగిస్తున్నాయి అనే తప్పుడు వార్తలు, కథలు చాలా దశాబ్దాలు ప్రచారం చేసాయి. ఈ వార్తలను భారత ప్రభుత్వం ఖండించినా అవి ఎవరూ పట్టించుకోలేదు. కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో `జిహాద్’ పేరిట జరిగిన హిందువుల హత్యలు, స్త్రీలపై మానభంగాలు, వేలాది దేవాలయాల విధ్వంసo, ఆఖరికి లక్షలాది హిందువులను అక్కడినుంచి తరిమికొట్టడం వంటి దురాగతాలను సాటి భారతీయులు కాని, భారత మానవహక్కుల కమిషన్లు, సంఘాలు/ సంస్థలు ఎందుకు విస్మరించాయో తెలియదు. పాకిస్తాన్-ప్రేరేపిత ఈ మతహింసపై, భారత ప్రభుత్వ వాణి కూడా అంతర్జాతీయంగా బలంగా వినిపించలేదు. అయితే భారతదేశానికి వ్యతిరేకంగా మాత్రం, ఇక్కడి అల్పసంఖ్యాక వర్గాలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని, ప్రజాస్వామ్యానికి, మానవహక్కులకి భంగం వాటిల్లుతోందని, కొందరు వ్యక్తులు, సంస్థలు పనికట్టుకునిచేసే అసత్య వార్తలు మాత్రం బాగా ప్రచారoలో ఉన్నాయి.
వారు చాలాకాలంగా ప్రపంచ దేశాలలో, మరీ ముఖ్యంగా భారతదేశం దేశం నుంచి విడిపోయి, రెండు ఇస్లామిక్ దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో, గత కొన్ని దశాబ్దాలుగా హిందువులకి వ్యతిరేకంగా జరిగే మానవహక్కుల ఉల్లంఘనలను ఎప్పుడూ పట్టించుకోలేదు. భారత్ లోని 135కోట్లమంది ప్రజలు, ముఖ్యంగా హిందువులు భారత ప్రభుత్వం కూడా ఆ దేశాలలో హిందువులపై జరిగే దౌర్జన్యo, హత్యాకాండ, హింస, బలవంతపు మతమార్పిడిలు, ప్రాణహాని, స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నా, అంతర్జాతీయంగా వాటిపై ప్రతిస్పందించలేదు. అసలు ఎటువంటి వార్తలు కూడా బయటకి వచ్చేవి కావు. ఇటివలికాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని చాలా సంఘటనలు ప్రతినిత్యం తెలుసుకోగలుగుతున్నాము. అయినా ఆశ్చర్యకరంగా భారత మీడియాలోగానీ, మెజారిటీ భారతీయులలోగానీ ఎటువంటి స్పందనా ఉండదు. `ఆప్ఇండియా’వంటి కొన్ని వెబ్సైట్లు మాత్రం హిందువుల మానవహక్కుల ఉల్లంఘనలపై కధనాలు వ్రాస్తుండడం అభినందనీయం. కొన్ని ఉదాహరణలు- 2001లో బంగ్లాదేశ్ భోలా జిల్లాలో హిందూద్వేషo కారణంగా, ఏకంగా 200మంది హిందూమహిళలపై మూకుమ్మడి అత్యాచారాలు జరిగాయి. 2017లో బంగ్లాదేశ్ రంగాపూర్ లో ఒక హిందూ యువకుడి ఫేస్బుక్ పోస్ట్ కారణంగా హిందువులను వెళ్ళగొట్టి వారి ఇళ్ళు తగలబెట్టారు. జూన్ 2020లో పాకిస్తాన్ సింద్ గోలార్చిలో 102మంది హిందువులు బలవంతపు మతమార్పిడికి గురయారు. అక్కడి దేవాలయం మసీదుగా మారింది. సెప్టెంబర్2020లో సింద్ రాష్ట్ర సంఘర్ లో 171 భిల్ సముదాయ హిందువులు బలవంతపు మతమార్పిడికి గురయారు. పాకిస్తాన్ లో హిందూ అమ్మాయిల బలాత్కరణ, బలవంతపు పెళ్లిళ్లు అసంఖ్యాకం. హిందువుల ఇళ్ళు తగలబడిపోవడం, దేవాలయాలు మసీదులుగా మారడం కోకొల్లలు. కరోనా కాలంలో కూడా, హిందువులకి మందులు, చికిత్స ఇవ్వలేదనే వార్తలు అనేకం వచ్చాయి. పాకిస్తాన్ లో ఉన్న ` మతదూషణ’ చట్టంకింద, అనేకమంది హిందువులపై తప్పుడు కేసులు పెడుతుంటారు.
పాకిస్తాన్ , బంగ్లాదేశ్ ల్లో హింసకు గురై, ప్రాణాలు అరచేత పెట్టుకుని పారిపోయిన హిందువులు సిక్ఖులకు కొంత వెసులుబాటు కల్పిస్తూ, డిసెంబర్2019లో భారత ప్రభుత్వం, `పౌరసత్వచట్ట సవరణలు’ (CAA 2019) చేసినపుడు, ఆ సవరణలకి మనదేశంలో మైనారిటీలకి ఎటువంటి సంబంధం లేకపోయినా, దేశంలో అసంఖ్యాక ప్రాంతాల్లో సుదీర్ఘకాలం నిరసనలు ప్రేరేపించడం జరిగింది. ఢిల్లీలో షాహీన్బాగ్ ప్రాంతాన్ని దిగ్బంధనం చేసి, చివరికి మార్చ్2020లో ఢిల్లీ అల్లర్లు సృష్టించారు, వాటిల్లో 50మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంటలిజెన్స్ అధికారి అంకిత్ శర్మను అతి కిరాతకంగా హింసించి చంపి, మురికి కాలవలో పడేసారు. కేవలం `హిందూద్వేషం’తో, శరణార్ధి హిందువులకి మానవహక్కులు లేకుండా చేయాలని ఈ అక్రమాలన్నీ జరిగాయి. అయితే కోట్లాదిమంది బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు ఈ దేశంలో అక్రమంగా చట్టవిరుద్ధంగా నివాసం ఏర్పరుచుకున్నా, ఆశ్చర్యకరంగా ఎప్పుడూ ఎటువంటి నిరసనలు జరగలేదు. parties.hen adn kingd
హిందువుల జీవించే హక్కు
కాశ్మీర్ లాగే, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో, ముఖ్యంగా బెంగాల్, కేరళ, హర్యానా, హైదరాబాద్ వంటి కొన్ని ప్రాంతాల్లో, కొన్ని వర్గాలు వివిధ రకాలుగా హిందువులపై ఆధిపత్యం చెలాయిస్తున్నా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవు, దౌర్జన్యాలపై ఎటువంటి చర్యలు తీసుకోవు, అయినా ఇవి హిందువుల మానవహక్కుల ఉల్లంఘనగా పరిగణించబడట్లేదు. ఇటీవలి కాలంలో, మహారాష్ట్ర పాల్ఘర్ హిందూ సాధువుల హత్య, ఉత్తరప్రదేశ్ లో హిందూ కార్యకర్త కమలేశ్ తివారీ దారుణ హత్య, తెలంగాణాలోని వరంగల్ లో హిందూ పూజారి హత్య, తమిళనాడులో హిందూ కార్యకర్తలు రామలింగం, అరుణ్ ప్రకాష్ హత్యలు, తెలంగాణా భైన్సాలో హిందువుల ఇళ్ళపై దాడి, ఎన్నోచోట్ల `గోవుల స్మగ్లింగ్’ని ఆపే ప్రయత్నం చేసే గోరక్షకుల హత్యలు, హిందూ యువతులను ప్రేమ పేరుతో చేసే `లవ్ జిహాద్’ మోసాలు, యువతుల హత్యలు, బెంగుళూరులో ఒక ఫేస్బుక్ పోస్ట్ పై హిందువులపైన, పోలీస్ స్టేషన్లపైన దాడులు, ఇంకా అనేకానేక సంఘటనలు, కేవలం `హిందూ ద్వేషంతో’ హిందూస్తాన్ అని పిలిచే భారత్ లో జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ మిర్జాపూర్ లో తివారీ సోదరుల హత్యలు, గోపాల్గంజ్ లో రోహిత్ జస్వాల్ హత్య, ఢిల్లీలో అంకిత్ సక్సేనా హత్య, విద్యార్థిని నికితా తోమర్ హత్య, ఇంకా ఎన్నెన్నో ఈ కోవకి చెందుతాయి. జాతి, మత విద్వేషంతో జరిగే ఈ హత్యలు, దౌర్జన్యాలు, అరాచకాలు మానవహక్కుల ఉల్లంఘన క్రిందకే వస్తాయి. ఇతర దేశాలు ఇటువంటి హింసాదౌర్జన్యాలు ఎంత తీవ్రంగా తీసుకుంటాయో, మనం ఇటీవల ఫ్రాన్స్, ఆస్ట్రియా, డెన్మార్క్, బ్రిటన్ వంటి దేశాలలో గమనించాము.
హిందూ మత- సాంస్కృతిక హక్కులు
పైన చెప్పిన ఉదాహరణలు, హిందువుల జీవించే హక్కును ఉల్లంఘిస్తుంటే, హిందువుల తమ మతాన్ని స్వేచ్ఛగా పాటించే హక్కు, ఇతర సామాజిక, సాంస్కృతిక మానవహక్కులను దశాబ్దాలుగా విచ్చలవిడిగా ఉల్లంఘిస్తూ నిరాటంకంగా క్రిస్టియన్ మతమార్పిడిలు చర్చ్ ద్వారా సాగిపోతున్నాయి. కోట్లాదిమంది హిందువులు, మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, ఈశాన్య రాష్ట్రాలలో, దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాలలో, చాలా శాతం జనాభాను మతమార్పిడి చేయడమే కాక, ఈ మార్పిడి జనాభా లెక్ఖలలో నమోదు కాకుండా జాగ్రత్త పడ్డారు; హిందూ పేర్లతో కొనసాగుతూ, హిందువులకి చెందాల్సిన రిజర్వేషన్లవంటి సౌకర్యాలను హరించారు. అలాగే ముఖ్యంగా దక్షిణ భారతంలో హిందూ దేవాలయాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉంటాయి, వారు ఇష్టానుసారంగా వాటిని నిర్వహిస్తారు. భక్తులు హుండిలో వేసే డబ్బులతో, భక్తులనుంచి టికెట్ల రూపంలో వసూలు చేసే డబ్బుతో ప్రభుత్వ లౌకికమైన కార్యక్రమాలు చేస్తుంటారు. దేవాలయాల భూములు, ఇతర ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నా, ప్రభుత్వం హిందూ సమాజానికి సమాధానం చెప్పదు, ప్రభుత్వమే భూముల పంపిణి చేస్తుంటుంది. బ్రిటిషు కాలంనాటి హిందూ వ్యతిరేక చట్టాలు, 21వ శతాబ్దంలో కూడా, హిందువుల నిర్లక్ష్యం కారణంగా కొనసాగుతున్నాయి. చర్చ్ లు, మసీదులు, వారి స్థిరచరాస్తులు అన్నీ వారి మతసంస్థల క్రిందే ఉన్నాయి, కాని హిందూ దేవాలయాలు మాత్రమే ప్రభుత్వం క్రింద ఉంటాయి. అయితే నిజమైన లౌకిక దేశంలో ఈ పరిస్థితి ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్ లో గతకొంత కాలంగా 18దేవాలయాలపైన ఏదోఒకరకమైన దాడులు జరిగాయి, అంతర్వేది క్షేత్రంలో శ్రీనరసింహస్వామి వారి రధం తగలబడిపోగా, ఇంతవరకు నేరస్థులు ఎవరినీ ప్రభుత్వ యంత్రాంగం పట్టుకోలేదు. కానీ ఇదే సంఘటనలో హిందూసమాజం నిరసన ప్రదర్శన జరపగా, అక్కడున్న చర్చ్ ప్రహరీగోడపై రాయి తగిలి పెచ్చు ఊడిపోయిందని, 40మందిని అరెస్ట్ చేసి కొంతకాలం జైల్లో పెట్టారు.
ఇవన్నీ హిందువుల సామాజిక సాంస్కృతిక మానవహక్కుల ఉల్లంఘనే అని భారతీయులు అర్థం చేసుకోవాలి. హిందువులకి కూడా సమాన మానవహక్కులు ఉంటాయని భారతదేశంతో సహా ప్రపంచం అర్థంచేసుకుని, హిందువుల మానవహక్కుల పరిరక్షణకై కృషి చేయడం మంచిది.
(ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం – 10 డిసెంబర్)