తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కందకుర్తికి ఘనమైన చరిత్ర ఉంది. గతంలో ఈ ప్రాంతాన్ని పలు రాజవంశాలు పరిపాలించాయి. హరిద్ర, మంజీర, గోదావరి నదులతో కూడిన త్రివేణి సంగమానికి నెలవు ఈ ప్రాంతం. వనవాస సమయంలో శ్రీరాముడి ఇక్కడి గోదావరి తీరంలో సంచరించి శివుడిని కొలిచినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆర్.ఎస్.ఎస్ వ్యవస్థాపకులు దివంగత హెడ్గేవార్ జన్మించిన గడ్డ కావడంతో జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్న ప్రాంతం. ఇక్కడ హెడ్గేవార్ స్మృతి మందిరం ఉంది. సనాతన భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలు, చరిత్ర, విద్య, వైద్యం తదితర అనేక అంశాలకు చెందిన రచనలు ఈ ప్రాంతంలో రచించబడ్డాయి. ఎన్నో విశిష్టతలతో కూడిన రచనలు ఈ ప్రాంతంలో వెలుగుచూశాయి. వాటిని డిజిటలైజేషన్ చేసి భావితరాలకు అందించేందుకు ‘పతంజలి రిసోర్సు సెంటర్’ హరిద్వార్ ఆధ్వర్యంలో ప్రముఖ యోగా గురువు రాందేవ్ సంకల్పించారు. హస్త లిఖిత గ్రంథాల డిజిటలైజేషన్ చేపడుతున్నారు. తద్వారా కందకుర్తి ఖ్యాతి విశ్వవ్యాప్తం కానున్నది.
ప్రపంచానికి తెలియనున్న కందకుర్తి చరిత్ర:
- ఈ ప్రాంతంలో వెలుగుచూసిన 700 హస్త లిఖిత గ్రంథాల డిజిటలైజేషన్
- సంకల్పించిన యోగా గురువు రాందేవ్
- ‘పతంజలి రిసోర్సు సెంటర్’ హరిద్వార్ ఆధ్వర్యంలో డిజిటలైజేషన్
- కందకుర్తిని సందర్శించి పని పూర్తిచేసిన యోగా గురువు ప్రతినిధి ఆచార్య అఖిలేశ్ ఆనంద్
ఘన చరిత్రకు నిలయం ఈ ప్రాంతం :
సనాతన భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలు, చరిత్రను భావితరాలకు అందించేందుకు ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా సంకల్పించారు. దీనికోసం పతంజలి సంస్థ ఆధ్వర్యంలో చారిత్రక గ్రంథా ల డిజిటలైజేషన్ ఆయన శ్రీకారం చుట్టా రు. డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని 2017 మే 3న హరిద్వార్ (ఉత్తరాఖండ్)లో ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా పతంజలి రిసెర్చ్ సెంటర్ ప్రారంభించారు. దేశంలోని చారిత్రక ప్రాంతాలు, చరిత్ర, పురాణాలు, ఇతిహాసాలు, సంస్కృతీ సంప్రదాయాలు, వైద్య, పురాతన గ్రంథాలు, చేతిరాత్ర ప్రతులను గుర్తించి డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోనే చారిత్రక ప్రాంతమైన కందకుర్తిపై రాందేవ్ దృష్టిసారించారు. ఈ ప్రాంత చరిత్ర, పురాతన గ్రంథాలను గుర్తించి డిజిటలైజేషన్ పూనుకున్నారు.
కందకుర్తికి ఘన చరిత్ర:
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి గ్రామానికి చెందిన చరిత్ర పరిశోధకుడు యాదవరావు వద్ద అందుబాటులో 700 లిఖిత గ్రంథాల డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఆ లిఖిత గ్రంథాలను యాదవరావు వద్ద సురక్షితంగా ఉంచి, సీడీ రూపంలో సేకరించి ఆన్ పొందు పర్చేందుకు రాందేవ్ తన ఆశ్రమంలో వ్యాకరణ, ఆయుర్వేద ఆచార్యులు అఖిలేశ్ కందకుర్తి పంపించారు. ఆయన నెల రోజుల పాటు గ్రామంలో ఉండి గ్రంథాల్లోని ప్రతి ఒక్క అంశాన్ని సీడీలో పొందుపరుస్తున్నారు. మారుమూల గ్రామమైన కందకుర్తికి ఘన చరిత్ర ఉంది. ఈ ప్రాంత చరిత్ర, ఇక్కడ వెలుగుచూసిన గ్రంథాలు, సంస్కృతీ సంప్రదాయాలను విశ్వవాప్తం చేయడానికి డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఇది తెలంగాణకు గర్వకారణం కానున్నది. కందకుర్తిలోని త్రివేణి సంగమం, ఆర్.ఎస్.ఎస్ వ్యవసాప్థపకులు స్వర్గీయ హెడ్గేవార్ స్మృతి మందిరం గురించి ప్రపంచానికి తెలియజేయనున్నారు. తెలిసీ తెలియక చాలామంది తమ వద్ద పురాతన హస్త లిఖిత గ్రంథాలను పారవేస్తున్నారని, ఎవరి వద్దనైనా చేతిరాత గ్రంథాలు ఉంటే హరిద్వార్ అఖిల భారతీయ పతంజలి యోగాపీఠంలోని లైబ్రరీలో సంప్రదించాలని ఆచార్య అఖిలేశ్ ఆనంద్ సూచించారు. పురాతన చేతిరాత గ్రంథాలను తమకు అందజేస్తే వాటిని డిజిటలైజేషన్ చేసి వాటిని తిరిగి ఇస్తామని ఆయన పేర్కొన్నారు.
కందకుర్తిలో హస్త లిఖిత ప్రతుల ఉన్న విషయం తెలిసింది ఇలా..:
కందకుర్తి గ్రామానికి చెందిన చరిత్ర పరిశోధకుడు యాదవరావు నిజామాబాద్ నగరంలోని డాక్టర్ మాధవి వద్దకు వెళ్లినప్పుడు రామారావు అనే వ్యక్తి అక్కడ ఆయనకు పరిచయం అయ్యాడు. నా దగ్గర అనేక హస్త లిఖిత, ఆయుర్వేదిక గ్రంథాలు ఉన్నాయని ఆ సందర్భంలో యాదవరావు దృష్టికి రామారావు తీసుకెళ్లారు. మరుసటి రోజు రామారావు కందకుర్తి గ్రామాన్ని సందర్శించి వాటిని పరిశీలించి ఈ విషయాన్ని హైదరాబాద్ హస్త లిఖిత భాండాగారానికి సమాచారం అందించారు. అక్కడ పనిచేసే విద్యార్థి ఆయుర్వేద గ్రంథాల్లో కొన్నింటిని డిజిటలైజేషన్ చేశాడు. ఆ డిజిటలైజేషన్ చేసిన సీడీని కాపీ చేసిన యాదవరావు… దానికి ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాకు పంపారు. భావితరాలకు ఎంతో ఉపయోగపడే హస్త లిఖిత గ్రంథాలను డిజిటలైజేషన్ చేసేందుకు ఆచార్య అఖిలేశ్ ఆనంద్ కందకుర్తి పంపారు. కందకుర్తిలో నివాసముండే చరిత్ర పరిశోధకుడు యాదవరావు ఇంటికి 2019 జూన్ 30న ఆచార్య అఖిలేశ్ ఆనంద్ చేరుకున్నాడు. గ్రామంలో సుమారు నెల రోజుల పాటు నివాసముండి సుమారు 700 రాత ప్రతులను గ్రంథాలను తను సేకరించి ఆన్ లైన్ లో నమోదు చేశారు.
– నమస్తే తెలంగాణా సౌజన్యంతో