సుప్రసిద్ధ తెలుగు రచయిత్రి, రసాయన శాస్త్రవేత్త, ‘సోషల్ కాజ్’ సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ సోమరాజు సుశీల బుధవారం తెల్లవారుజామున స్వర్గస్తులయ్యారు. వారి వయసు 75 సంవత్సరాలు. కథా రచన ద్వారా వేలాది మంది తెలుగువారి హృదయాలను గెలుచుకున్న సోమరాజు సుశీల గారు రాష్ట్ర సేవికా సమితి, బౌద్దిక్ ప్రముఖ్ గా, ప్రాంత సంపర్క్ ప్రముఖ్ గా 2014 వరకు బాధ్యతలు నిర్వర్తించారు.
కెమిస్ట్రీలో పీహెడీ చేసిన సోమరాజు సుశీల ఆంధ్రప్రదేశ్ నుండి ఆ విభాగంలో పీహెడీ చేసిన తొలి మహిళగా ఖ్యాతి సంపాదించారు. విజయవాడ స్టెల్లా మేరీ కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపకురాలిగా రెండేళ్లు పనిచేసిన అనంతరం 1966 నుండి 1974 వరకు పూణేలోని నేషనల్ కెమికల్ లాబరేటరీ (NCL)లో పనిచేసారు. అనంతరం 1974లో హైద్రాబాదులో ‘భాగ్యనగర్ లేబొరేటరీస్’ పేరిట సంస్థను ఏర్పాటు చేశారు.
అఖిల భారత మహిళా శాస్త్రవేత్తల సంఘం సభ్యురాలిగా, భారతీయ తయారీ సంస్థల సంఘం అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించిన సోమరాజు సుశీల వృత్తి జీవితంలో ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ సేవా కార్యక్రమాల కోసం తమ మిగిలిన సమయాన్ని వెచ్చించేవారు. ‘అపరాజితా సేవా సమితి’, ‘రాణి రుద్రమదేవి ట్రస్ట్’లకు సభ్యురాలిగా వ్యవహరించారు. ‘తిరుమల తిరుపతి సంరక్షణ సమితి’ ఉపాధ్యక్షురాలిగా తిరుమల సంరక్షణోద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు.
రచనా వ్యాసంగాలపై అపరిమితమైన ఆసక్తి కనబరిచే సోమరాజు సుశీల ‘చిన్న పరిశ్రమలు – పెద్ద కథలు’తో రచయిత్రిగా సాహిత్య రంగప్రవేశం చేశారు. తెలుగులో ఎన్నో జాతీయవాద రచనలు చేశారు. ‘ఇల్లేరమ్మ కథల’తో ఇంటింటా పరిచయమయ్యారు. దాదాపు ప్రతికథలోనూ కనిపించే మానవతా స్పర్శ,, హృదయావిష్కరణ ఇది ‘మన జీవితానుభవమే’ అని పాఠకులు అనుకునేలా చేస్తాయి.