–వేదుల నరసింహం
స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ చీకటి ఘట్టం. ప్రజాస్వామ్య పునాదులను కదలించడానికి నాటి ప్రధాని ఇందిరా గాంధీ నియంతగా వ్యవహరించిన తీరు, ఆ నియంతృత్వ విధానాలను ఎదిరించి తిరిగి ప్రజాస్వామ్య వ్యవస్థను పట్టాలకు ఎక్కించిన ఘనత దేశ ప్రజలదే. 1975, జూన్ 25 అర్ధరాత్రి ఎమర్జెన్సీ ప్రకటించగా, 1977 మార్చ్ 21 అర్ధరాత్రి రద్దు చేయబడింది. సుమారు 21 నెలలపాటు కొనసాగిన ఆ కాలఖండంలో అనేక వేలమంది రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు నిర్బంధించబడ్డారు. సుమారు లక్షా పాతికవేలమంది జైలుపాలు కాగా, అందులో 90 శాతం మంది ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలే.
ఎమెర్జెన్సీ సమయంలో నియంత ఇందిరాగాంధీ తన ప్రత్యర్ధులను జైలుపాలు చేయడంతోపాటు ప్రజాస్వామ్య హక్కులను హరించివేసింది. రాజ్యాంగం కల్పించిన పౌరహక్కులు హరించివేయబడ్డాయి. ప్రచార, ప్రసార మాధ్యమాలపై ఆంక్షలు అమలయ్యాయి. పత్రికలపై ముందస్తు సెన్సార్ షిప్ ప్రవేశపెట్టారు. ఏ వార్త అయినా సంబంధిత ప్రభుత్వ అధికారి ఆమోదిస్తే తప్ప ప్రచురణకు నోచుకోని పరిస్థితి నెలకొంది. ఆర్ ఎస్ ఎస్ తో సహా అనేక సంస్థలను నిషేధించారు. క్రమశిక్షణ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులపై ఆంక్షలు, నిఘా మొదలైంది. నియంత ఇందిరాగాంధీ, ఆమె పాలనకు వ్యతిరేకంగా ఏ చిన్న వ్యాఖ్య చేసినా అరెస్ట్ చేసి జైలులో పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇందిర కుమారుడు సంజయ్ గాంధీ పెత్తనం నడిచింది. నిర్బంధ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు జరిగాయి. రహదారుల విస్తరణ పేరుతో ముందస్తు నోటీసులు లేకుండా ఇళ్లను కూల్చివేశారు. ఇలా అంతటా నిర్బంధ విధానాలు కొనసాగాయి.
అయితే ఈ పరిణామాలతో సాధారణ ప్రజలు భయభ్రాంతులకు గురైనప్పటికీ, ప్రతిపక్ష రాజకీయ నాయకులు, ఆర్ ఎస్ ఎస్ వంటి స్వచ్ఛంద సంస్థలు మౌనంగా ఊరుకోలేదు. ఇందిరా నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా అజ్ఞాత ఉద్యమాన్ని నిర్వహించాయి. ప్రభుత్వ అవకతవక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం తీసుకువచ్చాయి. అనేక వేలమందిని నిర్బంధించినప్పటికీ దేశవ్యాప్తంగా అజ్ఞాత ఉద్యమం కొనసాగింది. ఈ ఉద్యమానికి నేతృత్వం వహించి, సమన్వయంతో విజయవంతమైన పోరాటం కొనసాగించిన ఘనత ఒక్క ఆర్ ఎస్ ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్)కె దక్కుతుంది.
ఎమర్జెన్సీ ప్రకటించి నెలరోజులు పూర్తైనప్పుడు 1975 జులై 26న ఆర్ ఎస్ ఎస్ దేశవ్యాప్తంగా వ్యక్తిగత సత్యాగ్రహాలు, గంటానాదాల కార్యక్రమాలు చేపట్టింది. దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో గంటలు మ్రోగించడం ద్వారా ప్రజలు తమ నిరసన తెలియజేశారు. 1975 జులై 26 నుంచి పదిరోజులపాటు వ్యక్తిగత సత్యాగ్రహాలు జరిగాయి. అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలలో ప్రముఖులు ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ సత్యాగ్రహం చేసి అరెస్ట్ అయ్యారు.
ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమపు రెండవ అంకంలో 1975 నవంబర్ 14 నుంచి 1976 జనవరి 26 వరకు సత్యాగ్రహాలు జరిగాయి. ప్రతివారం పది, 15మందితో అన్ని జిల్లాలు, చిన్నచిన్న పట్టణాలలో సత్యాగ్రహాలు చేశారు. అనేకచోట్ల మహిళా సత్యగాహాలు కూడా చేపట్టారు. కరపత్రాలు పంచుతూ ప్రజలను చైతన్యం చేసి అరెస్ట్ అయ్యారు. అంతకుముందు 1975 ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అజ్ఞాత కార్యకర్తలు కరపత్రాలను పంచారు. ప్రజాస్వామ్యాన్ని ఇందిరా గాంధీ అపహాస్యంపాలు చేస్తున్న వైఖరిని ఆ కరపత్రాల్లో తీవ్రంగా ఎండగట్టారు. ఈ ఉద్యమంలో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నప్పటికి మొత్తం పోరాటం లోక సంఘర్ష సమితి (ఎల్ ఎస్ ఎస్) పేరుమీద లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్ నాయకత్వంలో జరిగింది.
పత్రికలపై సెన్సార్ షిప్ ఉండడంతో అన్ని భాషలలోనూ అజ్ఞాత పత్రికలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా చిన్న చిన్న పుస్తకాలు ముద్రించి పంపిణీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వందేమాతరం, ఎక్స్ రే, గర్జన, అంతర్వాణి, ప్రజావాణి, జనవాణి పేర్లతో అజ్ఞాత పత్రికలు ప్రచురించారు. తొలిరోజుల్లో వివిధ పేర్లతో అజ్ఞాత పత్రిలౌ వెలువడినప్పటికి చివరివరకు వందేమాతరం, ఎక్స్ రే పత్రికలు కొనసాగాయి.
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా 1975 ఆగస్ట్ 15న ఆనాటి గవర్నర్ జస్టిస్ ఓబుల్ రెడ్డి భీమునిపట్నంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కరపత్రాల పంపిణీ జరిగింది. అదేవిధంగా తణుకులో జరిగిన గవర్నర్ కార్యక్రమంలో కూడా కరపత్రాలు పంచారు. 1976 జనవరిలో విశాఖపట్నంలో జరిగిన సంజయ్ గాంధీ సభలో వైద్య విద్యార్ధులు ధర్నా చేశారు. ఇలా రాష్ట్రం అంతటా అన్ని కీలకమైన సభల్లో అజ్ఞాత సాహిత్య వితరణ జరిగింది. దేశంలో జరుగుతున్నా అన్ని విషయాలు అజ్ఞాత పత్రికల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉండేవి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాలకు చెందిన సుమారు 250 మందిని `మీసా’ చట్టం కింద అరెస్ట్ చేశారు. సుమారు రెండున్నర నెలలపాటు జరిగిన సత్యాగ్రహాల్లో 354 స్థలాల్లో 5వేలమంది సత్యాగ్రహం చేశారు. వీరిలో 1,655మందిని అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో డి ఐ ఆర్ చట్టం కింద 703మందిని అరెస్ట్ చేయగా వీరిలో 672మంది ఆర్ ఎస్ ఎస్ పరివార సంస్థలకు చెందినవారే. దేశవ్యాప్తంగా మొత్తం 23వేలమంది మీసా, డి ఐ ఆర్ కింద అరెస్ట్ చేశారు. ఒక లక్షా 54 వేలమంది సత్యాగ్రహం చేశారు. ఈ గణాంకాలన్నీ అందినంత సమాచారం మేరకే.
21 నెలలపాటు మహా ఉధృతంగా సాగిన అజ్ఞాత ఉద్యమ ఫలితంగా 1977 మార్చి మూడవ వారంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల్లో శ్రీమతి ఇందిరా గాంధీతోసహా కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం సంభవించింది. పాత కాంగ్రెస్, భారతీయ జనసంఘ్, లోక్ దళ్, సోషలిస్ట్ పార్టీల విలీనంతో ఏర్పడిన జనతాపార్టీ లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. ఈ అఖండ విజయం భారత పోరులది, ప్రజాస్వామ్యానిదే.
(రచయిత సీనియర్ జర్నలిస్ట్)
This article was first published in 2019