నవంబర్ 18 సూరూజీ సంస్మరణ దినం సందర్భంగా
సూరూజీ ప్రచారకులందరికీ ఒక దీపస్తంభంగా ఉండేవారు. సుదర్శన్జీ సర్సంఘచాలక్ బాధ్యతల నుండి తప్పుకునే ముందు తగిన వ్యక్తిని సంప్రదించాలని చెన్నై వెళ్ళి సూరూజీని సంప్రదించారట. మోహన్ భాగవత్జీకి పగ్గాలు అప్పగించేముందు సూరూజీని సంప్రదించి నిర్ణయం తీసుకున్నానని సుదర్శన్జీ ప్రతినిధి సభకు వెల్లడించారు. అప్పటికి సూరూజీ అనారోగ్యం వల్ల ప్రయాణించే స్థితిలో లేరు. అనారోగ్యం కారణంగా బాధ్యతలకు దూరమైనప్పటికీ కురువృద్ధులైన సూరూజీ ప్రాముఖ్యం చెక్కు చెదరనిదని ఈ ఉదంతం నిరూపిస్తోంది.
అది 1983వ సంవత్సరం. హైదరాబాద్లో సంఘశిక్షావర్గ జరుగుతోంది. అప్పుడు నేను మొదటిసారిగా మాననీయ సూర్యనారాయణరావు (సూరూజీ) గారి ప్రసంగం విన్నాను. అప్పట్లో ఆయన తమిళనాడు ప్రాంత ప్రచారక్గా ఉండేవారు. ఆయన ఇచ్చిన రెండు బౌద్ధిక్లలో దేశాన్ని అట్టుడికించిన సామూహిక మతమార్పిళ్లు జరిగిన మీనాక్షిపురం ఉదంతం గురించి విడమరిచి చెప్పారు. ఆ మత మార్పిళ్లకు వ్యతిరేకంగా జరిగిన సామాజిక ఉద్యమం ఎంత శక్తివంతమైందంటే నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధి సైతం ఆ మోసపూరిత మతమార్పిళ్లపై విరుచుకుపడ్డారు. ప్రసార మాధ్యమాలు ఆ ఘటనకు ప్రచారం కల్పించేలా, దానిని వెలుగులోకి తేవటంలో సూరూజీ ప్రముఖ పాత్ర పోషించిన విషయం ఆ ప్రసంగం తర్వాత చాలా సంవత్సరాలకు నాకు అర్థమైంది. లేదంటే భారత్లోని ప్రసార మాధ్యమాలు హిందూ సమాజానికి సంబంధించిన అలాంటి వార్తలను లోపలి పేజీలలో ఏదో మూలకు తోసేసేవి. ఆ ఘటనతో మతమార్పిళ్లు ఆగటమే గాక మొత్తం హిందూ సమాజం మేల్కొని చైతన్యమైంది.
ఎంతోమందికి ప్రేరణ
మనుషుల్ని తీర్చిదిద్దే కళలో సిద్ధహస్తులైన సూరూజీ వందలకొద్దీ ప్రచారకులు, వేలకొద్దీ కార్యకర్తలు తయారవడానికి ప్రేరణనిచ్చారు. ఏ విధంగా చూసినా ఆయన మ¬న్నతులే. శారీరకంగా ఆరడుగుల ఎత్తుతో బలిష్ఠుడైన ఆజాను బాహులు. మేధస్సులో మేరుశిఖరం. వ్యక్తులను తయారు చేయడంలో, సంఘటనను నిర్మించటంలో మహామహులు. స్వయంసేవకులకు, సంఘ పరిధికి ఆవలనున్న వారికి సైతం అపార ప్రేమామృతాన్ని పంచే మ¬న్నత హృదయులు. లలాటాన విభూతి రేఖలతో మందస్మిత వదనారవిందంతో ఉండి, తన చుట్టూ ఉండేవారిపై ఆనందాన్ని వెదజల్లుతుండే వారు. ఆయన నవ్వినప్పుడు ఆ నవ్వు ఆయన హృదయంలో నుంచి పెల్లుబికేది. ఆ విధంగా ఆయన జన హృదయాలను జయిస్తుండేవారు.
1950 ప్రారంభంలో యాదవరావుజీ తమిళనాడు ప్రాంత ప్రచారక్గా, సూరూజీ విభాగ్ ప్రచారక్గా ఉండేవారు. అప్పటికి ఆ ప్రాంతంలో విభాగ్ ప్రచారకులు సూరూజీతో కలిపి ముగ్గురే. ఆ ముగ్గురూ ఉత్సాహం ఉరకలేసే యువకులు కావడంతో ప్రాంత ప్రచారక్ను గాని, ఇతర సీనియర్లను గాని సంప్రదించకుండానే శాఖలను వేగవంతంగా వృద్ధి చేయడానికి ప్రాంతాన్ని మూడు భాగాలుగా విభజించి ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు బాధ్యత స్వీకరించారు! వారు కార్యరంగంలోకి దిగిన తర్వాత తమ సాహస ప్రణాళిక గురించి యాదవ రావుజీకి తెలియజేశారు. యాదవరావుజీ ఏమీ అనకుండా, ఓ చిరునవ్వు నవ్వారు.
ఒక ఏడాది తర్వాత వారు మళ్ళీ యాదవ రావుజీని కలిసి శాఖల సంఖ్య పెరగటానికి బదులుగా తగ్గుముఖం పట్టిందని, తమ విస్తరణ ప్రణాళిక పని చేయడంలేదని విన్నవించారు. ఇలా జరుగుతుందని తాను ముందే ఊహించానని, అత్యుత్సాహంతో మీరు జీర్ణం చేసుకోగల దానికన్నా ఎక్కువ మింగాలని చూస్తే ఫలితం ఇలానే ఉంటుందని యాదవరావుజి అన్నారు. దాంతో వారి ప్రణాళికను వెనుకకు తీసుకున్నారు. జరిగిన పొరపాటును సూరూజీ మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. (వివేకానందుడు తన కాలక్రమంలో గురువు రామకృష్ణ పరమహంస మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరించిన ఉదంతాలు ఇక్కడ గుర్తు చేసుకోదగినవి).
సూరూజీతో మా సమావేశాలు మరింత తరచుగా జరిగేవి. తరువాత ఆయన అఖిల భారత సేవా ప్రముఖ్ అయ్యారు. సంఘ స్థాపకులు డాక్టర్జీ జన్మ శతాబ్ది సందర్భంగా వారి గురించి సూరుజీ చేసిన ప్రసంగాలు విన్నాం. ప్రతి ప్రసంగం సంఘకార్య అభివృద్ధికి కావలసిన ప్రేరణను, ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని మాలో నింపింది.
అప్పట్లో సేవా కార్యక్రమాల్లో నిమగ్నులైన యువ ప్రచారకులందరికీ సూరూజీ ఒక దీపస్తంభంగా ఉండేవారు. సేవా కార్యాన్ని తమ జీవనవ్రతంగా స్వీకరించేలా యువతను ఆకర్షించి, ప్రభావితం చేసి, స్ఫూర్తినిచ్చే వరకు ఆ రంగం వృద్ధ తరానికే పరిమితమై ఉండేది. స్వామి వివేకానంద జీవితాన్ని, సందేశాన్ని సూరూజీ తనలో ఎంతగా జీర్ణించు కున్నారో చికాగో విశ్వమత మహాసభల్లో స్వామీజీ ప్రసంగపు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వెల్లడైంది. 1948లో సంఘంపై తొలి నిషేధం విధించిన సందర్భంగా జైలు పాలైన రోజుల్లో సూరూజీ స్వామి వివేకానంద జీవితాన్ని, సాహిత్యాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి జైలు జీవితాన్ని సద్వినియోగ పరచుకున్నారు.
పశ్చిమ ఆంధ్రప్రదేశ్ (ప్రస్తుత తెలంగాణ) లోని అన్ని జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని జిల్లాలలో సూరూజీ పర్యటించినప్పుడు నేను వారి వెంట తిరిగాను. ఆయన నాయకత్వం వహించే సమావేశాలకు హాజరై సేవ, సామాజిక సమస్యలు, సవాళ్లకు సంబంధించిన వివిధ కోణాలపై చర్చలలో పాల్గొనటానికి కార్యకర్తలందరూ ఎంతో ఉత్సాహం చూపించేవారు. సేవ గురించి ఆయన చేసే ప్రసంగం కమ్మని విందులా ఉండి హృదయాలను నిండుగా నింపేది. ఆయన వినయం మిగిలిన అంశాలన్నిటిని అధిగమించేది. సమావేశాల్లో ప్రతి ఒక్కరితోను ఆయన సంభాషించటం నేను గమనించాను.
1995లో వడోదరలో జరిగిన విశ్వసంఘ శిబిరం సందర్భంగా సూరూజీ విశ్వవ్యాప్త సేవా కార్యక్రమాలపై చర్చలకు నాయకత్వం వహించారు. బైఠక్లలో వివిధ దేశాల నుండి వచ్చిన 30-35 మందితో కూడిన చిన్న బృందాలు పాల్గొనగా చర్చాంశాలు సేవకు సంబంధించిన అన్ని అంశాలను స్పర్శించేలా ఉండేవి. సేవా కార్యక్రమాల నిమిత్తం భారత్కు సక్రమ మార్గాలలో డబ్బు పంపించటమే ప్రధానాంశమని బృంద సభ్యులు భావించారు. సూరూజీ ధనాకర్షణను మించిన విస్తృతమైన ఆలోచనను వారి ముందుంచి ఏ దేశానికి ఆ దేశం సేవా ఇంటర్నేషనల్ పేరు మీద కార్యక్రమాలను నడిపించే విషయమై ఏకాభిప్రాయాన్ని నిర్మించారు.
ప్రతి యూనిట్ స్థానిక నియమ నిబంధనల ప్రకారం రిజిస్టర్ అవాలనీ, ప్రభావశీలంగా పని చేసేందుకు యూనిట్ల మధ్య విస్తృతమైన సంబంధ బాంధవ్యాలను పెంపొందించుకోవాలని మార్గనిర్దేశం చేశారు. ఈ సమావేశాల్లో ఆహ్వానితుడిగా నేను పాల్గొని ఒక విశ్వవ్యాప్త సేవాకార్యం భావన రూపు దిద్దుకోవడానికి సాక్షీభూతుడినయే భాగ్యం పొందాను.
సంఘంలో సూరూజీ స్థానం కుటుంబ పెద్దను పోలి ఉంటుంది. ఆయన దేన్నైనా విశాల హృదయంతో నిష్పక్షపాతంగా స్వీకరిస్తుండేవారు. తన మనసులోని మాటను దాపరికం లేకుండా వెల్లడిస్తుండేవారు. ఒక ప్రతినిధి సభలో శేషాద్రిజి సంఘ సర్ కార్యవాహ బాధ్యతల నుండి తప్పుకుంటూ తాను సూరూజీని సంప్రదించి ఆయన సూచనల మేరకే తనకన్నా తక్కువ వయసు గల కార్యకర్తకు బాధ్యతలు అప్పగించే సమయం వచ్చిందని గ్రహించి నిష్క్రమిస్తున్నానని చెప్పారు.
సంఘంలో నియంతృత్వం రాజ్యమేలుతుందంటూ ఏవేవో పిచ్చి ప్రేలాపనలు చేసేవారు అర్థం చేసుకో వాల్సిన మరో ఉదంతం ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. సుదర్శన్జీ సర్సంఘచాలక్ బాధ్యతల నుండి తప్పుకునే ముందు తగిన వ్యక్తిని సంప్రదించాలని చెన్నై వెళ్ళి సూరూజీని సంప్రదించారట. మోహన్ భాగవత్జీకి పగ్గాలు అప్పగించేముందు సూరూజీని సంప్రదించి నిర్ణయం తీసుకున్నానని సుదర్శన్జీ ప్రతినిధి సభకు వెల్లడించారు. అప్పటికి సూరూజీ అనారోగ్యం వల్ల ప్రయాణించే స్థితిలో లేరు. అనారోగ్యం కారణంగా బాధ్యతలకు దూరమైనప్పటికీ కురువృద్ధులైన సూరూజీ ప్రాముఖ్యం చెక్కు చెదరనిదని ఈ ఉదంతం నిరూపిస్తోంది.
– శ్యాంపరాండే, ‘సేవా ఇంటర్నేషనల్’ అంతర్జాతీయ సమన్వయ కర్త
(జాగృతి సౌజన్యం తో)