సృజనాత్మక ఆలోచన, భగవంతుడిలో విశ్వాసం, పవిత్రత ఉన్నవారెవరైనా జీవితంలో విజయం సాధించవచ్చని మాజీ రాష్ట్రపతి ఎ పి జె అబ్దుల్ కలాం జీవితం మనకు చెపుతుంది. మన దేశానికి మరింతమంది కలాం లాంటి వ్యక్తుల అవసరం ఉంది. బాలగోకులం వంటి కార్యక్రమాలకు అలాంటి కలాంలను తయారుచేసే సత్తా ఉందని అరుణ్ తివారీ అన్నారు. తివారీ మాజీ రాష్ట్రపతి కలాం తో కలిసి 5 పుస్తకాలు రచించారు.
భారత్ హైదరబాద్ చాప్టర్ కు చెందిన బాలగోకులం వార్షికోత్సవంలో పాల్గొన్న మనోజ్ తివారీ తాము ఏమి కావాలనుకుంటున్నారో పిల్లలే నిర్ణయించుకోవాలని, దానికి తగినట్లుగా కష్టపడాలని అన్నారు. స్వచ్చమైన మనస్సు, శరీరం, బుద్ధి లేనివారికి శ్రీకృష్ణ భగవానుడు ఏది ఇవ్వడని ఆయన అన్నారు. భగవంతునిలో విశ్వాసం ఉండాలి. మనం బాగా కృషి చేస్తే, మంచి పనిచేస్తే ఆయన తప్పకుండా మన బాగోగులు చూస్తాడని `వింగ్స్ ఆఫ్ ఫైర్’ సహ రచయిత అయిన తివారీ అన్నారు.
ఈ సంవత్సరం భాగ్యనగర్ లో కొత్తగా 60 బాలగోకులం కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని మూడు ప్రాంతాలలో బాలగోకులం వార్షికోత్సవాలు జరిగాయి. వీటిలో మొత్తం 1200 మంది పిల్లలు పాల్గొన్నారు. వాళ్ళు శ్రీమద్ భగవద్గీతలోని 6 అధ్యాయంలో 1 నుండి 20 శ్లోకాలను పఠించారు.
కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణా ప్రాంత ప్రచార ప్రముఖ్ నడింపల్లి ఆయుష్ మాట్లాడుతూ కలిసి పనిచేయడమెలాగో బాలగోకులం నేర్పుతుందని అన్నారు. ఎవరికి వారు మంచివారు, సమర్ధులు కావచ్చును కానీ కలిసి పనిచేయడం నేర్చుకోవలసిందేనని ఆయన అన్నారు. ఒకప్పుడు జగద్గురువుగా విలసిల్లిన భారతదేశం తరువాత ఆ స్థానాన్ని కోల్పోయిందని అన్నారు. మనం ఒక జాతిగా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయాము. బాలగోకులం, ఇతర సంఘ్ కార్యక్రమాలు మనలో మళ్ళీ ఆత్మ స్థైర్యాన్ని, విశ్వాసాన్ని నింపడానికేనని ఆయన అన్నారు. నేడు ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు భారత్ పరిష్కారం చూపగలదని, అయితే భారత జాతి తగినంత విశ్వాసం, శక్తి పొందినప్పుడే అది సాధ్యపడుతుందని అన్నారు. భావి తరాలలో ఈ లక్షణాలను పెంపొందించడానికి బాలగోకులం ప్రయత్నిస్తోందని ఆయుష్ అన్నారు.
పిల్లలు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశ సంస్కృతి, జాతీయ విలువలు, వైవిధ్యాన్ని ప్రతిబింబించే నృత్య, నాటిక, గాన, యోగా అంశాలు పిల్లలు ప్రదర్శించారు.
గచ్చిబోలి జోన్ కు చెందిన బాలగోకులం వార్షికోత్సవం ఈ నెల 3న జరిగింది. ఇందులో పాల్గొన్న తెలంగాణ ప్రాంత ప్రచారక్ దేవేందర్ జీ శ్రీకృష్ణుని జీవితం నుండి మనం ఎంతో నేర్చుకోవాల్సిఉందని అన్నారు. జీవితాన్ని అర్ధవంతంగా ఎలా గడపాలో ఆయనను చూసి నేర్చుకోవచ్చని అన్నారు. సమాజం లేనిదే మనం లేము కాబట్టి సమాజాభివృద్ది కోసం పనిచేయడం ప్రతిఒక్కరి కర్తవ్యమని దేవేందర్ జీ అన్నారు. సేవాబస్తీ (మురికివాడలు)లకు వెళ్ళి అక్కడి పిల్లలకు చేతనైన సహాయం చేసేందుకు ప్రయత్నించాలని ఆయన పిల్లలకు సూచించారు. `కిశోరి వికాస్’ కార్యక్రమాలను కూడా త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందని, అవి మగ, ఆడపిల్లలకు వేరువేరుగా ఉంటాయని ఆయన వెల్లడించారు.
ప్రముఖ బాడ్మింటన్ ఆటగాడు సాయి ప్రణీత్, బిలిగిరి హోటల్స్ స్థాపకుడు కిరణ్ బిలిగిరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని దేశానికి నిస్వార్ధంగా సేవ చేయడం అలవరచుకోవాలని పిల్లలకు ఉద్బోధించారు.