Home News వెల్లువెత్తుతున్న వాస్తవాలు

వెల్లువెత్తుతున్న వాస్తవాలు

0
SHARE

చారిత్రక వాస్తవాలనే కాదు, వర్తమాన సమాజంలోని సత్యాలనూ మసిపూసి మారేడుకాయ చేస్తున్న సమయంలో సత్యాన్వేషణ అవసరాన్ని దేశానికి ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌సరిగ్గా గుర్తు చేసింది. అలా మహోపకారం చేసింది. ఉదారవాదులూ, కమ్యూనిస్టులూ, కాంగ్రెస్‌ ‌తైనాతీలు పెడుతున్న చిత్రహింస నుంచి వాస్తవాలు బయటపడే శుభ ఘడియలను అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌ముందుకు తీసుకువచ్చింది. గడచిన పాతిక ముప్పయ్‌ ‌సంవత్సరాలుగా ఇందుకు సంబంధించిన ప్రయత్నం జాతీయస్థాయిలో, అంతర్జాతీయస్థాయిలో జరుగుతున్నా, ఆ మహా మేధో ఉద్యమానికి ఇప్పుడు పూర్తి ఊపు వచ్చింది. వక్రీకరణల నుంచి వాస్తవాలు విముక్తమవుతున్నాయి. వక్రభాష్యాల నుంచి సాంత్వన పొందుతున్నాయి. హిందూత్వ కేంద్రబిందువుగా సాగుతున్న ఈ రాక్షస యుద్ధ శైలికి ప్రతిఘటన బలపడింది. నగరాలలో ఉంటూనే విశ్వవిద్యాలయాలలో ఉద్యోగులుగా, న్యాయవాదులుగా, హక్కుల కార్యకర్తలుగా, సామాజిక కార్యకర్తలుగా, సాంస్కృతిక కార్యకర్తలుగా సంచరిస్తున్న మేధో ఛద్మవేషధారులు చేసే భారత వ్యతిరేక వాదనల మీద ప్రతిదాడి ఊపందుకుంది. చరిత్ర రచనను వక్రీకరిస్తే జాతిని ద్వితీయ శ్రేణి పౌరులుగానే ఉంచవచ్చునన్న తెల్లజాతి వ్యూహమే వీరూ కొనసాగిస్తున్నారు. కానీ వీరంతా ప్రచారం చేసినట్టు చరిత్రలో భారతజాతి దాస్యాన్ని ఆమోదించలేదు. ధర్మాన్ని తాకట్టు పెట్టలేదు. పురాతన భారతానికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లేదన్న ఆరోపణ, శాస్త్రీయ దృక్పథం మృగ్యమన్న వ్యాఖ్య  శుద్ధ అబద్ధం. ఇప్పుడు ఈ అబద్ధాలకే చుక్కెదురవుతోంది. వాస్తవాలు  వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా గొప్ప చరిత్ర కలిగిన భారతజాతి పురోగమనానికీ, సగౌరవంగా లక్ష్యాన్ని చేర్చడానికీ ఉపయోగపడేదే. హిందూత్వకు, భారతీయతకు ఏ చేటు వచ్చినా ఆర్‌ఎస్‌ఎస్‌ ఆదుకోవాలన్న దృక్పథమే సమాజంలో ఉంది. ఇప్పుడు కూడా మన గతంలోని మంచిని చెప్పడం, వాస్తవాలు చెప్పడం, తప్పులను అంగీకరించడం, అదే సమయంలో సరిదిద్దుకోవడం అనే బాధ్యతను కూడా సంఘమే స్వీకరించింది. కానీ ఇది దేశ పునర్నిర్మాణం కోణం నుంచి మాత్రమే సంఘం స్వీకరించింది. భావదాస్యం నుంచి బయటపడడమే ధ్యేయంగా చేపట్టింది. మనదైన ప్రతిభ, సామర్థ్యం వెలికి తీయడానికి మార్గంగా ఉపయోగించు కుంటున్నది. ఈ యజ్ఞంలో సంఘంతో సంబంధం లేనివారు కూడా పలువురు పాల్గొంటున్నారు. అంటే వాస్తవాలు గుర్తించే పనిని, సేకరించే బాధ్యతని సమాజం సమష్టిగా స్వీకరిస్తున్నది. ఇది మరింత స్వాగతించదగినది. ఆ ప్రయత్నాన్ని మనసారా స్వాగతిస్తూ, ఇంతదాకా జరిగిన ప్రయాణంలో పడిన కొన్ని అడుగులు చూద్దాం.

రాజకీయ, సైద్ధాంతిక కుట్రతో దాచి పెట్టిన వేలాది నిజాలను వెలికితీసే పని ఇవాళ జరుగు తున్నది. అందుకు తగిన సామాజిక వాతావరణం ఉంది. ఆత్మ గౌరవం ఆసరాగా దేశం నడవడానికే ఇదంతా. అందుకు గతంలోని నిజాలు, వర్తమాన సమాజంలోని వాస్తవాలూ రెండూ అవసరమే. ఆర్‌సి మజుందార్‌, ‌సీతారాం గోయెల్‌, ‌విల్‌ ‌డ్యురాంట్‌, ‌డేవిడ్‌ ‌ఫ్రాలే, విక్రమ్‌ ‌సంపత్‌, ఆచార్య ఎస్‌వి శేషగిరిరావు వంటి ఎందరో గతంలోని వాస్తవాల నిగ్గు తేలిస్తే, ‘అర్బన్‌ ‌నక్సల్స్’ ‌వంటి పుస్తకంతో వివేక్‌ అగ్నిహోత్రి వంటివారు వర్తమాన కాలాన్ని కమ్మేయాలని చూస్తున్న కుహనా మేధావుల కుతంత్రం గురించి, వామపక్ష తీవ్రవాదంలోని అరాచకత్వాన్ని చెప్పారు. వీరు వెల్లడించిన వాస్తవాలకు ఒక అంతస్సూత్రం కనిపిస్తుంది. అది వాక్‌స్వాతంత్య్రం పేరుతో హిందూధర్మాన్ని కించపరచడమే. కాలానికి తగిన వాదనలు చేయకపోవడం కూడా వారందరి కుట్రలో భాగమే. ఒక తప్పిదాన్ని, ఒక ప్రాంత దురాచారాన్ని మొత్తం హిందూజాతికి అంటగట్టడం కూడా సర్వసాధారణం. అంతిమంగా భావి భారతపౌరులను నిత్యం డోలాయమానంలో ఉంచాలన్న ప్రయత్నమేనని అర్థమవుతుంది.

అర్ధంలేని ప్రశ్నలకూ, కుతర్కాలకూ జవాబులు ఇచ్చుకోవలసిన భావదారిద్య్రపు యుగంలో జాతీయ వాదులు నోరు విప్పక తప్పడం లేదు. చరిత్రలో జరిగిన ఆ తప్పులే పునరావృతం కావడానికి వీలైన పరిస్థితుల వైపునకు ప్రజలను నెడుతున్న వారికీ, ఆ ప్రయత్నాన్ని భగ్నం చేయవలసిన అవసరాన్ని గుర్తించిన వారికీ జరుగుతున్న యుద్ధంలో వాస్తవాలు వెల్లడి కావడమే ప్రధానం. ఆ యుద్ధం సరైన సమయంలోనే మొదలయింది. వర్తమానం మీదనే కాదు, చరిత్ర మీద కూడా బ్రాండ్‌లు వేయాలన్న అత్యుత్సాహమే ఈ యుద్ధానికి నాంది పలికింది. భారత సమైక్యత కోసం, భారతీయ ఆత్మ కోసం ఈ యుద్ధంలో గెలవవలసిన అవసరం ఉంది. గెలుస్తున్నాం కూడా. వందేమాతరం ఉద్యమంతో, బెంగాల్‌ ‌కేంద్రంగా పనిచేసిన తీవ్ర జాతీయవాద సంస్థ అనుశీలన్‌ ‌సమితితో డాక్టర్జీ అనుబంధం ఎవరూ కాదనలేనిది. ఆ కాలంలో ప్రముఖ జాతీయ కాంగ్రెస్‌ ‌నాయకుడు డాక్టర్‌ ‌బాలకృష్ణ మూంజే అనుచరునిగా డాక్టర్జీ ఉన్నారు. బెంగాల్‌ ‌విభజనకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో పాల్గొన్నందుకు ఆయన మీద సెక్షన్‌ 180 ‌కింద కేసు నమోదు చేశారు. అనుశీలన్‌ ‌సమితి ప్రధాన పాత్ర వహించిన అలీపూర్‌ ‌కుట్ర కేసులో దొరికిపోయిన వారికి న్యాయ సహాయం అందించడానికి ప్రయత్నించినవారిలో డాక్టర్జీ ఒకరు. అనుశీలన్‌ ‌సమితిలో డాక్టర్జీ నిర్వహించిన భూమిక గురించి త్రైలోక్యనాథ్‌ ‌చక్రవర్తి రాసిన ‘జైల్‌ ‌మే తీస్‌ ‌వర్ష్’ (‌జైలులో మూడు దశాబ్దాలు) పుస్తకంలో స్పష్టంగా ప్రస్తావించారు. ఈ పుస్తకంలో ఆయనే ప్రచురించిన సహచర స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలలో డాక్టర్జీ ఫొటో కూడా ఉంది. అలీపూర్‌ ‌కుట్ర కేసులో (1908) అరవింద ఘోష్‌, ‌బరీంద్ర ఘోష్‌, ఉల్లాస్కర్‌ ‌దత్‌ ‌సహా 37 మంది నిందితులు. ఈ కేసు విచారణ సమయంలోనే డాక్టర్జీ వైద్య విద్య కోసం నాగపూర్‌ ‌నుంచి కలకత్తా చేరారు. అసలు ఢాకా అనుశీలన సమితి వ్యవస్థాప కుడు విప్లవకారుడు పులిన్‌ ‌బిహారీదాస్‌తో ఉన్న పరిచయంతోనే డాక్టర్జీ కలకత్తా వెళ్లారు. అనంతర కాలాలలో భారత జాతీయ కాంగ్రెస్‌ ‌రాష్ట్ర కమిటీలో సభ్యులయ్యారు. గాంధేయమార్గంలో ఉద్యమించి కొద్దికాలం జైలు జీవితం అనుభవించారు.ఆగస్ట్ 19, 1920‌లో దేశద్రోహం కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్ష పడింది. కానీ డాక్టర్జీ కొంచెం భిన్నంగా ఆలోచించారు. ఉద్యమం కోసం ప్రాణత్యాగం తుది గమ్యం మాత్రమే. తొలి ప్రాధాన్యం- జీవించి ఉంటూ ఉద్యమాన్ని నడపడం, స్వరాజ్య లక్ష్యాన్ని సాధించడం. స్వాతంత్య్రం వచ్చితీరాలన్న ఉగ్ర దీక్ష, సమగ్ర కాంక్ష; దీనితో ఆవిర్భవించే స్వతంత్ర భారతదేశ స్వరూపస్వభావాల గురించి భావనలూ ఆ ఆలోచనలో అంతర్భాగంగా ఉన్నాయి. జూలై 12, 1922న డాక్టర్జీ విడుదలై వచ్చినప్పుడు నాగపూర్‌లోని వెంకటేశ్‌ ‌నాట్యగృహలో అభినందన సభ జరిగింది. మోతీలాల్‌ ‌నెహ్రూ, విఠల్‌భాయ్‌ ‌పటేల్‌, ‌సి. రాజగోపాలాచారి, డా. ఎంఏ అన్సారీ పాల్గొన్నారు. తరువాత డాక్టర్జీ కాంగ్రెస్‌ ‌ప్రదేశ్‌ ‌కమిటీ సహాయ కార్యదర్శి పదవి చేపట్టారు కూడా. డాక్టర్జీ సునిశిత సామాజిక, రాజకీయ దృష్టి కలిగిన వారు. స్వరాజ్య సమర నిర్వహణలో బాలగంగాధర తిలక్‌, ఆపై గాంధీజీ నాయకత్వ తీరులను బేరీజు వేయడానికి డాక్టర్జీకి అదే సునిశిత దృష్టి అద్భుతంగా ఉపయోగ పడిందనిపిస్తుంది. ఉద్యమం సరే, ఒక జాతి భవిష్యత్తు ప్రాతిపదికగానే ఆ కాలాన్ని బేరీజు వేశారాయన. వ్యక్తి ఆరాధన చుట్టూ స్వాతంత్య్ర పోరాటం నిర్మితం కావడం, ముందు నుంచీ దేశ విభజన దిశగానే అడుగులు వేస్తున్న ముస్లింలను దేశభక్తి వైపు నడిపించాలన్న విఫలయత్నం డాక్టర్జీని ఆలోచింప చేశాయి. ఉద్యమానికి దేశ చరిత్ర ద్వారా, పరంపర ద్వారా తాత్త్వికత లభించాలి. కానీ, ఆధిపత్య ధోరణి కలిగిన చిన్నవర్గం గొంతెమ్మ కోరిక ఆ గొప్ప తాత్త్వికత స్థానాన్ని అక్రమించడానికి ఉపకరిస్తున్న, ప్రోత్సహిస్తున్న వాతావరణం కూడా డాక్టర్జీని కలతపెట్టింది. ఇది డాక్టర్జీకి పరిమితమైన కలతేనా? కాదు. ఆనాడు మొదట కాంగ్రెస్‌తోనే కలసి నడచి, తరువాత తీవ్ర జాతీయవాదం వైపు మొగ్గిన అనేకుల గుండెల కలత. కాంగ్రెస్‌ ‌పోకడ నుంచి పక్కకు జరిగి విదేశాల నుంచైనా ఉద్యమించవచ్చునని భావించిన అనేకమంది అనుభవించిన కలత కూడా. ఆ గొంతెమ్మ కోరికలోని ప్రమాదాన్ని జాతీయ కాంగ్రెస్‌ ‌గుర్తించ నిరాకరించింది. ఫలితాన్ని వర్తమానతరం అనుభవిస్తోంది. దీనిని గుర్తించిన ఆర్‌ఎస్‌ఎస్‌ను మాత్రం నాడూ నేడూ కూడా మతోన్మాద సంస్థ అంటూ విమర్శిస్తున్నారు.

ఇలాంటి అంశాలతో పాటు, ఆర్‌ఎస్‌ఎస్‌కు ఆకృతినిచ్చిన ఆలోచనలు, సంస్థకు ఆయువు పట్టు వంటి శాఖా కార్యక్రమం, నేడు మనమంతా చదువుతున్న చరిత్ర గురించి సంఘ్‌ ‌భావన, సనాతన హిందూత్వం గురించిన చింతన, కులం-సామాజిక న్యాయం, అనేక రంగాలకు విస్తరించిన సంఘ ఆలోచన, ప్రపంచీకరణను సంఘం అర్ధం చేసుకున్న తీరు, కుటుంబం, ఆధునిక కాలంలో అనేక వాదోపవాదాలకు కేంద్ర బిందువులుగా ఉన్న సహజీవనం, హిజ్రాల హక్కులు, స్వలింగ సంపర్కం వంటి అన్ని అంశాలను ‘ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రణాళిక- 21వ శతాబ్దం కోసం’ (‘ది ఆర్‌ఎస్‌ఎస్‌: ‌రోడ్‌మ్యాప్స్ ‌ఫర్‌ ‌ది ట్వెంటీఫస్ట్ ‌సెంచరీ’కి తెనుగుసేత. అను: బీరం వెంకటేశ్వరరెడ్డి, 2022) పుస్తకంలో సునీల్‌ అం‌బేకర్‌ (అఖిల భారత ప్రచార ప్రముఖ్‌) అవసరమైన మేరకు ప్రస్తావించారు. రాజకీయాలలో సంఘం నేరుగా జోక్యం కల్పించుకోదు. కానీ ఆ రంగం మీద సంఘానికి ఉన్నది నిశితమైన దృష్టే. దేశసేవ, దేశభద్రత రాజకీయ నాయకుల పరమావధి కావాలంటుంది సంఘం. సంఘానిది సజీవ లక్షణం, ప్రవాహశీలత కలిగిన కార్యక్రమం. కాబట్టి సమకాలీన సమాజాన్ని తాకిన ఏ విషయమైనా, జరిగిన పరిణామం ఏదైనా సంఘం వాటి మీద తనదైన వైఖరిని తీసుకుంటూనే ఉంటుంది. తన అభిప్రాయాన్ని సుస్పష్టంగా వెల్లడిస్తూనే ఉంటుంది కూడా. కానీ దీనికి ప్రాతిపదికలు మాత్రం మన చరిత్ర, అది అందించిన పాఠం, భారతీయత. ఇవన్నీ పది అధ్యాయాల ద్వారా అందించారు.

ఎంతో ‘గంభీర అంశ’మైన చరిత్ర బ్రిటిష్‌ ‌వలస దృక్పథం నుంచే బోధిస్తున్నారని సంఘ్‌ ‌గట్టిగా విశ్వసిస్తున్నది. ఇప్పుడు ఇలాంటి అభిప్రాయం దేశవ్యాప్తంగానే ఉంది. విక్రమ్‌ ‌సంపత్‌ ‌వంటివారు ఆ అవాంఛనీయ దృక్పథం గురించి చక్కని విశ్లేషణలు చేస్తున్నారు కూడా. జాతీయవాదానికి ఆద్యులు అనదగిన భారతీయ వీరులు, వనవాసీల చరిత్రలను కావాలనే మరుగుపరిచారని సంఘం భావిస్తున్నది. రామమందిరం విషయంలోనూ ఇదే జరిగింది. ఢిల్లీ కేంద్రంగా చరిత్రంతా జరిగినట్టు చెప్పడం మరొక వికృతి. ఇందులో హిందుత్వకు, సంఘానికి ఉన్న అనుబంధం గురించి లోతైన వివరణ ఉంది. నిజానికి నేటి స్వయం ప్రకటిత మేధావులు చెబుతున్నట్టు ఆ భావన గానీ, ఆ పద ప్రయోగం కానీ సావార్కర్‌వి కావు. 1880లో వంగదేశీయుడు చంద్రనాథ్‌ ‌బసు ప్రాచుర్యంలోకి తెచ్చారు. హిందూత్వం అనేది మతం కాదు. అదొక పరిపూర్ణ జీవన విధానంగానే ఆర్‌ఎస్‌ఎస్‌ ‌స్వీకరిస్తుంది. ఇక ప్రపంచీకరణ యుగాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ ఎలా చూస్తోంది? ‘ప్రపంచ వ్యవహారాలపై హిందూ ఆలోచనా పద్ధతి రాజకీయా లతో, దౌత్య సంబంధాలతో ముడిపడి లేదు. ప్రపంచంతో భారతదేశానికున్న సంబంధాలకు మూలం ప్రపంచం సంక్షేమం, నిర్మాణాత్మక ధోరణి, సహకారం, సంబంధాలు, కుటుంబ విలువలు’ అన్నారు అంబేకర్‌. ‌మతోన్మాదంతో జరిగే దాడులను ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నది. ఈ దాడులు చేసిన వాళ్లకి శిక్షలు కొవ్వొత్తులు పుచ్చుకుని ఉదారవాదం పేరుతో ఊరేగడాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌గర్హిస్తున్నది. మానవ సంబంధాలను పటిష్టం చేయగలిగేది కుటుంబం అన్నదే ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నమ్మకం. అందుకే సంఘం తీసుకున్న ఐదు కీలకాంశాలలో కుటుంబ ప్రబోధన్‌ ఒకటైంది (కుటుంబంలో స్త్రీపురుషులది సమష్టి బాధ్యత అనే సంఘం భావిస్తుంది). మిగిలినవి గ్రామ వికాస్‌, ‌గో వికాస్‌, ‌ధర్మ జాగరణ, సమరసత. ఇటీవల స్వీకరించినది పర్యావరణ పరిరక్షణ.

సహజీవనమనేది భారతీయ సమాజానికి మచ్చ వంటిదేనని చాలా విశ్లేషణతో అంబేకర్‌ ‌వివరిం చారు. కులాంతర వివాహాలకు సంఘం వ్యతిరేకం కాకున్నా, అవి సామాజిక ఘర్షణలకు దారితీయని విధంగా జరగాలని అంటోంది. ఇతరుల జీవితాలను ప్రభావితం చేయనంత వరకు స్వలింగ సంపర్కం నేరంగా చూడనక్కరలేదని సంఘం అభిప్రాయం. హిజ్రాలను భారతీయ జీవనంలో అంతర్భాగంగా గుర్తిస్తూ, వారిని ఏవగించుకునే మనస్తత్త్వం నుంచి బయటకు రావాలనే సంఘం చెబుతోంది.

మరో రెండేళ్లలోనే నూరేళ్ల సందర్భం దగ్గరకు వెళుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సిద్ధాంతం ఏమిటో సునీల్‌ అం‌బేకర్‌ ‌విస్పష్టంగా పాఠకుల ముందు ఉంచారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అం‌టే ఏమిటో తెలియకుండానే గంటల తరబడి ఉపన్యాసాలు, కాలమ్‌ల కొద్దీ వ్యాసాలు రాసేవాళ్లకు ఇదొక కనువిప్పు.

1948లో జరిగిన గాంధీజీ హత్యోదంతం నుంచి ఈనాటి వరకు కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పేరు వినపడని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. మూడు నిషేధాల నుంచి కూడా బయటపడి సజీవంగా మిగిలిన ఏకైక సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. ‌సేవ, సర్వేజనా సుఖినోభవంతు అనే సిద్ధాంతంతో ఉండే దేశభక్తి, నిబద్ధత కలిగిన సంస్థ కాబట్టే సంఘం ఇవాళ అత్యధిక భారత ప్రజల గుండె చప్పుడయింది. దేశం ముక్కలైనా ఫర్వాలేదు, హిందువుల మనోభావాలు ఎంత తీవ్రంగా గాయపడినా పరిగణించనక్కరలేదను కుంటూ ఓట్ల రాజకీయాలు, బుజ్జగింపు విధానాలు వీడనివారే సంఘం మీద అక్కసు వెళ్లబోసుకుంటూ ఉంటారు. ఆ విమర్శలైనా నానాటికీ పలచనై పోతున్నాయి. అందుకు నిదర్శనం- ఈ సంస్థతో ప్రేరణ పొంది రాజకీయవేత్తలైన ఇద్దరు దేశానికి ప్రధానమంత్రులయ్యారు. ఎవరికి బాధ కలిగినా 21వ శతాబ్దం ఆర్‌ఎస్‌ఎస్‌దే. అందుకే ఈ శతాబ్దంలో సంస్థ నడవబోయే బాట గురించిన ప్రణాళికను అంబేకర్‌ ఈ ‌పుస్తకం ద్వారా భారతజాతి ముందు ఉంచారు. సానుకూల దృక్పథంతో సాగే సంస్థ చేయవలసిన, చేయగలిగిన పని ఇది. ఇందులోని ప్రతి అక్షరం దానినే ప్రతిబింబించింది.

ఆర్‌ఎస్‌ఎస్‌ ఏమిటి.. ఎందుకు?

ఆర్‌ఎస్‌ఎస్‌ అం‌టే ఏమిటో, దాని ప్రస్థానం ఏమిటో కొద్దిగా కూడా తెలియకుండా మాట్లాడే మేధావులకు దేశంలో కొదవలేదు. సంఘం స్థాపించిన కాలానికీ, వ్యవస్థాపక సర్‌సంఘచాలక్‌ ‌డాక్టర్జీ నేపథ్యానికీ చాలా ప్రాధాన్యం ఉన్నాయి. ఈ అంశాల మీద విహంగ వీక్షణ చేయించే పుస్తకమిది. డాక్టర్‌ ‌సురేశ్‌చంద్ర వాజపేయి రాసిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఎట్‌ ‌గ్లాన్స్‌కు ఇది (అను: డాక్టర్‌ ‌వడ్డి విజయసారథి) అనువాదం. స్వయంసేవకులు, కొత్తగా సంఘానికి వచ్చిన వారు ఎదుర్కొనే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఉపయోగపడాలన్న ధ్యేయంతో ఈ పుస్తకం వెలువరించారు.

కేవల పరిశీలకుల భావనలో ఆర్‌ఎస్‌ఎస్‌

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సంస్థ ఏం మాట్లాడినా, ఏమీ మాట్లాడకపోయినా వార్తే. సంచలనమే. కానీ సంఘం పేరు చెప్పగానే ఉదారవాదులు వీరంగం వేస్తారు. కొందరు మాత్రం సమ్యక్‌ ‌దృక్పథంతో సంస్థను బేరీజు వేయడానికి చూస్తున్నారు. అలాంటివారిలో వాల్టర్‌ ఆం‌డర్సన్‌, శ్రీ‌ధర్‌ ‌డామ్లే కూడా ఉన్నారు. వీరు ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావం, పనితీరులను చారిత్రక దృక్పథంతో అంచనా వేశారన్న పేరు ఉంది. ఈ ఇద్దరు ఇదే అంశంతో పలు పుస్తకాలు వెలువరిం చారు కూడా. అందులో ఒకటి ‘ది ఆర్‌ఎస్‌ఎస్‌: ఏ ‌వ్యూ టు ది ఇన్‌సైడ్‌’ (2018). ఈ ‌పుస్తకం మూడు ప్రశ్నలు వేసుకుని సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. గడచిన పాతికేళ్లలో సంఘ అనుబంధ సంస్థలు ఇంత శరవేగంగా ఎలా విస్తరించగలిగాయి? ఆధునిక సామాజిక, ఆర్థిక పరిస్థితుల పరిణామాల నడుమ సంఘం తనను తాను ఎలా నిర్మించుకుంది? శరవేగంగా సాగిన సంఘ విస్తరణ దేశ రాజకీయా లను, ఇతర విధానాలను ఎలా ప్రభావితం చేసింది? చాలా కీలకమైన ప్రశ్నలే. కాస్త పరిచయం ఉన్నా ఈ ప్రశ్నలలోని సహేతుకత తెలుస్తుంది. కాస్త ఆలోచిస్తే జవాబు కూడా దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌, ‌సంఘ సిద్ధాంతం ఈ దేశ జీవనాడి. అలాగే సంఘం లోపలి పనితీరును వీరు అసంపూర్ణంగానే అయినా తెలియచెప్పే ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఎలా ఉన్నా సంఘ పరిణామక్రమం, ఇవాళ్టి విశ్వరూపం దాల్చడానికి సాగించిన అపూర్వ యాత్ర, అధికార పార్టీతో (బీజేపీ) సంబంధాలు, దాని పరిమితుల గురించి ఈ పుస్తకం వివరించింది.

‘ది బ్రదర్‌హుడ్‌ ఇన్‌ ‌సాఫ్రాన్‌’ అన్న పుస్తకంలో ఆండర్సన్‌, శ్రీ‌ధర్‌ ‌డామ్లే పరిశీలించి, ఆలోచించ దగిన కొన్ని అంశాలు ఇచ్చారు. 1925 సంస్థ స్థాపన, స్వయంసేవకుల నిర్మాణం, సిద్ధాంతం గురించి ఎలాంటి భాష్యాలకీ చోటు ఇవ్వకుండానే చర్చించారు. కానీ మొదటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మత ఘర్షణలతోనే ఎదిగింది అన్న కొందరి వాదం ఎంత అర్ధరహితమో చెప్పే ఒక ఉల్లేఖన ఇందులో ఉంది. అది 1943లో బ్రిటిష్‌ ‌గూఢచారి శాఖ ఇచ్చిన నివేదికలో భాగం. ‘ఇప్పటికిప్పుడే ఆర్‌ఎస్‌ఎస్‌ ‌దేశానికి బెడదగా తయారవుతుందని చెప్పడం కష్టం’ అనే అందులో ఉంది. అసలు మత కల్లోలాలను ఒక వర్గ బలహీనతగానే సంస్థ భావిస్తుం దని కూడా ఆ ఇద్దరు రచయితలు చెబుతారు.

భారతీయ సమాజంలో సంఘ్‌ ‌విశ్వరూపం: ఆర్‌ఎస్‌ఎస్‌ 360’

అం‌బేకర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సమగ్ర సైద్ధాంతిక చిత్రాన్ని అందిస్తే, ప్రముఖ కాలమిస్ట్ ‌రతన్‌ ‌శార్దా నేటి భారతీయ సమాజంలో విస్తరించిన సంఘ విశ్వ రూపాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అందుకే ఆ గ్రంథానికి ‘ఆర్‌ఎస్‌ఎస్‌ 360’ (2018) అని సరైన శీర్షిక ఇచ్చారు. టీవీ చర్చలు చూసేవారికి ఆయన చిరపరిచితులే కూడా. ఆర్‌ఎస్‌ఎస్‌ ఎం‌త శ్రమించి, ఎదురీది తనను తాను ఆవిష్కరించు కున్నదీ, నేటి రూపాన్ని సంతరించుకున్నదీ కూడా అద్భుతంగా వివరించారు రచయిత. స్వాతంత్య్రోద్య మంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పాల్గొనలేదు అంటూ చాలామందే ఇటీవల అంటున్నారు. సంఘం చరిత్ర అనే ఏమిటి? అసలు దేశ చరిత్ర గురించి రెండు వాక్యాలు కూడా తెలియనవారే ఇలాంటి అసంబద్ధ ఆరోపణ చేస్తున్నారని కచ్చితంగా చెప్పవచ్చు. ఇలాంటి అజ్ఞానులకి కూడా ఈ పుస్తకంలో చక్కని సమాధానాలు ఉన్నాయి. స్ఫూర్తి, నిర్మాణం, అభివ్యక్తి అనే మూడు భాగాలలో అనేక అంశాలను పొందుపరిచారు రచయిత.

 ఒక వ్యూహంతో, తన ప్రతిభను అద్భుతంగా వ్యక్తమయ్యే తీరులో ఈ రచనకు శ్రీకారం చుట్టారు రతన్‌. ‌స్వతంత్ర భారత రాజకీయాలను మలుపు తిప్పిన బిందువు అది. కాంగ్రెస్‌ ‌పార్టీ తన సమాధికి తానే పునాది వేసుకున్న ఘడియ కూడా అదే. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పోరాట పటిమ, త్యాగనిరతి ఎంతటివో లోకానికి తెలిసిన క్షణాలు కూడా అవే. కాంగ్రెస్‌, ‌దాని కుటుంబ పాలనకు వ్యతిరేకంగా విపక్షం ఒకే శిబిరంగా ఆవిర్భవించడానికి మార్గం చూపిన ఘటన అది. అదే అత్యవసర పరిస్థితి విధింపు (1975). స్వాతంత్య్రం సమరం ఆకాంక్షించిన స్వేచ్ఛ, భారత రాజ్యాంగ పరిషత్‌ ‌ప్రతిపాదించిన ప్రజాస్వామ్యం ఆ చర్యతో కుదేలైపోయాయన్న నిర్ణయానికి భారత జాతి వచ్చిన సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌రంగంలోకి దిగి వాటిని పునరుద్ధరించింది. ఆ సమయంలో క్షా ముప్పయ్‌వేల మందిని అరెస్టు చేస్తే అందులో లక్ష మంది ఆర్‌ఎస్‌ఎస్‌, ‌దాని అనుబంధ సంస్థల సభ్యులే. మరి దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించినవారు ఎవరు అంటే ఎవరైనా ఏ పేరు చెప్పాలి! ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రయాణం నల్లేరు మీద నడక కాదు. దేశ విభజన, గాంధీజీ హత్య తరువాత నిషేధం, వివేకానంద రాక్‌ ‌మెమోరియల్‌ ‌నిర్మాణం, 1975లో రెండోసారి నిషేధం, ఏక్తా యాత్ర, డాక్టర్జీ శతజయంత్యుత్సవాలు, రామజన్మ భూమిలోని వివాదాస్పద కట్టడం కూల్చివేత-సంస్థ మీద నిషేధం వీటి మధ్యనే పుఠం పెట్టిన బంగారంలా మెరిసింది సంస్థ. ఈ విషయాలే మొదట రచయిత చర్చించారు.

మొదటి భాగంలో భారత్‌ను ఎలా నిర్వచించాలి? హిందువులను సంఘటితం చేయవలసిన అవసరం, నిత్య శాఖ గురించి వివరణ ఉంది. ఈ మూడు ఒకదానితో ఒకటి సంబంధం కలిగినవే. రెండో భాగంలో మనవైన విలువలు, పండుగల ద్వారా అందే జాతీయ సమైక్యతా సందేశం, ప్రచారకుల వ్యవస్థ వంటి అంశాలను చర్చకు తెచ్చారు. మూడో భాగంలో సేవను ఒక బాధ్యతగా సంఘం ఎలా స్వీకరించింది అనే అంశం చుట్టూ వ్యాసాలు నడిచాయి. అనుబంధాల విభాగంలో చేర్చినప్పటికీ క్విట్‌ ఇం‌డియా ఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌, ‌గాంధీ హత్య తరువాత పటేల్‌, ‌నెహ్రూలతో విభేదాలు వంటి కీలక అంశాలు చర్చకు వచ్చాయి.

జాగృతి సౌజ‌న్యంతో…