Home Telugu Articles స్వాతంత్ర్య వీర సింహం ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి

స్వాతంత్ర్య వీర సింహం ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి

0
SHARE
ఫిబ్ర‌వ‌రి 22 –  య్యాలవాడ నరసింహా రెడ్డి వర్థంతి 

య్యాలవాడ నరసింహా రెడ్డి జన్మ స్థానం నేటి కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ మండలం రూపనగుడి గ్రామం. ఈయన నివాసం ఉయ్యాలవాడ, కర్నూలు జిల్లా, రాయలసీమ. ప్రజలు “కుందేలు” గా పిలిచే నేటి “కుందూ నది” లేదా “కుముద్వతీ” నదీ తీరంలో, నల్లని రేగడి భూములతో విరాజిల్లే ఆ ప్రాంతం నడుమగా ఉండడం వలన దానిని “నడిగడ్డ” అనే వారు. ఈ కుందూనది ఉయ్యాలవాడ,  రూపనగుడి గ్రామాల మధ్య దూరము కేవలం 3km మాత్రమే. ఈ నది విశాలంగా ప్రవహిస్తుంది.

నడిగడ్డకు ప్రాణగడ్డ ఉయ్యాలవాడ దుర్గం పాలెగాడైన మజ్జరి పెద్ద మల్లా రెడ్డి గారి చిన్న కుమారుడు వీర నరసింహారెడ్డి. కుందూ పరివాహక ప్రాంతమంతా నల్ల రేగడి నేలలున్న సీమ కావడం వల్ల అది రేనేల సీమగా (రేగడి), రేనాటి సీమగా ప్రసిద్ధి చెందింది. ఉయ్యాలవాడ గ్రామానికి పడమర దిశకు, రూపనగుడి గ్రామానికి తూర్పు దిశన కుందూ నది ప్రవహిస్తున్నది. ఈ రెండు గ్రామాలలోనూ పటిష్టమైన రాచనగరులాంటి ఇళ్లున్న వారు కావటం వలన నరసింహారెడ్డి శాఖ వారు “నగరిండ్ల” వారుగా ప్రసిద్ది చెందినవారు.

నరసింహారెడ్డి బాల్యం, విద్యాభ్యాసం “గుళ్లదుర్తి” గ్రామంలో సాగింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మొలక మీసం ప్రాయం అయినప్పటికీ అతనిలోని ప్రత్యేకతలు కండబలం, బుద్ధిబలం, స్ఫురద్రూపం అందరినీ ఆకర్షించేలా ఉండేవి. నరసింహారెడ్డి ఎంత చండ ప్రచండుడో అంత శాంత స్వభావము గలవాడు, మృదు హృదయం గలవాడు మరియు ధైర్యశాలి.

నొస్సం దుర్గంలో అతని కొలువు (సభ) నిత్య సాహిత్య వినోద గోష్టులతో సాగుతుండేది. “దీబగుంట్ల వీరభద్ర చరిత్ర” కావ్యకర్త, హనుమాన్ ఉపాసకుడు క్రిష్టిపాటి వేంకట సుబ్బకవి, గురువు, పండిత కవి ఓబలాచార్యుడు అతని ఆస్థానంలోని విద్యావేత్తలు.

క్రీ. శ. 1800 సంవత్సరంలో సర్ థామస్ మన్రో పాలెగాళ్ళ వ్యవస్థను రద్దు చేసి వారికి తవర్జీని ఏర్పాటు చేశారు. కుందూనది ప్రశాంతంగా ప్రవహించుచూ రేగడి నేలలలో బంగారు పంటలు పండిస్తూ ఉన్నారు రైతులు. కుందూ నది సస్యాభివృద్ధికి తోడ్పడుతూ, దాహార్తి తీర్చుతూ ఉండగా జయరామి రెడ్డి ఏలుబడి ధర్మపథంలో సాగుతూ సుఖశాంతులతో అన్నదమ్ములవలె హాయిగా జీవిస్తూ ఉన్నారు నొస్సం ప్రజలు. నొస్సం పాలెగాడు జయరాముడుకి సంతానము లేదు. అందువల్ల తన కూతురి కుమారుడు నరసింహారెడ్డిని దత్తతగా స్వీకరించాడు. ఆ కూతురి కుమారుడే (మనుమడే) రేనాడు వీరుడు – శూరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.

నరసింహారెడ్డి దత్తతకు వచ్చి నొస్సం పాలెగాడు అయ్యాడు. బ్రిటీషు అధికారి సర్ ధామస్ మన్రో పాలెగాళ్ళ వ్యవస్థను రద్దు చేసి తవర్జీ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. తవర్టీ కోసం ప్రతి నెలా నరసింహారెడ్డి తన అనుచరుల్ని కోవెలకుంట్ల ఖజానాకు పంపి తెప్పించుకునేవారు. నరసింహారెడ్డి తవర్జీ నెలకు పదకొండు రూపాయల పది అణాలు మాత్రమే. ఒకానొక సందర్భంలో కోవెలకుంట్ల తహసీల్దారుకు, వీరనారసింహారెడ్డికి తవర్జీ విషయంలో వాగ్వివాదం జరిగింది. వీర నరసింహారెడ్డి తహసీల్దారుని ఏమాత్రం లెక్క చేయకుండా అవమానించాడు. ఆ అవమానాన్ని వీరుడు నరసింహారెడ్డి మరచినా తహసీల్దారు మాత్రం మరువలేదు. యథాప్రకారం తన నమ్మిన బంటును ఒకరిని కోవెలకుంట్లకు పంపి తన తవర్జీని తీసుకురమ్మన్నాడు. నమ్మిన బంటు ఎప్పటి మాదిరిగా వెళ్లి తవర్జీ అడుగగా “నరసింహారెడ్డి ఓ దాసరి, వాని క్రింద మరో దాసరియా! ఆ దాసరిని వచ్చి మా వద్ద తవర్జీని తీసుకుపొమ్మని” నమ్మిన బంటు (దూత) ను పరిహాసంగా వెక్కిరించి (వ్యంగ్యంగా) పంపాడు తహశీల్దారు.

నమ్మిన బంటు జరిగిన సంగతి నరసింహారెడ్డికి పూస గుచ్చినట్లు చెప్పాడు. అప్పటికే ఆంగ్లేయుల దాష్టీకం, అధికార మదోన్మాద వైఖరి, పీడించి పన్నులు వసూలు చేయడం వంటి దురాగతాలతో విసిగి వారిపై కసిగొని ఉన్న నరసింహారెడ్డికి ఈ అవమానం మరింత అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. వీర నరసింహారెడ్డి ఒక ప్రణాళిక రచించుకున్నాడు. తాను చేయబోయే పనికి తదనంతర పరిణామాలను బేరీజు వేసుకున్నాడు. ఇప్పుడు తానో మహా గిరిని ఢీకొనబోతున్నాడు. తన సైనిక శక్తి అత్యల్పం కానీ “గుండెబలం“ “ఆత్మ విశ్వాసం” “మాతృ దేశభక్తి అచంచలం. తనకు అత్యంత విశ్వాసపాత్రులైన “కలవాటాల” బోయదండును పిలిపించుకున్నాడు. కోవెలకుంట్ల ఖజానా మీదకు దాడికి వెళ్ళాడు. “ఒడ్డె ఓబన్న” అంగ రక్షకుడై వెంట నడిచాడు. రేనాటి సూర్యుడి ధాటికి తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులందరూ పరుగెత్తిపోయారు.

తహశీల్దారు ఎక్కడో మారుమూల గదిలో తలుపులు బిడాయించి దాక్కున్నాడు. తలుపులు బద్దలు కొట్టి తహసీల్దారుని బయటకు లాగి “ఆనాడు నీవన్న దానికి బదులు” అంటూ వాని తలను నరికేశాడు. ఖజానా మొత్తం కొల్లగొట్టి తహసీల్దారు తలను బల్లేనికి గ్రుచ్చి ఎత్తి పట్టుకుని కోవెలకుంట్ల రంగనాయక స్వామికి అర్పించి స్వగ్రామానికి వెళ్ళిపోయాడు. ఈ వార్త ఇంగ్లీష్ అధికారులకు తెలిసి ఆగ్రహోదగ్రులయ్యారు. మండలాధికారి (సైనికాధికారి) “కాక్రిన్” వెంటనే కొందరు సైనికులను పంపి నరసింహారెడ్డిని పట్టి బంధించి తెమ్మన్నాడు. భవిష్యత్ పరిణామాలను ఊహించి వీరనారసింహారెడ్డి తన మకాంను ఉయ్యాలవాడ నుండి నొస్సం దుర్గానికి (తాత జయరామిరెడ్డి దుర్గం) మార్చి, ప్రాకారాలను, రక్షణ బురుజులు ఇంకా పటిష్టపరిచి కోట నిండా కావలసిన నిత్యావసర సరుకులు నింపి తగు జాగ్రత్తలతో ఉన్నాడు. “గోసాయి వెంకన్న” అనే మహానుభావుడు నరసింహారెడ్డి ఆధ్యాత్మిక గురువు, ఆప్తుడు. అంజనం వేసి జరగబోయే పరిస్థితులను చెప్పడంలో దిట్ట. అతడు “ఆకుమళ్ళ” గ్రామ నివాసి. అతని అవసరం తనకెంతయినా ఉంటుందని నరసింహారెడ్డి వెంకన్నను నొస్సం గ్రామానికి రప్పించుకున్నాడు.

నరసింహారెడ్డి ప్రయత్నాలన్నిటినీ ఆంగ్లేయులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. లెఫ్టినంట్ కల్నల్ వాట్సన్ నాయకత్వాన నొస్సం దుర్గం మీదకు దండు పంపించారు. సమర చాతుర్యమంతా చూపి వాట్సన్ సేనలను మధ్యలోనే అడ్డగించి కకావికలం చేయడం, కోట దారికి రాకుండా బురుజులు మీద నుండే వడిసెలలు, విల్లంబులు బలాధిక్యతను చూపడంతో ఏమి తోచని వాట్సన్ కోట గోడలు పగులకొట్టే ప్రయత్నం చేశాడు. మందుగుండు సామాగ్రి కోసం “బళ్లారికి” కబురు పంపాడు. ఈ వార్త రహస్యంగా అవుకు రాజుకు చేరవేయించాడు. నరసింహారెడ్డి బళ్లారి వైపు నుండి (ఔకు రాజు నుండి) వచ్చే మందుగుండు సామాగ్రినంతా మధ్యలోనే దోపిడీ చేయించాడు.

వాట్సన్ దగ్గర ఆయుధ సంపత్తి లేక దిగులుపడి ఉన్న సమయంలో తన సైన్యంతో వీరనరసింహారెడ్డి అకస్మాత్తుగా దాడి చేశాడు. వాట్సన్ బ్రతుకు జీవుడా అంటూ పారిపోయాడు. అప్పటినుండి ఆంగ్లేయాధికారులకు నరసింహారెడ్డి పేరు వినగానే వొళ్ళు వణకడం మొదలైంది. అతడు ఆంగ్లేయుల గుండెల్లో సింహమై నిద్రించసాగాడు. నరసింహారెడ్డి అటవీ జనాలను పీడిస్తున్న అటవీ రేంజర్ అయిన రుద్రవరం నివాసిని వెతికి వెతికి ఒక చాకలి ఇంట దాక్కున్న వాణ్ని బయటకు లాగి, హతమార్చి అరణ్య జీవులకు ఆనందం కలిగించాడు. వీరనరసింహారెడ్డి సాహసకృత్య వార్తలు నాటి దక్షిణాపథ ఆంగ్ల స్థావరం ప్రధాన నగరమైన మదరాసుకు చేరాయి. అక్కడి ఆంగ్ల పాలనాధికారులలో కోపావేశాలు మిన్నంటాయి. మన చెప్పు చేతలలో ఉండాల్సిన ఒక అర్భక పాలెగాడు ఇంత మొనగాడా? వాట్సన్ వంటి వాణ్ని పరాజితుడిని చేస్తాడా ? ఇక ఊరుకోరాదు అని ఆంగ్లేయులు గట్టిగా తీర్మానించుకున్నారు. ఈమారు కెప్టెన్ హోదాలో ఉన్న ఘనుడైన సేనాని “నార్టన్” ను దండయాత్రకు పంపిందారు. అతడు సర్వప్రయత్న శీలుడై తన సైన్యంతో బయలుదేరి వచ్చి గిద్దలూరు (నేటి ప్రకాశం జిల్లా) సమీపంలో శిబిరం ఏర్పాటు చేసుకున్నాడు.

అతడి శిబిరానికి ఆమడ దూరంలో రెడ్డి కోట ఉంది. అక్కడికి సులభంగా వెళ్లేందుకని అడవులు నరికిస్తూ గుండ్లు బండలను చదును చేయిస్తూ ఉన్నాడు. ఈ వార్తలు అన్నీ అతి వేగంగా తెలుసుకున్న నరసింహారెడ్డి తన సేనకు, అనుచర బృందానికి తన వ్యూహం అంతా వివరించి భారత దాస్యశృంఖలాలు త్రుంచాలని, ఆంగ్ల సేనలను తరిమికొట్టవలసిన గురుతర బాధ్యతను ఉపదేశించి ఉసిగొల్పాడు. అప్పుడు భారతీయుడు అయిన కంభం తహసీల్దారు మరియు ఆంగ్లేయుడు అయిన సూపరింటెండెంటును కూడా హతమార్చిన నరసింహారెడ్డి పేరు కంభం పరిసరాలలో మారుమోగింది.

ఒక అమావాస్య నాటి రాత్రి ఆంగ్లసైన్యమంతా నిద్రలో ఉన్న వేళ అకస్మాత్తుగా అక్కడికి ప్రవేశించి చీకటిలో అందినవారిని అందినట్లు హతమార్చగా మిగతా సైనికులు పరుగెత్తి పారిపోయారు. నార్టన్ కూడా అవమాన భారంతో పారిపోయాడు. కానీ అవమాన భారం దహిస్తుంటే ప్రతీకారం తీర్చుకుని తీరాలనే పంతంతో బళ్లారికి వెళ్లి అఖండ సైన్యాన్ని వెంటబెట్టుకుని అనేకంగా మందుగుండు, తుపాకులు మొదలగు సాధనాలు సమకూర్చుకుని వెంటనే తిరిగి దండెత్తి వచ్చాడు నార్టన్.

ఈ సమయంలో నరసింహారెడ్డి విధి వక్రీకరించింది. అతడి అర్ధాంగి అకస్మాత్తుగా దివంగతురాలయి పుట్టెడు శోకం మిగిల్చింది. కాశీయాత్రకు వెళ్లిన ఆ వీరుని మాతృమూర్తి అక్కడే శివైక్యం చెందిందన్న పిడుగు పడిన వార్త మరొక శూలమై మదికి తాకింది.

ఇలాంటి దు:ఖ సమయంలోనే గోడ చాటు నక్క చందాన నార్టన్ వచ్చి దాడి ప్రారంభించాడు. ఇలా దొంగ దెబ్బ తీయడం ఆంగ్లేయులకే చెల్లుతుంది. అయినా కూడా మొక్కవోని ధర్యంతో తన సైనికులను సంసిద్ధపరచి కోటలో ప్రవేశించిన శత్రు సైన్యాన్ని ఎదిరించాడు. నార్టన్ కేమో మందుగుండు సామాగ్రి పుష్కలంగా ఉంది. దుర్గంలోని నిల్వలు ఒక్కొక్కటిగా అయిపోసాగాయి. చివరకు నీరు మాత్రమే మిగిలింది. పైగా బయటనుండి శతఘ్నుల దాడి రాను రాను తీవ్రమై కోట గోడలు బీటలు పడసాగాయి. ఏ క్షణంలో అవి కూలతాయో చెప్పలేని స్థితి ఉంది. విషయం గమనించిన నరసింహారెడ్డి తన అనుచరులందరికీ తగు ఉపదేశం చేశాడు. దానిని అనుసరించి రాత్రి వేళలో చడీచప్పుడు కాకుండా తన భటులతో పాటు దుర్గం నుండి అదృశ్యమై సమీప గ్రామంలో రహస్యంగా దాక్కొని అక్కడి నుండి రాత్రివేళల దాడి చేయసాగాడు.

వీరనారసింహారెడ్డి తన భట వర్గంతో అదృశ్యమైపోయాడు. నార్టన్ “చెట్టు పుట్టా వెతకండి అంటూ తన సైనికులను ఆదేశించాడు. 3 సంవత్సరాలు వేట సాగింది. చివరకు నరసింహారెడ్డి, ఓబన్న, గోసాయి వెంకన్న మిగిలారు. ఓబన్న, వెంకన్నలు అహోబలేశుని దర్శించుకుని వస్తుండగా ఆంగ్ల సైనికులు హతమార్చారు. నరసింహారెడ్డి ఒంటరి వీరుడైపోయాడు. ఒంటరివాడు కావడం వల్ల కొంత కాలం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. జనంలో దేశభక్తి సాహసశౌర్యాలు ప్రేరేపించాడు. నల్లమల అడవులు వదిలి ఎర్రమల కొండలు చేరి జగన్నాధుని కొండ మీద వీరనరసింహారెడ్డి రహస్యంగా కాలం గడిపాడు. నార్టన్ నరసింహారెడ్డి కోసం నల్లమల కొండలంతా జల్లెడ పట్టించాడు. కొంత కాలానికి జగన్నాథ గట్టు మీద నరసింహాలయంలో నరసింహారెడ్డి ఉన్నాడన్న విషయం తెల్ల దొరలకి తెలిసింది. జగన్నాధ గట్టు దగ్గరలోని ఆల్వకొండలో నరసింహారెడ్డి ఆప్తబంధువు ఉన్నారు. బంధువులు ఒక గొల్లవాని ద్వారా ప్రతిరోజూ నిత్యం అన్నపానాదులు అందజేసీవారు. జగన్నాధ గిరిపైన ఆలయంలో ఒంటరిగా నరసింహారెడ్డి ఉన్నాడు. ఈ వార్త నరసింహారెడ్డి సొంత అన్న మల్లారెడ్డిని లోబరుచుకుని ఇంగ్లీషు అధికారులు తెలుసుకున్నారని ఒక చారిత్రక కధనం ఉంది.

మహాశౌర్యసాహసి, వీరత్యాగమూర్తి నరసింహారెడ్డి తినే అన్నపానాదులలో మత్తుమందు కలిపేలా నరసింహా రెడ్డికి అన్నపానాదులు అందచేస్తున్న గొల్లవానిని ఆంగ్లేయులు ప్రేరేపించారు. ఆ ఆహారం భుజించి నరసింహారెడ్డి స్పృహ కోల్పోయాడు. గొల్లవాడు(భారతీయుడు) ద్రోహి. నరసింహారెడ్డి కత్తిని, తుపాకిని ఆంగ్లేయులకు అందచేశాడు. 1846 అక్టోబర్ 6వ తేదీన కెప్టెన్ తన సైన్యంతో జగన్నాధుని కొండ మీద ఆలయాన్ని చుట్టుముట్టాడు. స్పృహలేని నరసింహారెడ్డిని సంకెళ్లతో బంధించి కోవెలకుంట్ల కారాగారం చేర్చాడు. మాతృదేశ దాస్య శృంఖలాలు చేధించాలని ఉద్యమించిన రాయలసీమ స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆంగ్లేయుల దుష్ట బుద్ధి వలన, స్వంతవారి ద్రోహ బుద్ధి వలన శృంఖలాబుద్దుడై బోనులో పడిన ఉగ్ర నరసింహమైపోయాడు. ఆనాటి కలెక్టర్ కాక్టైన్ 2000 మంది ప్రజల సమక్షంలో 1847 ఫిబ్రవరి 22న ఆ రేనాటి సూర్యుణ్ణి (వీర సింహం) జుర్రేటి ఒడ్డున బహిరంగంగా ఉరి తీశాడు. ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామంగా పిలువబడే సిపాయిల తిరుగుబాటు 1857 కు పది సంవత్సరాల ముందే ఇది జరిగింది.

ఆంగ్లేయుల పాలనపై మొదటి తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తొలితరం స్వాతంత్య్ర వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. నరసింహారెడ్డి మరణానంతరం 100 సంవత్సరాలకు అంటే 1947 ఆగష్టు 15 వ తేదీన మన దేశానికి స్వాతంత్ర్యం లభించింది. అప్పుడు ఆ వీరమూర్తి ఆత్మ శాంతించి ఉంటుంది.

భారతీయులు స్వతంత్రులు, స్వేచ్చాజీవులు, శాంత స్వభావులు, సంస్కారవంతులు, దైర్యశాలులు త్యాగమూర్తులు. అయితే బానిసలు కారు. భారతీయులు అన్యాయాలను సహించరు. భారతీయులు విప్లవ వీరులు, తత్వవేత్తలు, దేశభక్తి గలవారు. ఇచ్చిన మాటకు కట్టుబడేవారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతమైన ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి వీరుడు ఉద్భవించాడు. నేటి యువతరానికి ఆదర్శ మూర్తి, ప్రాతః స్మరణీయుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.

VSK Andhra సౌజ‌న్యంతో… 

This Article was first published in 2022